Thursday, July 2, 2009

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 4

శేషేంద్ర ఆధునిక కావ్యభాషను సృష్టించటం ఒక అంశం అయితే అంతకన్నా ప్రబలమైన అంశం ఆధునిక వచన కావ్య రీతిలో మహాకావ్య నిర్మాణం చేయటం. ప్రాచీన మహాకావ్యాలకు కథాంశం మూలసూత్రం. మానుష కథ ఆధారంగా చేసిన నిర్మాణం కావటంవలన విభావాదులకు బలం సమకూడి జీవన వేదనల సమీకరణం ద్వారా ఒక విశిష్టమైన అనుభవ విశేషం దానికి చేరువయ్యింది. ప్రాచీన కాలంనుంచీ భారతీయ సాహిత్యం ఈ సమీకరణం ఆధారంగా రససిద్ధాంతాన్ని నిర్మించుకొన్నది.
ఆధునికకవి వలె ప్రాచీనకవి అంతగా అంతర్ముఖుడు కాడు. తన సంవేదనలను కావ్యపాత్రల ముఖంలో వ్యక్తంచేయగల నిడివీ పొడవూగల వస్తు జగత్తుగలవాడు. కథా ప్రధానంగా కావ్యనిర్మాణం చేయవలెననే ఆలోచన అరవైల తొలిరోజులల్లోనే కుందుర్తి ప్రభృతులు చేయటం (ఈ వ్యాసకర్తకూడా ఆ భావాన్నే అప్పుడు బలపరచటం జరిగింది). దాన్ని తిలక్‌ ప్రభృతులు వ్యతిరేకించటమూ జరిగింది. ప్రాచీనకావ్యం సమష్టి ప్రక్రియ. దానిలోనే కథ ఉంది. వర్ణన ఉంది. ఉపదేశం ఉంది. చమత్కారం ఉంది. నాటకీయ రీతి ఉంది. ఆధునిక కాలంలో నాకం స్వతంత్రించి ముందుకు రావటం కథనంకోసం ప్రత్యేకంగా నవల, కథ ప్రక్రియలు పుట్టుకు రావటం జరిగింది. వర్ణనలు ఖండకావ్యాలలోకి జారిపోయాయి. ఈనాడు కావ్యం మిగిలితే ఖండ కావ్యంగానే ఉండిపోయింది. ఈ సంకుల సన్నివేశంలో కవులు ఈనాటి కావ్యం పద్దెనిమిది పుటలే/ పంక్తులే అనే దశకు చేరుకున్నారు.
విస్తృతమైన సామాజిక సంవేదనను, విశ్వసంవేదన వెల్లడించేందుకు కవిత్వం సాధనం కాలేక పోయింది. వచనంలో మాలపల్లి, వేయిపడగలు ఆధునిక ఇతిహాసాలై ఏకవీర, చివరకు మిగిలేది వంటివి ఆధునిక కావ్యాలైనై. హిందీలో కామాయని ఒక త్రోవచూపింది. సుమిత్రానందన్‌పంత్‌ లోకాయత్‌ ఇంకా విస్తృత భూమికలో మహాకావ్య నిర్మాణానికి ప్రయత్నం చేసింది. నారాయణరెడ్డి కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలు ప్రాచీన కథా కావ్యాల నేటి పద్ధతి కొనసాగింపై నవ్య సంప్రదాయ మార్గంలోకి చేరిపోయినయ్‌. సుమనశ్రీ `నేత్రం నా సంకేతం' పీఠికలో నిఖిలేశ్వర్‌ `పదిదృశ్యాల కవితా సంపుటిని నేను కావ్యంగా ఆమోదించలేక పోతున్నాను' అంటాడు. కావ్యం ఖండకావ్యం కన్నా విశిష్టమైన ఏకాత్మభావం కలిగిన రచనా విశేషమన్న భావం అందరిలోనూ ఉన్నది.
పెన్నా శివరామకృష్ణ రచించిన `జీవనది' పీఠికలో సంపత్కుమారాచార్య ఇలా అంటున్నాడు. `ఏ కావ్య నిర్మాణమైనా కథ ఉన్నా లేకపోయినా సరే కావ్యపరమార్థ దృష్టా్య సాగుతుంది. భారతీయాలంకారికుడయిన దండి `కావ్యం కవే రభిప్రాయః' (కావ్యమంటే కవి ెుుక్క అభిప్రాయం) అన్నాడు. కావ్యం ద్వారా కవి పాఠకుడికి వ్యక్తం చేయదలచుకొన్న అభిప్రాయం అర్థంెుుక్క వివర్త రూపమే కావ్యం'.
శేషేంద్ర `మండే సూర్యుడు' వెనువెంటనే వచ్చిన మహాకావ్యం' `నా దేశం నా ప్రజలు'. ఒక రామాయణంవలె మహాభారతంవలె అతి దీర్ఘమైన కావ్య శరీరం ఆద్యంతం అనుభవించి తన చైతన్యంలో సంలీనం చేసుకునే వ్యవధి తక్కువ కావటంవల్ల ఈనాటి కావ్యాలు సంక్షిప్తరూపంలో ఉండటం లక్షణం అన్నది ఒక విధమైన సమర్థన మాత్రమే అవుతుంది. పాశ్చాత్య దేశాలలోను మనదేశంలోనూ నవలలు వేయిపేజీలను మించిన పరిణామంలో వెలువడటం వాటిని ప్రజలు అంగీకరించటం మనకు తెలియని అంశమేమీకాదు. అయితే ప్రాచీన కావ్యంలోని కథాంశం తొలగిపోయిన ఆధునిక కావ్యం/ఇతిహాసం లఘురూపాన్ని పొందటం విస్మయపరచే అంశమేమీకాదు. ఇందుకు ప్రధానకారణం ఇతివృత్తరాహిత్యం.
అందువల్ల ఆధునిక మహాకావ్యాలకు నాయకుడు నామరూపములు కలిగి ఒకానొక దేశకాలాలకో బద్ధుడైనవాడు కాదు. తననుతాను విశ్వీకరించుకొన్న కవియే ఈ కావ్యాలలో వక్త. తానే నాయకుడు. కావ్యంలోని ప్రతీ అంశంతో తాదాత్మ్యం చెందగలవాడు. `నా దేశం నా ప్రజలు' ఆవిధంగా భారత కర్షక నాయకమైన దేశీయ చైతన్యం రూపుకట్టిన కావ్యం. ఇది ఎనిమిది సర్గల కావ్యం. `నిజానికి ఒకటో సర్గలోని పథకమే రకరకాలుగా పునరావృతమై విస్తృతమౌతుంది మిగతాసర్గల్లో. ఇది కావ్యంలో లయ' అన్నారు ఆర్‌.ఎస్‌.సుదర్శనం (యుగకవి శేషేంద్ర 1976 పే.9)
`నా దేశం నా ప్రజలు' తెలుగు కవిత్వరంగంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. నారాయణరెడ్డి `విశ్వంభర' ఈ మథనంలోనుంచి వెలువడిన మరొక ఇతిహాస కావ్యం. భూమితోనే ప్రారంభమయిన తన జిజ్ఞాస వేయిరేకుల పద్మమై విచ్చుకొన్నది ఈ కావ్యంలో. ఈ కావ్యం అంతా మానవుడు తన సుదీర్ఘ చరిత్రలో చేసిన మహాప్రస్థానం చిత్రించింది. శేషేంద్ర కావ్యంలో మానవుని జీవన సంవేదన మూలం కాగా విశ్వంభరలో మానవుని జిజ్ఞాస మూలమైంది. `నా దేశం నా ప్రజలు'కు ఇలియట్‌ `ది వేస్టులాండ్‌.' ప్రేరణయిస్తే విశ్వంభరకు జయశంకర్‌ప్రసాద్‌ `కామాయని' దారిచూపింది.
పెన్నా శివరామకృష్ణ `జీవనది' మహాకావ్య నిర్మాణంలో మరొక సఫల ప్రయత్నం. ఈ కావ్యం `ద్వాసుపర్ణా' అన్న శ్రుతిని ప్రతీకగా చేసుకొని ప్రారంభమయింది. భారతీయ జీవన పురుషార్థ సాధక దృష్టి ప్రధానంగా ఈ కావ్యం కొనసాగి ఈ దేశ సంస్కృతి కేంద్రంగా చేసుకొని విశ్వజనీనంగా ఎదిగింది. ఈ కావ్యంలో వర్తమానంలోని `కుహనా లౌకికవాదం' ఎంత నష్టం కలుగచేసిందో వివరిస్తున్నాడు కవి
మా సహనమే మమ్మల్ని కాటేసింది
మా సౌభ్రాతృత్వమే దేశాన్ని అవమానాలపాలు చేసింది
మా శత్రువు లెవరెవరిని ఎంతగా ప్రేమిస్తున్నా వన్నదే కాదు
మా శత్రువుల విజయాని కెంత సంబర పడుతున్నావన్నదీ
నీ దేశభక్తికి కొలమానమే
మరొకచోట కవి కవిలక్షణాన్ని వివరిస్తూ `అనుభవాన్ని ప్రేమించని వాడికి/అశ్రువు విలువ తెలీదు/ప్రపంచాన్ని ప్రేమించనివాడు కవి కాలేడు' అంటున్నాడు. ఈ ప్రేమ ఆధారమైన కవి హృదయం ఈ కావ్యాన్ని విశ్వజనీనం చేసింది.
`నాదేశం నా ప్రజలు' నుంచీ వెలువడుతున్న ఆధునిక మహాకావ్యాలను నిర్వచించే ప్రయత్నం చేరా చేశారు. `ఒక ప్రధాన వస్తువుతో, ఒక తాత్తి్వక చింతనతో, సందేశంతో, అనేక భావాలతో, ళీళిళిఖిరీతో, కథ లేకుండా, అర్బేనిటీ అనే లక్షణం కలిగివుండి, తగినంత విస్తారంగా ఉన్న దీర్ఘ కవితను ఆధునిక మహాకావ్యం అంటున్నాను. (కొయ్యగుర్రంపీఠిక) కథా రాహిత్యమును ఒక స్పష్టమైన లక్షణంగా పేర్కొని చేరా ఆధునిక మహాకావ్య స్వరూపాన్ని నిర్ణయించటం జరిగింది. మిగతా లక్షణాలు ఏ మహాకావ్యానికైనా అన్వయించేవే.
వచన కవిత్వరూపం క్రమంగా వికసిస్తూ మహాకావ్యంగా, ఇతిహాసంగా వృద్ధిపొందటం మనం గమనించదగిన ప్రధానాంశం. క్రమంగా రూపం మీద శ్రద్ధకన్నా అభివ్యక్తి వస్తువిన్యాసము ఈ క్రమంలో ప్రాథమ్యం వహించాయి.
1987లో సుప్రసన్న ఒక ఆధునిక మహాకావ్యాన్ని `శతాంకుర' రూపంలో ప్రకటించడం జరిగింది. `కావ్యంలో ఏ కవిత కా కవిత ప్రత్యేకంగా ఆత్మాశ్రయ ధోరణిలో వచన చ్ఛందస్సులో ఖండ కావ్యరూపంగా వ్యక్తీకరించబడింది. కాని ప్రధానాంశం జగజ్జీవన చిత్రణ, కాలస్వరూప విశ్లేషణ, అనంతత్వోపాసన, సృష్టిమూలగవేషణ, త్రివిధ భూమికలలోని దైవాసుర సంఘర్షణ మొదలైన ఐతిహాసిక కావ్య లక్షణాలు, సృజన భూమికల అన్వేషణ, సౌందర్యంతో మమేకత్వం, ప్రేమ దుఃఖంవంటి సుకుమార లలిత భావ వ్యక్తీకరణ మొదలైన కాల్పనిక కావ్య లక్షణాలన్నీ శతాంకురలో గాఢమైన అనుభవ లోకాలను ఆవిష్కరిస్తాయి `(కె.వి.యన్‌. రాఘవన్‌, అభినవ భారతి పే.300) ఏకసూత్రంలో గ్రథితమైన మణిహారం వంటి ఈ కావ్యం తాత్తి్వక కావ్య ధోరణి వికాసానికి బాటవేసింది.
సుప్రసన్న ఇటీవల వెలువరించిన మరొక ముఖ్యమైన మహాకావ్యం సాంపరాయం (2002). ఈ అనంతేతిహాసం (జూచీరిబీ ళితీ శినీలి జూశిలిజీదీరిశిగి) ప్రస్తావనలో రచయిత వ్రాసుకొన్న మాటలివి `సాంపరాయంలో సృష్టా్యరంభంనుంచీ భావి దుఃఖరహిత జగన్నిర్మాణం దాకా గతాగతాలు వర్తమానంలోనికి వచ్చి ముడి వేసుకొన్నాయి. సర్గవిస్తరణలోనికి ప్రసవవేదన భౌతిక ప్రాణిక చైత్త్యస్తరాలలోని సంక్లిష్టత అంతరంగ చైతన్యం దుఃఖ విముక్తికోసం చేసే తపస్సు దీనిలో ఇతివృత్తాలైనవి.
`వస్తు విన్యాసంలో ఏ సరిహద్దులూ లేవు. నాలోనుంచి అమూర్తమైన జీవన పరంపర `పికాసో' చిత్ర సంపుటిగా అభివ్యక్తమై తన ఆంతర్యాన్ని వ్యాఖ్యానించింది. బిందువునుండి మండలం దాకా పరిణామం చెందే క్రమంలో విశ్వవికాసంలోని అన్ని ఘట్టాలనూ, సభ్యతల విస్ఫోటనాన్ని, జీవనంలోని పరిమితులను స్వప్నసంకలనాలలోని సామరస్యాన్ని విశదం చేసింది.
`ఆనంత్యం' రూపుగట్టుకొని వచ్చిమృత్యుకవాటాన్ని వివృతంచేసే ప్రయత్నంలో ఈ కావ్యప్రపంచం ఇతిహాసమై అవ్యక్త శిలాగర్భంలోనుంచి ఆవిష్కృతమైనది. వేదోపనిషత్తులూ, జానపదపురాగాథలూ ఆదిమ ప్రాగ్రూపాలూ తామై కావ్యద్రవ్య సముద్రంలోనికి ప్రవహించాయి. ఈ మెటామార్ఫసిస్‌లో ముడిసరుకుగా ఉన్న సంస్కారాలూ, భావనలూ, బింబాలూ, కల్పనలూ, అన్నీ అనుభవజగత్తులోనికి ఒకానొక అపూర్వ పరిమళాలను మోసుకు వచ్చాయి', (ప్రస్తావన).
పన్నెండాశ్వాసాల ఈ ఇతిహాసం చివరి మూడుసర్గలలో ఉపనిషత్కథలూ, బౌద్ధగాథలూ సంలీనమయినాయి. కథా రాహిత్యమన్న లక్షణానికి ఇది కొంతవరకు అపవాదం వంటి సన్నివేశం. సాహిత్య విమర్శ ధోరణిలో మహాకావ్యం, ఇతిహాసం ఈ రెండు శబ్దాలు పైన పేర్కొన్న కావ్యాల సందర్భంలో అనిశ్చితంగానే వాడబడుతున్నాయి. `నగ్నముని' కొయ్యగుర్రాన్ని మహాకావ్యమన్న చేరా నిశ్చయమూ వివాదరహితం కాలేదు.
5
మొత్తంమీద తెలుగు కవిత్వం ఇంచుమించుగా ఈ మూడు దశాబ్దాలలో విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే ప్రధాన దృశ్యాలు ఇవి.
సెవెన్‌స్టార్‌ సిండికేట్‌వారి అభ్యుదయ సాహిత్య సదస్సు (1970) నాటికి `అరసం' ప్రగతివాద కవిత్వానికి మార్కి్సజం తప్పనిసరి కానక్కరలేదని స్పష్టంగా ప్రకటించింది. సాయుధ విప్లవమే నూతన సమాజ నిర్మాణానికి అవసరమని భావించిన నక్సల్‌బరీ పోరాటం సమర్థించే సాహిత్యకారులు శ్రీశ్రీని కలుపుకొని విరసం ఏర్పరచటం జరిగింది. విరసం క్రమంగా వచనకవిత్వంలోంచి పాటలోకి సాగిపోయి ఒకే ఇతివృత్తం, పరిమితమైన అభివ్యక్తి మార్గం, నియతమైన ఛందస్సులను పరిమితమైన పునఃపునరావర్తనం చేత ఒక మొనాటనీని తప్పించుకోలేక పోయింది. పాడటం లేకుండా రక్తికట్టే పరిస్థితి లేకపోవటం వల్ల అది విప్లవకారుల వారి అనుయాయుల సభలకు పరిమితమై పోయింది. గద్దర్‌, శివసాగర్‌, వంగపండు ప్రసాద్‌ వంటి కవుల రచనలకు ప్రాచుర్యం కలిగింది.
అయితే తమ కవిత్వ సాధనలో అర్బేనిటీపోకుండా మధ్యతరగతి వర్గంలో తాదాత్మ్యం చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు శివారెడ్డి. నగ్నముని, వరవరరావు ప్రభృతులు. శివారెడ్డి ప్రతిభ చేత వస్తువు రత్న గర్భమై ప్రకాశించింది అతని కావ్యాలలో.
దళితవాదం గొంతువిప్పినప్పుడు చాలా బలంగానే విన్పించినా క్రమంగా సమగ్రసమాజం ెుడల సహానుభూతిలేని కారణంగా విశ్వజనీనతను సంతరించుకోవటం కష్టమవుతున్నది. అయినా ఈ మార్గంలో ఉత్తమశ్రేణిలో ెుండ్లూరి సుధాకర్‌, శిఖామణి, సతీష్‌చందర్‌, బన్న ఐలయ్యలు నిలుస్తున్నారు. స్త్రీవాదమూ పరిమిత వస్తువిన్యాసంతో క్రమంగా వెనుకంజవేస్తున్నది. కొండేపూడి నిర్మల, సావిత్రి, జయప్రభ, రజని మొదలైన వారి కవితలు స్త్రీ జీవనంలోని సంవేదనలను స్పష్టంగా ప్రకటించాయి.
ఇదంతా ఏదోవిధమైన నిరసన, సంఘర్షణ, పోరాటాలను ఆశ్రయించిన పార్శ్వం. అయితే రెండవ పార్శ్వంఅధివాస్తవికత, అస్తిత్వవాదం, సంశయ వాదం, అంతర్జగత్తులోని కల్లోలం ఇవన్నీ వ్యక్తంచేసే కవిత్వ భూమి. ఇక్కడ అక్కడక్కడా రహస్యవాదం నీడలు, అనిర్దిష్టమైన అన్వేషణ దృగ్గోచరమవుతాయి. సామాజిక సంవేదన కూడా ఇక్కడ `స్వప్నలిపి'గా మారిపోతుంది. ప్రతీకలు, బింబాలు, నూతన సంయోజనలు ఈ మార్గంలో ఎక్కువ. అజంతా, మోహన్‌ప్రసాద్‌, సుమనశ్రీ ప్రభృతులు ఈ మార్గంలో సాగిపోయినవారు. ఇక్కడ కవిత్వం వస్తు ఛందస్సులను దాటి అభివ్యక్తి నిష్ఠమై పోతున్నది. అందువల్ల అవగాహనలో సౌలభ్యం తక్కువ.
అయితే మరికొంతమంది కవులు భావకవిత్వంవలెనే ఆత్మాశ్రయ లక్షణంతో కాల్పనిక రహస్యవాద మార్గంలో కవిత్వ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ అస్పష్టతలేదు. అరిపిరాల విశ్వం, ఇస్మాయిల్‌, శ్రీకాంతశర్మ, సత్య శ్రీమన్నారాయణ ఇలా కవులు ఒక భావనిష్ఠమైన అనుభూతి రహోలోకాలను నిర్మిస్తున్నారు.
ఆర్‌.ఎస్‌.సుదర్శనం, సంపత్కుమార, అనుమాండ్ల భూమయ్యలు వ్రాసేది పద్యమైనా ఒక ఆత్మానుభవ ప్రకటనకు ప్రాధాన్యం యిస్తున్నారు. చిన వీరభద్రుడు, విన్నకోట రవిశంకర్‌, రాజు, సిద్ధార్థ, సౌభాగ్య, మునిపల్లె రాజు, రామ్‌నారాయణ్‌ఈ కవులంతా తమ నూతన బింబాల సృష్టితో ప్రతీకల ప్రయోగంతో కవిత్వ జగత్తును సుసంపన్నం చేస్తున్నారు. రామగిరి శివకుమారశర్మ `సింగిడి' తెలంగాణా రైతుజీవితంలోని భావనలను అనుభవాలను అత్యంతసుందరంగా అభివ్యక్తం చేసింది. దర్భశయనం రచనల్లో ప్రతీకలు, బింబ సామాగ్రి దేశీయతా, గ్రామీణతా పరిమితుల లోంచి పెల్లుబుకుతున్నది. అభినవత్వం దీనిలో విశిష్టత.
కొందరు ఇటీవలికవులు ఆధునికోత్తరకాలంపేర విచిత్ర ప్రకటనా వూ్యహాలలో విలక్షణమైన శబ్దజాలంతో రచనా ప్రపంచంలో పురోగమిస్తున్నారు. వీరిలో అఫ్సర్‌, సీతారాం, ప్రసేన్‌, వంశీకృష్ణలు ప్రముఖులు. అయితే అనేకమంది కవులు ప్రధాన స్రవంతియైన జాతీయ ప్రజాస్వామ్య చైతన్యంలో దేశీయతాభూమికలో రచనాప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తున్నారు. ఈ కవులు తమ శిల్ప నైపుణ్యంతో వస్తు విన్యాసంలో అపరిమితమైన కవిత్వపు సీమల్లోకి ప్రవేశింపజేస్తున్నారు. వీరిలో బోయి భీమన్న, శేషేంద్ర, నారాయణరెడ్డి, మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, సుప్రసన్న, పెన్నా శివరామకృష్ణ, గోపి, బాపురెడ్డి, మొదట పేర్కొనదగినవారు.
ఇంద్రధనూరమ్యమైన ఈ దృశ్యపరంపరకు వెనుకగా ఈ కాలంలో నవ్య సంప్రదాయం మూడు గొప్ప మహాకావ్యాలను ఆవిష్కరించింది. ఒకటి వానమామలై వరదాచార్యుల పోతన చరిత్రము రెండు ముదిగొండ వీరభద్రమూర్తి' వందేమాతరం', మూడు నాయని సుబ్బారావు `జన్మభూమి'.
ఈతరం కవులు వచన కవిత్వంలో మహాకావ్య నిర్మాణం చేయటం ఒక విలక్షణమైన ఉపలబ్ధి విశేషం. విస్తారమైన మన ఆధునిక సాహిత్యోపలబ్ధులను తమకు, తమకు చెందిన వారికి మాత్రమే పరిమితం చేసుకునే ఒక సంకుచిత బుద్ధితో కొందరు విమర్శకులు నేటి సాహిత్యంలో గిరిగీతలు గీస్తున్నారు. `అసలు సాహిత్యరంగంలోనైతే శాశ్వత విప్లవాన్ని ఎప్పుడూ సంప్రదాయవాదులే తీసుకురాగలరని హెరాల్‌‌డ రోజెన్‌ బర్‌‌గ చెబుతున్నాడు. ఈ మాటల్ని ప్రత్యక్షర సత్యం చేసినవారు ఇలియట్‌, ఆడెన్‌, అరవిందుడు, టాగోరు, విశ్వనాథ, శ్రీశ్రీ లాంటి మహాకవులు. వీళ్లందరిదీ సంప్రదాయం వల్ల పరిపుష్టమైన ఆధునికత. వేదంలోంచీ, మహాభారతంలోంచీ గ్రహించిన `సావిత్రి' వృత్తాంతంపై ఇంగ్లీషూలో రాసిన మహాకావ్యం `సావిత్రి'లో కనిపించేదంతా అరవిందుని ఆధునికత్వమే. అలాగే శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో `ఏ దనుజున్‌ వధించినను ఇంత విషాదమునొందు ఆత్మ మర్యాదుడుస్వామి' అంటూ శ్రీరామచంద్రుడి హృదయంలో ఒక అస్తిత్వవేదన (లినిరిరీశిలిదీశిరిబిజి బిదీవీరీశి) లాంటిది సృష్టించిన విశ్వనాథ సంప్రదాయం లోంచీ ఆధునికతను ఆవిష్కరిస్తున్నాడని గమనించాలి'. (ఆచార్య పణతుల రామచంద్రయ్య పే. 290 సాహిత్యంలో ఆధునికత అభినవ భారతి 1996)
ఈ సమన్విత దృష్టి విశ్వజనీనమైంది ఉంటేనే మనకు మన సాహిత్యచిత్రం సమగ్రంగా దర్శనమిస్తుంది. ఏది ఏమైనా కవిత్వ సాధనకు లక్ష్యం పరిపూర్ణతా సిద్ధి. మన కళాత్మక శిల్పాత్మక సాధనలు ఉపకరణాలు అన్నీ ఈ లక్ష్యం వైపుగానే ప్రయాణించాలి. భాష, ఛందస్సు, అలంకారము, ప్రతీక మరింకేదైనా ఉంటే అదిఅన్నీ మానవ జీవనంలోని అన్ని స్తరాలలోని సంఘర్షణలను చిత్రిస్తూఅనంత జీవనాన్ని గురించిన అతని ఆర్తిని అభివ్యక్తీకరించాలి. 20వ శతాబ్దం నూతనమైన ఆధిభౌతిక తత్త్వ చింతనలోని పార్శా్వలను ఆవిష్కరించింది. మనశ్శాస్త్రం ఆధ్యాత్మిక అనుభవాల సీమలను తాకుతూ వచ్చింది. ఖండదృష్టీ, పార్శ్వదృష్టీ తప్పుడు అనుభావనలకు కారణాలవుతవి.

No comments:

Post a Comment