Thursday, July 2, 2009

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 1

ఈనాటి చాలామంది తెలుగు కవిత్వ విమర్శకులకు, పరిశీలకులకు కవిత్వాన్ని ఒకే ప్రవాహంగా ధోరణిగా చూడటం అలవాటు. మిగతా ధోరణులు, కావ్యరచనా సంప్రదాయాలు ఎంతటి బలమైనవైనా వాటిని ఉపేక్షించి, ్ర పాధాన్యం తగ్గించి, అవి అసలే కవిత్వంకాదన్న ముద్రవేయటం, ఈ ధోరణిలో ఒక ముఖ్యమైన అంశం.
స్వాతంత్య్రం వచ్చేనాటికి అవిచ్ఛిన్నంగా ఎప్పటికప్పుడు నూత్నచైతన్యాన్ని తనలో సంగమింప చేసుకుంటూ జాతీయభావం దేశీయత మానవీయ సంస్కృతి మూలాంశాలుగా నవ్య సంప్రదాయ ధోరణి కానవస్తున్నది. అప్పటికి ప్రబలంగా ఉన్న ప్రగతివాదం రాజకీయోత్థాన పతనాల కారణంగా 1955 నాటికి కుప్పకూలింది. శిష్‌ట్లా మొదలైన కవుల పరంపర ప్రయోగవాద ధోరణి ప్రగతివాదంలోని కొన్ని అంశాలను సంగమింపజేసుకుంటూ యూరోపీయ అస్తిత్త్వవాద ధోరణులను సమాశ్లేషిస్తూ, ఫ్రెంచికవుల సింబలిస్టు ధోరణులను ఆహ్వానిస్తూ ఒక నవ్య కవితా ధోరణికి స్వాగతం చెప్పుతున్నది. అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో ఈ ఉద్యమం నిశ్శబ్దంగానే `కవిత' పత్రిక ద్వారా బయటపడుతున్నది. అజంతా, వరద్ట, రాజశేఖర్‌ మొదలైన కవులు ఈ పద్ధతిని నడిపించేతీరు కనబడుతున్నది. అనుకోకుండా ఇంకా ప్రగతివాద పరివేషం పూర్తిగా వదలని కుందుర్తి వీరిలోనే ఉన్నారు. శ్రీశ్రీ ఆరుద్రలు ఈ ఆశ్రమంలోనికి చేరుకున్నారు. `సాహిత్యోపనిషత్తు'లో తమ పరివర్తనను స్పష్టంగా చాటుకున్నారు.
అప్పుడే ఆధునిక ధోరణిలో మేల్కొన్న తెలంగాణం. ప్రగతివాదంనుంచి నడచివచ్చి తన త్రోవన వెదుక్కొంటున్నది. దాశరథి `మహాంధ్రోదయం'లో తెలుగు సమాజాన్ని దాని మహోజ్జ్వల వైభవాన్ని పద్యరచనా వైదగ్ధా్యన్ని స్వాయత్తంచేసుకొని విజృంభిస్తున్నాడు.
తెలగాణము్మ తమః కవాటముల బందీయైన నిశ్శబ్దరా
త్రులలో మేల్కొని; కోటి తము్మలను మేల్కొల్పన్‌ మహోల్కాసము
జ్జ్వల దగ్నిప్రభలీను గీతముల నభ్రమ్మంటగా పాడి తె
ల్గులలో వెల్గులు నాటినట్టి కవితా లోక ప్రభా నీరధీ
(జలపాతం సి. నారాయణరెడ్డి)
అతని ఉద్విగ్నజాతీయ చైతన్యంలో పారశీక కవితా మాధుర్యమూ కాళిదాసాదుల కావ్యలావణ్యమూ, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల కవిత్వ చైతన్యమూ సంగమించి నూతన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపచేశాయి. ఈ జలపాతంలో తడుస్తూ వచ్చిన కవి నారాయణరెడ్డి దాశరథి మార్గంలోనే జాతీయ చైతన్యం మూలచైతన్యంగా ప్రజాస్వామ్య సంస్కృతి నేపథ్యంగా నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలు రచిస్తున్నాడు.
క్రమంగా `దాశరథి సంప్రదాయం' కవిత్వంలో రూపాన్ని పట్టించుకోలేదు. పద్యమూ, గేయమూ, వచన పద్యమూ మూడూ ఈ ధోరణిలోని కవులు వాడుకున్నారు. అయితే ఈ స్వేచ్ఛ శిల్ప విషయంలో విశృంఖలతకు అవకాశమీయదు.
ఆరుద్ర ప్రధానంగా ప్రయోగవాది. `త్వమేవాహం'లో తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి ఉందని ఆయనే వ్యాఖ్యానించుకోవలసివచ్చింది. చెరిషించు, పెరిషించు మొదలైన ప్రయోగాలు దానిలోనే నిద్రపోయాయి. `త్వమేవాహం' తరువాత ఆరుద్ర ఏ భావబిందువుు దగ్గరా నిలువలేదు. ప్రయోగాలుగానే సాగింది అతని కవితాయాత్ర.
అబ్బూరి ఛాయాదేవి `కవిత' ప్రచురణ రెండు సంచికలతో ఆగింది. శ్రీశ్రీ, ఆరుద్ర, వరదలు `మేమే' రాసినప్పుడు ఒక ఉన్మత్త ధోరణి తొంగిచూచింది. ఆశ్రయం కోల్పోయిన కుందుర్తి క్రమంగా వచనకవిత్వ ఉద్యమం పేరున రూపవాదాన్ని ఆశ్రయించ వలసివచ్చింది. అజంతా బింబసంయోజనలు చేసుకుంటూ ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు.
వచన చ్ఛందస్సులో జాతీయ ప్రజాస్వామ్యతత్త్వం ఆధారంగా నిరంతర రచన కొనసాగిస్తూ సాగిపోతున్నాడు మాదిరాజు రంగారావు. సుప్రసన్న పద్యము, గేయము, వచనపద్యమూ సాధన చేస్తూనే కవితారంగంలో సామాజిక ధోరణులతో బాటు ఆధ్యాత్మిక అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీ అరవిందుల తత్త్వచింతన ఆధారంగా ఈ భూమినే దుఃఖరహితంగా పునారచించవలసిన ఆదర్శాన్ని కవిత్వంలో కేంద్రంగా చేసుకొని తన అన్వేషణ ప్రారంభమయింది. ప్రజాస్వామ్యం జాతీయ చైతన్యము, వ్యక్తి సర్వతోముఖ వికాసము, దివ్యజీవన సాక్షాత్కారము ఇవన్నీ చేతనావర్తానికి కారణము లయ్యాయి. ఉద్యమాల హోరుగాలి ఒత్తిడిలో దీని వ్యక్తిత్వాన్ని ప్రధాన ధర్మాన్ని మరచిపోయిన తెలుగు విమర్శ ప్రపంచం ఈ సమగ్ర సమన్విత దృక్పథాన్ని అర్థం చేసుకోవటంలో వెనుక ముందాడింది. దేశీయతత్త్వం మూలాలను వెదకిపట్టుకొన్న ఈ ధోరణి నెమ్మది నెమ్మదిగా `సాహిత్య భూమి'లో వ్రేళూ్లనుకోవటం జరుగుతూ వచ్చింది. సాహిత్య సౌందర్య దర్ళనం భారతీయ జీవన మూల్యాలతో మళ్లీ ముడి వేసుకున్నది. ప్రగతివాదం వస్తుసంవరణంలో చేసిన నియంత్రణ క్రమంగా అదృశ్యమయింది. విద్వాన్‌ విశ్వం 1955 ప్రాంతాలలో రాయలసీమ దారుణమైన కరువుదృశ్యాన్ని జీవనాన్ని `పెన్నేటి పాట'లో పద్యంగా గేయంగా చిత్రించి దాశరథి మార్గాన్ని తేజస్వంతం చేశాడు. (ఈ గ్రంథాన్ని మొదట తెలంగాణా రచయితల సంఘం ప్రచురించింది).
అరవైల నాటికి సాహిత్యరంగంలో ప్రబలంగా ఉన్న ధోరణులు మూడు:
1. నవ్యసంప్రదాయము
2. కుందుర్తి నిర్వహిస్తున్న వచన కవిత్వవాదమనే రూపవాదము
3. దాశరథి కవితాసంప్రదాయము
ఇక్కడ దాశరథి కవితా సంప్రదాయమంటే 1) ప్రగతివాదం విధించిన వస్తు పరిమితులకు లొంగకుండా వుండేది. 2) జాతీయ సంస్కృతిలోని మేలి సంప్రదాయాలను స్వాయత్తం చేసుకునేది 3) విశ్వజనీన దృక్పథం కలది. 4) అభివ్యక్తి విషయంలో రూపవిషయంలో ఏ పరిమితులకూ లొంగనిది 5) మానవుణ్ణి భౌతిక, సాంస్కృతిక ఆధ్యాత్మిక త్రిపుటిగా భావించేది 6) ప్రజాస్వామ్య దృక్పథం మీద అచంచల విశ్వాసంకలది 7) పీడితులు, తాడితులు లేని సర్వశ్రేయస్సమాజంకోసం భావించేది.
ఒక విధంగా తెలంగాణాలో స్వాతంత్య్రానంతరం తెలుగుకవితా ధోరణి ఈ ప్రభావ పరిధిలోనే ప్రవహించింది. నారాయణరెడ్డి, మాదిరాజు రంగారావు, బాపురెడ్డి, సంపత్కుమార, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి, కవిరాజమూర్తి యీ వ్యాసకర్తా మొదలైన వాళ్లందరూ ఇంచుమించుగా ఈ విస్తృత కవితా భూమికకు చెందినవారే. ఇంకా వీరికి ప్రేరణ యిచ్చిన వాళ్లల్లో కాళోజీ, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, పి.వి. నరసింహరావులను ప్రత్యేకంగా పేర్కొనాలి.
పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్కీ్సయ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమూ్యనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత' అన్నగేయం కమూ్యనిష్టూల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి' (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు.
నీవు నేనూ కలసి, నేను నీవూ కలసి భూమిదేవికి పూలువేద్దాము
పుడమితల్లికి పూజచేద్దాము
వీరాధివీరులౌ శ్రీరామచంద్రులన
కారుణిక మూర్తులౌ శాక్యగౌతములను
జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను
కన్నతల్లికి హారతిద్దాము
కన్నీ కడిగి పూజిద్దాము
నీవు పుట్టిన నేల, నేను పుట్టిననేల . . . .
పాలునీరుగ మనము కలసి పోయిననేల
కలసి పోయిన మనము కరగిపోయిననేల
జంట నాగళ్లతో బీళు్ల దున్నిన నేల
నీళు్ల గొట్టిన నేల కాపుగాచిన నేల
రామరాజ్యపు చల్వపందిరెత్తిన నేల
గాంధిపుట్టిన భూమి, తిలకు పుట్టిన భూమి
శాంతి ఆయుధముతో స్వాతంత్య్రపథములో
సామ్రాజ్యరాక్షసిని సంహరించిన భూమి
ఇంటింట జాతీయ జెండ లెగసిన భూమి
కోటొక్క ప్రజలకు తిండి బెట్టేనేల
చల్లచల్లని శాంతి నీడ నిచ్చే నేల
మెల్లమెల్లగ మనలపెంచి సాకేనేల
నిండ నూరేండ్లయి కండ్లుమూసేటపుడు
పట్టుపాన్పులాంటి గుండెపై జోకొట్టి
జోలపాడే నేల, నిద్రబుచ్చేనేల (పే. 42,43)
తమ ఉద్యమం రోజుల్లో `దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషూలోయ్‌' అన్న గేయాన్ని `వందేమాతరం' గేయానికి ప్రతిద్వంద్విగా, వలస వాదులకు అనుకూలంగా కమూ్యనిస్టులు వాడుకున్నారు. ఈ గేయం సంస్కరణోద్యమాన్ని బలపరచేది. స్వాతంత్య్రోద్యమానికి అననుకూలమైంది. స్వాతంత్య్రోద్యమంలో భారతదేశం చరిత్ర సంస్కృతి సాధించిన ఔన్నత్యాలు ప్రేరకాలు. దేశం ఒకవిధంగా జగన్మాతృ రూపమైంది. గురజాడ ఆంగిలేయుల ధర్మరాజ్యాన్ని ప్రశంసించినవాడు. గతమును చూచేప్పుడు వాళ్ల దృష్టితోనే చూచి, `మంచిగతమున కొంచెమేనోయ్‌' అన్నవాడు. పాములపర్తి సదాశివరావు రచన కమూ్యనిస్టులలో రావలసిన భావపరిణామాన్ని దేశీయతా దృక్పథాన్ని ఎత్తిచూపింది. గురజాడ వంటివారి దేశాన్నిగురించిన ఆలోచనలోని రిక్తతను, శూన్యత్వాన్ని బట్టబయలు చేసింది.
ఈ నడుమ దిగంబరకవులు హఠాత్తుగా ఒక నాలుగైదు సంవత్సరాలు చెలరేగటం జరిగింది. అరాచకత్వం, మొరటుతనం, ప్రజాస్వామ్య వ్యవస్థల వైఫల్యం వల్ల కలిగిన నిస్పృహ, ఎక్కడో బలంగా స్రై్టక్‌ చేయాలనే ధోరణి, బూతు పదాల ప్రయోగం ఇవన్నీ వీరి ఆయుధాలు. గిన్‌‌సబర్‌‌గ మొదలైన అమెరికన్‌ కవుల ధోరణులు వీరికి బలాన్ని యిచ్చాయి. అయితే క్రమంగా ఈ ఉద్యమం విరసంలో కలసిపోయింది. పలుచ పలుచగా అటూ ఇటూ చెదరిపోయింది.

2 comments:

 1. కోవెల సుప్రసన్నాచార్య గారి రచనలు ఇలా నెట్ లో చూసే అవకాశం దొరికినందుకు సంతోషంగా వుంది.
  వారి అన్ని రచనలూ ఇందులోకి రావాలని కోరుకుంటూ

  అఫ్సర్

  ReplyDelete
 2. సుప్రసన్నాచార్యగారికి
  నమస్కారములు
  రెండురోజులనుండి చదువుతున్నాను ఈ వ్యాసపరంపరను. ఇప్పటికి పూర్తయింది. గొప్ప విషయాలు చెప్పారు. అర్ధ శతాబ్ధపు తెలుగు సాహితీలోక సింహవలోకనం చేయించారు.

  ధన్యవాదములు.

  బొల్లోజు బాబా

  ReplyDelete