Thursday, July 2, 2009

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 3

ఈ పరిస్థితిలో తెలుగు కవిత్వంలో ఉదయించిన నూతన ప్రభాతం ``మండే సూర్యుడు'' ఆవిర్భవించడంతో సంభవించింది. ``విరసం'' ధోరణులు క్రమంగా సాహిత్యరంగానికి దూరమై రాజకీయోద్యమంతో తాదాత్మా్యన్ని పొందటం ఒకవైపు జరిగింది. రాజకీయ స్పృహ ప్రధానాంశమైంది. నియంత్రణ పెరిగి వస్తురూపముల విషయంలో కవి రాజకీయపక్షపు ఆదేశాలకు లొంగిపోతున్నాడు. సాహిత్య రంగంలో నాయకత్వం పరాయివాళు్ల బలవంతంగా ఆక్రమిస్తున్నారు.
ఈ సందర్భంలో శేషేంద్ర ఆవిష్కారం `మండేసూర్యుడి' కాంతిలో కవిత్వ జగత్తును జేగీయమానంగా ప్రకాశించేటట్లు చేసింది.
శేషేంద్ర ఆంధ్ర కవితా జగత్తును ప్రకాశింపజేసిన ప్రధానాంశాలు ఇవి.
1. రాజకీయపక్షాల ప్రాబల్యం నుంచి కవితాజగత్తును విముక్తం చేయటం సాహిత్య జగత్తుకు కవియే నాయకుడని స్పష్టంగా ప్రకటించటం.
2. శుష్కమైన, నినాదప్రాయమైన అకవితా సందోహం భస్మీకరించిఅచ్చమైన కవిత్వ స్పృహను పెంచి కవితా సాధనను ఒక స్పష్టమైన అభినివేశంగా తీర్చిదిద్దటం.
3. కవిత్వాన్ని వ్యాఖ్యానించేప్పుడు తన చేతనను నిర్భయంగా ప్రకటించుకోవటం.
4. ప్రాచ్య పాశ్చాత్య వాఙ్మయాలలోని ఇతిహాసాల ప్రక్రియలను అధ్యయనం చేసి ఆధునిక ప్రక్రియలుగా తన రచనలను ప్రవేశప్టెటం.
5. ప్రతీకలను, బింబసంయోజనను ఫ్రెంచి కవుల నుంచి స్వీకరిస్తూనే వాల్మీకి, కాళిదాస భవభూతులు మొదలైన భారతీయ కవుల ప్రతీకలను, బింబములను ప్రయోగించటాన్ని వివరించి వారి విశ్వజనీనతను ప్రవ్యక్తం చేయటం.
6. ఉదాత్తములైన భారతీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించుతూ, నిర్జీవములైన ప్రాచీనాంశాలను తిరస్కరించటం.
7. నన్నయ్య అనంతరంరాయప్రోలు అనంతరం తెలుగు కావ్యభాషను ఆమూలాగ్రం పరివర్తన చేసి కవిత్వానికి కొత్త రక్తమాంసాలను సమకూర్చటం
8. మార్కి్సజాన్ని జీవన తత్త్వంగా అంగీకరిస్తూనే దాని నుండి విశ్వజనీన చైతన్యం దాకా ప్రస్థానం చేయటం.
9. ప్రగతివాద కవిత్వోద్యమం, విప్లవకవితోద్యమం తీసుకురాలేని వేగాన్ని, ఆవేశాన్ని వచనంలోకి ప్రతిఫలించేట్లు చేయటం.
10. కవిత్వంలో నూతన భాషను సృష్టించుకొన్నప్రతీకలను, బింబాలను విరివిగా ఉపయోగిస్తూ వచ్చినా కావ్యం పాఠకులలో ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఆస్వాదయోగ్యం చేయటం. ఎక్కడా సంక్లిష్టతకానీ, అస్పష్టత కానీ ఉండకుండా ప్రతీకల బింబాల అశ్వ హృదయం తెలిసిన దార్శనికుడైన కవి కావటం.
11. ఈనాటి జీవనానికి అనుగుణంగా ఉపనిషత్తత్తా్వన్ని వ్యాఖ్యానించటమేకాదు. ఆ భాషలోని ముడులను విప్పి తాత్తి్వక రహస్యాలను వెల్లడించటం.
12. తన ప్రతి పరిశీలనను, అనుభవాన్ని, తన జాతిజనుల అనుభవ సంపుటులను కవిత్వంగా మార్చగల స్పర్శవేదిగా తాను రూపొందటం.
ఈ పన్నెండు అంశాలను చూస్తే కవి తెచ్చిన పరిణామం ఎంత బృహత్తరమో అంచనా వేయటానికి కొంత కాలం వేచి చూడవలసి ఉందనిపిస్తుంది. శేషేంద్ర రచనలన్నీ సంకలితాలై ఆధునిక మహాభారతంగా సంకలితమైనాయి. దీనిలో పన్నెండు పర్వాలున్నాయి. దీనికి అనుబంధకావ్యంగా జనవంశం అనే రచనా వచ్చింది. తన కవితా సర్వస్వాన్ని మహాభారతంతో ఏకీభావాన్ని భావించుకోవటంవల్ల శేషేంద్ర దేశీయ జీవన మూలాల్లోకి ప్రవేశించాడు. ప్రగతివాద కవులూ, ప్రయోగవాద కవులూ, విప్లవ వాదులు అందరూ ఈ విషయంలో విఫలమే అయ్యారు. దీని మూలాలు దాశరథిలో ఉన్నా శేషేంద్రలో ఆవిష్కృతమైనంత శక్తిమంతంగా అవి వెలువడలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం శీర్షిక మహాభారత స్ఫురణ కలిగివున్నా తాత్తి్వకంగా భారతంలోని పరమార్థ స్ఫురణ అంటే ఆత్మబలి లేదు.
తన మహాభారతానికి కర్షకుడే నాయకుడు. `ఈ దేశానికి నాగలి ప్రతీక. ఈ దేశపు ఆకృతి నాగలి. ఆకృతి ఒకదాన్ని ఒకటి పోలివుంటుంది.... అతడే ఈ దేశపు జీవన దానప్రభువు' అంటాడు కవి. దేశపు ఆకృతి నాగలి పోలివుండటం అన్న ఒక్క అంశం చాలు శేషేంద్రను జాతీయ మహాకవిగా గుర్తించేందుకు.
శేషేంద్ర కవిత్వ ధర్మాన్ని గురించి శ్రీకాంతశర్మ ఇలా అంటున్నాడు. `శేషేంద్ర శర్మలో లాలిత్యం, అలాగే శబ్దగతమైన కర్కశత్వం ఏకకాలంలో ఒకే కవితలో కలగలిసి, చిత్రమైన బొమ్మలు గీయడానికి ప్రతీకల ద్వారా దోహదం చేస్తాయి. ప్రతి భావాభివ్యక్తి లోనూ ఒక సామూహికత ఉంటుంది. ఏక రూపమైన విశేషభావం, పక్షులుగా, నక్షత్రాలుగా, వల్లికలుగా, వనాలుగా అనేకతను సంతరించుకొంటుంది. బాహ్య ప్రపంచాన్ని తనలోకి లాక్కోవాలనే తపన; లోపల క్రిక్కిరిసిపోయిన శబ్ద ప్రపంచాన్ని విసిరివేయ్యాలనే ఆరాటం; ప్రతిబింబిస్తాయి ఆయన ప్రతీకలు. నీరైపారిపోయినా, సూర్యుడై మండినా తన ప్రతీకలో తనే మునిగిపోయే కవి ఆయన. (ఆలోచన పే. 44. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. 1981).
రామాయణం అశ్వమేధంతో ఆరంభమయింది. భారతం సర్పయాగంతో ప్రారంభమయింది. అందుకే ఇతిహాస రచన ఒక యజ్ఞం. `ఇతిహాస నిర్మాణానికి బాధాపూర్వక బలి కావాలి. నేనే ఆ బలి. నా ప్రతిభ, నా పాండిత్యము, నా అనుభవము ఈ అన్నింటినీ జోడించుకొన్న నా ఆయుస్సు సర్వమూ పిండి మాటల గొంతుల్లో పోసిన ప్రక్రియ ఈ ఇతిహాసం. ప్రపంచ మానవుల్ని, వాళ్ల చరిత్రలని, వాళ్ల జయాప జయాల్ని, వాళ్ల భూత భవిష్యద్వర్తమానాల్ని నా ఇంద్రియ వాద మార్గ ఆర్జిత జ్ఞాన నేత్రంతో అవలోకనచేసి విశ్వదృశ్యం నుంచి ఈ తాత్పర్యాన్ని క్రోడీకరించాను. దూర దూరాల కొండల్లో కూర్చొని ఏకాంత గురుత్వాన్ని ఆశ్రయించి ఈ ఆధునిక మహాభారతాన్ని పొందాను' తన రచనా రహస్యాన్ని తపోవ్యగ్రతను ఇంతస్పష్టంగా ప్రకటించిన కవులు చాలా అరుదు. దూరదూరాల కొండలు, ఏకాంత గురుత్వమూ కవి తన చేతస్సీమలను దాటి ప్రచేతస్సీమలను చేరుకోవటం స్పష్టంగా నిరూపిస్తున్నది. ఈ ప్రచేతస్సీమలను గురించిన ఎరుక శ్రీ అరవిందుల తత్త్వదర్శనంలో కావ్యతత్త్వ చింతనలో స్పష్టంగా కానవస్తున్నది.
సూర్యుడు ఈ శుభ దినాన్ని
మోసంచెయ్యనియ్యను
ఈ దేశపు ప్రాచీరేఖ మీద
సూర్యు డుదయించకపోతే
మండే నా గుండె చీల్చి దానిమీద పెడతా (సూర్యపర్వము 61 పే.)
ఎదురుచూచిన నూతన యుగోన్మేషం జరుగటం లేదు. ఈ సారి కవి తన చైతన్యాన్నే నూతన యుగ భూమికగా అమరుస్తానంటున్నాడు. ఆ గుండెభవిష్యద్దర్శనం జీవకోటి అనంతస్వప్నాల సంకలనం. తప్పక దాన్ని వాస్తవం చేస్తానంటున్నాడు కవి. నాగలిని గురించిన వర్ణన ఇలా ఉంది. `నీవొక కరమ్రుక్కవే కావచ్చు / కానీ అనాది సృష్టిలో తలెుత్తిన/మానవ మహాకృషి ఏకైక చిహ్నానివి . . . . నీ స్పర్శ మట్టిలో నిద్రిస్తున్న/కలల పరిమాణాల్ని మేల్కొల్పి/దిశల్లో విదిలించింది. . . . .శ్రమ జీవుల లోకానికి ఒక/ నూతన సూర్యుణ్ణి వాగ్దానం చేశాను' (ఆ.మహా. పే.92) ఎంత కొత్త పలుకుబడి. నాగలి నూతన యుగ నిర్మాణ హేతుభూతమైన ఒక మహాశక్తికి ప్రతీక అయింది.
`గింజ దిగగానే చినుకు పడగానే వారు ప్రేమించిన గింజల గర్భంలో ప్రవేశిస్తారు. మనుష్యూల జన్మలకు మళ్లీ బీజాలవుతారు.' (ఆ.మహా47) ఈ వాక్యాల్లో సృష్టి పరిణామ రహస్యం ఉన్నది. ఉపనిషత్తులలో చెప్పిన పంచాగ్ని విద్య ఉన్నది. దీన్నే `నా దేశం నా ప్రజలు' ఆరంభంలో `నేను ధాన్యంలోనుంచి పుట్టాను. ధాన్యంకోసమే బ్రతుకుతాను. మరణించి ధాన్యంలోకే వెళ్లిపోతాను' (ఆం. మహా 12పే) అని అంటాడు.
శేషేంద్ర కవితలోని ఏ పంక్తి ఎత్తుకున్నా సజీవంగా ఉరకలేస్తూ ఉంటుంది.
ఆకాశం కనిపించటం మానేసింది
ద్రవ్యరాక్షసి కడుతున్న బహుఅంతస్తుల భవనాలుచూచి (165)
అతనితోపాటు అతని స్వప్నాలుకూడా
కాలుతున్న పరిమళం
అతడు ఒక శతాబ్దం మీద నిలుచున్న వీరుడు. (158)
అడవిలో నాకోసం మరణించిన ఆ వీరునికి
ఎవడు కట్టగలడు ఎత్తయిన సమాధి
నా గుండె వాడి మీద లేచిన గోపురం
నా ఆశ్రువులే వాడిమీద రాలుతున్నపూలు (159)
జీవితం ఒక మహాసముద్రం కావచ్చు
కానీ ఆశ అనే నావలో దాన్ని దాటి వేయవచ్చు (188)
మనుషూలందరూ నడిచే సముద్రాలు
చివరకు కాలపు కెరటాల్లాంటి పునః
పునరావృత్త ప్రాచీన పంక్తుల్లో అర్ధశక్తి
ఆవిష్కారం జరిగింది. నాలో కల్లోలం
స్వస్వరూప దర్శనమిచ్చింది (275)
మరొకచోట అంటాడుకవి `భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కరలేదు మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరతలేదు'! (323) అని. శేషేంద్ర కవిత్వం నిండా ఒక ప్రబలమైన ఆశ. పునర్నిర్మాణ దీక్ష. శేషేంద్ర కవిత్వమంతా ఆధునిక మానవుని సుదీర్ఘ సుందరస్వప్నం.

No comments:

Post a Comment