Friday, July 31, 2009

తెలంగాణలో సాహిత్య చైతన్యం

1955లో బి.ఏ చదువుకోవటానికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాను. అప్పుడు తెలంగాణా రచయితల సంఘం చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నది. ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. `ఉదయ ఘంటలు' కవితా సంకలనం వెలువడింది. మంజీర అనే సాహిత్య పత్రికను ప్రారంభించితే ఒక సంచిక మాత్రం వెలువడింది. మా చిన్నాయనగారు సంపత్కుమారాచార్యులు భువనగిరిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ రచయితల సంఘంలో ముఖ్య కార్యకర్తగా ఉన్నారు. హైదరాబాదులో నేను యూనివర్సిటీ ప్రాంగణంలోని `ఏ' హాస్టలులో చేరాను. అప్పటికి అక్కడ ఉదీయమానుడైన కవి మాదిరాజు రంగారావు వున్నారు. ఆయన తొలిసారి కలుసుకోగానే అంతకుముందే ప్రచురితమైన నేను, సంపత్కుమారతో కలిసి రచించిన కావ్యం `హృద్గీత' నుంచి పద్యాలు చదివించుకుని సాదరంగా ఆహ్వానించారు. నాటినుంచీ మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా, దాదాపు సాహచర్యంగా సాగి పోయింది. అప్పటికే `తెలుగు స్వతంత్ర'లో రంగారావు రచనలూ, నా రచనలూ వెలు వడుతూ వున్నవి. రంగారావు బాగా పద్యం వ్రాయగల, తీర్చిదిద్దగల నేర్పుగలవారే. విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం అంటే అమితమైన ఇష్టం. ఆయన ఇంట్లో బెజవాడలో వుండి కొన్ని రోజులు మేఘసందేశం చదువుకున్నారు. `నా ఇంటన్‌ పదినాళు్ల బిడ్డవలె నున్నాడాంధ్ర సాహిత్య రేఖాయోగ్యుండగు మాదిరాజమణి రంగారాయ బాలుండు' అని విశ్వనాథ ఖమ్మంలో కల్పవృక్ష పఠన సభలలో ఆయనను ప్రశంసించడం నాకు గుర్తే. నారాయణగూడా `దీపక్‌మహల్‌' వెనుక పల్లాదుర్గయ్యగారి ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లోనే రామరాజు, దాశరథి, ఆళ్వార్‌ స్వామి ప్రభృతులు చిన్నచిన్న భాగాలలో అద్దెకు వుంటూండేవాళు్ల. అది సాహిత్య కేంద్రం. సాయంకాలాల్లో మేము యూనివర్సిటీ హాస్టలునుంచి అక్కడికి చేరుకునేవాళ్ళం. ఎం.ఎల్‌.ఏ క్వార్టర్‌‌సలో వుండే నారాయణరెడ్డి చేరుకునేవాడు. కవిత్వమే ప్రధానాంశం. వర్తమాన ధోరణులు, వాటిని గురించిన ప్రశంసలు, విమర్శలు, చర్చలు కొనసాగేవి. సమష్టిగా వీళ్ళందరికీ సాహిత్యమే ప్రధానాంశం గానీ వీళ్ళమీద ఏ రాజకీయ పక్షాల ప్రాబల్యం వుండేది కాదు. కులాల స్పృహ వుండేది కాదు. ఈ గోష్ఠూలలోకి కాళోజీ వచ్చి చేరేవారు. అట్లాగే కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వీళ్ళందరికీ ఆప్తులు. ప్రచురణకు ముందు వడపోతలో శాస్త్రిగారిది ప్రథమ స్థానం. జనగామలో అధ్యాపకులుగా పనిచేస్తున్నా, ఉరుపుటూరి రాఘవాచార్యులు ఈ సమూహానికి ఎంతో వెన్నుబలంగా నిలిచేవారు. ప్రథమ వార్షికోత్సవాలు జనగామలో జరగటానికి బహుశః ఆయనే కారణం. అక్కడ ఆయన పుట్టపర్తివారిని పిలిపించి ఉపన్యాసాలు ఏర్పాటుచేసి వాటిని ప్రచురించారు కూడా. వానమామలై వరదాచార్యులు క్షయ వ్యాధి నుంచి బయటపడి పోతన చరిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. కపిల కాశీపతి సమాచార శాఖ అధిపతిగా వున్నారు. నారాయణరెడ్డి `నాగార్జునసాగరం' వ్రాసిన తరువాత దాన్ని నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన నివాసంలో వినిపించుకున్నారు. జె.బాపురెడ్డి, చేకూరి రామారావులు నిజాం కాలేజీలో చదువుకునే వాళు్ళ. సి.నా.రెతో బాటే గూడూరి సీతారాం వుంటుండేవాడు. `మంజీర' ఆగిపోవడంతో దక్షిణ భారత ప్రచారసభ నిర్వహించే పత్రిక `స్రవంతి' తెలుగు సాహిత్య వికాసానికి బాసటగా నిల్చింది. కొత్త కవుల రచనలకు ఆహ్వానం పలికేది. ఆ పత్రిక సంపాదకులు వేమూరి ఆంజనేయ శర్మ సౌజన్యం మూర్తీభవించిన వ్యక్తి. అప్పట్లో తెలంగాణా రచయితల సంఘం నిర్వహించిన కవిత్వపు పోటీలో తెన్నేటి పూర్ణచంద్రరావు రచన `దయ్యాల మఱ్ఱిచెట్టు' కు మొదటి బహుమానం యాభై రూపాయలు. నా రచన `ఎవరెస్టు గేయానికి' రెండవ బహుమానం ముపై్ప రూపాయలు ఇచ్చారు. ఈ బహుమానం నిర్ణయించిన వారిలో పుట్టపర్తి నారాయణాచార్యులు, నార్ల వెంకటేశ్వరరావులు వున్నారని విన్నాను. నారాయణ రెడ్డి నాగార్జున సాగరం గేయకావ్యం. బౌద్ధమత వాతావరణంలో నుంచి ఉత్పన్నమైన ప్రేమ త్యాగాల జమిలితనం దీనిలో ఇతివృత్తం. చివరకు సాగరం ఏర్పడటం కావ్య తాత్పర్యం. భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నాగార్జున సాగరం ప్రారంభించిన తరువాత అదే వేదికమీద నారాయణ రెడ్డి కావ్య ప్రకటనం జరిగింది. ఇదొక విలక్షణ సన్నివేశం. అంతకు పూర్వం నారాయణ రెడ్డి `జలపాతం' అనే ఖండకావ్యాన్ని దాశరథికి అంకితం చేశారు. ఆ కావ్యంలో ఆ అంకితం పద్యాలు అద్భుతమైనవి. భావ బంధురమైనవి. ఆనాళ్లలో అబ్బూరి వరద రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఛాయాదేవి సంపాదకత్వంలో `కవిత' పత్రిక రెండు సంచికలు చాలా అందంగా వచ్చాయి. దీనిలో తెలంగాణ రచయితల్లో ప్రముఖులెవరికీ స్థానం లభించలేదు. ప్రయోగవాద ప్రగతివాదాల కలయికగా, పాశ్యాత్య కవుల రచనల అనువాదాలతో ఈ సంచికలు వచ్చాయి. సిద్దిపేటలో వేముగంటి నరసింహాచార్యులు స్వయం వ్యక్తుడుగా కావ్య రచన సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా చండూరులో అంబటిపూడి వేంకటరత్నంగారు ఆధునిక కవితకు రూపుదిద్దుతున్న వాళ్లలో వున్నారు. వరంగల్లులో గార్లపాటి రాఘవరెడ్డి, ఉదయరాజు శేషగిరిరావు, గొట్టుముక్కుల రాధాకృష్ణమూర్తి రచనలు కొనసాగిస్తున్నారు. నాటి తెలంగాణంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో వున్న వాతావరణం ఫలితం- ఏ రూపంమీదా, ఏ వస్తువుమీదా, ఏ ప్రత్యేకమైన అభివ్యక్తిపైనా, ఏకైక గమ్యమన్న నిష్ఠ లేకపోవడం. దాశరథి `మస్తిష్కంలో లేబోరేటరీ' అయినా `మహాంధ్రోదయం' అయినా వానమామలై వారి `పోతన చరిత్ర'మైనా, కాళోజీ `నాగొడవ' యైనా నారాయణ రెడ్డి `విశ్వగీతి'యైనా కవి గోష్ఠూలలో సమానంగా ఆదరింపబడేవి. యువ కవుల రచనలకు ప్రతిష్ఠ బాగానే వుండేది. ఈ పరిస్థితివల్ల కవిత్వానికి, అనుభూతికీ ప్రాధాన్యం వచ్చింది. రాజకీయ సిద్దాంతాలకు సాహిత్యం కట్టుబడిపోలేదు. దాశరథి ప్రగతివాద మార్గం నుంచి ప్రయాణం ప్రారంభించినా, కవిత్వ స్ఫూర్తికే కట్టుబడ్డారు. ఆయన పద్యం కొత్త పలుకుబడినీ, జీవాన్ని సంతరించుకున్నది. భావకవులు తెచ్చిన సౌకుమార్యాన్ని కొంత సడలించుకుని ఓజస్సును సమకూర్చుకున్నది. `రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికము్మ దక్కునే' అన్న భీషణ ఘోష పలికించారు. వీర వ్యావహారానికి కానీ, వీర గ్రాంధికానికి గానీ తెలంగాణాలో ప్రాబల్యం లేదు. వచ్చినాడు, చేసినాడు మొదలైన క్రియారూపాలు, దేశికవులలో, తిక్కనలో కనిపించే నామరూపాలు వ్యవహారంలో నిలిచివుండటం వలన యిక్కడ భాషా వైపరీత్యం లేదు. నారాయణరెడ్డి ఒకసారి నా వచనాభాసంగా వ్రాసిన గీత పద్యం చదువుతూవుంటే తన ఒక గీత పద్యం వినిపించారు. దాని చివరిపాదం `మబ్బులవలె వెన్నెలవలె మంచులవలె' అని గుర్తు. ఇంత విశిష్టంగా పద్యాన్ని తీర్పగల నేర్పు ఆయనకు వున్నది. దేవులపల్లి రామానుజరావు, జువ్వాడి గౌతమరావు, పి.వి. నరసింహారావు మొదలైన సాహితీవేత్తలు సమచిత్తంతో సాహిత్యాన్ని నిలబెట్టేవారు. ఆంధ్ర ప్రాంతం నుంచీ సాహితీవేత్తలు రావటం, కావ్య పఠనాలు, ఉపన్యాసాలు విరివిగానే సాగేవి. ఒకసారి బాలాజీ భవన్‌లో నా అభిమాన కవి అనే అంశం గురించి రెండురోజులు ఉపన్యాసాలు జరిగాయి. రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, శ్రీశ్రీ తదితరులను గురించిన ప్రసంగాలు సాగాయి. చివరకు నారాయణరెడ్డి ప్రసంగం తనకంటే వయస్సులో మూడునాల్గేళ్ళకు పైబడని సహచరుడైన కవి దాశరథిని గురించి విశిష్టమైన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. తెలంగాణా రచయితల సంఘం ప్రాచీన కావ్య సంస్కారాన్ని సజీవంగా వుంచడంకోసం కావ్య పఠనోత్సవాలను నిర్వహించింది. భారత భాగవతాలను, మను వసు చరిత్రాదులను శ్రావ్యంగా పఠించి పాఠకుల హృదయాలకు చేరువగా, భావస్ఫోట కంగా, పద్యంలోని సంగీత గర్భితను స్ఫుటంగా చేస్తూ ఈ పఠనం కొనసాగింది. ఈ పద్ధతిని కొనసాగించుతూ ఈనాటికీ నిలబెడుతున్న మహా రసికశ్రేష్ఠూడు జువ్వాడి గౌతమరావు. తెలంగాణా రచయితల సంఘం సాహిత్య చైతన్యాన్ని విశ్వతోముఖంగా పరివ్యాప్తం చేసేందుకు ఎన్నుకున్న ప్రక్రియ కవి సమ్మేళనం. ఉర్దూ పారశీక కవి సమ్మేళనాలలోని పాఠకుల ప్రతిక్రియను ప్రకటించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. ఎన్నుకొన్న కవులనే కాక ఎందరైనా కవులు తమ కావ్యాలను పఠించే సంప్రదాయానికి బలం చేకూర్చారు. 1955 ప్రాంతాలలో బమ్మెరలో కవి సమ్మేళనం రాత్రి తొలిజాములో ప్రారంభమై తెల్లవారేదాకా కొనసాగింది. ఆర్ర్ధత ఆత్మీయతలు అల్లుకున్న తెలంగాణలోని సాహిత్య స్థితి అది.

2 comments:

  1. మంచి వ్యాసాలు రాస్తున్నారు. అయితే Form and content తో పాటు Design కూడా అవసరమనుకుంటా. ఇలా పొడవునా కాకుండా గద్యలు (పేరాగ్రాఫులు) గా విడగొట్టి రాస్తే పఠనీయత ఉంటుంది. మూస (Template) కూడా కొంచెం మార్చిచూడండి.

    ReplyDelete
  2. గురుదేవులకు పాదాభివందనం.
    మీరిలా బ్లాగు ప్రారంభించడం తెలుగు సాహితీలోకానికి ఆనందదాయకం. మీ అనుభవాలు మాకు మార్గదర్శకాలు. నిన్ననే మీ బ్లాగు మొదటిసారి చూడడం. అన్నట్టు ఈ మధ్య పరిమళ కాలనీలో ఒక మిత్రుని ఇంటికి వచ్చి ఆరా తీస్తే మీరక్కడక ఉండడంలేదన్నారు.

    ReplyDelete