`ఎటు?' అని నిర్దిష్టంగా సమాజాన్ని ప్రశ్నిస్తున్న కవి శ్రీ రామా చంద్రమౌళి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత. `ఇక్కడి ఈ ప్రజలు / నిజంగా నిద్రపోతున్నారా / నిద్రలో మరణించారా / నిద్ర నటిస్తున్నారా' ఇది కవికి కలిగిన సంశయం.
నాల్గో సింహం తల్లివలె జాతీయ స్తంభం
వెనుకే దుఃఖిస్తూ మరుగుననే ఉంది.
వ్రేళు్ల భూమిలో రహస్యంగా. . . గుప్తంగానే ఉన్నాయి.
నీళు్ల సముద్రాలలో, జనం కళ్లలో భద్రంగానే ఉన్నాయి.
ప్రజలు ఎన్నో కోటానుకోట్ల అవినీతిని క్షమించి
నిశ్శబ్దంగా నిద్రపోతూనే ఉన్నారు.
ఈ నాల్గో సింహం సమష్టి చైతన్యం మూర్తీభవించిన భారతమాత. వ్యవహార మంతా సాగుతూనే ఉన్నది సాగవలసిన దానికి విరుద్ధంగా. రాజకీయవాదులు సిద్ధాంతాలను మరచి వ్యభిచరిస్తున్నారు అంటున్నారు కవి. ఈ నిద్ర స్వభావం ఏమిటి? ఈ క్షమ వెనుక ఉన్న అసమర్థత ఏమిటి? మేధావుల `స్వప్నాలలో స్ఖలించటం' వెనుక అవార్డులను గౌరవంగా స్వీకరించటం వెనుక, అంగీలు చింపుకుని అరిచే `స్వవంచన వెనుక, ఎంతగా గాఢతమస్సర్పమై కదలి పోతున్నది. ఈ తీవ్రస్వరం వెనుక అనంతమైన వేదన ఉన్నది.
రామా చంద్రమౌళి కవిత్వభాష విలక్షణమైంది. ఆయన ఎన్నుకొన్న శబ్దజాలం, వాక్యవిన్యాసం, బింబాలు ప్రతీకలు సామాన్య తెలుగు కవితా పాఠకునికి చిరపరిచితమైనవి కావు. ఈ రచనలో `వాచ్యాభాసత' ఒక ముఖ్యలక్షణం. వాచ్యాభాసత వాచ్యం కాదు. ఉద్వేగతీవ్రత వల్ల వాచ్యంలా కనిపిస్తుంది. ఈ భాషలో ఆధునిక ఎలక్ట్రానిక్ పదజాలం ఉంది. గణిత విజ్ఞాన శాస్త్రాంశాలు ఉన్నాయి. వాక్యం సాగదు. ఎక్కడైనా విరుగుతుంది. ఆగుతుంది. నెమ్మది నెమ్మదిగా సాగుతుంది. మధ్యలో చిన్నప్పుడు తాను విన్న పాఠంలోని వాక్యం `నీరు కదలనిచో నాచుపట్టి నీచు వాసనతో మరణించును.' నీరు మరణించునా అని వెంటనే ప్రశ్న. `ప్లాటు ఫారంపై భారతీయుడు' గీతం శీర్షిక. రైలుకోసం నిరీక్షణం. ఇంకా రైలు రాదు వాన ఆగదు. చీకటి విడిపోదు. ఈ నిరీక్షణలో అనంతమైన మనోవల్మీకంలోంచి పొడుచుకువచ్చే పాముల బుసబుసలు. చైతన్య స్రవంతి పద్ధతిలో సాగే గీతం `అతని తలలో నగ్న వృక్షాలు, నగ్న సముద్రాలు గిర్రున తిరుగుతున్నాయి'. అతన్ని `సాదీ సాదీ' చీకిపోయిన అవ్వముఖం. ఎడతెగని నిరీక్షణ `చూపులు ఎరన్రి లైట్‌లో దిగబడి ఎంత పీకినా రావడంలేదు.' ఎరల్రైట్ బురద ఐందా, సుడిగుండమైందా అని మనం విచారించాలి. మన స్మృతిధార అంచునబడిపోతే అన్నమయ్య అంటున్నమాట `నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదుగదా' అని గుర్తుకు వస్తున్నది. భావభూమికలు వైరైనా సృజన భూమికలు ఒక్కటే.
`రూ. వేయి నోట్లపై లేజర్ చూపులు' అన్న గీతం పురపాలక సంస్థలూ, ఆసుపత్రులూ ఎలా వ్యర్థమైన వ్యవస్థను నిలబెట్టటమే ప్రయోజనమై, సాఫల్యం వైపు చూడనైనా లేని పరిస్థితిని వ్యక్తీకరిస్తున్నది. `కోయ్ వాడి గుండెను' `వేసేయ్ లైఫ్ టాక్‌స' మూడు ముక్కల్లో రామాయణం చెప్పినట్లు ఈనాటి అర్థవ్యవస్థలో అధికారులు, వైద్యులు మొదలైన వారి జీవితం `అడ్డమైన డబ్బు సంపాదించె సంపాదించె సంపాదించె చచ్చె' ఇదీ ఈ మానవమూల్యాలను పోగొట్టుకున్న ధనమునకు దాస్యం చేసే వ్యవస్థ చేరుకున్న భయంకరమైన కాలతీరం.
అదిరిపడి అర్థరాత్రి లేచి కూర్చుంటే
పెళ్ళాం వేసే సాంబ్రాణి పొగ. . . చూపించే వేయి రూపాయల కట్టలు
మార్చరీ వాసన
ఎంతకూ కలలు తెగిపొవు
జీవితం అంతా కారుణ్యం, స్నేహం మమకారం, వాత్సల్యం, ఔదార్యం, కృతజ్ఞత ఇలా అన్ని దైవ గుణాలను కోల్పోయిన స్థితి. కవి వాక్యాలలో వాస్తవాన్ని చెప్పుతూవున్నా ఎంత కసి ఉన్నది? ఈ కసి వెనుక ఎంత క్రోధం ఉన్నది? ఆ క్రోధం వెనుక ఎంత దుఃఖభారం ఉన్నది? `బట్టల్లో లోపల అసలు నీవు లేనట్టు బోలుతనంతో క్షణం క్షణం చచ్చిపోతూ' ఇదీ అతని స్థితి. ఈ మానవుడు సగటు మానవుడు చేరుకోనెంచే లక్ష్యం. ప్రైమరీ యూనిట్.
చంద్రమౌళి కవిత్వంలో వాక్ తీవ్రధార ఒక పార్శ్వం. మరొకచోట కరిగి కన్నీరై ప్రవహించగల చోట అతనిలోని మృదు కుసుమ పార్శ్వమూ గోచరిస్తుంది.
హృదయాన్ని తపసుతో పూరించి ఆవేశ పరచినప్పుడు
తల ధనధ్రువమై పాదాలు ఋణ ధ్రువాలౌతాయా?
మరొకడు తలతో పాదాలకు ప్రణమిల్లి
హస్తాలతో ఆశీస్సులు పొందితే
విద్యుద్వలయం పూరణమై
శక్తి హృదయానికి చేరుతుందా
మృదు మధుర కోమల హస్త స్పర్శలో శాంత సముద్ర దృక్కులతో ఆ మనిషి మహామానవుడైనా పిడికెడు గుండెతో ఆకాశమందు అగ్నిని ధరించిన పసివాడౌ తున్నాడు. తన్నుతాను తపస్సులోకి ఉపసంహరించుకుంటున్నాడు. పై ఖండిక జీవ చైతన్యంలో ధ్యేయ పరంపర ఎలా పరివర్తనాన్ని సాధించగలదో తెలియజేసింది. తపః ప్రసారాన్ని జీవనంలోనికి నిలువరించుకునే లక్షణాన్ని వ్యాఖ్యానించింది.
జీవితంలో అన్ని పార్శా్శలూ దుఃఖపు అగాధాలై నడిమి బొడ్డు విూద నిల్చున్న వ్యక్తి ఎలా కలల్లో తన భావనాజగత్తులో సుఖానుభవాన్ని ప్రోది చేస్తుందో ఈ ప్రపంచం ఆ కలను ఎంత క్రూరంగా భంగింపజేస్తుందో `పగటిపూట పనిమనిషి కల' అనే గీతంలో వ్యక్తమవుతున్నది.
తుఫానులో రెండు గడ్డిపరకల్లా. . . రెండు జీవితాలు మిగిలాయి. తల్లీబిడ్డలు. ఆ తల్లి ఏంచేస్తుంది. వ్యభిచారం. `. . . ప్లీజ్' అన్న గీతం ఆ బాలుని ోభను వ్యక్తం చేయటానికి పుట్టింది. ఆ పసిగుండె ఎంత వేదన పడుతున్నదో ఈ రచన అద్భుతంగా ప్రకటించింది. `నాన్న చనిపోయారు బీదరికముంది చుట్టూ క్రూర నిర్దయ వికృత దయాహీన సమాజ ముంది.' ఇదంతా భూమిక. విలువలు లేని సమాజం. పరదుఃఖ దుఃఖిత లేని సమాజం. `సర్వ మున్నతని దివ్యకళామయ మంచు' భావించలేని సమాజం, ముడుచుకు పోయి ఇరుకైన చీకటి గుహలతో అభద్రతా భావంతో, నిత్య మృత్యు సన్నిహిత భయంతో సగం చచ్చిన సమాజం ఆమెకు ఏ దారి చూపించగలదు? రాజకీయ వ్యవస్థలు, సిద్ధాంతాలు, రాసులు పోసిన సంపదలు, విజ్ఞానము, సాంకేతికత ఇవన్నీ మనిషిలోని దైవీయ పార్శా్వన్ని లోతులలో నుంచి చేది ముందుకు తీసుకురాగలవా అంటే అది అసంభవమనే చెప్పాలి. సర్వాత్మ చైతన్య స్పృహలేని సమాజం తప్పక ఎక్కడో కుప్పకూలుతుంది. అందుకే ఆ బిడ్డ తల్లి తలను నిమిరితే పాము చుట్టపై బడ్డట్లు జలదరించిపోయినాడు.
ఈ సంపుటిలో ఒకటి రెండు వియోగ గీతాలు ఉన్నవి. ఈ గీతాలు మృత్యు వేదనకు సుస్పష్ట ప్రతీకలు. `నీవు వెళ్లి పోయాక' అన్న గీతం ఆమె వెళ్ళిన తరువాత రెక్కలు తెగిన ప్టక్షిగా తాను మారిపోవటంతో ప్రారంభమయింది. గృహము వట్టి ఇల్లయింది. గృహము అంటే కళిళీలి అనీ, ఇల్లు అంటే కళితిరీలి అనే శబ్దాలకు పర్యాయంగా ఇక్కడ, తెలుగులో కవి ప్రయోగించాడు. ఇది భాషలో పలుకుబడిని `సహజమార్గం'లో సంపన్నంగా చేసే పని. ఆమె లేకపోవటం వల్ల బయటి ప్రపంచమూ లేకుండా పోయింది. గృహం అంతటా అణువణువునా ఆమె జ్ఞాపకాలే.
ఎందుకంటే ఆమె సహచరి. ప్రథమ సమాగమంలోనే ఆమె జీవితాన్ని ఉమ్మడి పోరాటంగా నిర్వచించింది. ఎక్కువ తక్కువలు లేవు. లొంగుబాట్లు అధిక గౌరవస్థానాలు లేవు. రెండు చేతులకు బదులు మరో రెండు చేతులు. రెండు కాళ్లకు బదులు మరో రెండు కాళు్ల. ఈ గీతం జీవనంలో గార్హస్థ్య ధర్మ సంపూర్ణతా లక్షణాన్ని ఆధునిక పరిభాషలో చాలా బలంగా, చాలా సమచిత్తంలో, నిమగ్నతతో వ్యాఖ్యానించింది. గృహస్థ జీవనంలో ఒకటి పతాకం పతంగి, రెండవది దాని నింగిదాకా మోసుకుపోయే దారం. చివరకు అంటాడు అత్యంత కరుణాస్పదంగా, ప్రతీక గర్భంగా `ఒక చెప్పు తెగి ఎక్కడో పడిపోతే రెండో చెప్పు పనికి రాదు. దీన్ని తప్పకుండా పారేయాల్సిందే' అని `అసలు వీళ్ళద్దరూ ఇద్దరు కాదని' ఆరంభించి ఐదు పంక్తులలో జీవనంలో దంపతుల సహకార సౌమనస్య జీవన తాత్పర్యం సంప్రదాయ ప్రతీకలు వాడకుండా ఎంత భావుకంగా చిత్రింపబడిందో ఆశ్చర్యం వేస్తుంది.
మరొక వియోగ గీతం `నాన్న జ్ఞాపకాల్లో' అనేది. తండ్రి తనకు ఎలా జీవితాన్ని విప్పి చెప్పాడో, వివరంగా వర్ణిస్తాడు కవి.
అనివార్యమై దుఃఖాలు దండెత్తినపుడు
ఒక్కనివే భరిస్తూ మాకు మండే సూర్యుణ్ణి చూపించావు
ఒక్క ఆకాశం తనను తాను చినుకులుగా, చినుకులుగా
భూమికి దానం చేసుకున్నట్లు
నీవు వేలమంది శిష్యూలకు ఓ చిర్నవు్వవై విస్తరించావు.
మిగతా ఎక్కువ గీతాల్లో కరుణరసభావం క్రూరమైన అధిక్షేపంలో, నిశితమైన వెక్కిరింపులలో నిండివున్న కవివాక్కు ఈ వియోగ గీతాలలో నగ్నంగా, అనుద్విగ్న జలపాతంగా గోచరిస్తుంది. `ఆజంజాహి మిల్లు'ను గూర్చి మరొక వియోగగీతం రాయటం అరుదైన అబ్బురమైన అంశం.
`ఎటు' అన్న ప్రారంభ గీతం జీవితంలో ఉండే నిర్ణయను, కఠినమైన దోపిడీని, మాయాసభ్యతల వలల విసరడాన్ని చిత్రిస్తున్నది. `మెడబట్టి నెట్టబడినచోట కాళ్లకూ కళ్లకూ ఐచ్ఛికాలుండవు. నిర్బంధాలే అనివార్యాలౌతాయి' మన విద్య, మన నాగరికత, సినిమాలు, కళలు, భాషలు ఎలా ప్రపంచ ఆర్థిక సంస్థల నియంత్రణలో, పశ్చిమ దేశాల సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో ఓడిపోయి చైతన్యం కోల్పోయి, నిరాశోపహతమై, హతమై జీవిస్తున్నాయో చిత్రిస్తుందీ కత్తివాదరవంటి గీతం `పావురాన్ని మూసిన హాల్లో బంధించి తరుముతే దానంతటదే నేల కూలుతుంది కుట్ర' అంటారు కవి.
కవి యువజనుల దైన్యస్థితిని కళ్లకు కట్టిస్తున్నాడు. ఆ వేగంతో కొట్టుకుపోతూ ఆ ప్రవాహంలో మనను లాక్కొని పోతున్నాడు. చివరకు
ఇక్కడి జీవావరణం కలుషితమైంది. . . జీవనచిత్రం ఛిద్రమైంది.
జీవన ధర్మాలు, జీవన విధాలు. . . జీవన గమనాలు గతి తప్పాయి.
యిక్క డిపుడు చెట్లపై వాలిన పక్షులను ఆకులే తుపాకులై హత మారుస్తున్నాయి.
రోడ్లే ఉన్నట్లుండి విచ్చుకొని పర్రెలై కబళిస్తున్నాయి.
అని ఈ భయంకర చీకటి రాత్రిని వర్ణిస్తున్నాడు. దీని అనుస్యూతిలో `వేణువు కనిపించడం లేదు. కాని పాట వినిపిస్తోంది.' చదివితే వెలుతురు కిరణాల కోసం యుగయుగాల నిరీక్షణ యికనైనా ముగుస్తుందా అని ప్రశ్నిస్తాడు కవి. అందుకే ఇక్కణ్ణించి `పరుగు గునపా ల్లాంటి చినుకుల వర్షంలో ఒకటే పరుగు.' ముందు ఓ చెట్టు కిందకు చేరనీ' ఈ చెట్టు జీవవృక్షం, సంసార వృక్షం, అనంతకాలాన్ని తనలో సంలీనం చేసుకున్న మహావృక్షం. సర్వజీవులకు ఆశ్రయమిచ్చే వృక్షం.
ఈ వృక్ష ప్రతీక పృథ్విలోకి చొచ్చుకొని ఉన్న ఆనంత్యాన్ని సూచిస్తుంది. అది భూమి మీద నుంచి ఆకాశం నలువైపులా వ్యాపించి దాన్ని ఆవరిస్తుంది. పరిమితినుంచి అపరిమిత స్థానందాకా ఎదిగిపోతుంది. సర్వమునూ తనలో గర్భితంగా చేసుకుంటుంది. అందుకే తర్వాత `వేణువు కనిపించకున్నా ఎక్కడ నుండయితే నేమి ఓ బ్రతికించే పాటను వినవచ్చు.'
`పెనునిద్ర' అన్న గీతం జీవన విధానమే అవినీతిని భాగంగా చేసుకున్న అంశాన్ని దేశ జీవనాన్ని చిత్రిస్తుంది. ఆడిటర్ భార్య దీనిలో వక్త. జీవితంలో ఎన్ని పొరలున్నాయి. ఎన్ని వేల ముసుగులున్నాయి. ముప్పయ్యేళు్లగా ఈ వ్యవహారానికంతా సాక్షి. తాను మాంగళ్యధారణతోనే `మరణించింది.' నిద్రలేవవలసినవాళు్ల పెనునిద్దుర నుండి మేల్కోవడం లేదు అంటుంది. ఈ నిద్ర మేలుకొల్పుకు ఆమె వాడుకున్న ప్రతీకగానం `కౌసల్యా సుప్రజా రామ' అని ఈ కౌసల్య నిరీక్షణ రామునికోసం ధర్మ సంస్థాపకుడైన, సత్యపరాక్రముడైన రామునికోసం. ఈ కౌసల్య దేశం. పృథ్వీగర్భం. అందుకే సగటు భారతీయుని సంబోధిస్తూ కవి అంటున్నాడు.
యోజనాల దూరాలను అడుగుల్లోకి సూక్ష్మీకరించడం
దూరాలను సంకలీకరించుకుని సమీకరణాలను సమీక్షించుకుని
దండయాత్రను రచించుకోవడం ఇవన్నీ ఒంటరిగా
నీవు గరళధారి శివుడివికావాలి
నిశ్చల సముద్రంగా గంభీరునివి కావాలి
అప్పుడు పోరాటం `ఓ మాటను పెంచేసుకుని, ఓ పాటను వెంటేసుకొని ఒక సూర్యుడిలా ఒక ఆకాశంలా ఒక భూమిలా ఒంటరిగా ఒక వ్యక్తిగా పోరాటానికి ఉపక్రమిస్తావు.' ఈ ఒంటరిపోరాటం ఆత్మవిశ్వాసంలోనుంచి పొడుచుకు వస్తుంది. గాంధీజీ దేశంలో పోరాటం ఇలాంటి స్థితిలోనే ప్రారంభించారు. ఆ ఒక్క వ్యక్తిలోనే కోట్లాది భారతీయుల చైతన్యం సమీకృతమై అహింసా సేవావాహిని అయింది. అందుకే `గాంధీ జీవన విధానం కంటే గొప్ప పరిత్యాగ సిద్ధాంతం ఉన్నదా' అని కవి ప్రశ్న. రామా చంద్రమౌళి కవితలో వరంగల్లు మాండలిక భాషలోని జీవలక్షణం ఉన్నది. ప్రాంతీయ మాండలిక ప్రయోగాల బిగింపు ఉన్నది. `పెంకాసు', `ఠక్కున, `ఇసిరె' `సద్దుల', `దబదబా', `పతంగీ', `మాంజా', `బొక్క' మొదలైనవి గమనించవచ్చు.
అభివ్యక్తి విషయంలో చంద్రమౌళి కవితకు వాడి ఎక్కువ. `ఏండ్లకు ఏండ్లు గొడ్రాలైన ఆకాశం చినుకు రాల్చదు' `ఆడబొడ్డు చుట్టూ మగచీమలు' `మొస్స పోసుకుంట' `పనియంత్రాలే మంత్రాలపై ఓంు్టగల్లు నగరాన్ని ఓ ఎగిరే జెండగా' `నీ ఉత్తరం చంద్రుణ్ణి తోడ్కొని వచ్చే ఓ ఆకాశం.' ఈ వాక్యాలు కవి భావుకతను పట్టియిస్తాయి.
శ్రీ రామాచంద్రమౌళి ఇంతకు ముందు ప్రచురించిన కవితా సంపుటాలు శిలలు వికసిస్తున్నాయి (1979) స్మృతిధార (1984)ల్లో కవి ఇంత విస్తృతంగా కవితా గంగా ప్రవాహాలను క్రుమ్మరించలేదు. వాటిల్లో పరిమిత బింబాల ప్రతీకల వాక్యవిన్యాసాల పునరావృత్తి ఉన్నది. గొంతులో ఇతర కవుల ముద్రలు ఉన్నాయి. అయితే `ఎటు' వచ్చేసరికి ఈ కవి సర్వతంత్ర స్వతంత్రుడు. భాషలో అనూహ్య మైన వేగం, అభివ్యక్తిలో విలక్షణమైన వినూత్న వైఖరి, వస్తువ్యాసంలో ఆత్మీయత ఈ అంశాలు దీన్ని సర్వతో ముఖంగా వర్చస్వంతం చేశాయి.
ఈనాటి శిథిలమవుతున్న కుటుంబ వ్యవస్థను చిత్రించే `గుండెపుండు' గీతంలో శ్వాసించేశవం అయిన తండ్రి దుర్భర పరిస్థితిని చిత్రించి `నెలక్రితం అమ్మచావును పెళ్లిలా జరిపిన కన్న పిల్లలు' తను జీవించి వుండటాన్ని ఎంత భారంగా భావిస్తున్నారో హృదయ విదారకంగా చిత్రించాడు కవి. తుదకు తన స్థితి పాయలు పాయలుగా ఎడతెగని దుఃఖం, నీడలు నీడలుగా చంపకుండా వెంటాడే భయం' ఈ భయం చంపదు ఛేజ్ చేస్తుంది.
`యుద్ధరహస్యం' గీతం ప్రపంచీకరణలోని తాత్పర్యాన్ని వెల్లడిస్తున్నది. విద్యావంతుల `బానిసల వలసలు' ఎలా ఐడెంటిటీని పరిహరిస్తున్నవో `మనిషిని ఓ మార్కెట్ చేసి చివరకు నీకు తెలియకుండానే నిన్ను హర్రాజు చేస్తుంది.' ఈ కొత్త దోపిడీని వెల్లడిస్తాడు కవి. భారతీయ జీవనాదర్శ శిఖరాలు ఎలా పడిపోతున్నాయో ఆశ్చర్యకరమైన శబ్ద సంపుటితో వ్యక్తం చేస్తున్నాడు.
`కొండ శిఖరంపై ఓ రమణమహర్షి మరణ మహర్షి రణమహర్షి మర మహర్షి రాలిపోతున్నట్లు, కూలిపోతున్నట్టు' `రమణ మహర్షి' శబ్దం పొందిన వికారాలు మూడూ జాతి పతనాన్ని సూచించే విలక్షణ పదబంధాలు. శబ్దం అక్షర వ్యత్యయంతో నూత్నావతారం ఎత్తిందో ఈ పంక్తులు శక్తివంతంగా రూపించాయి. రామా చంద్రమౌళి శిల్ప పారమ్యం ఇలాంటి ఘట్టాలలో చూడవచ్చు.
వ్యతిరేక పార్శా్వన్ని ఇంత బలంగా చూపిన ఈ కవి సమాజంలోని అనుకూల పార్శా్వన్నీ ప్రకటించటమూ అవసరమే.
భావుకజగత్తులో కొత్త జండాలు ఎగురవేస్తున్న కవి రామా చంద్రమౌళి.
good analysis.
ReplyDelete