Monday, January 25, 2010

‘అంతరంగం’కు ‘ టాగూరు సాహిత్య పురస్కారం’

written by - డా.లక్ష్మణ చక్రవర్తి

(సుప్రసన్నాచార్య ‘అంతరంగం’కు నేడు ఢిల్లీలో సాహిత్య అకాడమి ‘టాగూరు సాహిత్య పురస్కారం’ ప్రదానం చేసిన సందర్భంగా)

అనుభూతి, అనుభవం ఇవి రెండు ఒకే వ్యక్తిలో ఉంటే అంతరంగం సుప్రసన్నమౌతుంది. అనుభూతిని అనుభవానికి తెచ్చుకుని అంతరంగాన్ని ఆవిష్కరించగలగడం అందరూ చేయగలిగిన పని కూడా కాదు.నలభై ఏళ్లుగా సృజన/విమర్శ రంగాలలో తమదైన ముద్రను ప్రదర్శిస్తూ తమ అంతరంగాన్ని ఈ రెండు రంగాలలోను ఆవిష్కరిస్తున్నవారిలో ప్రత్యేకంగా చెప్పదగినవారు ఆచార్య కోవెల సుప్రసన్న. సృజనమూలాలు విమర్శ చైతన్యం రెండూ వేర్వేరు తీరాలు.హృదయం ద్రవించి ఏ తీరాన్ని చేరుతుందో దానినిబట్టి సృజన/విమర్శ ఏర్పడతాయని భావించే వర్గానికి ప్రతినిధిగా నిలిచేవారు వీరు. గత ౪౦ ఏళ్లుగా సృజనాత్మక, శాస్త్ర వాఙ్మయ గ్రంథాలకు రాసిన పీఠికలన్నీ కలిపి ‘అంతరంగం’గా సృజనలోకం (వరంగంల్‌) వారు ప్రచురించారు. ఇందులో ౬౮ పీఠికలున్నాయి. పెద్దల స్తుతిరూపంలో ప్రాచీనాంధ్ర కవుల పీఠికలుంటే పెద్దలే రచించినవి ప్రస్తుత పీఠికలు. రెండవ పద్ధతికి సంబంధించిన పీఠికలు ఇవి. చాలావరకు పీఠికలు గ్రంథాన్ని, గ్రంథకర్తను ప్రోత్సహించి ముగించినట్లుగా, గ్రంథ విశేషాలతో కూడినట్లుగా ఉంటాయి. ఈ పద్ధతికి భిన్నంగా ఉండడమే ఈ పీఠికల విశిష్టత. సుప్రసన్న ఈ పీఠికల ద్వారా కొత్తమార్గం వేశారని చెప్పవచ్చు. రచన, రచయిత కంటే రచనలోని అంశానికి సంబంధించిన విస్తృత విషయాలను అందించడం ఆ కొత్తమార్గం.౧౯౬౬లో సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘వసుచరిత్ర’కు సంపాదకునిగా రాసిన పీఠిక నుండీ, సాహిత్యలోకంలోకి ఇటీవల వచ్చిన ‘భారతీయ జ్వలిత చేతన-బంకించంద్ర చటర్జీ’ వరకు పయనించిన వారి పీఠికలు ఇందులో ఉన్నాయి. కాలక్రమంగా కాకుండా విషయ ప్రధానంగా పీఠికలు కూర్చడం బాగుంది. విషయం అర్థం చేసుకునేందుకు వీలు కలిగింది. ఒక అంశానికి సంబంధించిన పీఠికలను ఒక దగ్గరగా చదువుకుంటే ఆ విషయానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది.సాహిత్య చరిత్ర, విమర్శకులకు సంబంధించిన పీఠికలు ముందుగా చేర్చడం, స్వీయ రచనలు, భగవత్‌ సంబంధ రచనలు దేశభక్తి, విశ్వనాథ, శాస్త్ర వాఙ్మయ విషయాలకు సంబంధించినవి వరుసగా చేర్చడం వలన విషయ విస్తృతి తెలుస్తుంది. భట్టుమూర్తి వసుచరిత్రకు రాసిన పీఠిక మధ్యయుగ ప్రబంధాల అధ్యయనానికి ఒక నూతన మార్గాన్ని వేసింది.కథను మూడంచెలుగా భట్టుమూర్తి నిర్వహించినట్లు వారు ప్రతిపాదించడంతో తర్వాతి కాలంలో ప్రబంధాలలో ఉన్న సంకేత శిల్పాన్ని చాలా మంది అధ్యయనం చేయడానికి దోహదం చేసింది. ఉపరిచరంలో వసువృత్తాంతం, ఇంద్రవృత్రాసురుల కథ, జలకథ ఈ మూడు పొరలలో కథ నడిచిందని ప్రతిపాదించారు. మహాకావ్య నిర్మాణానికి ఉపబలకంగా ఉండే అన్ని అంశాలు ‘శిల్పం’లో ఉంటా యి. ఈ శిల్పం ద్వారా కావ్య నిర్మాణాన్ని కవి చేసిన తీరును ఈ పీఠిక తెలియజేస్తుంది.చేతనావర్తం ఆధునిక సాహిత్యలోకంలో తెచ్చిన మార్పు దేశీయమైంది. వైయక్తిక, సామాజిక అనుభూతులను వ్యక్తీకరించడంలో చేతనావర్త కవులు కొత్త దారులు వేశారు. ఈ పీఠికలో డార్విన్‌, ఫ్రాయిడ్‌, మార్క్స్‌, ఐన్‌స్టీన్‌ చేసిన శాస్త్రీయ భావాలపైన ఆధునికత నిలిచిందన్నారు. ౧౯౬౦ వరకున్న సాహిత్య వాతావరణాన్ని కూలంకషంగా చర్చించి, ఐహిక, భావ, ఆధ్యాత్మ రచన చేసేవారు చేతనావర్త కవులని భావించారు. సహృదయుడి నేపథ్యంతో విమర్శ నిర్మించవలసి ఉందన్న ప్రతిపాదన చేశారు. ఆధునిక సాహిత్య పరిణామాన్ని సూచించే పీఠిక ఇది.స్వీయరచనల పీఠికల్లో పాంచరాత్రాగమశాస్త్ర అవగాహన తెలుస్తుంది. హనుమంతుడు, నృసింహుడు మొదలైన విషయాలపై రచించిన సిద్ధాంత వ్యాసాలు, సృజనాత్మక రచనలకు రాసిన పీఠికల్లో ఆయా భగవత్తత్వాలు తెలుస్తాయి. కృష్ణతత్త్వానికి సంబంధించిన పీఠికలు అంతరంగంలో ఎక్కువ. ఉత్పలవారి భ్రమరగీతాలకు రాసిన పీఠిక కృష్ణతత్త్వక్రమ పరిణామాన్ని చెబుతుంది.ముదిగొండ వీరభద్రమూర్తి వందేమాతరం, బంకించంద్ర గ్రంథానికి రాసిన పీఠికలు భారతీయ జీవనమూల్యాలు పరిష్కృతం కావడానికి కారణమైన వారిని చెబుతూనే ప్రస్తుత కర్తవ్యాన్ని వివరిస్తాయి. కేతవరపు రామకోటి శాస్త్రి నాచన సోముడుకు రాసిన పీఠిక/సోమనపై వచ్చిన విమర్శ గ్రంథాలను ప్రస్తావించి తుమ్మపూడి వారిది సమగ్రమైందని సమన్వయ పూర్వకమైందని నిష్పాక్షికంగా చెప్పారు.అంతరంగంలోని పీఠికలు పుస్తకం అట్టమీద ఉన్నట్టు ‘పీఠికలు కేవలం ప్రశంసలు కావు. కావ్యగర్భంలోనికి ప్రవేశించి దాని పరమార్థాన్ని వ్యాఖ్యానించేవి. పీఠికలో రచన/ రచయిత కంటే దానిచుట్టూ ఉన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన పాఠకుడి జ్ఞానం మరింత విస్తృతమవుతుంది.ఇందులోని సాహిత్య చరిత్ర విమర్శ వికాసాలకు సంబంధించిన పీఠికలు ఆయా రంగాల్లోని కొత్త మార్గాలను చెబుతున్నాయి. అయితే సుప్రసన్నగారి విస్తృత విషయ పరిజ్ఞానం పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏ పీఠికకు ఆ పీఠికగా అధ్యయనం చేస్తే ప్రతి పీఠికా విజ్ఞాన సర్వస్వమవుతుంది. ఒక్కో పీఠిక ఒక్కో విమర్శాంత రంగాన్ని ఆవిష్కరిస్తుంది.ఈ విధంగా వారి పీఠికలన్నీ ఒక్క దగ్గరికి చేర్చడం వల్ల సాహిత్య విమర్శలో కొత్త మార్గాలు తెలుసుకోవడానికి, లోటును దూరం చేసుకోడానికి ఉపయోగపడతాయి. అటువంటి పీఠికలకు టాగూర్‌ సాహిత్య అవార్డు రావడం సాహిత్య విమర్శకులకు ఆనందాన్ని కలిగించే విషయం.

5 comments:

 1. నేను శీర్షిక చూసి చరసాల ’అంతరంగం’ కేమో అనుకున్నాను.

  ReplyDelete
 2. " సాహిత్య విమర్శకులకు ఆనందాన్ని కలిగించే విషయం. "
  అవును. నిజం గానే సంతోషించాల్సిన విషయం. కంగ్రాస్చులేషన్స్ సుప్రసన్న గారు. సంపాత్కుమారాచార్య గారు ఎలా వున్నారు? మేము అదిగామని చెప్పండి.

  ReplyDelete
 3. ఆచార్య సుప్రసన్న గారికి:

  అభినందనలు.

  నిజానికి వారు చేసిన కృషికి మనం ఎంతో రుణపడి వుండాలి. కాని, అకాలం కదా! నిజమయిన కృషికి సత్కారాలు దక్కని కాలం ఇది.

  మీ కలం పది కాలాలు విరామ మెరుగక సాగాలని

  మీ
  అఫ్సర్

  ReplyDelete
 4. మీ కలమెత్తి నిల్పిన అమేయ సమున్నత 'పీఠికా'కృతుల్
  ఏ కవికేని, పండితునకేని, మహాంధ్ర విమర్శ సాహితిన్ -
  చీకటి నుండి కాంతిమయ సీమకు చూపు పథాలు! 'సుప్రస
  న్నా'! కవి లోక వంద్య! అభినందన - 'సత్కృతి' నొందు మీకిదే!

  ReplyDelete
 5. ఆచార్య సుప్రసన్నాచార్య గారికి పాదాభివందనములు. మీ '"అంతరంగం" కు టాగూరు సాహిత్య పురస్కారం లభించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  ReplyDelete