Friday, July 31, 2009

తెలంగాణలో సాహిత్య చైతన్యం

1955లో బి.ఏ చదువుకోవటానికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాను. అప్పుడు తెలంగాణా రచయితల సంఘం చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నది. ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. `ఉదయ ఘంటలు' కవితా సంకలనం వెలువడింది. మంజీర అనే సాహిత్య పత్రికను ప్రారంభించితే ఒక సంచిక మాత్రం వెలువడింది. మా చిన్నాయనగారు సంపత్కుమారాచార్యులు భువనగిరిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ రచయితల సంఘంలో ముఖ్య కార్యకర్తగా ఉన్నారు. హైదరాబాదులో నేను యూనివర్సిటీ ప్రాంగణంలోని `ఏ' హాస్టలులో చేరాను. అప్పటికి అక్కడ ఉదీయమానుడైన కవి మాదిరాజు రంగారావు వున్నారు. ఆయన తొలిసారి కలుసుకోగానే అంతకుముందే ప్రచురితమైన నేను, సంపత్కుమారతో కలిసి రచించిన కావ్యం `హృద్గీత' నుంచి పద్యాలు చదివించుకుని సాదరంగా ఆహ్వానించారు. నాటినుంచీ మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా, దాదాపు సాహచర్యంగా సాగి పోయింది. అప్పటికే `తెలుగు స్వతంత్ర'లో రంగారావు రచనలూ, నా రచనలూ వెలు వడుతూ వున్నవి. రంగారావు బాగా పద్యం వ్రాయగల, తీర్చిదిద్దగల నేర్పుగలవారే. విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం అంటే అమితమైన ఇష్టం. ఆయన ఇంట్లో బెజవాడలో వుండి కొన్ని రోజులు మేఘసందేశం చదువుకున్నారు. `నా ఇంటన్‌ పదినాళు్ల బిడ్డవలె నున్నాడాంధ్ర సాహిత్య రేఖాయోగ్యుండగు మాదిరాజమణి రంగారాయ బాలుండు' అని విశ్వనాథ ఖమ్మంలో కల్పవృక్ష పఠన సభలలో ఆయనను ప్రశంసించడం నాకు గుర్తే. నారాయణగూడా `దీపక్‌మహల్‌' వెనుక పల్లాదుర్గయ్యగారి ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లోనే రామరాజు, దాశరథి, ఆళ్వార్‌ స్వామి ప్రభృతులు చిన్నచిన్న భాగాలలో అద్దెకు వుంటూండేవాళు్ల. అది సాహిత్య కేంద్రం. సాయంకాలాల్లో మేము యూనివర్సిటీ హాస్టలునుంచి అక్కడికి చేరుకునేవాళ్ళం. ఎం.ఎల్‌.ఏ క్వార్టర్‌‌సలో వుండే నారాయణరెడ్డి చేరుకునేవాడు. కవిత్వమే ప్రధానాంశం. వర్తమాన ధోరణులు, వాటిని గురించిన ప్రశంసలు, విమర్శలు, చర్చలు కొనసాగేవి. సమష్టిగా వీళ్ళందరికీ సాహిత్యమే ప్రధానాంశం గానీ వీళ్ళమీద ఏ రాజకీయ పక్షాల ప్రాబల్యం వుండేది కాదు. కులాల స్పృహ వుండేది కాదు. ఈ గోష్ఠూలలోకి కాళోజీ వచ్చి చేరేవారు. అట్లాగే కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వీళ్ళందరికీ ఆప్తులు. ప్రచురణకు ముందు వడపోతలో శాస్త్రిగారిది ప్రథమ స్థానం. జనగామలో అధ్యాపకులుగా పనిచేస్తున్నా, ఉరుపుటూరి రాఘవాచార్యులు ఈ సమూహానికి ఎంతో వెన్నుబలంగా నిలిచేవారు. ప్రథమ వార్షికోత్సవాలు జనగామలో జరగటానికి బహుశః ఆయనే కారణం. అక్కడ ఆయన పుట్టపర్తివారిని పిలిపించి ఉపన్యాసాలు ఏర్పాటుచేసి వాటిని ప్రచురించారు కూడా. వానమామలై వరదాచార్యులు క్షయ వ్యాధి నుంచి బయటపడి పోతన చరిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. కపిల కాశీపతి సమాచార శాఖ అధిపతిగా వున్నారు. నారాయణరెడ్డి `నాగార్జునసాగరం' వ్రాసిన తరువాత దాన్ని నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన నివాసంలో వినిపించుకున్నారు. జె.బాపురెడ్డి, చేకూరి రామారావులు నిజాం కాలేజీలో చదువుకునే వాళు్ళ. సి.నా.రెతో బాటే గూడూరి సీతారాం వుంటుండేవాడు. `మంజీర' ఆగిపోవడంతో దక్షిణ భారత ప్రచారసభ నిర్వహించే పత్రిక `స్రవంతి' తెలుగు సాహిత్య వికాసానికి బాసటగా నిల్చింది. కొత్త కవుల రచనలకు ఆహ్వానం పలికేది. ఆ పత్రిక సంపాదకులు వేమూరి ఆంజనేయ శర్మ సౌజన్యం మూర్తీభవించిన వ్యక్తి. అప్పట్లో తెలంగాణా రచయితల సంఘం నిర్వహించిన కవిత్వపు పోటీలో తెన్నేటి పూర్ణచంద్రరావు రచన `దయ్యాల మఱ్ఱిచెట్టు' కు మొదటి బహుమానం యాభై రూపాయలు. నా రచన `ఎవరెస్టు గేయానికి' రెండవ బహుమానం ముపై్ప రూపాయలు ఇచ్చారు. ఈ బహుమానం నిర్ణయించిన వారిలో పుట్టపర్తి నారాయణాచార్యులు, నార్ల వెంకటేశ్వరరావులు వున్నారని విన్నాను. నారాయణ రెడ్డి నాగార్జున సాగరం గేయకావ్యం. బౌద్ధమత వాతావరణంలో నుంచి ఉత్పన్నమైన ప్రేమ త్యాగాల జమిలితనం దీనిలో ఇతివృత్తం. చివరకు సాగరం ఏర్పడటం కావ్య తాత్పర్యం. భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నాగార్జున సాగరం ప్రారంభించిన తరువాత అదే వేదికమీద నారాయణ రెడ్డి కావ్య ప్రకటనం జరిగింది. ఇదొక విలక్షణ సన్నివేశం. అంతకు పూర్వం నారాయణ రెడ్డి `జలపాతం' అనే ఖండకావ్యాన్ని దాశరథికి అంకితం చేశారు. ఆ కావ్యంలో ఆ అంకితం పద్యాలు అద్భుతమైనవి. భావ బంధురమైనవి. ఆనాళ్లలో అబ్బూరి వరద రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఛాయాదేవి సంపాదకత్వంలో `కవిత' పత్రిక రెండు సంచికలు చాలా అందంగా వచ్చాయి. దీనిలో తెలంగాణ రచయితల్లో ప్రముఖులెవరికీ స్థానం లభించలేదు. ప్రయోగవాద ప్రగతివాదాల కలయికగా, పాశ్యాత్య కవుల రచనల అనువాదాలతో ఈ సంచికలు వచ్చాయి. సిద్దిపేటలో వేముగంటి నరసింహాచార్యులు స్వయం వ్యక్తుడుగా కావ్య రచన సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా చండూరులో అంబటిపూడి వేంకటరత్నంగారు ఆధునిక కవితకు రూపుదిద్దుతున్న వాళ్లలో వున్నారు. వరంగల్లులో గార్లపాటి రాఘవరెడ్డి, ఉదయరాజు శేషగిరిరావు, గొట్టుముక్కుల రాధాకృష్ణమూర్తి రచనలు కొనసాగిస్తున్నారు. నాటి తెలంగాణంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో వున్న వాతావరణం ఫలితం- ఏ రూపంమీదా, ఏ వస్తువుమీదా, ఏ ప్రత్యేకమైన అభివ్యక్తిపైనా, ఏకైక గమ్యమన్న నిష్ఠ లేకపోవడం. దాశరథి `మస్తిష్కంలో లేబోరేటరీ' అయినా `మహాంధ్రోదయం' అయినా వానమామలై వారి `పోతన చరిత్ర'మైనా, కాళోజీ `నాగొడవ' యైనా నారాయణ రెడ్డి `విశ్వగీతి'యైనా కవి గోష్ఠూలలో సమానంగా ఆదరింపబడేవి. యువ కవుల రచనలకు ప్రతిష్ఠ బాగానే వుండేది. ఈ పరిస్థితివల్ల కవిత్వానికి, అనుభూతికీ ప్రాధాన్యం వచ్చింది. రాజకీయ సిద్దాంతాలకు సాహిత్యం కట్టుబడిపోలేదు. దాశరథి ప్రగతివాద మార్గం నుంచి ప్రయాణం ప్రారంభించినా, కవిత్వ స్ఫూర్తికే కట్టుబడ్డారు. ఆయన పద్యం కొత్త పలుకుబడినీ, జీవాన్ని సంతరించుకున్నది. భావకవులు తెచ్చిన సౌకుమార్యాన్ని కొంత సడలించుకుని ఓజస్సును సమకూర్చుకున్నది. `రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికము్మ దక్కునే' అన్న భీషణ ఘోష పలికించారు. వీర వ్యావహారానికి కానీ, వీర గ్రాంధికానికి గానీ తెలంగాణాలో ప్రాబల్యం లేదు. వచ్చినాడు, చేసినాడు మొదలైన క్రియారూపాలు, దేశికవులలో, తిక్కనలో కనిపించే నామరూపాలు వ్యవహారంలో నిలిచివుండటం వలన యిక్కడ భాషా వైపరీత్యం లేదు. నారాయణరెడ్డి ఒకసారి నా వచనాభాసంగా వ్రాసిన గీత పద్యం చదువుతూవుంటే తన ఒక గీత పద్యం వినిపించారు. దాని చివరిపాదం `మబ్బులవలె వెన్నెలవలె మంచులవలె' అని గుర్తు. ఇంత విశిష్టంగా పద్యాన్ని తీర్పగల నేర్పు ఆయనకు వున్నది. దేవులపల్లి రామానుజరావు, జువ్వాడి గౌతమరావు, పి.వి. నరసింహారావు మొదలైన సాహితీవేత్తలు సమచిత్తంతో సాహిత్యాన్ని నిలబెట్టేవారు. ఆంధ్ర ప్రాంతం నుంచీ సాహితీవేత్తలు రావటం, కావ్య పఠనాలు, ఉపన్యాసాలు విరివిగానే సాగేవి. ఒకసారి బాలాజీ భవన్‌లో నా అభిమాన కవి అనే అంశం గురించి రెండురోజులు ఉపన్యాసాలు జరిగాయి. రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, శ్రీశ్రీ తదితరులను గురించిన ప్రసంగాలు సాగాయి. చివరకు నారాయణరెడ్డి ప్రసంగం తనకంటే వయస్సులో మూడునాల్గేళ్ళకు పైబడని సహచరుడైన కవి దాశరథిని గురించి విశిష్టమైన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. తెలంగాణా రచయితల సంఘం ప్రాచీన కావ్య సంస్కారాన్ని సజీవంగా వుంచడంకోసం కావ్య పఠనోత్సవాలను నిర్వహించింది. భారత భాగవతాలను, మను వసు చరిత్రాదులను శ్రావ్యంగా పఠించి పాఠకుల హృదయాలకు చేరువగా, భావస్ఫోట కంగా, పద్యంలోని సంగీత గర్భితను స్ఫుటంగా చేస్తూ ఈ పఠనం కొనసాగింది. ఈ పద్ధతిని కొనసాగించుతూ ఈనాటికీ నిలబెడుతున్న మహా రసికశ్రేష్ఠూడు జువ్వాడి గౌతమరావు. తెలంగాణా రచయితల సంఘం సాహిత్య చైతన్యాన్ని విశ్వతోముఖంగా పరివ్యాప్తం చేసేందుకు ఎన్నుకున్న ప్రక్రియ కవి సమ్మేళనం. ఉర్దూ పారశీక కవి సమ్మేళనాలలోని పాఠకుల ప్రతిక్రియను ప్రకటించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. ఎన్నుకొన్న కవులనే కాక ఎందరైనా కవులు తమ కావ్యాలను పఠించే సంప్రదాయానికి బలం చేకూర్చారు. 1955 ప్రాంతాలలో బమ్మెరలో కవి సమ్మేళనం రాత్రి తొలిజాములో ప్రారంభమై తెల్లవారేదాకా కొనసాగింది. ఆర్ర్ధత ఆత్మీయతలు అల్లుకున్న తెలంగాణలోని సాహిత్య స్థితి అది.

Thursday, July 30, 2009

రసలోకం-3

పద్యం చచ్చిపోయిందని ప్రచారం చేశారు చాలాకాలం. పద్యం ముసలిదైపోయింది. నేటి అవసరాలకు భావాలకు సరిపోదు. దానికి ఉన్న పరిమితిలో ఆధునిక భాష ఒప్పదు. ఇంకా అనవసరమైన నిర్బంధాలు - అక్షర గణాలు, యతిప్రాసలు ఇంకా తత్సమ పద బాహుళ్యం అందువల్ల సామాన్య ప్రజలకు అర్థం కాదు - అని వాదం
పూర్వం భారత భాగవతాలు గ్రామాలలో రచ్చబండల దగ్గర చదువుతూ ఉండటం వలన జనం వినేవాళు్ల. పద్యం చదవటంలోని ఒడుపు వల్ల అది అందరికీ అర్థం అయ్యేది. యక్షగానాలలో వచనంలో వ్యావహారికం ఉన్నా, పద్యాలూ, పాటలూ లాక్షణిక భాషలోనుండేవి. వీటిని జనం చూచి ఆనందించే వాళు్ల.
20వ శతాబ్దంలో తెలుగులో నూతన సారస్వతం ఆరంభం కావడం, అనేక ప్రక్రియలలో రచనలు కొనసాగటం జరిగింది. పద్యం, గేయం, వచన పద్యమూ ప్రస్తరించాయి. వాటి వాటి అంతస్సత్వాన్ని బట్టి అవి సారస్వతంలో స్థానం పొందాయి. తిరుపతి కవుల తెలుగు పద్యం వాడుక భాషలోని కాకువును, వాక్య నిర్మాణాన్ని తనలో సంలీనం చేసుకున్నది. క్రియాంత ప్రత్యయాలు వదిలేస్తే మిగిలినదంతా వ్యవహార భాషే. పద్యం స్వేచ్ఛగా సంచరించటానికి వీలు లేదని ఆక్షేపించిన నిర్బంధాలు వారి పద్యాలకేం అడ్డం కాలేదు.
కావ్యభాషలో పలుకుబడిలో, పద బంధాలలో శ్రుతి మాధుర్యంలో నూతన స్థితిని ప్రవేశపెట్టిన రాయప్రోలు సుబ్బారావు పద్యం, సహృదయులకు కొత్త ప్రేయసిలాగా చేరువ అయింది. కృష్ణశాస్త్రి పద్యం మాధుర్య ప్రవాహమై వింత సొగసులు పోయింది. ``శిలలు ద్రవించి యేడ్చినవి శీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురము్మలు'' అన్న కొడాలి సుబ్బారావు పద్యం ప్రాచీన వైభవ శైథిల్యాన్ని రూపుగట్టించింది. నేటితో అస్వతంత్రతా నియతమైన ఈ బ్రతుకు తెల్గువారు భరింపలేరు'' అన్న విశ్వనాథ విషాద గీతం జాతి జనుల గుండెలలో ప్రతిస్వనించింది. త్రిపురనేని సూతపురాణం కొత్తగా పురాణ వ్యతిరేక ధోరణిని పద్యంలో ఆవిష్కరించింది.
ఆ నాళ్లలో నండూరి సుబ్బారావు యెంకిపాటలు జానపద భాషలో రాయటం చేత అవి ఎంత రసవంతాలయినా అకలుష ప్రణయ ప్రకటనాలైనా క్రమంగా అవగాహన పరిమితులలో నుంచి వెలికి పోతున్నాయి. ఆ స్థితి గేయ కావ్యాలైన కిన్నెరసాని పాటలకు శివతాండవానికి పట్టలేదు.
1932 తర్వాత తెలుగు పద్యానికి కాల్పనిక కవిత్వంలోని పరిధులు తొలగిపోయాయి. సౌందరనందం రాకతో ఖండకావ్యం మహాకావ్యమయిపోయింది. ఆధునిక సంవేదనలను నాడు కావ్యాలు ప్రస్ఫుటం చేయగలిగాయి. సౌందరనందం కానీ, రామాయణ కల్పవృక్షం కానీ, శివభారతం కానీ, రాణా ప్రతాపసింహ చరిత్ర గానీ, ఆత్మకథ కానీ, ఆంధ్రపురాణం కానీ పద్యం శక్తి ఎంతటిదో ప్రస్ఫుటం చేశాయి. దాశరథి పద్యం సవ్యసాచి సంధించిన బాణం వలె సామాన్య జనులలోకి దూసుకొని వెళ్లింది. `నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను'.. `మూడు కోటుల నొక్కటే ముడి బిగించి పాడినాడ మహాంధ్ర సౌభాగ్యగీతి'... ``తీగెలను త్రెంపి అగ్గిలో దింపినాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ''.. ``మా నిజాంరాజు జన్మ జన్మాల బూజు'' ఈ విధంగా ఉదహరిస్తే దాశరథి పద్యాలన్నీ ఇందుకు తార్కాణాలే.
`పద్యం ఆధునిక భావాలను చెప్పలేదు' అనే మాట సత్యమేనా? `వాస్తవము్మ నార్లవారి మాట'' అన్న మకుటంతో నార్ల రాసిన పద్యాలు ఆధునికాలు కావా? `పెన్నేటి పాట'లో రాయలసీమ కరువు రైతు జీవితం ఎంతో బలంగా వ్యక్తమైంది అంతెందుకు జాషువా పద్యాలు సమకాలీన పరిమితులలో ఒదుగటం లేదా? రామిరెడ్డి పానశాల పద్యాలు ఈనాటి సంవేదనలకు తార్కాణం కాదా? శ్రీశ్రీ సిరిసిరి మువ్వ పద్యాలు, రుక్కుటేశ్వర శతకం పద్యాలు నేటి భాషను ఇముడ్చుకోవటం లేదా?
ఇంద్రగంటి వారి కీర్తితోరణం, ముదిగొండ వీరభద్రమూర్తి గారి `వందేమాతరం' ఎంతో సరళమైన పద్యాలను ఇముడ్చుకొన్నవి. వందేమాతరంలో భాష, వాతావరణం, సన్నివేశ కల్పన స్వాతంత్య్రోద్యమపు స్ఫూర్తిని ఎంతో బలంగా అనుసంధించాయి. బోయి భీమన్న పద్యాలు ఎంతగా నవంనవంగా ఉన్నవో చదివితే తెలుస్తుంది. అనుముల కృష్ణమూర్తి పద్యాలు గుర్రాలపై స్వారీ వంటివి. బేతవోలు పద్యాలు గోదావరి ప్రవాహం వంటివి.
ఇటీవలి కాలంలో తెలుగు పద్యం వచనానికి అత్యంత సన్నిహితంగా వచ్చింది. విశ్వనాథ మధ్యాక్కరలలో ఈ గుణం విశ్వరూపం దాల్చింది. బాడాల రామయ్య కృష్ణకథా విపంచి, సంపత్‌రాఘవాచార్య విశ్వనాథ విజయం ఉత్తమ శ్రేణి రచనలే. చిటిప్రోలు కృష్ణమూర్తి `పురుషోత్తముడు' ఇటీవలి పద్యకావ్యాలలో మేలైంది.
ఉత్పలవారి `ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు' వర్తమాన నగరాన్ని చిత్రించిన రచన. అమేయమైన పద్యశక్తి దీనిలో ప్రకటితమైంది. జోస్యము విద్యాసాగర్‌ `అమ్మ' కోడూరి విష్ణువర్థన్‌ `ధర్మదండం', విలక్షణమైన రచనలు. `కృష్ణరశ్మి' నుంచి `మణిసేతువు' దాకా నా కావాలు, సంపత్కుమార `ఆముక్త', అనుమాండ్ల భూమయ్య మార్మిక పద్య రచనలు ఇటీవలి ఆధ్యాత్మి రచనలు. ఆచార్య ఫణీంద్ర మాస్కో స్మృతులు ఆధునిక నాగరక శాస్త్రీయతా చేతనను ప్రతిఫలించే రచన. కరణం బాలసుబ్రహ్మణ్య పిళై్ల `ఒక రాఘవ రెడ్డి కథ' పెన్నేటి పాటతో పోటీపడదగిన రచన.
`తెలుగు పద్యమనే దానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అది భూస్వామ్య యుగంలో పుట్టిన ప్రక్రియ. దానికి పౌరాణిక వాసన ఉన్నది. రాచరిక వ్యవస్థ భావజాలపు స్వభావం ఉంది. ప్రజాస్వామ్య స్వభావం లేదు.'(వి. చెంచయ్య, 2004) ఇలాంటి గతానుగతికమైన అభిప్రాయాలను ఖండిస్తూ చేరా అంటున్నాడు. `నిజానికి పద్యం తత్కాలపు అవసరాలకు తగినట్టుగా ఎపుడూ మారుతూనే ఉంది.'
ఈ కాలపు అవసరాలకు తగినట్లుగా మారిపోతున్న తెలుగు పద్యం 20వ శతాబ్దంలో నూతన రూపాన్ని సంతరించుకున్నది. నూతన భావ ప్రకటనకు యోగ్యంగా పరిణమించింది. అబ్బూరి రామకృష్ణరావు ఏ ఛందోగతీ లేని వచన పద్యాన్ని కవిత్వ యోగ్యంగా ఆమోదించేవారు కారు.
గడచిన పాతిక సంవత్సరాలుగా అవధానాలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. జనం వేలాదిగా వీటిల్లో పాల్గొంటున్నారు. ఆనందిస్తున్నారు. వీటివల్ల పద్యం అభినవంగా, తరుణంగా నిలిచి ఉంటున్నది.

Wednesday, July 29, 2009

లోకమ్ము వీడి రసమ్ము లేదు

సాహిత్యం అనుభవ సముద్రం. ఈ అనుభవానికి ఏ ఎల్లలూ ఏ కార నియతీ ఉండదు. మానవుడి సర్వ అనుభవాలు, సర్వ జీవన పార్శా్వలు అది ప్రతిఫలిస్తుంది. వివిధ ప్రక్రియలు, సాహిత్య రూపాలు అభివ్యక్తి వైవిధ్యాన్ని బట్టి పాఠకుల వైవిధ్యాన్ని బట్టి కాల ప్రభావాన్ని బట్టి వేరువేరుగా ఏర్పడుతూ ఉన్నవి. ప్రక్రియల భేదం తప్ప, అభివ్యక్తి వైవిధ్యం తప్ప సాహిత్య స్వస్వరూపంలో ఆత్మగా నిలిచి ఉండేది రసమే. ఈ రసం లోకంలోనుంచి కావ్యం లోనికి ప్రసరిస్తుంది.
`లోకము్మ వీడి రసము్మ లేదు' అంటే లోకమే రసమని తాత్పర్యం. లోకంలోనుండి కావ్య ప్రపంచంలోనికి ప్రవహించిన శబ్దం, దేశ కాలాల పరిమితులను ఛేదించుకొని సార్వజనీనంగా, సార్వకాలికంగా రూపొందింది. రసముగా పరిణమిస్తుంది. పాఠకుని అనుభవానికి చేరువగా చేరేందుకు రసము అతని ఎరుకలో ఉన్న స్వస్థాన వేష భాషాది మతములను ప్రకటిస్తూ అభివ్యక్తమవుతుంది.
ఈ వైవిధ్యాలను గుర్తించకుండా ఇటీవలి కాలంలో సాహిత్యాన్ని వైరుధ్యాల పుట్టగా, పరస్పరం సంఘర్షించుకొనే యుద్ధ శ్రేణులుగా వ్యాఖ్యానించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం సుమారుగా అరవై సంవత్సరాల నుంచి సాగుతూ, సాగుతూ ఇప్పుడు దాని పరమ వికృత రూపం ప్రకటిస్తున్నది.
నన్నెచోడుడు `మును మార్గకవిత లోకంబున వెలయక, దేశి కవిత పుట్టించి తెలుంగున నిలిపిరి చాళుక్య రాజు మొదలగు పలువురు' అన్నప్పుడు మార్గదేశి భేదములు మొదటిసారి ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన మొదట సంగీత శాస్త్రానికి చెందింది. ఆ తరువాత సాహిత్యంలోకి వచ్చింది. ఇక్కడ మార్గ కవిత్వం సంస్కృత కవిత్వమై నన్నయాదుల కవిత దేశి కవిత అయింది. తరువాత కొంచెం కాలం గడిచేసరికి మన అంచనాలు మారిపోయి నన్నయాదుల కవిత మార్గమై, పాల్కురికి సోమన మొదలైన వారి కవిత దేశి అయింది. పురాణ ఇతిహాస సంప్రదాయాలు, ఆ రూపాలు మొదటి వర్గం కాగా, దానికి భిన్నమైన ద్విపదాది రచనలు దేశి కవిత అయింది. ఈ విభజన మరి కొంత కాలానికి మరొక రకంగా ప్రస్తావించడం జరుగుతుంది. ఉదాహరణ కావ్యాలు.. దేశి లక్షణాలైన, గానయోగ్యాలైన రగడలు అధికంగా ఉన్నా దేశి కవితలుగా చెప్పబడటం లేదు. శతకాలు ఆత్మాశ్రయాలై, సమాజ వస్తువులు ప్రకటించేవి అయినా, అక్షర ఛందస్సుల్లో ఉండటం వల్ల దేశి కవితలుగా ప్రముఖంగా ప్రస్తావనకు నోచుకోవడం లేదు. మార్గకవిత్వం పండితైకవేద్యమని, దేశి కవిత్వం ప్రజాబాహుళ్యాన్ని ఉద్దేశింపబడిందని ప్రచారం జరుగుతోంది. పండితారాధ్యచరిత్రలో పాండిత్య వివాదాలు, అన్నమయ్య శృంగార మంజరిలో ప్రబంధ లక్షణాలు పామరులకు అందుబాటులోకి వచ్చేవి కావు.
ఈ విభాగం కొంచెం ముందుకు పోయి మౌఖిక, లిఖిత సంప్రదాయాలుగా విభజించడం జరిగింది. లిఖిత సంప్రదాయం అనేసరికి ద్విపదాది కావ్యాలు కూడా దాంట్లో చేరిపోతవి. అప్పుడు జానపద సాహిత్యం, అన్నమయ్య సంకీర్తనలు, సారంగపాణి, క్షేత్రయ్య వంటివారి సాహిత్యం, ఈ విభాగంలోకి వస్తాయి. రాగిరేకుల మీద రాయబడటం వల్ల అన్నమయ్య సాహిత్యాన్ని లిఖిత సాహిత్యం అంటారేమో నాకు తెలియదు. కానీ, అన్నమయ్య సాహిత్యంలో జానపదాంశాలు, ఆ రూపాలు ఎంత విరివిగ ఉన్నవో, ఉపనిషత్తులలోనూ, తత్త్వరహస్యాలు, దై్వతాదై్వత సిద్ధాంతాల విభేదాలు, మార్మిక సంకేతాలు ఎన్నో విరివిగా కనిపిస్తాయి. కొన్ని సంకీర్తనల వివరణలు, సూత్రభాష్యాదుల పాండిత్యం లేకుండా అర్థం కాదు. అట్లాగే త్యాగయ్య రచనల్లో ఉండే తాత్తి్వకాంశాలు, క్షేత్రయ్య రచనల్లో ఉండే రస, నాట్యశాస్త్ర విశేషాలు కేవలం పామరుల కోసం ఉద్దేశింపబడినట్లు కాదు.
పాల్కురికి సోమన కానీ, అన్నమయ్య కానీ, పల్నాటి వీరచరిత్రను రచించిన శ్రీనాథుడు కానీ, రంగనాథ రామాయణ కర్తకానీ, పండితులు కారనడానికి వీల్లేదు. వీరిలో కొందరు అటు పండితాదరణీయాలని చెప్పబడుతున్న కావ్యాలు, ప్రబంధాలు రచించడం ఒకవైపు, మరొక వైపు జానపద లక్షణాలు కల దేశి రచనలు రచించడం మరొకవైపు జరిగింది. ఒక పరిశీలన చేసి చూస్తే, తాత్తి్వకంగా సాహిత్య రచయిత వస్తువును బట్టి తను పెంచుకున్న శ్రోతృ సమూహాన్ని బట్టి ప్రక్రియను నిర్ణయించుకుంటున్నాడు తప్ప సహజంగానే ఈ సాహిత్య సృష్టిలో భేదబుద్ధి లేదు. జానపద సాహిత్యాన్ని సేకరించిన తొలిరోజుల్లో దానికి ప్రాచుర్యం కల్పించడానికి ఆదరణ లభించడానికి కొన్ని `అర్థవాద వాక్యాలు' చెప్పడం అవసరమే కావచ్చు కానీ, అవి ప్రామాణికాలని చెప్పడానికి వీల్లేదు. చింతా దీక్షితులు గారు, నేదునూరి గంగాధరం గారు, బిరుదురాజు రామరాజు గారు మొదలైన వారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి ధోరణి వివరణలలో చెప్పి ఉండవచ్చు. అనాదృత వాఙ్మయం, ప్రజావాఙ్మయం వంటి మాటలు వాడి ఉండవచ్చు. కానీ, ఏదీ నిశ్చితమైన అభిప్రాయం కాదనుకోవాలి. పోతన భాగవతంలో`కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు మఱియున్‌ కొందరకు రెండు గుణమగు అందర మెప్పింతునేను అయ్యెయెడలన్‌' అన్న చోట నాటికీ ప్రచారంలోకి వస్తున్న ఈ భేదభావాన్ని అన్వయించే లక్షణం కన్పిస్తుంది. ఈ ఉభయ సాహిత్య మైత్రి ఆయన రచనను తెలుగువాళ్లకు అత్యంత ఆదరణీయంగా రూపొందింపజేసింది. భాగవత పద్యాలు ఏ సాహిత్య ప్రక్రియల అత్యంత ప్రాచుర్యం పొందిన అంశం అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పాండవోద్యోగ విజయ పద్యాలు అత్యంత జనాదరణ పొందడానికి వాటి అక్షర ఛందోరూపం అడ్డం రాలేదు.
ఎరిగియో ఎరుగకయో అభిమానం చేత రాబోయే పరిణామాలను గూర్చిన అంచనా సరిగా లేకపోవడం వల్ల కల్పించిన ఈ భేదభావాలు సాహిత్యాన్ని నిలువుగా చీల్చడం ఈనాడు పరిదృశ్యమానమవుతున్నది. ఈ భేద కల్పనలో ప్రజాకవులు, అప్రజాకవులనీ సంస్థాన కవులు సంస్థానేతర కవులనీ, ఉన్నత వర్గాల, దళిత వర్గాల కవులనీ, విభజించడం కానవస్తుంది. తేనె, కలకండ, మామిడిపండ్ల రసం మొదలైనవి ఆయా ఉత్పత్తి మూలాలను బట్టి భిన్నంగా కన్పించవచ్చు కానీ, తాత్పర్యతః అవన్నీ మాధుర్యమనే లక్షణం చేత ఒక్కటే అవుతున్నవి. అలాగే రసలక్షణం చేత సాహిత్యాన్ని ఏకరూపంగానే దర్శించవలసి ఉంటుంది.

Tuesday, July 28, 2009

సాహిత్య పరిణామంలో కులము - కులాంతరాలు-మతాలు

`నన్నయ్య కవి పెట్టినాడు గదా తిక్కనాది కవీంద్రుల కాది భిక్ష' అన్న తిరుపతి వెంకట కవుల పద్యం వెనుక, సాహిత్య చరిత్రలో పరిణామంలో నన్నయ్య ప్రాధమ్యాన్నీ, ప్రాధాన్యాన్నీ స్థాపించుటకు కాకుండా నాటికి విజృంభించి ఉన్న వైదికి నియోగి శాఖా భేదాల అంశంకూడా ఉన్నది. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాని, లుద్ధావధాని, గుంటూరు శాస్త్రి మొదలైన పాత్రల ద్వారా వైదికులను వెక్కిరించటం, తక్కువ పరచటం ఉందని భావించే అవకాశం ఉన్నది. వీరేశలింగం నాటికి సాహిత్యరంగం అంతా నియోగి ప్రాధాన్యం ఉండటం, తిక్కనకు అగ్రాసనాధిపత్యం ఇవ్వటం, నాచన సోముని ప్రశంసించే సందర్భంలో నన్నయ, ఎఱ్ఱనకంటే అతనిని అధికునిగా భావించటం ఇవన్నీ ఈ శాఖా భేదాల పరిణామాలే.
అంతకు పూర్వం సి.పి.బ్రౌన్‌ వేమన పద్యాలను ఆకాశానికెత్తటం వెనుక ఉన్న రాజకీయం ఇంతకంటే మించింది. వేమన పద్యాలలో విగ్రహారాధనాదికాలైన `హిందువుల ఆచార వ్యవహారాలను పరిహసించటం, నిరసించటం వెనుక ఆతని అచల యోగ సంప్రదాయము, అవధూత లక్షణాలు ఉన్నాయిగాని, వాటి వెంట ఆత్యంతికమైన వ్యతిరేకత లేదు. ఈ సంప్రదాయ వైవిధ్యంలోని ఆభాస వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక బ్రౌను వేమన రచనను క్రైస్తవ దృష్టిలో చూచి ఆయన సాహిత్యాన్ని సర్వేతరాంధ్ర సాహిత్యానికన్నా అధికంగా భావించటం జరిగింది. ఈ ప్రకటంగా కనిపించే ఆచార వ్యవహార నిరసన మాత్రం ప్రధానంగా భావించి- అతని యోగాన్ని దివ్య జీవన సాధనకు ఉపేక్షించి విమర్శకులు `ఉపరిశోధనలు' చేస్తూ వచ్చారు.తెలుగు సాహిత్యంలో వైదికి నియోగి భేదాలు 1910 తరువాత ఎక్కువగా విజృంభించాయి. తిరుపతి వెంకటకవులు కొప్పరపు కవుల విభేదాలు అనేక కవిత్వ వివాదాలకు కారణాలయ్యాయి, నన్నయ్య భట్టుకు తిక్కనతో సమానమైన- అధికంగా కాకపోయినా స్థానం లభించటానికి తరువాత కనీసం నలభై యేళ్లయినా పట్టింది.సుమారుగా ఈ ప్రాంతంలోనే జస్టిస్‌ పార్టీ ఉద్భవించింది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు పెచ్చరిల్లాయి. గుంటూరు ప్రాంతంలో త్రిపురనేని వారు దీనికి నాయకత్వం వహించారు. నెల్లూరు ప్రాంతాలలో రెడ్లు ఈ ఉద్యమానికి నాయకులయ్యారు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి ఉద్గమ స్థానం మదరాసు కావటంవలన నెల్లూరు అక్కడికి సమీపంలో ఉండటం వలన, అంతకు పూర్వమే గ్రామంమీద పెత్తనం ఉండటంవలన రెడ్లు రాజకీయాలలో మొదట అధికారంలోకి వచ్చారు.
గుంటూరు ప్రాంతంలోని రైతులుగా ఉన్న కమ్మవారు క్రమంగా సాహిత్యరంగంలోకి, పత్రికారంగంలోకి, వ్యాపార రంగాలలోకి వచ్చి బలపడ్డారు.ఈ సంధిలో పుట్టిన `కవిత్వ తత్త్వవిచారం' అలంకార శాస్త్ర మర్యాదలను పునాదులు కూలగొట్టి వస్తు ప్రాథమ్యానికి పట్టం కట్టింది. మహా కావ్యాల చట్రాన్ని తిరస్కరించింది. అభివ్యక్తి వైచిత్రిని కాదన్నది.అప్పటికే ప్రతిష్ఠితమైన కావ్య సంప్రదాయాలను కాదని నూతన సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఔపదేశికతను - అనగా వస్తువునకు పురస్కృతి కలిగింది. తమిళదేశంలో తిరువళు్ళవర్‌కు పట్టంకట్టిన విధంగానే నీతి బోధనకతకు, సామాజిక వ్యాఖ్యకు, కుల భేదాల నిరాకరణకు, అస్పృశ్యతను కాదనటానికి ముఖ్యత వచ్చింది. సరిగ్గా ఇదే కాలంలో ఈ అంశాలలో అధికాంశాలకు ప్రాధాన్యమిచ్చిన గాంధీ నాయకత్వం దేశంలో స్థిరపడింది.కుల భేదాల నిరాకరణం వెనుక కులాల ఆలసత్వమును ప్రకటించుకోవటం ముఖ్యాంశమే అయింది. యోగిగా, జ్ఞానిగా పరిగణింపబడిన వేమన వేమారెడ్డి - `మహాకవి' అయినాడు గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణకర్తగా నిరూపించబడ్డాడు. రాళ్లపల్లివారి వేమన ఉపన్యాసాల సందర్భంలో, రంగనాథ రామాయణం ప్రచురణ సందర్భంలో కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా ఉండటం అవిస్మరణీయమైన అంశం. ఈ కాలంలోనే మొల్ల రామాయణం ప్రశస్తి పెరిగింది. నన్నెచోడుడు, శ్రీకృష్ణదేవరాయల వంటి రాజకవులకు ప్రాధాన్యం కలిగింది.జాతీయోద్యమానికి వ్యతిరేకంగా కొనసాగిన సామ్యవాదోద్యమం భారత జాతీయతను ఏక దేశ భావనను కాదన్నది. క్విట్టిండియా ఉద్యమాన్ని త్రోసిపుచ్చింది. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని బలపరచిన దానిని స్తోత్రం చేసిన కందుకూరినీ, గురజాడనూ, ప్రాచీన సాహిత్యంతో సంబంధం తెలియకుండానే త్రెంచే ప్రయత్నం చేసిన వ్యావహారిక వాది గిడుగు రామమూర్తినీ, ఆధునికాంధ్ర మహాపురుషులుగా గుర్తించి ప్రచారం చేసింది. కాశీనాథుని నాగేశ్వరరావునూ, కొమర్రాజు లక్ష్మణరావునూ ఎప్పుడూ అలా ప్రశంసించలేదు.సామ్యవాదోద్యమంలో జస్టిస్‌ పార్టీవారి వ్యతిరేకాంశాలు ప్రథమంగా చోటు చేసుకున్నవి. స్వాతంత్య్రోద్యమ భావన గర్భితంగా ఉన్న `ప్రతాప రుద్రీయం' వారి ప్రశంసలకు ఎప్పుడూ స్థానం లేదు. వీరి సాహిత్య పార్శ్వం అరసం `ప్రాచీన సాహిత్యమంతా జన సామాన్యానికి ద్రోహం చేసింది' అన్న మూల సూత్రంతో ఉద్యమం ప్రారంభించింది. రామలింగారెడ్డి ప్రారంభం చేసిన వస్తుప్రాధమ్యం. క్రమంగా వస్తువే సాహిత్యమన్న పారమ్య స్థితికి చేరుకున్నది. కాల్పనిక కవిత్వంలోని దేశభక్తి ప్రణయం ఆదిగా పార్శా్వలు దూషితాలయినాయి.
ఈ నడుమ హిందూ భావనకు, విశ్వాసాలకు వ్యతిరేకంగా క్షతికలిగే విధంగా పురాణ, ఇతిహాస ఘట్టాలకు అపవ్యాఖ్య చేయటం ప్రారంభం అయింది. చలం, ముద్దుకృష్ణ, నార్లవంటి వారు ఈ మార్గంలోని వారు.నార్ల కమూ్యనిస్టు వ్యతిరేకిగా కనిపించినా లోతుగా ఎన్నో వ్యతిరేకతలు ఆయన రచనలలో ఉండేవి. ఆయన పత్రికా నిర్వహణలో కొందరు రచయితల ప్రసక్తి నిషిద్ధమై ఉండేది. అంతగా `భావ స్వేచ్ఛ'ను ఆదరించిన వ్యక్తి ఆయన. ఆయన పత్రికలో `చలం - విశ్వనాథ - శ్రీశ్రీల ప్రసక్తి నిషిద్ధం. ఈ అంశం పరిశీలించినప్పుడు ఆయన నిషేధం విధించటంలోని తాత్తి్వక మూలాలు బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం దాకా కొనసాగవలసి ఉంటుంది.ఇన్ని ఇబ్బందులలోనూ ఏ ఇబ్బందికీ పట్టుబడకుండా ఏ స్థిరబిందువుమీదా నిలువకుండా కాలానుగుణంగా కదిలిపోయిన వ్యక్తి కృష్ణశాస్త్రి అనిపిస్తుంది. కాల్పనికోద్యమంలో మూలవిరాటై్ట, అభ్యుదయ కవిత్యోద్యపు `పతాకై' మతం వద్దు, గతం వద్దు మారణహోమం వద్దు అంటూ లౌకికవాదై, `రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం' అంటూ భక్తివాదియై ప్రవర్తించాడు.నార్ల వ్యతిరేక దృక్పథం వల్ల తెలుగు వాళ్లకు రావలసిన జ్ఞానపీఠ ప్రథమ పురస్కారం రాకుండా పోయింది.1956-57లలో హైదరాబాద్‌లో తెలంగాణా రచయిత సంఘం వార్షికోత్సవాలు జరిగాయి. ఆ వేదిక మీద నుంచి విశ్వనాథ అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఆ భావనతో కార్యాచరణకు పూనుకుని ఆ పరిషత్తు ఏర్పరచేందుకు ఒక సన్నాహక సమావేశం హైదరాబాదులో జరిగింది. దీని ఆధిపత్యం తనకు అనుకూలం కానీ వారికి లభించవచ్చునన్న ఊహతో నార్ల, అబ్బూరిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి కొద్ది రోజులలోనే ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీని ఏర్పడేట్లు చేశారు.అయితే కొన్నేళ్ల తరువాత అకాడమీల రద్దుకు ఆయన కారణమయ్యారు.
ప్రాంతీయవాదంవైపు వస్తే తొలి రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాల కవి మండలి సాహితీ సమితిగా సాహిత్యాన్ని ఆవరించింది. తరువాతి కాలంలో ఉత్తరాంధ్ర రచయితలకు ప్రముఖమైన లాబీగా అవతరించింది. తెలంగాణా ప్రాంతంలోగానీ, రాయలసీమలోగానీ ఇలాంటి ప్రబలమైన రచయితల పరస్పర ప్రచారక మండలి ఏర్పడలేదు.మన లౌకికవాద వామపక్ష రచయితలకు మైనారిటీ మతమంటే ఎంతో ముద్దు. గజనీనుంచి కాశీం రజ్వీదాకా వెయ్యేండ్లు విధ్వంసం చేయబడ్డ దేశం. మనుష్యుల మీద ప్రకటించిన క్రౌర్యం, బాగా సంస్కృతుల అణచివేత ఈ కవులకు వస్తువు కాలేకపోయింది. గోద్రా రైలు దహనం వంటి అమానుష చర్య కలిగించిన పరిణామాలు మాత్రమే వస్తువులయి కవులు గుజరాత్‌ గాయం పేర `ఏకాహా'లు నిర్వహించారు. బాబ్రీ సంఘటనను నిరసించే ఈ కవి సమూహం తరువాత విధ్వంసమైన కాశ్మీరులోని ముప్పయి నలభయి దేవాలయాల సంగతి పట్టించుకోలేక పోయారు. మార్కి్సస్టుల ఎజెండాలో ఇటీవల స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదం వస్తువులు కావటం- వారి అనుబంధ సంస్థలు ఈ అంశాలకు ప్రచారం ఇవ్వటం ఆత్యంతికంగా ఈ దేశం `హిందూత్వ'ను నిర్మూలించే లక్ష్యమనేది స్పష్టం అవుతుంది. మనకు ఈ ఆపదనుంచి ఎవరూ రక్షించగలరు?

Saturday, July 25, 2009

రామా చంద్రమౌళి కవిత వసంత పునరాగమనం

`ఎటు?' అని నిర్దిష్టంగా సమాజాన్ని ప్రశ్నిస్తున్న కవి శ్రీ రామా చంద్రమౌళి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత. `ఇక్కడి ఈ ప్రజలు / నిజంగా నిద్రపోతున్నారా / నిద్రలో మరణించారా / నిద్ర నటిస్తున్నారా' ఇది కవికి కలిగిన సంశయం.
నాల్గో సింహం తల్లివలె జాతీయ స్తంభం
వెనుకే దుఃఖిస్తూ మరుగుననే ఉంది.
వ్రేళు్ల భూమిలో రహస్యంగా. . . గుప్తంగానే ఉన్నాయి.
నీళు్ల సముద్రాలలో, జనం కళ్లలో భద్రంగానే ఉన్నాయి.
ప్రజలు ఎన్నో కోటానుకోట్ల అవినీతిని క్షమించి
నిశ్శబ్దంగా నిద్రపోతూనే ఉన్నారు.
ఈ నాల్గో సింహం సమష్టి చైతన్యం మూర్తీభవించిన భారతమాత. వ్యవహార మంతా సాగుతూనే ఉన్నది సాగవలసిన దానికి విరుద్ధంగా. రాజకీయవాదులు సిద్ధాంతాలను మరచి వ్యభిచరిస్తున్నారు అంటున్నారు కవి. ఈ నిద్ర స్వభావం ఏమిటి? ఈ క్షమ వెనుక ఉన్న అసమర్థత ఏమిటి? మేధావుల `స్వప్నాలలో స్ఖలించటం' వెనుక అవార్డులను గౌరవంగా స్వీకరించటం వెనుక, అంగీలు చింపుకుని అరిచే `స్వవంచన వెనుక, ఎంతగా గాఢతమస్సర్పమై కదలి పోతున్నది. ఈ తీవ్రస్వరం వెనుక అనంతమైన వేదన ఉన్నది.
రామా చంద్రమౌళి కవిత్వభాష విలక్షణమైంది. ఆయన ఎన్నుకొన్న శబ్దజాలం, వాక్యవిన్యాసం, బింబాలు ప్రతీకలు సామాన్య తెలుగు కవితా పాఠకునికి చిరపరిచితమైనవి కావు. ఈ రచనలో `వాచ్యాభాసత' ఒక ముఖ్యలక్షణం. వాచ్యాభాసత వాచ్యం కాదు. ఉద్వేగతీవ్రత వల్ల వాచ్యంలా కనిపిస్తుంది. ఈ భాషలో ఆధునిక ఎలక్ట్రానిక్‌ పదజాలం ఉంది. గణిత విజ్ఞాన శాస్త్రాంశాలు ఉన్నాయి. వాక్యం సాగదు. ఎక్కడైనా విరుగుతుంది. ఆగుతుంది. నెమ్మది నెమ్మదిగా సాగుతుంది. మధ్యలో చిన్నప్పుడు తాను విన్న పాఠంలోని వాక్యం `నీరు కదలనిచో నాచుపట్టి నీచు వాసనతో మరణించును.' నీరు మరణించునా అని వెంటనే ప్రశ్న. `ప్లాటు ఫారంపై భారతీయుడు' గీతం శీర్షిక. రైలుకోసం నిరీక్షణం. ఇంకా రైలు రాదు వాన ఆగదు. చీకటి విడిపోదు. ఈ నిరీక్షణలో అనంతమైన మనోవల్మీకంలోంచి పొడుచుకువచ్చే పాముల బుసబుసలు. చైతన్య స్రవంతి పద్ధతిలో సాగే గీతం `అతని తలలో నగ్న వృక్షాలు, నగ్న సముద్రాలు గిర్రున తిరుగుతున్నాయి'. అతన్ని `సాదీ సాదీ' చీకిపోయిన అవ్వముఖం. ఎడతెగని నిరీక్షణ `చూపులు ఎరన్రి లైట్‌లో దిగబడి ఎంత పీకినా రావడంలేదు.' ఎరల్రైట్‌ బురద ఐందా, సుడిగుండమైందా అని మనం విచారించాలి. మన స్మృతిధార అంచునబడిపోతే అన్నమయ్య అంటున్నమాట `నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదుగదా' అని గుర్తుకు వస్తున్నది. భావభూమికలు వైరైనా సృజన భూమికలు ఒక్కటే.
`రూ. వేయి నోట్లపై లేజర్‌ చూపులు' అన్న గీతం పురపాలక సంస్థలూ, ఆసుపత్రులూ ఎలా వ్యర్థమైన వ్యవస్థను నిలబెట్టటమే ప్రయోజనమై, సాఫల్యం వైపు చూడనైనా లేని పరిస్థితిని వ్యక్తీకరిస్తున్నది. `కోయ్‌ వాడి గుండెను' `వేసేయ్‌ లైఫ్‌ టాక్‌‌స' మూడు ముక్కల్లో రామాయణం చెప్పినట్లు ఈనాటి అర్థవ్యవస్థలో అధికారులు, వైద్యులు మొదలైన వారి జీవితం `అడ్డమైన డబ్బు సంపాదించె సంపాదించె సంపాదించె చచ్చె' ఇదీ ఈ మానవమూల్యాలను పోగొట్టుకున్న ధనమునకు దాస్యం చేసే వ్యవస్థ చేరుకున్న భయంకరమైన కాలతీరం.
అదిరిపడి అర్థరాత్రి లేచి కూర్చుంటే
పెళ్ళాం వేసే సాంబ్రాణి పొగ. . . చూపించే వేయి రూపాయల కట్టలు
మార్చరీ వాసన
ఎంతకూ కలలు తెగిపొవు
జీవితం అంతా కారుణ్యం, స్నేహం మమకారం, వాత్సల్యం, ఔదార్యం, కృతజ్ఞత ఇలా అన్ని దైవ గుణాలను కోల్పోయిన స్థితి. కవి వాక్యాలలో వాస్తవాన్ని చెప్పుతూవున్నా ఎంత కసి ఉన్నది? ఈ కసి వెనుక ఎంత క్రోధం ఉన్నది? ఆ క్రోధం వెనుక ఎంత దుఃఖభారం ఉన్నది? `బట్టల్లో లోపల అసలు నీవు లేనట్టు బోలుతనంతో క్షణం క్షణం చచ్చిపోతూ' ఇదీ అతని స్థితి. ఈ మానవుడు సగటు మానవుడు చేరుకోనెంచే లక్ష్యం. ప్రైమరీ యూనిట్‌.
చంద్రమౌళి కవిత్వంలో వాక్‌ తీవ్రధార ఒక పార్శ్వం. మరొకచోట కరిగి కన్నీరై ప్రవహించగల చోట అతనిలోని మృదు కుసుమ పార్శ్వమూ గోచరిస్తుంది.
హృదయాన్ని తపసుతో పూరించి ఆవేశ పరచినప్పుడు
తల ధనధ్రువమై పాదాలు ఋణ ధ్రువాలౌతాయా?
మరొకడు తలతో పాదాలకు ప్రణమిల్లి
హస్తాలతో ఆశీస్సులు పొందితే
విద్యుద్వలయం పూరణమై
శక్తి హృదయానికి చేరుతుందా
మృదు మధుర కోమల హస్త స్పర్శలో శాంత సముద్ర దృక్కులతో ఆ మనిషి మహామానవుడైనా పిడికెడు గుండెతో ఆకాశమందు అగ్నిని ధరించిన పసివాడౌ తున్నాడు. తన్నుతాను తపస్సులోకి ఉపసంహరించుకుంటున్నాడు. పై ఖండిక జీవ చైతన్యంలో ధ్యేయ పరంపర ఎలా పరివర్తనాన్ని సాధించగలదో తెలియజేసింది. తపః ప్రసారాన్ని జీవనంలోనికి నిలువరించుకునే లక్షణాన్ని వ్యాఖ్యానించింది.
జీవితంలో అన్ని పార్శా్శలూ దుఃఖపు అగాధాలై నడిమి బొడ్డు విూద నిల్చున్న వ్యక్తి ఎలా కలల్లో తన భావనాజగత్తులో సుఖానుభవాన్ని ప్రోది చేస్తుందో ఈ ప్రపంచం ఆ కలను ఎంత క్రూరంగా భంగింపజేస్తుందో `పగటిపూట పనిమనిషి కల' అనే గీతంలో వ్యక్తమవుతున్నది.
తుఫానులో రెండు గడ్డిపరకల్లా. . . రెండు జీవితాలు మిగిలాయి. తల్లీబిడ్డలు. ఆ తల్లి ఏంచేస్తుంది. వ్యభిచారం. `. . . ప్లీజ్‌' అన్న గీతం ఆ బాలుని ోభను వ్యక్తం చేయటానికి పుట్టింది. ఆ పసిగుండె ఎంత వేదన పడుతున్నదో ఈ రచన అద్భుతంగా ప్రకటించింది. `నాన్న చనిపోయారు బీదరికముంది చుట్టూ క్రూర నిర్దయ వికృత దయాహీన సమాజ ముంది.' ఇదంతా భూమిక. విలువలు లేని సమాజం. పరదుఃఖ దుఃఖిత లేని సమాజం. `సర్వ మున్నతని దివ్యకళామయ మంచు' భావించలేని సమాజం, ముడుచుకు పోయి ఇరుకైన చీకటి గుహలతో అభద్రతా భావంతో, నిత్య మృత్యు సన్నిహిత భయంతో సగం చచ్చిన సమాజం ఆమెకు ఏ దారి చూపించగలదు? రాజకీయ వ్యవస్థలు, సిద్ధాంతాలు, రాసులు పోసిన సంపదలు, విజ్ఞానము, సాంకేతికత ఇవన్నీ మనిషిలోని దైవీయ పార్శా్వన్ని లోతులలో నుంచి చేది ముందుకు తీసుకురాగలవా అంటే అది అసంభవమనే చెప్పాలి. సర్వాత్మ చైతన్య స్పృహలేని సమాజం తప్పక ఎక్కడో కుప్పకూలుతుంది. అందుకే ఆ బిడ్డ తల్లి తలను నిమిరితే పాము చుట్టపై బడ్డట్లు జలదరించిపోయినాడు.
ఈ సంపుటిలో ఒకటి రెండు వియోగ గీతాలు ఉన్నవి. ఈ గీతాలు మృత్యు వేదనకు సుస్పష్ట ప్రతీకలు. `నీవు వెళ్లి పోయాక' అన్న గీతం ఆమె వెళ్ళిన తరువాత రెక్కలు తెగిన ప్టక్షిగా తాను మారిపోవటంతో ప్రారంభమయింది. గృహము వట్టి ఇల్లయింది. గృహము అంటే కళిళీలి అనీ, ఇల్లు అంటే కళితిరీలి అనే శబ్దాలకు పర్యాయంగా ఇక్కడ, తెలుగులో కవి ప్రయోగించాడు. ఇది భాషలో పలుకుబడిని `సహజమార్గం'లో సంపన్నంగా చేసే పని. ఆమె లేకపోవటం వల్ల బయటి ప్రపంచమూ లేకుండా పోయింది. గృహం అంతటా అణువణువునా ఆమె జ్ఞాపకాలే.
ఎందుకంటే ఆమె సహచరి. ప్రథమ సమాగమంలోనే ఆమె జీవితాన్ని ఉమ్మడి పోరాటంగా నిర్వచించింది. ఎక్కువ తక్కువలు లేవు. లొంగుబాట్లు అధిక గౌరవస్థానాలు లేవు. రెండు చేతులకు బదులు మరో రెండు చేతులు. రెండు కాళ్లకు బదులు మరో రెండు కాళు్ల. ఈ గీతం జీవనంలో గార్హస్థ్య ధర్మ సంపూర్ణతా లక్షణాన్ని ఆధునిక పరిభాషలో చాలా బలంగా, చాలా సమచిత్తంలో, నిమగ్నతతో వ్యాఖ్యానించింది. గృహస్థ జీవనంలో ఒకటి పతాకం పతంగి, రెండవది దాని నింగిదాకా మోసుకుపోయే దారం. చివరకు అంటాడు అత్యంత కరుణాస్పదంగా, ప్రతీక గర్భంగా `ఒక చెప్పు తెగి ఎక్కడో పడిపోతే రెండో చెప్పు పనికి రాదు. దీన్ని తప్పకుండా పారేయాల్సిందే' అని `అసలు వీళ్ళద్దరూ ఇద్దరు కాదని' ఆరంభించి ఐదు పంక్తులలో జీవనంలో దంపతుల సహకార సౌమనస్య జీవన తాత్పర్యం సంప్రదాయ ప్రతీకలు వాడకుండా ఎంత భావుకంగా చిత్రింపబడిందో ఆశ్చర్యం వేస్తుంది.
మరొక వియోగ గీతం `నాన్న జ్ఞాపకాల్లో' అనేది. తండ్రి తనకు ఎలా జీవితాన్ని విప్పి చెప్పాడో, వివరంగా వర్ణిస్తాడు కవి.
అనివార్యమై దుఃఖాలు దండెత్తినపుడు
ఒక్కనివే భరిస్తూ మాకు మండే సూర్యుణ్ణి చూపించావు
ఒక్క ఆకాశం తనను తాను చినుకులుగా, చినుకులుగా
భూమికి దానం చేసుకున్నట్లు
నీవు వేలమంది శిష్యూలకు ఓ చిర్నవు్వవై విస్తరించావు.
మిగతా ఎక్కువ గీతాల్లో కరుణరసభావం క్రూరమైన అధిక్షేపంలో, నిశితమైన వెక్కిరింపులలో నిండివున్న కవివాక్కు ఈ వియోగ గీతాలలో నగ్నంగా, అనుద్విగ్న జలపాతంగా గోచరిస్తుంది. `ఆజంజాహి మిల్లు'ను గూర్చి మరొక వియోగగీతం రాయటం అరుదైన అబ్బురమైన అంశం.
`ఎటు' అన్న ప్రారంభ గీతం జీవితంలో ఉండే నిర్ణయను, కఠినమైన దోపిడీని, మాయాసభ్యతల వలల విసరడాన్ని చిత్రిస్తున్నది. `మెడబట్టి నెట్టబడినచోట కాళ్లకూ కళ్లకూ ఐచ్ఛికాలుండవు. నిర్బంధాలే అనివార్యాలౌతాయి' మన విద్య, మన నాగరికత, సినిమాలు, కళలు, భాషలు ఎలా ప్రపంచ ఆర్థిక సంస్థల నియంత్రణలో, పశ్చిమ దేశాల సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో ఓడిపోయి చైతన్యం కోల్పోయి, నిరాశోపహతమై, హతమై జీవిస్తున్నాయో చిత్రిస్తుందీ కత్తివాదరవంటి గీతం `పావురాన్ని మూసిన హాల్లో బంధించి తరుముతే దానంతటదే నేల కూలుతుంది కుట్ర' అంటారు కవి.
కవి యువజనుల దైన్యస్థితిని కళ్లకు కట్టిస్తున్నాడు. ఆ వేగంతో కొట్టుకుపోతూ ఆ ప్రవాహంలో మనను లాక్కొని పోతున్నాడు. చివరకు
ఇక్కడి జీవావరణం కలుషితమైంది. . . జీవనచిత్రం ఛిద్రమైంది.
జీవన ధర్మాలు, జీవన విధాలు. . . జీవన గమనాలు గతి తప్పాయి.
యిక్క డిపుడు చెట్లపై వాలిన పక్షులను ఆకులే తుపాకులై హత మారుస్తున్నాయి.
రోడ్లే ఉన్నట్లుండి విచ్చుకొని పర్రెలై కబళిస్తున్నాయి.
అని ఈ భయంకర చీకటి రాత్రిని వర్ణిస్తున్నాడు. దీని అనుస్యూతిలో `వేణువు కనిపించడం లేదు. కాని పాట వినిపిస్తోంది.' చదివితే వెలుతురు కిరణాల కోసం యుగయుగాల నిరీక్షణ యికనైనా ముగుస్తుందా అని ప్రశ్నిస్తాడు కవి. అందుకే ఇక్కణ్ణించి `పరుగు గునపా ల్లాంటి చినుకుల వర్షంలో ఒకటే పరుగు.' ముందు ఓ చెట్టు కిందకు చేరనీ' ఈ చెట్టు జీవవృక్షం, సంసార వృక్షం, అనంతకాలాన్ని తనలో సంలీనం చేసుకున్న మహావృక్షం. సర్వజీవులకు ఆశ్రయమిచ్చే వృక్షం.
ఈ వృక్ష ప్రతీక పృథ్విలోకి చొచ్చుకొని ఉన్న ఆనంత్యాన్ని సూచిస్తుంది. అది భూమి మీద నుంచి ఆకాశం నలువైపులా వ్యాపించి దాన్ని ఆవరిస్తుంది. పరిమితినుంచి అపరిమిత స్థానందాకా ఎదిగిపోతుంది. సర్వమునూ తనలో గర్భితంగా చేసుకుంటుంది. అందుకే తర్వాత `వేణువు కనిపించకున్నా ఎక్కడ నుండయితే నేమి ఓ బ్రతికించే పాటను వినవచ్చు.'
`పెనునిద్ర' అన్న గీతం జీవన విధానమే అవినీతిని భాగంగా చేసుకున్న అంశాన్ని దేశ జీవనాన్ని చిత్రిస్తుంది. ఆడిటర్‌ భార్య దీనిలో వక్త. జీవితంలో ఎన్ని పొరలున్నాయి. ఎన్ని వేల ముసుగులున్నాయి. ముప్పయ్యేళు్లగా ఈ వ్యవహారానికంతా సాక్షి. తాను మాంగళ్యధారణతోనే `మరణించింది.' నిద్రలేవవలసినవాళు్ల పెనునిద్దుర నుండి మేల్కోవడం లేదు అంటుంది. ఈ నిద్ర మేలుకొల్పుకు ఆమె వాడుకున్న ప్రతీకగానం `కౌసల్యా సుప్రజా రామ' అని ఈ కౌసల్య నిరీక్షణ రామునికోసం ధర్మ సంస్థాపకుడైన, సత్యపరాక్రముడైన రామునికోసం. ఈ కౌసల్య దేశం. పృథ్వీగర్భం. అందుకే సగటు భారతీయుని సంబోధిస్తూ కవి అంటున్నాడు.
యోజనాల దూరాలను అడుగుల్లోకి సూక్ష్మీకరించడం
దూరాలను సంకలీకరించుకుని సమీకరణాలను సమీక్షించుకుని
దండయాత్రను రచించుకోవడం ఇవన్నీ ఒంటరిగా
నీవు గరళధారి శివుడివికావాలి
నిశ్చల సముద్రంగా గంభీరునివి కావాలి
అప్పుడు పోరాటం `ఓ మాటను పెంచేసుకుని, ఓ పాటను వెంటేసుకొని ఒక సూర్యుడిలా ఒక ఆకాశంలా ఒక భూమిలా ఒంటరిగా ఒక వ్యక్తిగా పోరాటానికి ఉపక్రమిస్తావు.' ఈ ఒంటరిపోరాటం ఆత్మవిశ్వాసంలోనుంచి పొడుచుకు వస్తుంది. గాంధీజీ దేశంలో పోరాటం ఇలాంటి స్థితిలోనే ప్రారంభించారు. ఆ ఒక్క వ్యక్తిలోనే కోట్లాది భారతీయుల చైతన్యం సమీకృతమై అహింసా సేవావాహిని అయింది. అందుకే `గాంధీ జీవన విధానం కంటే గొప్ప పరిత్యాగ సిద్ధాంతం ఉన్నదా' అని కవి ప్రశ్న. రామా చంద్రమౌళి కవితలో వరంగల్లు మాండలిక భాషలోని జీవలక్షణం ఉన్నది. ప్రాంతీయ మాండలిక ప్రయోగాల బిగింపు ఉన్నది. `పెంకాసు', `ఠక్కున, `ఇసిరె' `సద్దుల', `దబదబా', `పతంగీ', `మాంజా', `బొక్క' మొదలైనవి గమనించవచ్చు.
అభివ్యక్తి విషయంలో చంద్రమౌళి కవితకు వాడి ఎక్కువ. `ఏండ్లకు ఏండ్లు గొడ్రాలైన ఆకాశం చినుకు రాల్చదు' `ఆడబొడ్డు చుట్టూ మగచీమలు' `మొస్స పోసుకుంట' `పనియంత్రాలే మంత్రాలపై ఓంు్టగల్లు నగరాన్ని ఓ ఎగిరే జెండగా' `నీ ఉత్తరం చంద్రుణ్ణి తోడ్కొని వచ్చే ఓ ఆకాశం.' ఈ వాక్యాలు కవి భావుకతను పట్టియిస్తాయి.
శ్రీ రామాచంద్రమౌళి ఇంతకు ముందు ప్రచురించిన కవితా సంపుటాలు శిలలు వికసిస్తున్నాయి (1979) స్మృతిధార (1984)ల్లో కవి ఇంత విస్తృతంగా కవితా గంగా ప్రవాహాలను క్రుమ్మరించలేదు. వాటిల్లో పరిమిత బింబాల ప్రతీకల వాక్యవిన్యాసాల పునరావృత్తి ఉన్నది. గొంతులో ఇతర కవుల ముద్రలు ఉన్నాయి. అయితే `ఎటు' వచ్చేసరికి ఈ కవి సర్వతంత్ర స్వతంత్రుడు. భాషలో అనూహ్య మైన వేగం, అభివ్యక్తిలో విలక్షణమైన వినూత్న వైఖరి, వస్తువ్యాసంలో ఆత్మీయత ఈ అంశాలు దీన్ని సర్వతో ముఖంగా వర్చస్వంతం చేశాయి.
ఈనాటి శిథిలమవుతున్న కుటుంబ వ్యవస్థను చిత్రించే `గుండెపుండు' గీతంలో శ్వాసించేశవం అయిన తండ్రి దుర్భర పరిస్థితిని చిత్రించి `నెలక్రితం అమ్మచావును పెళ్లిలా జరిపిన కన్న పిల్లలు' తను జీవించి వుండటాన్ని ఎంత భారంగా భావిస్తున్నారో హృదయ విదారకంగా చిత్రించాడు కవి. తుదకు తన స్థితి పాయలు పాయలుగా ఎడతెగని దుఃఖం, నీడలు నీడలుగా చంపకుండా వెంటాడే భయం' ఈ భయం చంపదు ఛేజ్‌ చేస్తుంది.
`యుద్ధరహస్యం' గీతం ప్రపంచీకరణలోని తాత్పర్యాన్ని వెల్లడిస్తున్నది. విద్యావంతుల `బానిసల వలసలు' ఎలా ఐడెంటిటీని పరిహరిస్తున్నవో `మనిషిని ఓ మార్కెట్‌ చేసి చివరకు నీకు తెలియకుండానే నిన్ను హర్రాజు చేస్తుంది.' ఈ కొత్త దోపిడీని వెల్లడిస్తాడు కవి. భారతీయ జీవనాదర్శ శిఖరాలు ఎలా పడిపోతున్నాయో ఆశ్చర్యకరమైన శబ్ద సంపుటితో వ్యక్తం చేస్తున్నాడు.
`కొండ శిఖరంపై ఓ రమణమహర్షి మరణ మహర్షి రణమహర్షి మర మహర్షి రాలిపోతున్నట్లు, కూలిపోతున్నట్టు' `రమణ మహర్షి' శబ్దం పొందిన వికారాలు మూడూ జాతి పతనాన్ని సూచించే విలక్షణ పదబంధాలు. శబ్దం అక్షర వ్యత్యయంతో నూత్నావతారం ఎత్తిందో ఈ పంక్తులు శక్తివంతంగా రూపించాయి. రామా చంద్రమౌళి శిల్ప పారమ్యం ఇలాంటి ఘట్టాలలో చూడవచ్చు.
వ్యతిరేక పార్శా్వన్ని ఇంత బలంగా చూపిన ఈ కవి సమాజంలోని అనుకూల పార్శా్వన్నీ ప్రకటించటమూ అవసరమే.
భావుకజగత్తులో కొత్త జండాలు ఎగురవేస్తున్న కవి రామా చంద్రమౌళి.

అరిశిరస్సుల నుత్తరించిన అలుగు నేనే, తెలుగు నేనే !

దాశరథి కవితారంగంలోకి ప్రవేశించినప్పటికి `తెలగాణము్మ తమఃకవాటముల బందీ'యైనకాలం. ఆ స్తబ్దతలో నిశ్శబ్దరాత్రిలో జ్వాలాకేతనంతో ప్రవేశించి, ఆసాధారణ ప్రతిభతో, పాండిత్యంతో నిరంతర సాధనతో `ప్రాణలొడ్డి ఘోర గహనాటవులన్‌ పడగొట్టి మంచి మాగాణములన్‌ సృజించిన రైతుదే తెలంగాణము, ముసలినక్కకు రాచరికము్మ దక్కునే' అని గర్జించిన కవియోధుడు దాశరథి. అప్పటికి ఉధృతంగా సాగుతూవున్న ప్రగతివాదోద్యమంలోనికి ప్రవేశించి ఆ ఉద్యమంలోనికి జాతీయవాద దీప్తిని నిలబెట్టి నూతన ప్రాణాన్ని సమకూర్చాడు. ఇంట్లో నేర్చుకున్న సంస్కృత సాహిత్యం. పాఠశాల వాతావరణంలో అలవడ్డ ఉర్దూ పారసీక కవితా సౌందర్యం ఆయన తెలుగు పలుకునకు గొప్ప దీప్తిని తెచ్చిపెట్టింది. ఈ స్థితివల్ల అతని కవిత ప్రగతివాదోద్యమ పరిధి కంటె విస్తృతంగా రూపొందింది.
గెలిచినది గడ్డిపోచ, ముక్కలయిపోయి
మన్నుకరచెను గొడ్డలి, కన్నులోని
వేడి ఆశ్రువు గెలిచెను, వాడి కత్తి
ఓడిపోెును ముస్సి పారాడిపోెు. . .
అని హైదరాబాదు సంస్థాన విముక్తిని తాదాత్మ్యంతో వర్ణించాడు దాశరథి. ప్రగతివాద కవుల్లోలేని ఆత్మీయతకాల్పనికవాద కవుల వారసత్వంగా దాశరథి కవితలోనికి సాగివచ్చింది. జాతీయ చైతన్యం సమగ్రంగా శతపత్రసుందరంగా దాశరథిలో వికసించింది. అగ్నిధార ప్రారంభంలోనే
జెండా ఒక్కటి మూడు వన్నెలది, దేశంబొక్కటే భారతా
ఖండాసేతు హిమాచ లోర్వర, కవీట్కాండము్మలోనన్‌ రవీం
ద్రుండొక్కండె కవీంద్రు, డూర్జిత జగద్యుద్ధాలతో శాంతికో
దండోద్యద్విజయుండు గాంధి ెుుకడే, తల్లీ మహాభారతీ
ఈ పద్యంలోని వస్తువు ప్రగతివాద కవుల పరిమితులను దాటివచ్చింది. `గతమొక గంగయై హృదయగహ్వరమునన్‌ చొరబారింది'. వర్తమానం ఆయన కార్య రంగం. భవిష్యత్తు స్వప్న భూమి. మూడుకాలాలనూ తనలో సమన్వయించుకున్న కవి. అందువల్ల `మంచి గతమున కొంచెమేనోయ్‌' వంటి పాక్షిక ధోరణులతో ఆయన ఎప్పుడూ కుంచించ్టుపోలేదు. అందుకే దాశరథి `కాలం నా కంఠమాల' అన్నాడు. దాశరథి దృష్టిలో గతం వర్తమానం లోనికి ప్రేరక శక్తిగా ప్రవహిస్తుంది. `నా కవితా లతాంతము తృణము్మలలో నయినన్‌ సువాసనల్‌ ప్రాకెడి రీతి పూచినది, పాతదనము్మను త్రావి తేన్చి నాజూకగు కొత్తవాసనలు చూపిన దీ రసికాంధ్ర సాహితీ లోకమునందు' అని వివరించాడు దాశరథి.
దాశరథి కవిత్వంలో ఉద్వేగం ఎక్కువ.
ఏది కాకతి, ఎవరు రుద్రమ,
ఎవడు రాయలు, ఎవడు సింగన,
అన్ని నేనే అంతనేనే, వెలుగు నేనే తెలుగు నేనే
అరిశిరస్సుల నుత్తరించిన అలుగు నేనే, తెలుగు నేనే
అఖిల జగముల చుట్టివచ్చిన పులుగు నేనే, వెలుగు నేనే,
దాశరథి దృష్టిలో కవిత మాట్లాడని మల్లెమొగ్గ. నిశ్శబ్దం ఎరుగని నిమ్నగ. ఈ రెండూ వైరుధ్యం గల లక్షణాలు. వాచ్య ప్రధానం కాక వ్యంగ్యమును ప్రకటించే కవిత మాట్లాడని మల్లె మొగ్గ. నిశ్శబ్దం ఎరుగని నిమ్నగ అంటే దేశకాలాలకు అతీతంగా అందరి హృదయాలలోనూ నిరంతరంగా నిస్వనించే లక్షణం కలిగింది. ఈ రెండు లక్షణాలు కలిగివుండడం వల్ల కవిత ఆజరామరమౌతుంది. దాశరథి కవితకు పోరాటమే వస్తువు. ఈ పోరాటం అంతస్సులోనూ, బాహ్యంగానూ సాగుతున్నది. హిట్లర్‌, ముసోలినీ, నిజాంరాజులను ఎదరించి గెలిచిన మహావీరులు ఆయనకు సమానంగా ఆరాధ్యస్థానాల్లో ఉన్నవారే. అందుకే `నేను దుష్టూలతో రాజీపడలేదు వారితో సామరస్యం నా చేతకాదు. సమరసం కన్నా సమరమే నాకు ఇష్టం' అంటాడు.
దాశరథి కవితాచైతన్య స్పందన తెలంగాణా పోరాటంతోనే ప్రారంభం అయింది. `విషము గుప్పించినాడు, నొప్పించినాడు మా నిజాంరాజు జన్మజన్మాల బూజు' అని ధీరతతో పల్కి యుద్ధంలో పాల్గొన్న కవి అతడు. ఈ ధీరప్రకృతి ఆయన కవిత్వం నిండా వ్యాపించి ఉన్నది. జీవితంలోనూ సాహిత్యంలోనూ దేనితోనూ రాజీపడని వ్యక్తిత్వం దాశరథిది. చైనాతో, పాకిస్తాన్‌తో భారతదేశం జరిపిన యుద్ధాలలోనూ దాశరథి తన గొంతును శక్తిమంతంగానే వినిపించాడు. తెలంగాణ తోడి ఆత్మీయతయే అతనిని గొప్పకవిగా తీర్చిదిద్దింది. `నా తెలంగాణా కోటి రత్నాల వీణ' అన్న మాట తెలంగాణా ప్రజల వ్యక్తిత్వ చైతన్యానికి ప్రతీక వంటి వ్యక్తీకరణ నినాదమయింది. తెలంగాణంలోని ప్రతి అంశమూ ఆ కవితా యాత్రలో ఆయన గళంలోనుంచి కవితయై పాటయై వెలువడింది. నిజామాబాదు దగ్గర ఉన్న `మంజీర' ఆయనకు కావ్యవస్తువైంది. `ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర' అన్న పంక్తులలో ఆనందమూ, దుఃఖమూ జంటగా కనిపిస్తాయి. జీవితంలోని వైవిధ్యం ప్రకృతిలో నిష్పన్నమై స్ఫురిస్తున్నది.
దాశరథి కాళిదాసు వలె, రవీంద్రుని వలె ప్రకృతితో తాదాత్మ్యము చెంద గలవాడు. పూలలో జ్వాలలు, మస్తిష్కంలో లేబరేటరీ వంటి రచనల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆయన ఆధునిక కావ్యభాషలో ఎన్నో భావ చిత్రాలను, శబ్ద చిత్రాలనూ నిర్మించాడు. వెలుతురు బాకు, మించుకాగడా, చీకటి కలలు, నగ్నతరువు, అగ్నిచేలము, మోదుగు ముతై్తదువ, దీపాంగన, నయన శయనాగారం ఇలా ఎనై్ననా పేర్కొనవచ్చు. ప్రగతివాద కాల్పనిక వాదాల సంగమంగా ప్రారంభమైన దాశరథి కవితా యాత్ర క్రమంగా పునః కావ్యరచన వైపు, పునః ప్రయోగశీలతవైపు సాగింది. ఇంచుమించుగా ఒకే కాలంలో వచ్చిన మహాంధ్రోదయం, పునర్నవం కావ్య సంపుటాలు ఈ భావనకు దోహదం చేస్తాయి.
తరువాత మహాబోధి కథాకావ్య రచనకు మార్గదర్శకం కాగా పునర్నవంలో అంతుర్ముఖు డైనా, కవి ప్రయోగవాదం నుంచి మార్మికత వైపు మరలినట్లుగా గోచరిస్తుంది. దాశరథి వల్ల తెలుగు కవిత్వంలోనికి నూతన సౌందర్య ప్రపంచం ప్రవేశించింది. అరబీ పారసీ కవితా రీతుల విస్ఫార రీతి అది. ఆయన కవిత్వం చేప్పేప్పటికి సాగివస్తూవున్న ప్రగతివాదం కేవలం నినాదాలలోకి అకవిత్వంలోకీ జారిపడుతూ వున్నది. ఆయనవల్ల కావ్యవస్తు విషయంలో పార్టీల నియంత్రణకు గురౌతూవున్న యువకవిలోకం ఒక్కసారి విముక్త మైనట్లు భావించుకున్నది.
అంతర్జాతీయ దృక్పథం పేర జాతీయోద్యమాలనూ, సంస్కృతినీ జీవన మూల్యాలనూ తిరస్కరించి, స్వయంకృత పరాయీకరణ నుంచి తప్పించి కవితా చైతన్యాన్ని ఈ దేశపు మట్టిలో నిలబెట్టడం జరిగింది. అంటే దాశరథి మతవాదీ, మితవాదీ సంకుచిత జాతీయవాదీ కాదు. `ముసలిమొగం పడిన వృక్షం మీద యౌవనం చిగురించడం కవిత్వం' `రోజూ కనబడే నక్షత్రాలలోనూ రోజూ కనపడని కొత్తదనం చూసి రోజూ పొందని ఆనందానుభూతిని పొందటం అంటేనే కవిత్వం' అని నిర్వచిస్తాడు కవిత్వాన్ని. అందుకే అతని దృష్టిలో శక్తిమంతమైన శబ్దానికి జననమే కానీ మరణంలేదు.
తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనంలో దాశరథి పాత్ర గణనీయమైంది. ఈ ప్రాంతపు సాహిత్య సంస్కృతులలో ఆధునికత సంపూర్ణంగా ఆయన వల్లనే ప్రవేశించింది. దాశరథి తీసుకువచ్చిన ప్రగతివాద, కాల్పనికవాద జాతీయోద్యమాల సమన్వయం వలన పద్యరచనకు ఆధునిక పరివేషం కల్పించడం వలన, సామ్యవాదం నుంచి మానవతావాదం దాకా ప్రయాణించడం వలన తరువాత నవ్య సంప్రదాయ సిద్ధాంతం బలం పుంజుకోవడం జరిగింది.
దాశరథి పద్యం కాల్పనికోత్తరకాలానికి చెందిన శిల్పమర్యాద కలది. సాధారణ జనజీవన వ్యవహారంలోని శబ్దాలే కవి స్పర్శతో సుందర కవితా తోరణాలైనాయి. పూర్వం చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి చేసిన ధోరణికి ఇది కొత్త తరపు పొడిగింపు. ఆయన పద్యం ఆధునిక భావనకు ఆధారంగా నిలిచిపోయింది. `గాలిబ్‌' మొదలైన కవుల రచనల అనువాదం చేత తెలుగు కవితా ప్రపంచం వస్తు విస్తృతిస్థానంలో రస ప్రచుర వాగ్వ్యక్తికి ఆలంబనమైంది. దాశరథి కవిత్వం తెలుగువాళ్లకు ప్రాణాగ్ని జ్వాల. ఆత్మలక్షణ దర్పణం.

Thursday, July 23, 2009

ఉషశ్రీ సుసంధితమైన చాపం నుండి ....

ఎవరి వ్యక్తిత్వానికైనా మూడు మూర్తులు, ఒకటి తన మనస్సులో అంచనా వేసుకునేదీ, ఇతరులు తన్ను గూర్చి భావించేదీ, మూడవది తన్ను తానే సమష్టి అవచేతనం లోంచీ, త్రవు్వకుని చూచుకోవడం. అయితే రెండవది బహుముఖమైంది. ఎంతమంది అంచనా వేస్తే అన్ని మూర్తులు, అన్నింటిలో ఎంతో వైవిధ్యం, వైరుధ్యం. విశ్వసిస్తే బహుజన్మ పరంపరల నుంచీ వాసనా సంపుటినీ కర్మసంచయాన్నీ మోసుకు వచ్చే జీవుడు తన చైతన్యం విూది ముద్రలని ఎన్నని లెక్కపెట్టగలడు? ఏ ముద్ర ఎప్పుడు మేల్కొంటుందో ప్రవృత్తిలో ఏ అనూహ్య క్రియకు కారణమౌతుందో ఎలా చెప్పగలం. అయితే మానవ ప్రవృత్తిలోని సంక్లిష్ట లక్షణం మనోలోకంలోని రహస్య ద్వారాలు తెరుచుకున్నా తనకు తానే అర్థం కావడం కష్టం. అందుకే సంప్రదాయం చెప్పింది, ప్రవృత్తిని కత్తివాదర విూద నుంచి నడిచే వాడిలాగా జాగరూకతతో రక్షించుకోవాలని, జారుపాటు ఏ క్షణంలో కలిగినా పతనమే. ``ఇది ఏనాటికి ఏమగున్‌ తెలియదోయీ రామ ! ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్‌, నెలల్‌, దినము, లిప్తన్‌, లిప్త, రక్షింపగా'' తుద ఎప్పుడు ! ఏ అజాగ్రద్వేళలో ! ఏ మోహమో ! ఏ లోభమో ! కాలుబట్టి లాగవచ్చు. మన చైతన్యంలో ఈ స్పృహ జాగ్రత్త ఎప్పుడూ మేల్కొని ఉంటే పతనం పొందే అవకాశం తగ్గిపోతుంది. మాన్యుడైన ఉషశ్రీ వ్యక్తిత్వంలో ప్రచురమూ, ప్రకటితమూ అయిన వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వ రక్షాస్పృహ కలది. ``జగదుషోవేళా ప్రసన్న వాగ్దేవత అకాశమున లాస్యమాడినపుడు'' అర్ష కంఠాలలో మ్రోగిన ఉషస్సూక్తాలనుంచీ ఈనాటి జిడ్డు కృష్ణమూర్తి అంతర్ముఖ సమారాధ్యమూ, బహిర్ముఖ సుదుర్లభమూ అయిన వాగున్మేషం దాకా ఆయన చైతన్య సంపుటిలోకి ప్రవేశించిన పదార్థాలే. ఈనాడు దేశంలో మానవుడు క్షుభితుడై, ఆత్మ విశ్వాసం కోల్పోయి కుంచితుడై ప్రాచీనాధునిక జీవన పరిస్థితుల ఘర్షణలో శిధిలుడై అరక్షితమైన వ్యవస్థలో నిత్యభీతుడై ఉండగా ఉషశ్రీ ఆ సంోభంలోనించి ఉద్గమించి రెండు దశాబ్దాలుగా ఒక మూల వ్యవస్థను గూర్చి దానిలోని అభయస్థితిని గూర్చీ సార్వకాలికతను గూర్చీ ఉప దేశిస్తున్నాడు. ఈ ప్రవక్తృ లక్షణం తనంత తాను ఎంచుకొన్నది కాదు. తానూ ఇన్ని ఒత్తిళ్ళకూ మనస్సులో రాపిడి పొందినవాడు. ఉద్యోగం లేకా; యజమానుల చేత అకారణ బాధలూ పొందినవాడు. ఆకలీ, దారిద్య్రం ఎరిగినవాడు. ఆ బాధలలోంచి ఒక ``కటు'' లక్షణం వాక్కులో పెంచుకున్నవాడు. దానితో ధీర ప్రవృత్తి వచ్చింది. వ్యాస వాల్మీకుల కథా కోశాలనుంచి తాను పునరుజ్జీవనం పొందాడు. తనకు తెలియకుండానే తాను ఆధునిక పౌరాణికుడూ, వర్తమానస్థితికి వ్యాఖ్యాతా అయినాడు. తాను పుట్టింది పురాణపండవారి శ్రోత్రియ కుటుంబంలో, అయితే తానూ పౌరాణికుడు కావాలని అనుకోలేదు. భీమవరంలో చదువు అఖండంగా సాగిస్తూ కవీ, కథకుడూ, నాటక కర్తా అయినాడు. 1952 నాటికే ``విశ్వశ్రీ'' పత్రిక స్థాపించాడు. ``విశ్వనాథ'' ప్రత్యేక సంచిక ప్రకటించి సాహిత్యరంగంలో అపూర్వ సంచలనం సృష్టించాడు. ఆ సందర్భంలో జరిపిన దేశాటనంలో సాహిత్యరంగంలోని అనేకులైన పెద్దల వ్యక్తిత్వంలోని వెలుగు నీడలను దర్శించాడు. జ జ జ రంగం హైదరాబాద్‌కు మారింది. ఉద్యోగాలు చాలా మార్చి పత్రికా రచయిత అయినాడు. చివరకు రేడియో ఉద్యోగం. అప్పటికి పిల్లలు, సంసారం ! ఎలాగో ఆ ఉద్యోగంలో కుదురుకున్నాడు. ఉషశ్రీ ఉద్యోగం చేస్తూ ఎప్పుడూ తలవంచలేదు. అన్యాయంతో పొత్తు గలపలేదు. విజయవాడ రేడియోలో ఆయన చేరిన తరువాత క్రమంగా ఆయన వ్యక్తిత్వంలో వక్తృ, ప్రవక్తృ లక్షణాలు విచ్చుకొన్నాయి. రేడియో కార్యక్రమాలకు రంగూ, రుచీ, వాసనా వచ్చాయి. ఉషశ్రీ గొంతు శ్రోతలకు ఒక ఆకర్షణ. దానిలో మార్దవం లేదు. అయినా ఆ ధీరత్వం, వాడీ, నిశితమైన వ్యంగ్యం. అంతకు పూర్వం ఆ ప్రభుత్వ సంస్థలో లేనివి. ఉషశ్రీకి రేడియో చాలలేదు. ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. ఆయనకు తెలుగు దేశమంతా వేదిక అయింది. ఎన్నివేల ఉపన్యాసాలో ఎన్ని వక్రోక్తులో ! దేశం ఈ అరుదైన వ్యక్తిని తన గుండెల్లో పొదువుకున్నది. సుసంధితమైన చాపం నుంచి సూటిగా లక్ష్యం వైపు దూసుకుపోయే బాణం లాంటి ఉషశ్రీ వాక్కు ఎందరికో ధర్మ సందేహాలు తీర్చింది, జీవిత గ్రీష్మాతపంలో తప్తులైన వారికి ఎందరికో దప్పిక తీర్చింది. ఇప్పుడు మనం చూడవలసింది ఆయన చెప్పేది రామాయణమా, భారతమా, మరొకటా అని కాదు. ఆ మూసలో జనానికి ఆయన అందించే ఆత్మ విశ్వాసం పాలెంత అని. స్తబ్ధమైన జనంలో అభీతిని కలిగించి కర్తవ్యోన్ముఖులను చేయడంలో ఆయన ప్రసంగాల పాత్ర ఎంత అని ! పురోగామి ప్రతీగామి శబ్దాలను పడికట్టు రాళు్లగా వాడకపోతే ఆయన కృషి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించిందనే చెప్పాలి.

Thursday, July 16, 2009

కృష్ణశాస్త్రి కావ్య సౌందర్యము

దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు ఆధునికాంధ్ర సాహిత్యంలో పారిజాతనికుంజం వంటి చోటు. లలిత కోమల కాంత పదావళితో భారతీయ సాహిత్యంలో జయదేవుని స్థాన మెల్లాంటిదో ఆధునికాంధ్ర సాహిత్యంలో శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో కృష్ణశాస్త్రిదీ అల్లాంటిదే. ఈ శతాబ్దంలో భావ కాల్పనిక కవితా ప్రస్థానం ప్రారంభించిన రాయప్రోలు, గురజాడల మార్గంలో ఒక భావుకతా శిఖరం నిర్మించిన కవి వతంసుడు కృష్ణశాస్త్రి `తలిరాకుజొంపముల సందుల త్రోవల నేలవ్రాలు తుహినకిరణ కోమలరేఖ'యై తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రి పద్యం వినూత్న అభివ్యక్తి లోకాలకు తలుపులు తెరచింది. ఆధునిక నాగరతతో వ్యస్తమైన జీవనంలో సహజమైన ప్రకృతితోడి సామరస్యం గల జీవనం నుంచి, దూరంగా తొలగిపోయిన ఈనాటి మానవుడు మళ్ళీ ప్రకృతి తోడి తాదాత్మా్యన్ని వాంఛిస్తున్నాడు. ఈ తాదాత్మ్యం కోసం ఈ సభ్యతల వలలో చిక్కుకుని పోయిన మిగిలిన వారికంటే తా నొంటరి తనాన్ని పొంది ప్రకృతి ెుుక్క నిసర్గమైన సాన్నిధ్యంలోకి వెళ్లాలని ప్రయత్నం ప్రారంభించాడు. `ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా' అని ప్రశ్నించుకున్నాడు ఈ భావ యాత్రలో కవి గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై తరులెక్కి అల నీలగిరినెక్కి మెలమెల్ల చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై పరిణమించాలని సంకల్పించాడు. నేల విూద నుంచి నింగిదాకా ప్రాకి అన్ని చైతన్యస్థానాలలో తానే అదై, అన్నీ తానై పోవాలని భావన చేస్తున్నాడు. ఈ భావతాదాత్మ్య దశలో వ్యష్టియైన తన వ్యక్తిత్వం సమష్టిలో లీనమవుతున్నది. అప్పుడు తనకు మిగిలేది `సర్వభూతస్థ మాత్మానం, సర్వభూతాని చాత్మని పశ్యతే (ెుూగయుక్తి) వ్యష్టి బిందువు నుండి సమష్టి సముద్రంలోనికి చేసే మహాప్రయాణం. అందువల్ల జగత్తు తోడి తాదాత్మ్యం సులభంగా సిద్ధిస్తుంది. కాల్పనిక కవితాతత్త్వం ఈ స్థితికి చెందిందే. మనోలోకంలో సమష్టివ్యధలు, బాధలు కల్లోలాలు అన్నీ కవిలో ఆత్మీయతను పొంది, గాఢదశలో అభివ్యక్తమవుతవి. ఈ సర్వత్ర సమదర్శనమన్న స్థితిని పొందటానికి కవి ఎంతో ఒరిపిడిని పొందవలసి ఉన్నది. అది ఒక ఏకాంతస్థితి `ఆకలా దాహమా చింతలా వంతలా ఈ కరణి వెర్రినై ఏకతమ తిరుగాడ' భావుకులుకాని అన్నమయ ప్రాణమయకోశాలకు నిబద్ధులైన వారికి ఈ బాధ, ఘర్షణ, ఉన్న స్థితితో అసంతృప్తి మొదలైన అంశాలు పొందే విలక్షణుడైన కవిని చూచినప్పుడు వెర్రివాడుగానే గోచరిస్తాడు. ఏ మార్గంలోనైనా ఈ స్థితి ఉండనే ఉన్నది. వర్తమానంలో ఉన్న ఈ దుఃఖం వల్ల, కట్టుబడుల వల్ల సంకుచితుడైన మానవుడు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నాడు. ఈ దాస్యశృంఖలాలు క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్యశృంఖలాలు. ఇవి తమంత తామే చెదరిపోవాలి. జీవితంలోని దుఃఖాన్ని గుర్తించడంలో కాల్పనికవులు బుద్ధదేవుని వలె లోకాన్ని దర్శించారు. దుఃఖం నుండి విముక్తి వాళ్లకు లక్ష్యమైంది. అయితే దుఃఖమూలంలోకి వెళ్లినప్పుడు వాళు్ల ఈ వేదనలన్నీ అనుభవించవలసి వచ్చింది. ఈ గాఢమైన మనస్సులోకి, అగాధంలోకి తమంత తాముగా ప్రవేశించి ఆ గాఢాంజన గర్భంలోనుంచి చీల్చుకుంటూ పైకి రావలసి వచ్చింది. అప్పటి స్థితి తిమిరలత తారకా కుసుమములు తాల్ప కర్కశశిలయు నవజీవ కళల దేర మ్రోడు వెుూక చివురులెత్తి మురువు సూప నున్న స్థితి తిమిరిలత అన్న స్థితి అగాధమై సృష్టిపరిణామం ప్రారంభంకాని సృష్టి దేవాలయంలో చిరుదీపం కూడా వెలుగని సంకల్ప పూర్వదశ కావచ్చు. రెండవది సంపూర్ణమైన కఠిన శిలాస్థితి. మూడవది చైతన్య స్పందం స్ఫురించే వ్రెుూడు వెుూక, ప్రాణ వికాసంలో క్రమ దశ ఈ విధంగా వ్యక్తమౌతున్నది. ఇలా మూల ప్రకృతిలోకి, దుఃఖ గర్భంలోకి ప్రవేశించి దాని నుండి సంఘర్షించి నూత్న జగత్తును స్పష్టించే సంకల్పంతో ఆ పరిమితులను ఛేదిస్తూ పురోగమనం చేయటం కాల్పనిక కవిత్వానికి పరమలక్ష్యమయింది. ఈ స్థితిలోని పరిణామదశలు ఎన్ని ఉన్నవో అన్నింటినీ స్పష్టరేఖలతో వ్యక్తం చేసిన కవి కృష్ణశాస్త్రి. `యుగయుగంబుల నీశ్వర యోధులగుచు' ఈ వ్యక్తులు స్వేచ్ఛకై తమ ప్రాణ సుమములు అర్పిస్తున్నారు. ఇందువల్ల అమల జీవిత ఫలము ధన్యతను పొందుతున్నది. ఇంతటి ఘర్షణ ఫలితం సామాన్యమైందికాదు. జగత్తు తనతో పాటు పరిణామానికి ఉన్ముఖమై తన పరిమితులనుండి ఉన్ముక్తమై వెంట వస్తూ వున్నది. భయము కలిగించు కష్టాతపంబు మరచి కరము కలగించు వంత చీకట్లు మరచి విశ్వమే పరవశమయి వెంటరాగ తాను ఈశ్వర యోధుడై ముందుకు సాగగా తన వెంట పరవశమయిన జగత్తు కదలి వస్తున్నది. జగత్తులోని దుఃఖాన్ని తొలగించటమే ఈశ్వర యోధుని లక్షణం. ఈశ్వరాభిముఖంగా ఈ జగత్తు పొందే పరిణామక్రమాన్ని వేగిరపరచి దానికి ఆనందమయస్థితిని కలిగింప జేసేందుకు మార్గం వేయటమే కవియైన ఈశ్వర యోధుని ప్రవృత్తి. ఈ ఈశ్వర యోధుని ఉన్ముక్తమైన ఉన్మాదప్రాయమైన దశ `స్వేచ్ఛాగాన'మన్న రెండవ ఖండికలో వ్యక్తమౌతున్నది. `పక్షి నెు్వద చిన్న ఋక్షమెు్యదను, మధుపమెు్యద చందమామ నెు్యదను, మేఘ మెు్యద వింతమెరపు నెు్యదను అలరు నెు్యద చివురాకు నెు్యదను' అంటూ `మాయ మెు్యదను నా మధుర గానమున' అంటాడు. తనకూ తన గానానికీ అభేదం. ఆ స్థితి పొందిన వారికి మళ్ళీ ప్రకృతి ఆవరణంలోకి వచ్చే అవసరం ఉండదు. వాళు్ల జీవన్ముక్తులు, అందుకే అంటారు కవి `దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అని అంటే ఆ చైతన్య పరిమితిలోనికి తిరిగిరానని తాత్పర్యం. కవి అనేక చిత్తస్థితులను వర్ణిస్తాడు. లోకంలో వైరుధ్యం ఉన్నది. సుఖ దుఃఖాలు ఉన్నవి. సుఖముగా ఉన్న దశలో అట్టడుగున ఉన్న దుఃఖాన్ని గుర్తించగలగితే ఈ దుఃఖ స్పర్శలేని స్థితి కోసం పరితపించే దశ వస్తుంది. వైరుధ్యాల వల్ల సంక్లిష్టమైన దశ ఉంటుంది. ఏది ఏమిటో గుర్తించలేము. అమల మోహన సంగీత మందు హృదయ దళన దారుణ రోదన ధ్వనులవిందు ఈ అనిత్యమైన నిరంతర పరిణామ శిథిలమైన జీవితం నుండి జీవుడు ఈశ్వర చైతన్యంలోకి విశ్రాంతి పొందే ఒక దశను కవి వర్ణిస్తాడు. నీలభ్రసరసిలో నిండు జాబిల్లి రాయంచవలె నిహారము సల్పుచుండె కమ్మతెమ్మరలు శాఖా పత్రములనొ కల్లోలినీ తరంగములనో దాగె నాట్యంబు మధుర గానంబును మరచి గాటంపు నిద్దురగాంచె శైవలిని సర్వేశ్వరుని హస్త జలజ యుగ్మమున విశ్వమే హాయిగా విశ్రాంతి జెందె ఈ వర్ణన మాండూక్యములో వర్ణించిన అవస్థాత్రయంలో మూడవ దశను సంబంధించింది. జాగ్రత్స్వప్న సుషూప్తిదశల్లో అనుభవస్థానమైన పురుషూని క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ భోక్త ప్రాజ్ఞదశలో ఉన్నప్పటి దశ. ఈ ఖండికలో వర్ణితమైంది. సామాన్య దశలో ఉండగా ప్రేరకమైన భావం ఎక్కడినుంచో అపూర్వమైంది స్ఫురిస్తుంది. అతని పాట అన్న గీతంలో `మందమలయానిలోర్మికా మాలికలను లలిత సుకుమార మధుర బాలస్వరంబు నెత్తి, పాడితి వేమేమొ హృదయ కమల వికస నోద్భోధకంబగు వింతగీతి' అప్పుడు తన అనుభవం ఎలా ఉందో వెంటనే వివరిస్తాడు కవి. `సందె వేళ పొలముగట్టు, చల్లగాలి చేతిలో చేయి నునులేత చిత్రములును, ఈవు నేను పిట్ట లటుల నేమియనక, సర్వమును జేర నొక్క యపూర్వభావ ముదయమెు్య కుమార నా హృదయమందు' `మొగముగంటి కనులగంటి మొగిలుగంటి పాటవిను చుంటి' ఈ విలక్షణమైన దశలో అనుభవిస్తున్న కవీ, పాడుతున్న కుమారుడూ ఇద్దరే ఉన్నారు. `ఈవునేను పిట్ట లటుల' అంటే జీవేశ్వరులను పక్షులుగా వర్ణించిన శ్రుతి తప్పక స్మరించబడుతుంది. `ద్వాసవర్ణా సయుజా సఖాయ' అని. విశ్వనాథ ఈ కాలంలోనే `ఈ అనిలాధ్వమందు నినదించెడు మువ్వల మ్రోత దూరమై పోయిన గోతతిన్‌ పిలుచు పోలిక యేదొ వినిస్వనించెదున్‌' అన్నిచోట ఈ అవ్యక్త లోకపు ఆహ్వాన గీత స్ఫురణను వర్ణించినాడు. ఈశ్వర భావవేళ దీనుడైన ఈ జీవుని పరిస్థితిని రవీంద్రుడు గీతాంజలిలో వర్ణించినాడు. కృష్ణశాస్త్రి ఒక గీతంలో ప్రసవ కోమల రమణీయ పథము బట్టి పోవుచుందువు లావణ్యమూర్తి నీవు ఏనొ దీనుడ, నే నీడనైన నొదిగి అడుగిడగ లేక నిట్టూర్పువిడువలేక పొరలు కన్నీటి కాల్వలు కురియలేక మ్రోడునై రాయినై నిల్చిపోదు నకట ఇక్కడ పరిణామానికి ముందు జీవుడు రాయిగా మ్రోడుగా నిలిచివున్న దశలను నీడలో నొదిగి ఉండటం, ప్రకృతి పరిమితుల్లో దుఃఖమయజగత్తులో మిగిలి పోవటాన్ని సూచిస్తుంది. బ్రహ్మసమాజ భావన కృష్ణశాస్త్రి కవిత్వానికి ఆధారపీఠం, విశిష్టాదై్వతంలోని సగుణోపాసన స్థానంలో నీరూపమైన ఈశ్వరభావన నిలిపితే బ్రహ్మభావన నిలచి వుంటుంది. అందుచేత ఈశ్వర శరణాగతి వల్ల ఎటువంటి జీవునికైనా నిష్కృతి ఉన్నదనే తత్త్వమార్గం బోధిస్తుంది. ఈశ్వరుడు దోషభోగ్యుడు. ఈశ్వరుని ఈ లక్షణమే అతనిని మనకు నిత్యసన్నిహితుణ్ణి చేస్తుంది. `మలినబాష్ప మౌక్తినము్మ మిలమిల నీ కనుల నిలువ, తళతళమని తారలు నటియించునురా పాపీ !' `కురియుమురా కన్నీటి మరిమరి విలపింపుమురా సరముగూర్చి పరమేశుడె తాల్చునురా పాపీ' శరణాగతి అనన్య గతికత్వము ఈ రెండు లక్షణాలే జీవుణ్ణి ఈశ్వరుని దగ్గరకు చేర్చే అంశాలు. అప్పుడు జీవుని మలినాశ్రుధార పరమపావన జాహ్ననీ ప్రతిభగాంచుతుంది. తావకీన పదసరోజ దళములందు నిలువ నిమ్మొక్క వేడి కన్నీటి చుక్క కడల ప్రసరించు నెత్తావి కమ్మదనము త్రావనివెుూ్మ ప్రభూ ! దాని తనివితీర ఈ జీవయాత్ర పరిమితిలో కృష్ణశాస్త్రి దుఃఖం సమష్టిజీవ దుఃఖమే కాని లౌకికమైన దుఃఖం కాదు. దానికి పరమమైన గమ్యం ఈశ్వర ప్రాప్తి. అవధరింతువు ప్రతి దివసాంతవేళ నిత్య నూతన తాండవ నృత్యకేళి ఓంుు నటరాజ తలలైన ఉపలేక భువనములు దుర్భరానందమున నడంగ ఆటలో పాటలో నేర్చినట్లు దేవ ఏనుగూడ నీవలె నటియింపనిము్మ ఎడతెగని యాత్ర నెట్లొ సాగించు వరకు ఎట్లొ నీ దర్శనము్మ సాధించు వరకు కృష్ణశాస్త్రి చెప్పిన ఈ అనంత యాత్ర సర్వజీవుల యాత్రయే. కాల్పనిక కవిగా కృష్ణశాస్త్రి కవిత్వం విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది. ఒక పరిమితుల్లో విమర్శకులు దీన్ని భావకవిత్వం అని పిలిచారు. ఆత్మాశ్రయధోరణిలో సాగిన మార్గంలో ఈ కవిత్వంలో ప్రధానస్థానాన్ని ప్రేమ ఆక్రమించింది. ఈ ప్రేమ ప్రకృతికీ, స్వేచ్ఛకూ ఈశ్వరుడికీ పరిమితం కాకుండా స్త్రీ పురుష సంబంధాన్ని విలక్షణంగా విచారించింది. సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు, ధర్మ స్ఫూర్తి కోల్పోయిన వివాహవ్యవస్థ కాఠిన్యాన్ని, మౌఢ్యాన్నీ స్త్రీ పురుషూలకు సమాన స్థానం లేక పోవటాన్నీ కల్పించినప్పుడు స్త్రీపుంసయోగంలో ప్రేమకు పట్టాభిషేకం చేసిన ఘనత భావ కవిత్వానిది. స్త్రీని కేంద్రంగా ఆరాధ్య దేవతగా భావించి ఈశ్వర స్థానం కల్పించే వరకూ ఈ కవిత్వం ప్రవర్తించింది. కృష్ణశాస్త్రి వివాహవ్యవస్థ కన్నా స్త్రీ పురుషూల మధ్య స్వేచ్ఛనూ ప్రణయాన్నీ లక్ష్యంగా ప్రతిపాదించినాడు. ప్రేయసిని `తానే సృష్టించుకొన్నాడట. ఎలాగ? తన మనస్సుకు ఎన్నడో ఎక్కడో సోకిన ప్రతి సౌందర్య ఖండాన్నీ, తన హృదయాన్ని ఎన్నడో పలకరించిన ప్రతిప్రేమ శకలాన్నీ ఏరి ఏరి తెచ్చుకుని, అన్నిటినీ కలిపి కలిపీ ఆమెను సృష్టించు కున్నాడట' ఈ మాటలు కవి చెప్పినవే. ఈ ప్రేయసి నితాంత వియోగిని, నిశీధిని, కఠోర ప్రణయశాలిని. అలాంటి ఆమెను గూర్చిన తన అన్వేషణము అనంతమైంది. ఈ భావసుందరిని నిజజీవితంలోకి సాక్షాత్కరించుకునే పని కృష్ణశాస్త్రి కవిత్వం సూచించదు. ఇది ముగియబోని, ఏ యర్థమెరుగరాని వేసటేలేని వెర్రి యన్వేషణము్మ ఈ ప్రవాస యాత్రారతి నిటులె నేను కదలిపోవుదు నాశావకాశములకు ఒక్కనిట్టూర్పు వోలిక ఒక్క మౌన బాష్పకణమటు, ఒక గాఢ వాంఛపగిది ఇంత నూతనాభివ్యక్తి సముదాయంతో కృష్ణశాస్త్రి తెలుగుకవిత్వానికి నూతన దిశాభిగమ్యం నేర్పాడు. తానే ఈ మార్గంలో కవులందరికీ గురుపీఠమైనాడు.

Thursday, July 9, 2009

ఈ తరంవారి భాగ్యం

తెలుగు సాహిత్యంలో సంస్కృతేతిహాస పురాణాలను మళ్ళీ అనువచించే సంప్రదాయం ఒకటి ఆదినించీ ఉన్నది. `మునివృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థ' మేర్పడ నన్నయ్యభట్టు తెలుగులో మహాభారతం పలకడం ప్రారంభించినాడు. తిక్కన ఎఱ్ఱనలు ఆ మార్గమే అనుసరించినారు. అయితే మూలం ఆధారంగా సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, శ్రోతల జ్ఞాన గ్రహణ పరిమితుల దృష్టిలో ఈ అనువచన ధోరణి ప్రారంభమయింది. అందువల్లనే మూలంలోని అనేకాంశాలు సామాజిక ధార్మికాంశాలు ఈ రచనలో కనిపించవు. ముఖ్యంగా భగవద్గీత, సనత్సు జాతీయము మొదలైన అనేక ప్రముఖ గ్రంథ భాగాలు లోపించినవి. అయితే మూలం ఒక ఆధారమై కవుల స్వేచ్ఛాచారణానికి అవకాశ మిచ్చిన ఈ రచనలు నన్నయాదుల కవితా శక్తికి నికషోపలాలు అయినవి. మహాభారత మూల గ్రంథ నిర్మాణవైఖరి, ఇతిహాస కథాంశ ప్రత్యేకతలు, అనేక జ్ఞాన విజ్ఞాన భాగాలు తొలగి పోయినవి. ఈ స్వాతంత్య్ర ధోరణి వాల్మీకి రామాయణం తెలుగులోకి తెచ్చినప్పుడు కూడా ప్రతిఫలించింది. భాస్కర రంగనాథులు రెండు మార్గాలను ఎన్నుకొన్నా, అనువచన పద్ధతి నన్నయాదుల మార్గమే. అవాల్మీకీయ కథాంశాల ప్రకారం కూడా ఎక్కువగానే ఈ రామాయణాలలో చోటు చేసికొన్నది. శ్రీనాథుని కాలంలో నైషధాదుల అనువాదం వచ్చేసరికి ఈ స్వాతంత్య్రం కొంచెం కుంచించుకుపోయింది. అయినా భాషలోని పూర్వ సంప్రదాయం `ఔచిత్యంబు పోషించియు, అనౌచిత్యంబు పరిహరించియు' సాగింది. ఇతిహాసం, పురాణం ఈ రెండూ వస్తు ప్రధాన రచనలు. కావ్యాలు భావ ప్రధానాలు. నాటకాలు పదప్రధానాలు. అందువల్లనే కవుల ప్రయత్నమంతా పురాణేతి హాసాల అనువచనమే. శ్రీనాథుని నైషధం వదలివేస్తే కావ్యాలు నాటకాలు ప్రాచీన సాహిత్యం పట్టించుకున్నవాళు్ళ లేరనే చెప్పాలి. ఏమైనా అనువాదం చేయవలసి వస్తే నాటకాలు కూడా కావ్యాలుగా రూపొందాయి. 19వ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్ల, సాహిత్య దృష్టి ప్రధానం కావడంవల్ల, కవుల ప్రతిభా విశేషాలను అంచనా వేయడం అంతస్థులను నిర్ణయించ ప్రారంభం కావడంవల్ల రచనా ప్రపంచంలో మార్పు వచ్చింది. కవుల కౌశలం ఎంచుకునే ధోరణి పెరిగింది. సాహిత్యానువాదం ఆయా కవుల ప్రతిభా ప్రకటనకే కాని అనువక్త ప్రతిభా ప్రకారం కోసం కాదని ఒక నిశ్చిత భావం ఏర్పడ్డది. అందుకే శరపరంపరగా కావ్యనాటకాదుల అనువాదం ప్రారంభం అయింది. మూల రచయితకు న్యాయం జరుగలేదనే ధోరణిలో ఒకే గ్రంథానికి అనేకానువాదాలు ఏర్పడ్డవి. ఒక్క మేఘదూతానికి, ఒక్క శాకుంతలానికి ముపై్ఫ పైగా అనువాదాలు రావడానికి ఇదే కారణం. ఇదే శతాబ్దంలో పురాణేతిహాసాల అనువాదం కూడా మళ్ళీ జరిగింది. శ్రీపాద వారు మళ్ళీ భారతం నిర్మించడం ఈ దృష్టితోనే. వావిలికొలను సుబ్బారావు గారి రామాయణం ఈ మార్గంలో నడచి సాగిన మరో రచన. ఆయన అనువాదంతోపాటు రామాయణానికి ప్రచారంలో ఉన్న వ్యాఖ్యానాలు ఆధారంగా ఒక బృహద్వా్యఖ్య నిర్మించి మందరమనే పేర అందించారు. వాల్మీకి రచనకు ఏఏ వ్యాఖ్యాన విశేషాలు అన్వయిస్తున్నవో అవన్నీ దీనికీ అనువర్తించగలవని వావిలికొలను వారి అభిప్రాయం. వావిలికొలను వారి దృష్టిలో రామాయణ రచన ఒక విశిష్ట స్థానంలో ఉన్నది అనే కాధ్యాత్మిక సంప్రదాయాల బీజగర్భితత్వం దీనిలో ఉన్నదని. అయితే, మనకు రామాయణం వేదోపబృంహణార్థమని భావించే ధోరణి ఒకటైతే కావ్యకళాదృష్టతో ఆద్యంతమూ విలువగల రచనగా ఆదికావ్యంగా పరిగణించడం ఇంకో దృష్టి. ఈ దృష్టిలో వాల్మీకి రచనను యథాతథంగా `తుచ తప్పకుండా' తెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇంత కాలానికి `రామానుజ రామాయణం' వల్ల జరిగింది. రామానుజ రామాయణం రచించిన మిత్రులు శ్రీ శ్రీ.న.చ. రామానుజా చార్యులుగారు నాకు ఆప్తమిత్రులు. తనలో నిద్రించి ఉన్న కవితా కుండలినిని మనో వాల్మీకంలోనించి తట్టిలేపి యేభై సంవత్సరాలు దాటిన ప్రాయంలో వాల్మీకి రామాయణాన్ని తెలుగులోనికి తీసుకువచ్చారు, దీక్షగా ఆరున్నర సంవత్సరాల యజ్ఞంగా. రామాయణ మూల రచనకు ఆధ్మాత్మిక, ధార్మిక, సామాజిక, భాషా సంబంధి, కళాత్మక ముఖాలు అనేకంగా ఉన్నవి. అయతే ఈ అనువాదంలో భాషా కళాముఖాలకే ప్రాధాన్యం ఉన్నది. వీలైనంతలో ఆయన శ్లోకం ఇముడగల దేశిచ్ఛందస్సులను ఎన్నుకోవడం, వీలైనంతలో దేశి శబ్దజాలాన్ని ఉపయోగించడం ఈ రచనలో ఉన్న విశేషాలు. శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారు వ్యాఖ్యానాలు పరిశీలించి అర్థ విస్పష్టతను సాధించారు. అయితే ఆ ధోరణిలో విస్తరించి వ్యాఖ్యానించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఆ ప్రలోభానికి లొంగక పోవడం తన వ్యక్తిత్వాన్ని మరుగు పరచుకోవటానికి చేసే ప్రయత్నం ఒక అసాధారణ సాఫల్యంగా నేను భావిస్తున్నాను. అనువాదం చేసే సందర్భంలో పద్యం క్రమంగా సారళ్యం పొందింది. `బడు' ను పరిహరించినా, సంస్కృత వాక్య విన్యాస ధోరణిని పరిహరించడం సాధ్యం కాలేదు. కొంచెం ఆ మార్గం అలవాటయితే, సంస్కృత రామాయణం చదువలేని వాళు్ళ, దాన్ని చేరలేనివాళు్ళ దీన్ని చదివి వాల్మీకి ప్రతిబింబాన్ని పోల్చుకోవచ్చును. ఈ అనువాద కార్యానికి తొలి ప్రోత్సాహం శ్రీ ఉషశ్రీది. అయితే ఈ రచనా సందర్భంలో అనువాదాన్ని మూలంతో సరిపోల్చుకుంటూ వినే అవకాశం నాకు చాలావరకు కలిగింది. నా పరిమితిలో కొన్ని చోట్ల చర్చించటం. శ్రీ.న.చ రామానుజా చార్యులుగారు కొన్ని చోట్ల మన్నించడం జరిగింది. కొన్నిచోట్ల తమ దృక్పథాన్ని విశదీకరించడం జరిగింది. ఒక విధంగా నాకు రామాయణాధ్యయనం చేసే అవకాశం, వాల్మీకిని అత్యంత సన్నిహితంగా ఎరిగే స్థితీ కలిగింది. శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారి మాట ఎంత `కచ్చితమో' జీవితంలో ఎంత క్రమశిక్షణో రచనలోనూ అంతే కచ్చితమైన క్రమశిక్షణ గల లక్షణము వ్యక్తమవుతుంది. ఎక్కడా అసమగ్రతతో ఆయన రాజీపడలేదు. ఎంత క్లిష్టమైన ఘట్టంలోనూ `నామూలం లిఖ్యతే' అన్న మార్గం ఆయన వీడలేదు. పారిభాషిక పదబహుళంగా ఉండే యజ్ఞ ఘట్టమూ, విశేషణాల పరంపర కలిగిన ఆదిత్య హృదయము, దేశ భౌగోళిక స్వరూపాన్ని వర్ణించే కిష్కింధలోని మార్గోపదేశమూ, అన్నీ ఈ క్రమశిక్షణలో సాగినవి. విశిష్టాదై్వత సంప్రదాయంలో బహు విశేషభావనలకు తావిచ్చే రామాయణ విశేష శ్లోకాల సంపుటికి `తని శ్లోకి' అని పేరు. ఆ శ్లోకాల రచనలో కూడా కత్తివాదర మీద నడకలాగా ఈ అనువక్త రచన సాగించి దీనికి రామానుజ రామాయణం అన్న పేరుంచడంలోని ఔచిత్యాన్ని ఋజువు చేశారు. అయితే శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారు గురుకుల క్లిష్టూలవునో కాదో కాని ఆంధ్ర మహాభారత సముద్రము దరియంగ నీదిన ప్రయోగదక్షులైన విద్వాంసులు. ఏ సందేహం కలిగినా పూర్వకవి ప్రయోగమును చప్పున ఉదాహరించగలవారు. కవిగా ఆయనకు ఈనాటిలోకం మీద ఉన్న నిరసన ధోరణి అంతా మూర్ఖ శతకంలో మిక్కిలి కటువుగా వ్యక్తమవుతున్నది. రామానుజ రామాయణంలోని అనువాద ధోరణిని పరిశీలించడం, పైన పేర్కొన్న అంశాలు ఆధారంగా జరగాలి. తేషాం కేతురివ జ్యేష్టా రామో రతికరః పితుః బభూవ భూయో భూతానాం స్వయంభూ రివ సమ్మతః (బాల1823)దీని అనువాదం వారిలోన పెద్దవాడు రాముడు పతా కము్మవోలె ప్రీతికరుడు తండ్రి కఖిల భూతతతికి ఆత్మభవుం డట్లు సమ్మదము్మ గూర్చు సంతతము్మఈ అనువాదంలో `పతాకము్మ' అన్నమాట పాదాంతంలో గురువు మీద విరిగి విలక్షణమై తన వ్యక్తిత్వ ప్రత్యేకతను చాటుతున్నది. ఇక్కడ కవి పదాన్ని ఎన్నుకోవడంలో `కేతు' శబ్దం తొలగిపోయి మరింత అసందిగ్ధతను చాటుతున్నది. ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి గుణా ద్రూపగుణాచ్చాపి ప్రీతి ర్భూయో భ్యవర్ధత (బాల7726)దీని అనువాదం ప్రీతిపాత్ర యెు్య సీత రామునకును తండ్రి కూర్చినాలు తానగుటను గుణము వలన రూపగుణమున సైతము పెంపు మీరు చుండె ప్రీతి మిగులఈ పద్యంలో మూలం ఎక్కడా చెక్కుచెదరక పోవడం, సంస్కృతం పలుకుబడి తెలుగులోకి అందంగా దిగిరావడం గమనించవచ్చును. అసిధారావ్రతంగా ఈ అనువాద కార్యం నిర్వహించిన రామానుజా చార్యులుగారిని అభినందించడం తప్ప మనం చేయగలిగిన దేముంది? వాల్మీకి గిరి సంభూతయైన రామాయణ మహానది తెలుగు క్షేత్రంలోకి ఇంత సులభంగా ప్రవహించడం ఈ తరం తెలుగువాళ్ళ భాగ్యం. ఈ యజ్ఞం పూర్తిచేసి అవబృథ స్నానం చేసిన రామానుజాచార్యులుగారిని వారి షష్టిపూర్తి సందర్భంగా హృదయ పూర్వకంగా అభినందించడం, వాల్మీకిని ఇష్టపడే సాహిత్య ప్రవాహ వీథీ సాంయాత్రికు లందరికి ధర్మం.

అంతర్ముఖుడు శ్రీ నవీన్‌

మన కవులు-రచయితలు-2
నవీన్‌ నాకు 1960 ప్రాంతాల నించి పరిచయమే. `అంపశయ్య' ద్వారా అంతవరకు తెలుగు సాహిత్యంలో అంతగా ప్రచలితంకాని చైతన్యస్రవంతి సంవిధానాన్ని ప్రయోగించి తొలి నవలను పూర్తి చేశాడాయన. 1955 ప్రాంతాలలో మేము నేను, పేర్వారం జగన్నాథం ప్రభృతులం `సాహితీబంధు బృందం' స్థాపించటం ప్రధానంగా కళాశాల విద్యార్థులుగా, సాహిత్య రంగంలో ప్రక్రియగా ఉండటం కోసం మేము హైదరాబాదు చదువుకోసం వెళ్లగానే మా ఆర్‌‌ట్స కాలేజి అధ్యాపకులు పి.జి, లాలే, ఇరివెంటి కృష్ణమూర్తి, జి.వి. సుబ్రహ్మణ్యం ప్రభృతులు కాళోజీ సోదరులు కేంద్రంగా మిత్రమండలిని స్థాపించటం జరిగింది. 195758లలో. అయితే మిత్రమండలి పక్షానికో, వారానికో సమావేశమై యువ రచయితల రచనలకు పదునుపెట్టింది. ఒక కార్యశాల వలె నడిచింది. ఆ కార్య శాలనించి బయటకు వచ్చిన రచయితలలో నవీన్‌ ఒకరు. వరంగల్లు సాహిత్యంలో తొలి నాళ్లనుంచీ రెండు రకాల స్రవంతులు సమాంతరంగా ప్రవహించటం ఉన్నది. దేశీయత కళామయత, అంతర్బహిర్ముఖాలు, ఆధ్యాత్మికత అధిభౌతికత జంటలు జంటలుగా సాగివస్తుంటవి. పాల్కురికి సోమన, పోతన్న నాటి నుంచీ ఈనాటి వరకు ఈ జంట జంటల పద్ధతి సాగిపోతూనే ఉంది. సర్వతః బహిర్ముఖంగా కనిపించే కాళోజీ ఉర్దు, పారశీక కవితా సౌందర్యానికి పరవశమయ్యే వ్యక్తియే. శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి భక్తి కవితా ధోరణికీ, ఉదయరాజు శేషగిరిరావు `మనోరమ' అనే శృంగార పద్యలహరికీ తన్మయమయ్యే లక్షణం ఉన్నవారే. కాళీజీ ప్రభృతులు నిర్వహించిన మిత్రమండలిలో నుంచి వెలువడడ్డ శ్రీ నవీన్‌ రచయితగా అంతర్ముఖుడైనాడు. అతని నవలలూ కథలూ ఎంతగా లోకాన్ని వర్ణించినట్లు కానవస్తూన్నా ఆత్యంతికగా అంతర్జగత్తులో విలీనమయ్యేవే. నవీన్‌ రచనల విూద ఒక సౌందర్య అనుభవ ముద్ర ఉన్నది. ఈ ముద్ర చలం ద్వారా ఆయనకు సంక్రమించింది. అందువల్ల జీవితాన్ని పై అంచులో వర్ణిస్తూ వర్ణిస్తూనే చివరకు ఆయన అంతర్జగత్తులోకి జారిపోతాడు. పైన బుద్ధిబలం వల్ల, హేతువాదం వల్ల ఏ ఏ పరివేషాల కానవచ్చినా అసలైన నవీన్‌ కేవలం వాటి పొరలు చించినప్పుడే కానవస్తాడు. ``మనస్సును కలచి కలచి మేధస్సును, సంఘటన అనే కవ్వంతో చిలికి చిలికి జీవిత రథ చక్రాల క్రిందపడి నలిగి నలిగి ప్రతిపాత్రను కలం కుంచెతో బొమ్మ గీసి గీసి, ప్రతి అక్షరాన్ని మార్చికూర్చి, ఇటుక మీద ఇటుకకను పేర్చినట్టుగా పేర్చిపేర్చి తన బాధను ప్రపంచబాధగా, ప్రపంచబాధను తన బాధగా చేసుకొని, జీవితం అనే సూది మొన మీద నిరంతర తపస్సు చేసి చేసి అప్పుడు గదా కథ పుడుతుంది అప్పుడు గదా నవల పుడుతుంది. అదో తపస్సుఅదో సాధన అదో ప్రసవవేదన.... అదో అన్వేషణ, అదో తీరని దాహం'' (అంతస్స్రవంతి పేజి. 41) ఒక రచయిత రచనాక్రమాన్ని సోపాన పద్ధతిలో వెల్లడిస్తున్నారు శ్రీ నవీన్‌. `ఇటుకమీద ఇటుక పేర్చినట్టుగా పేర్చిపేర్చి' ఇంతవరకు రచయిత జాగ్రదవస్థలో చేసే కార్యం. అంతస్సులోనికి ప్రవేశించే ప్రయత్నం. తన వు్యత్పత్తీ లోకానుభవమూ, అభ్యస్త సాహిత్య విద్యావైదుష్యమూ వెల్లడించేవి. తరువాత భాగం ఆయన అంతస్సును గురించి తెలియజేస్తుంది. `తన బాధను ప్రపంచబాధగా ప్రపంచబాధను తన బాధగా' చేసికొని ... ఇది అంతర్బహిస్సుల సంధి దశ. ఈ మాటలు మహాప్రస్థానం పీఠికలో చలానివి. ఒకటి కృష్ణశాస్త్రిని గురించి, రెండవది శ్రీశ్రీని గురించి చెప్పినవి. వ్యక్తి క్రమంగా విశ్వచైతన్యంగా పరివర్తించటం విశ్వచైతన్యాన్ని తన వ్యక్తిత్వంలోనికి స్వాయత్తం చేసుకోవటం . . . ఈ రెండూ ఉన్మేషనిమేష దశలు, ప్రతి రచయితా రచనావేళలో ఈ దశల్లో ఎక్కడో ఒకచోట తప్పక నిలిచివుంటాడు. తరువాత మూడవదశ వర్ణించబడింది. ఇది అత్యంతమూ ముఖ్యమైంది. ఒక విధంగా నిర్వికల్పసమాధివంటి దశ. అహంత సరిహద్దులు చెరిగిపోయిన స్థితి. ఆ స్థితి `జీవితం అనే సూదిమొన మీద చేసే నిరంతర తపస్సు'. సర్వ చరాజగత్తులోని జీవచైతన్యమూ సుసూక్ష్మీకరింపబడి కేంద్రితమై రచయితకు ఆధార స్థానమవుతుంది. ఈ ఆధార పద్మం మీద నిలిచి ఉంటాడు రచయిత. సృష్టికర్త. ఈ కేంద్రీకృతమైన సర్వజీవన చైతన్యాన్ని గర్భీకరించుకున్న బిందువు మీద ఉన్న రచయిత మనం ఎరిగిన లోకంలోని వ్యక్తి మాత్రమే కాదు అతడు తనకుమించిన జగత్తునంతనటినీ తనలోనికి చేదుకున్నవాడు. ఒక వ్యక్తావ్యక్త సంధి బిందువు మీద ఉన్న స్థితిని చెప్పుతాడు. అప్పుడది తపస్సుతీవ్రభావనఅవుతుంది. అప్పుడది సాధన అంతర్జగత్తునుంచి ఎప్పుడు చేదుకునే ప్రయత్నం అవుతుంది. అదే తానెరుగని అపూర్వమైన నూతనా విష్కారం కోసం చేసే ప్రయత్నం అవుతుంది. శ్రీ నవీన్‌ ఈ విధంగా రచనాప్రక్రియలోని భిన్నభిన్న దశలను ఇంత విశదంగా చెప్పారు. రచయితగా ఉన్న ఆయన వివేకం స్థాయిని ఇది తెలియజేస్తుంది. అంతర్బహిర్జగత్తుల మధ్య సమన్వయంలోనే గొప్పరచన వెలువడుతుంది. శ్రీ నవీన్‌లో ఈ ఘర్షణ `అంతస్స్రవంతి'లో వ్యక్తమయ్యే సన్నివేశం ఉంది. రచయిత భార్య రజని అంటుంది ``ఎప్పుడూ మల్లెపూల సువాసనలేకాదు. . . అప్పుడప్పుడు కిరోసిన్‌ కంపు కూడా భరించాలి'' అని. భౌతిక ఆధిభౌతిక జీవనాల మధ్య వారధిని నిర్మించుకోవలసిన అవసరాన్ని ఈ సన్నివేశం స్పష్టం చేస్తుంది. రవి తన పాఠకురాలు సుధకు రాసిన ఉత్తరం సన్నివేశంలో ఈ సమన్వయం కుదరకపోవటం వల్ల వచ్చే వైరుధ్యం కానవస్తుంది. ఇక్కడ రవి స్వాప్నికుడు. రజని భూమి. ఈ భూమ్యాకాశాల నడుమ సమన్వయం నవల చివర దాని సమావేశంలో సాధ్యమయ్యింది. రవికి సంప్రదాయ సిద్ధమైన పతివ్రత వంటి విలువలమీద నమ్మకం లేక పోయినా తన సహచరి ఇల్లాలు ఆయనకు సర్వమూ అవుతున్నది. `నువ్వే నారాణిని నా ఎంకివి నా ఊర్వశివి నా పార్వతివి కోమలివి నా అమృతానివి తాను మెచ్చిన స్త్రీల వ్యక్తిత్వాలన్నింటినీ తన ఇల్లాలు రజనిలో చూసుకోగలుగుతాడు రవి. అందువల్లనే ఆమె తన సంగమకాంక్ష తీర్చని వేళలో కూడా దగ్గరకు లాగి జోకొట్టింది. అతనికి ఓ చక్కని కలవచ్చింది. మత్తుగా ఉంది. తెల్లగా మంచుముద్దలు, పచ్చటి మైదానాలు సూర్యకిరణాలలో తళతళలాడే పర్వతాలు. ఎతై్తన యూకలిప్టస్‌ చెట్లు కాదు ఆపిల్‌ చెట్లు, గుత్తులు గుత్తులుగా ఆపిల్‌ పళు్ళ. `వాటి అందమంతా కళ్ళతోటే జుర్రేస్తున్నాడు' (పేజి. 1213) అతని శరీరం కోరిన అనుభవం స్వప్నంలోకి పరివర్తిత మయ్యింది. ఆ పళ్ళను డబ్బాలలో పెట్టి మేకులు కొట్టడం, పాలవాడు తలుపు బాదం ఇవి భౌతిక జగత్తులోనికి దించే వాస్తవాంశాలు. అయితే నవల చివర నాయికా నాయకుల సంగమ దృశ్యం వర్ణించబడింది. అనుభూతి జగత్తులోంచి ఈ వర్ణన భౌతిక పరిమితులను దాటిపోయింది. దాంపత్యజీవన తత్తా్వన్ని వ్యాఖ్యానించింది. ``వాళ్ళిద్దరూ రెండు శరీరాలుగా రెండు ప్రాణాలుగా అంతమైపోయారు. ఏకప్రాణిగా ఆవిర్భవించే ఆ క్షణాలు అతనికి మహత్తరంగా, మహాద్భుతంగా, మధుర మనోజ్ఞంగా కనిపిస్తాయి. అలాంటి క్షణాలు నిత్యమై శాశ్వతమై, అనంతమై'' ``ఈ సృష్టిలో ఇంత ఆనందం ఇంత హాయి తనకు మరొకటిలేదు. రాగం, ద్వేషం, కోపం, తాపం, ఈర్ష్య, ద్వేషం అన్నీ అంతమైపోయిన క్షణాలు'' (పేజి 178) అనిర్వచనీయమైన అనుభవాన్ని చెప్పే గొప్ప ప్రయత్నం ఇది. అందుకే శ్రీ నవీన్‌లో జీవితాన్ని గురించిన ఒక తాత్తి్వక దృక్పథం సమగ్రమైంది ఉన్నది. ఇలాంటి దృక్పథం అనేది లేకపోతే ఏ రచయితా సృష్టినీ మానవ జీవితాన్ని వినూత్నంగా వ్యాఖ్యానించలేదు. ఇన్ని పాత్రల ఇంగితాన్ని స్పష్టంగా విశదీకరించలేడు. అంతస్స్రవంతి చివర జీవితాన్ని గురించి నవీన్‌ ఇలా అంటాడు. ``సృష్టి విచిత్రమైంది. సృష్టి అనంతమైంది. సృష్టి ఆద్యంతాలు లేనిది. సృష్టి ఒక ఆవిచ్ఛిన్న ప్రవాహం. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి విరామం విశ్రాంతి లేవు. అనుక్షణం సృష్టికి ప్రతిసృష్టి జరుగుతూనే ఉంటుంది. అదే జీవిత రహస్యం. అదే జీవితాని కర్థం'' సృష్టి ెుుక్క అనుస్యూతిని, నైరంతర్యాన్ని చెప్పిన ఈ రచయితకు ఈ జగత్తుమీద ఉన్న ``మమకారం'' గొప్పది. ప్రజాతంతువును త్రెంచరాదు అని చెప్పే వైదికసూక్తి దీన్నే చెప్పింది. యూరోప్‌ దేశాన్ని ముంచెత్తిన నైరాశ్యవాదాల పాలబడకుండా, వ్యవస్థ సార్థకమైన ఉనికిని సమర్థించే నవీన్‌ మనకున్న కొద్దిమంది మంచి రచయితలలో ఒకరు.

Friday, July 3, 2009

నిజమైన గురజాడ చైతన్యం

మన కవులు-౧
ఒక రచయిత చైతన్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. వ్యక్తి సంస్కారము వాతావరణము 2. సమకాలీన చైతన్యము 3. ఆ వ్యక్తి సమష్టి చైతన్యాన్ని అందుకోవడం, తన వ్యక్తిత్వంలో అన్వయించుకోవడం ఈ అంశాలలో మొదటి రెండు సాధారణంగా స్ఫురించేవేకాని, మూడో అంశం సమష్టి అవచేతనలో వ్యక్తమయ్యే స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం జరిగితేనే అది నిజమైన రూపంలో సాక్షాత్కరిస్తుంది. సమష్టి అవచేతనలోని సంస్కారం రచయిత వైయక్తిక జాగ్రత్ప్రయత్నం లేకుండానే రచనలో నిరూపితమవుతుంది. గురజాడ ప్రధానంగా 19వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించినాడు. అవి భారత దేశంలో పునరుజ్జీవనోద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న రోజులు. దానికి రెండు ముఖాలు. ఒకటి 1857 ఉద్యమం ెుుక్క కొనసాగింపులో దేశ స్వాతంత్య్రానికి సమగ్ర జాతీయ శక్తుల సాక్షాత్కారానికి జరిగిన మహాప్రయత్నం. రెండోది ఆంగ్లపాలనా సంస్కారాలవల్ల ఆత్మన్యూనతా భావంతో ప్రారంభమై ఆంగ్ల విద్యాప్రాబల్యాన్ని కోరడం, బ్రహ్మసమాజ ఉద్యమం, సంఘసంస్కారోద్యమము మొదలైన రూపాలలో వ్యక్తమైంది. మొదటి మార్గంలో శ్రీ రామకృష్ణూల, దయానందుల, వివేకానందుల ఆధ్యాత్మికోద్యమాలు సంగమించి భారతీయాత్మను పునఃదర్శించే ప్రయత్నం జరిగింది. బంకించంద్రుని రచనలు ఈ ప్రేరణలోనుంచి ఉద్గమించినవే. మొత్తం జాతిని స్వాతంత్య్ర సమరానికి సమాయత్తం చేసిన ``వందేమాతరం'' ఈ రోజుల్లో ఆవిర్భవించింది. రెండో మార్గంలో ఉద్యమం జాతి పతనస్థితి నుండి ఉద్గతిని పొందేందుకు పాశ్చాత్య విజ్ఞానము, సంస్కారమూ అవసరమని భావించడం జరిగింది. దేశీయ మత స్వరూపాన్ని కూడా క్రైస్తవ మతము మాదిరిలో రూపొందించే ప్రయత్నం జరిగింది. బ్రహ్మసమాజ స్వరూపం ఈ రూపమైందే. మైఖేల్‌ మధుసూదన్‌ దత్‌ వంటి కవులు ఈ చైతన్యంతో పరిస్పందించినవారే. ఈ రెండు మార్గాలు ఇలా ఉండగా గురజాడ మనస్సు రూపొందే రోజులలో ఆయన ఒక జమీందారీలో జీవించాడు. విజయనగరం సంస్థానంలో ఆయన ఉద్యోగి. ఆ జమీందారీ ప్రభావం ఆయన మీద ఉండటం సహజం. ఆనందగజపతి రాజుగారి ప్రోత్సాహంతో ఆయన బ్రహ్మ సమాజంలోనూ, థియోసాఫికల్‌ సొసైటీలోనూ సభ్యుడుగా చేరినట్లు చరిత్ర చెప్పుతున్నది. తన చైతన్యమూ, తన పరిసరాలు ఆయనకు జమీందారు మీద ప్రత్యయాన్ని కలిగించినవి. ఆయన కన్యాశుల్కం రాయడం ఆనంద గజపతి ప్రోత్సాహం తోనే. అట్లాగే ఆయనకు ఆ కుటుంబం మీద ఉన్న భక్తివిశ్వాసాలు నీలగిరి పాటల్లోనే స్పష్టంగా వ్యక్తమవుతవి. ఆ వాతావరణం, ఆంగ్లేయ ప్రభుత్వానికీ, తన జమీందారుకీ ఉన్న సంబంధం ఆ ప్రభుత్వం మీద అమితమైన విశ్వాసం ప్రకటించేటట్లు చేసింది. ``కన్నుగానని వస్తుతత్వము కాంచనేర్పరు లింగిరీజులు, కల్లనొల్లరు వారి విద్యల కరచి సత్యము గరపితిన్‌'' ``ఆంగిలేయుల ధర్మరాజ్యము జ్ఞానమును స్వాతంత్య్రమిచ్చుచు సంతతము వర్ధిల్లు గావుత'' ఆనాటి ఆంగ్ల విద్యావంతులు సంస్కారోద్యమపరులు అందరూ ఇలాగే ఆలోచించేవారు. వీరేశలింగంగారు కూడా రాజకీయంగా ఇలాంటి అభిప్రాయం గలవారే. 1915 దాకా గురజాడ, 1919 దాకా వీరేశలింగం జీవించిఉన్నా ఉవ్వెత్తున లేచిన జాతీయోద్యమాన్ని వాళు్ల ఏ విధంగానూ బలపరచలేదు. అందువల్లనే గురజాడ అప్పారావు దేశభక్తి గీతం కూడా దేశ స్వాతంత్య్రాన్ని కోరే గీతం కాదు. ఆంగ్లేయులు దేశంలోకి తెచ్చిన ``నాగరీకరణ'' యుగానికి స్వాగతం చెప్పడమే దీనిలోని ప్రధానాంశం. ``అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోయ్‌ దేశి సరుకుల నమ్మవలెనోయ్‌ డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్‌'' ఈ గీతం ఆంగ్లేయులు వ్యాపారం ద్వారా దేశాలను ఎట్టా కబళిస్తూ వచ్చారో అలాగే వస్తువుల ఉత్పత్తి ద్వారా, ఎగుమతిద్వారా దేశాన్ని సంపన్నం చేయవలెనని ఆయన భావించడం జరిగింది. అయినా ఆంగ్లేయ రాజ్యం దేశీయ ఉత్పత్తులను ఎగుమతులను ప్రధానంగా దెబ్బతీసిన చారిత్రక సత్యం గురజాడ దృష్టికి రాలేదు. ఇక్కడ దేశి సరుకులు పెంచవలె ననడంలో గాంధీజీ నడిపిన స్వదేశీ ఉద్యమచ్ఛాయ ఏ మాత్రమూ లేదు. ఇటు ఉగ్రవాదోద్యమాల ెుడగానీ, అటు కాంగ్రెసు వారి ఉద్యమంమీదగానీ ఆయనకు సానుభూతి లేదు. ఒక కాంగ్రెసు సభకు వెళ్లి వచ్చి దాన్ని వెక్కిరిస్తూ గేయం రాసిన సంగతి కూడ మన గుర్తుంచుకోవాలి. దేశభక్తి గీతం ప్రధానంగా వ్యక్తిగతమైన సంస్కారాన్ని మాత్రమే కాంక్షిస్తుంది. అది ఆంగ్ల సామ్రాజ్యానికి ఏ హానీ చేయదు కనుక. దేశం అంటే కేవలం ఒక భౌగోళిక పరిమితి మాత్రమే కాదనీ, ఒక జన సమూహం మాత్రమే కాదనీ కొన్ని వేల సంవత్సరాలుగా పెంపొందించుతూ వచ్చిన సంస్కృతి చైతన్యానికి ప్రాతినిధ్యం వహించే స్థల వ్యక్తి కాలాల సంగమమనేభావం గురజాడకు అంగీకార్యం కాదు. ఒకవిధంగా ``దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషూలోయ్‌'' అన్నమాట ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పుతుంది. సర్వచైతన్య భావపరమేశ్వరిగా దేశాన్ని దర్శించిన వందేమాతరం గీతాన్ని వెక్కిరించడం కూడా ఈ గీత రచనలో గూఢమైన ఉద్దేశ్యం. అందువల్లనే దేశభక్తి గీతం సంకుచితమైన సమకాలీన మానవులను మాత్రమే దేశమని నిర్దేశిస్తుంది. ``దేశాభిమానం నాకు కలదని. . .'' ఇత్యాదిగా చెప్పిన అంశం జాతీయోద్యమం ెుడల ఆయనకు సానుభూతిలేని లక్షణం స్పష్టం చేస్తుంది. ఈ గీతంలో ఎక్కడా విదేశీపాలన ఎడల నిరాసం లేదు. ఇతర స్థలాలలో ఆంగ్లేయ ప్రభుత్వం చిరకాలం నిలువవలెనని కోరడం, ఈ గీతంలో విదేశీ పరిపాలన ప్రసక్తిలేక పోవడమూ ఈ రెంటిని సరిగ్గా అంచనా వేస్తే ఈ గీతం ఒక విధంగా ప్రభుత్వ విధేయంగా ఉంటూ వారి పాలనను ప్రోత్సహించుతూ వారి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే దేశభక్తిగా కవి ప్రతిపాదించినట్లు గోచరిస్తుంది. అయినా సంస్కారం విషయంలో కూడా గురజాడది పరిమితమైన దృక్పథం మాత్రమే. వీరేశలింగం ప్రధానంగా సంఘ సంస్కారి. ఆయన తన ఈ దృక్పథంతో ఎప్పుడూ రాజీపడలేదు. గురజాడ కన్యాశుల్కంలో అన్ని పాత్రలలోనూ మానవులలోని వెలుగు చీకట్లు ప్రదర్శించాడే తప్ప సంఘ సంస్కారాంశాన్ని ప్రతిపాద్యాంశంగా చూపలేదు. ఇంకా పరిశీలిస్తే గిరీశం పాత్ర ద్వారా సంఘ సంస్కారోద్యమం ఎట్లా విఫలమైందీ నిరూపించడం ఆయన ఈ విషయంలో నిశ్చయ భావానికి వచ్చాడని చెప్పే అవకావం ఇవ్వడం లేదు. కన్యాశుల్కంలో బాల్యవివాహాన్నీ, కన్యాశుల్కాన్ని నిరసించడం కనిపిస్తుంది. విధవా వివాహ విషయంలో ధైర్యంగా పరిష్కారం చూపించలేదనే చెప్పాలి. నాటకం చివర గిరీశం టక్కరితనం నిరూపించడం, బుచ్చమ్మ వివాహం విషయంలో అను కూలమైన సూచన ఏమీ చేయకపోవడం ఇక్కడ మనం గమనించాలి. అయితే గురజాడ ప్రధానంగా ఆశించిన సంస్కారం వర్ణభేదములన్నీ మాసి పోవలెననీ, లోకమంతా ఒక యిల్లు కావలెననే అంశం. వర్ణభేదనిరాసం మధ్య యుగాలనుంచీ భక్తి ఉద్యమాలలో ప్రసరిస్తూ ఉన్న భావస్రోతస్సే. అయితే ఆధునిక జీవన పరిస్థితులు ఆ భావాన్ని ఆచరణలో సాధ్యం చేసినవి. ఈ అంశంలో ఆంగిలేయులు, ఆంగ్లేయ విద్యావంతులూ సమభావం కలిగిఉన్నారు. అయితే స్వయంసంపూర్ణమైన గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, నూతనమైన భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటమూ, తత్ఫలితంగా నాగరీకరణమూ, నూతన వృత్తులూ వర్ణభేద వికాసాన్ని అత్యంతావసరం చేశాయి. అప్పటికే వర్ణ వ్యవస్థ తన ప్రాథమిక భావాన్ని కోల్పోయి స్వరూప మాత్రంగా నిలచివున్నది. ఈ వర్ణవ్యవస్థలోని ప్రాథమికమైన భావంతో ఆయనకు పేచీలేదు. `విద్య నేర్చినవాడె విప్రుడు, వీర్య ముండినవాడు క్షత్రియుడు' అని వర్ణవ్యవస్థ ెుుక్క భావరూపాన్ని వ్యాఖ్యానించుతారు. ఈ భావచ్యుతి పొందిన వ్యవస్థ తొలగిపోవలెననే అంశం పునరుజ్జీవనోద్యమంలోని రెండు ముఖాలూ ప్రబలంగా కోరినవే. అప్పటికీ శ్రీరామకృష్ణ, దయానంద, వివేకానందులు వర్ణభేదనిరాసమునూ, అస్పృశ్యతా రాహిత్యాన్ని ప్రపంచించదమే కాకుండా తమ తమ పరిధులలో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వసుధైక కుటుంబమన్న భావం కూడా వివేకానందులు ఆమెరికాలో చేసిన ఉపన్యాసాలలో స్పష్టంగా ప్రతిపాదించిన అంశమే ఈ సన్నివేశంవల్ల గురజాడలో ముత్యాలసరాలు రాసేనాటికి ఈ రెండు భావాలూ గాఢంగా వ్యక్తం కావడానికి అవకాశం కలిగించినట్లు భావించవచ్చు. `ముత్యాలసరా'లన్న ఖండికలోని `జీవితేశ్వరి' ద్వారా గురజాడనాటి సంస్కారోద్యమానికి ప్రతిపక్షాన్ని కూడ మృదువుగా సమకూర్చినట్లు తోస్తుంది. ``కలసి మెసలిన యంత మాత్రనె కలగబోదీ యైకమత్యము'' ఇది ఆమె మాట. కేవలం పంక్తి భోజనాలు చేయడం ద్వారా ఈ మార్పు రాదు. సామాజిక పరిస్థితులలో సంస్కారంలో మార్పులు రావాలి. ఈనాటికీ మన ప్రవృత్తిని ప్రశ్నిస్తున్న ప్రశ్న యిది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కలసి మెలగుతూ వున్నా దేవాలయ ప్రవేశం కలిగించినా ముప్పయ్యా రేండ్ల తరువాత కూడా ఈ కులపు వ్రేళు్ల ఇంకా బలపడుతూ వుండటం మనం చూస్తూనే వున్నాము. ఈ ప్రయత్నాలలో ప్రధానమైంది మానసిక సంస్కారం. అది కలిగించే ప్రయత్నం భక్తి ఉద్యమాలు చేశాయి. వర్గాలలో ఉన్న న్యూనతాధిక్య భావాలమీద దెబ్బతీశాయి. సమైక్యానికి పునాది వేశాయి. సంస్కారోద్యమాలు రాజకీయాల నీడలు పడినాక వాటికి ప్రచారమూల్యం పెరిగింది. భావ పరివర్తన వెనుకబడింది. ఈ నాగరిక వల్ల వచ్చిన మరో మార్పు సమష్టి కుటుంబ విచ్ఛేదం. ఈ అంశం కూడా ఈ గీతంలోనే ``జీవితేశ్వరి'' ప్రశ్నించింది. అయితే గురజాడ రచనల్లో కాల్పనికోద్యమ ప్రభావం కూడా బలంగా కనిపిస్తుంది. ఆయన రచనల్లో ప్రేమ ప్రాధాన్యం స్పష్టంగా పేర్కొనబడింది. ``దేశమనిెుడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్‌'' అన్నచోట ``ప్రేమ కలుగక బ్రతుకు చీకటి మరులు ప్రేమని మది తలంచకు'' అంటాడు. ``కాసులు'' అన్న గీతంలో వివాహవ్యవస్థలో ప్రేమ ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని సృష్టీకరిస్తాడు. ``మగడు వేల్పన పాతమాటది ప్రాణ మిత్రుడ నీకు'' అని స్త్రీ పురుషవ్యవస్థలో ఆ యిరువురి సమ ప్రాధాన్యాన్ని వివరిస్తాడు. సతుల సౌరను కమలవనమునకు పతుల ప్రేమయే వే వెలుగు'' అంటాడు. ఈ వాక్యంలోని రూపకం స్త్రీ పురుషూల సంబంధాలలోని సామరస్యాన్ని ప్రాధాన్య క్రమాన్నీ సూచిస్తుంది. ఈ గీతంలో ``అమలిన శృంగార'' భావబీజాలు నిక్షిప్తాలై ఉన్నాయి. గురజాడ ముందు పేర్కొన్నట్లుగా బ్రహ్మ సమాజంలోను, దివ్యజ్ఞాన సమాజం లోనూ సభ్యుడుగా ఉన్నవాడే. ఆయన మతవిషయాలలో ఆధునికోద్యమాల ప్రభావం ఉన్నవాడు. కాని నాస్తికుడు కాడు. ``మనిషి'' అన్న గేయంలో విగ్రహారాధనకు అంటే బాహ్యాచార ఆడంబరాలకు ప్రాధాన్యం యిచ్చి మాధవసేవకు ప్రాధాన్యం యివ్వని మౌఢ్యాన్ని తిరస్కరిస్తాడు. మధ్య యుగాలలోని భక్తి ఉద్యమాలలోని ఈ భావం ఆధునిక యుగంలో శ్రీ రామకృష్ణాదుల ముఖాన ప్రస్ఫుటమైంది. ఈశ్వరుడు సర్వసంస్థుడు. ఆయన ఉనికిని రాయి రప్పలకూ, కొండ కోనలకూ పరిమితం చేయటం తప్పు. భక్తులకు ఈశ్వరుడు కన్ను దెరచిన కానబడుతాడు. ఈ కన్ను దివ్యచక్షుస్సు. ఎరిగి కోరిన ముక్తిని యిస్తాడు. ఇక్కడి ఎరుక జ్ఞానము, కోరిన భక్తితో చేసే సమర్పణము. అనంత కరుణామయుడైన ఆ ప్రభువు కరిగి భక్తవశుడై ముక్తినిస్తాడు. ఈశ్వరభక్తి సంబంధించిన సంప్రదాయ రూపకాలు నీలగిరి పాటల్లో స్పష్టంగా గోచరిస్తవి. ఉమాపతి యర్చన అన్న గీతంలో ఉదకమండలం ఉమాపతి అర్చన ెుట్లా కోటి గుణితమైన పుణ్యఫల మిస్తుందో సూచిస్తాడు. తెలమబ్బులలో ఉదక మండలమే హిమాలయముగా గోచరిస్తుంది. అక్కడి ప్రకృతి అంతా ఈశ్వరార్చనకు సామగ్రి అయింది. ఆశ్రీతవరదుడైన అంబికారమణుడు రాణిని రక్షించవలెనని ఈ గీతం తాత్పర్యం. `చిత్తరువుని చూడ' అన్న గీతంలో విష్ణూప్రసక్తి కూడా వస్తుంది. గురజాడ రచనల్లో ``కన్యక'' ``పూర్ణమ్మ'' రెండూ గొప్ప గీతాలు. వీటిలోనూ, కన్యా శుల్కంలోనూ అసలు వివాహం ప్రధానమైన అంశం. ఆ విషయం కవిని ోభ పెట్టినట్లుగా గోచరిస్తుంది. ఈ రెండు గీతాలలో దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం ప్రాగ్రూపం (ఆర్కిటైప్‌) పని చేసినట్లుగా గోచరిస్తుంది. కన్యకలో రాజు దక్షుని స్థానంలో ధర్మస్వరూపాన్ని మరచి అహంకరించి మైమరచిన స్థితిలో గోచరిస్తాడు. అందుకే దక్షయజ్ఞంలో దక్షుని వలె రాజు నశిస్తాడు. పట్నమేలే రాజు పోెును, మట్టి కలసెను కోట పేటలు పదం పద్యం పట్టి నిలిపెను కీర్తు లపకీర్తుల్‌'' అని పూర్తి చేస్తాడు. అతని కోట కూలి నక్కల కాటపట్టయింది. అందుకే కన్యక రాజు ఎదురు పడ్డప్పుడు ``ఇంటిదైవం వీరభద్రుని దేవళానికి పోయి యిప్పుడె పళ్ళెరం సాగించి వత్తును'' అంటుంది. వీరభద్రుని పళ్ళెరం అనేది శైవుల యిళ్ళలో శుభాశుభ కార్యాలలో జరిపే ఒక కర్మకాండ. ఈ కర్మలో వీరభద్రుడు విజృంభించి దక్షునియజ్ఞాన్ని విధ్వంసం చేసిన వృత్తాంతం గీత నృత్యాలలో ఖడ్గఖేలనంతో స్మరింపబడుతుంది. ఈ లక్షణం వల్ల కన్యకకు సతీదేవితో సామ్యం లభించింది. పూర్ణమ్మ కూడ ఇలాంటి ఇతివృత్తమే ఈ కథలో పూర్ణమ్మ బాల్యం నుంచీ దుర్గ భక్తురాలు. కన్యక కథలోనూ దీనిలోనూ దుర్గాదేవి ప్రసక్తి కనిపిస్తుంది. గురజాడకూ ``దుర్గా''దేవికీ ఉన్న సంబంధం ఇంకా లోతుగా పరిశీలించదగింది. ఈ గీతంలో కవికి దుర్గోపాసన విషయంలో ఆసక్తి ఉన్న విషయం స్పష్టంగా గోచరిస్తుంది. గుడి పరిసరాల వర్ణన ఆమె దుర్గమత్వాన్ని (కొండల, కోనల, కొలనుల ప్రసక్తి వలన) సూచిస్తున్నది. ఆమె బంగరు దుర్గ. శ్రీ సూక్తంలో చెప్పబడిన ``హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం'' అన్న వర్ణన ెుుక్క సారమంతా ఈ బంగరు దుర్గ అన్నమాట వ్యక్తం చేస్తుంది. దుర్గ ెుట్లా హిరణ్మయో పూర్ణమ్మ కూడా పుత్తడిబొమ్మ. ఈ వర్ణన భక్తునికి భగవంతుడికి కలిగే అభేదాన్ని వ్యక్తం చేస్తున్నది. దీన్నే కంఠోక్తిగా పూర్ణమ్మ మరణించి నప్పుడు ``కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేనిపసల్‌, హంసల చేరెను నడకలబెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మా'' అని వర్ణించాడు. పంచభూతాలలో తత్తదంశలు విలీనం కాగా చివరకు ఆమె ఆత్మ ఆమె ఆరాధ్యయైన దుర్గలో ఐక్యాన్ని పొందింది. ఉపాసనా మార్గం విషయంలో కూడా దీనిలో కొన్ని అంశాలు కనిపిస్తుంది. ఏ ఏ వేళల పూచే పూవులు ఆయా ఋతువుల పండే ఫలాలు అన్నీ దుర్గకు ఆమె అర్పించేది. ప్రకృతి, కాలము రెంటి సంయోజనంవల్ల కలిగే చైతన్యస్పందం అంతా ఈశ్వరార్పితం కావలసిందేనని తాత్పర్యం. చివరకు దుర్గకు తన్నుతాను సమర్పణ చేసుకొన్న విధానికి ప్రతీకగా ఆమె మెడలో హారములమరెను'' అంటాడు కవి. ఈ కావ్యంలో అభివ్యక్తమయ్యే పూర్ణమ్మ దివ్యప్రకృతికి సూచనగా ఆమె మృతిని వాచ్యం చేయలేదు. ఒక విధంగా ఆమె పేరులో ఉన్న పూర్ణశబ్దం కూడా ఆద్యాదేవికి ప్రాగ్రూపంగా గూఢార్థ స్ఫోరకమేమో విచారించవలసి ఉన్నది. ఈ విధంగా విచారణ చేసినప్పుడు గురజాడ చైతన్యంలో ఈ క్రింది అంశాలు ప్రధానంగా కానవస్తవి.
1. గురజాడ ప్రధానంగా సంస్కారోద్యమంలో ప్రభావితుడైనవాడు అయినా ఆ ఉద్యమాలలోని పరిమితులను గ్రహించినవాడు. ఈ రంగంలో మానసిక సంస్కారానికి ప్రాధాన్యం యిచ్చేవాడు.
2. రాజకీయంగా ఆంగ్లేయ రాజ్యాన్ని అభిమానించేవాడు, ఆంగ్లేయుల సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని (కల్చరర్‌ ఇంపీరియలిజం) ఆహ్వానించే వాడు. ఆ సామ్రాజ్యం వల్ల దేశీయ గ్రామవ్యవస్థ ఛిన్నభిన్నమై వృత్తులు కోల్పోయిన ప్రజలు ఎట్లా ోభించిందీ గ్రహించినవాడు కాదు. జాతీయోద్యమానికి అనుకూలుడు కాదు.
3. ఆస్తికుడు. మత విషయాలలో నూతనోద్యమాలలోని సమన్వయ దృక్పథాన్ని అనుసరించినవాడు.
4. దేవీ ఉపాసనామార్గంతో తాదాత్మ్యం కలిగినవాడు.

Thursday, July 2, 2009

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 1

ఈనాటి చాలామంది తెలుగు కవిత్వ విమర్శకులకు, పరిశీలకులకు కవిత్వాన్ని ఒకే ప్రవాహంగా ధోరణిగా చూడటం అలవాటు. మిగతా ధోరణులు, కావ్యరచనా సంప్రదాయాలు ఎంతటి బలమైనవైనా వాటిని ఉపేక్షించి, ్ర పాధాన్యం తగ్గించి, అవి అసలే కవిత్వంకాదన్న ముద్రవేయటం, ఈ ధోరణిలో ఒక ముఖ్యమైన అంశం.
స్వాతంత్య్రం వచ్చేనాటికి అవిచ్ఛిన్నంగా ఎప్పటికప్పుడు నూత్నచైతన్యాన్ని తనలో సంగమింప చేసుకుంటూ జాతీయభావం దేశీయత మానవీయ సంస్కృతి మూలాంశాలుగా నవ్య సంప్రదాయ ధోరణి కానవస్తున్నది. అప్పటికి ప్రబలంగా ఉన్న ప్రగతివాదం రాజకీయోత్థాన పతనాల కారణంగా 1955 నాటికి కుప్పకూలింది. శిష్‌ట్లా మొదలైన కవుల పరంపర ప్రయోగవాద ధోరణి ప్రగతివాదంలోని కొన్ని అంశాలను సంగమింపజేసుకుంటూ యూరోపీయ అస్తిత్త్వవాద ధోరణులను సమాశ్లేషిస్తూ, ఫ్రెంచికవుల సింబలిస్టు ధోరణులను ఆహ్వానిస్తూ ఒక నవ్య కవితా ధోరణికి స్వాగతం చెప్పుతున్నది. అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో ఈ ఉద్యమం నిశ్శబ్దంగానే `కవిత' పత్రిక ద్వారా బయటపడుతున్నది. అజంతా, వరద్ట, రాజశేఖర్‌ మొదలైన కవులు ఈ పద్ధతిని నడిపించేతీరు కనబడుతున్నది. అనుకోకుండా ఇంకా ప్రగతివాద పరివేషం పూర్తిగా వదలని కుందుర్తి వీరిలోనే ఉన్నారు. శ్రీశ్రీ ఆరుద్రలు ఈ ఆశ్రమంలోనికి చేరుకున్నారు. `సాహిత్యోపనిషత్తు'లో తమ పరివర్తనను స్పష్టంగా చాటుకున్నారు.
అప్పుడే ఆధునిక ధోరణిలో మేల్కొన్న తెలంగాణం. ప్రగతివాదంనుంచి నడచివచ్చి తన త్రోవన వెదుక్కొంటున్నది. దాశరథి `మహాంధ్రోదయం'లో తెలుగు సమాజాన్ని దాని మహోజ్జ్వల వైభవాన్ని పద్యరచనా వైదగ్ధా్యన్ని స్వాయత్తంచేసుకొని విజృంభిస్తున్నాడు.
తెలగాణము్మ తమః కవాటముల బందీయైన నిశ్శబ్దరా
త్రులలో మేల్కొని; కోటి తము్మలను మేల్కొల్పన్‌ మహోల్కాసము
జ్జ్వల దగ్నిప్రభలీను గీతముల నభ్రమ్మంటగా పాడి తె
ల్గులలో వెల్గులు నాటినట్టి కవితా లోక ప్రభా నీరధీ
(జలపాతం సి. నారాయణరెడ్డి)
అతని ఉద్విగ్నజాతీయ చైతన్యంలో పారశీక కవితా మాధుర్యమూ కాళిదాసాదుల కావ్యలావణ్యమూ, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల కవిత్వ చైతన్యమూ సంగమించి నూతన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపచేశాయి. ఈ జలపాతంలో తడుస్తూ వచ్చిన కవి నారాయణరెడ్డి దాశరథి మార్గంలోనే జాతీయ చైతన్యం మూలచైతన్యంగా ప్రజాస్వామ్య సంస్కృతి నేపథ్యంగా నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలు రచిస్తున్నాడు.
క్రమంగా `దాశరథి సంప్రదాయం' కవిత్వంలో రూపాన్ని పట్టించుకోలేదు. పద్యమూ, గేయమూ, వచన పద్యమూ మూడూ ఈ ధోరణిలోని కవులు వాడుకున్నారు. అయితే ఈ స్వేచ్ఛ శిల్ప విషయంలో విశృంఖలతకు అవకాశమీయదు.
ఆరుద్ర ప్రధానంగా ప్రయోగవాది. `త్వమేవాహం'లో తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి ఉందని ఆయనే వ్యాఖ్యానించుకోవలసివచ్చింది. చెరిషించు, పెరిషించు మొదలైన ప్రయోగాలు దానిలోనే నిద్రపోయాయి. `త్వమేవాహం' తరువాత ఆరుద్ర ఏ భావబిందువుు దగ్గరా నిలువలేదు. ప్రయోగాలుగానే సాగింది అతని కవితాయాత్ర.
అబ్బూరి ఛాయాదేవి `కవిత' ప్రచురణ రెండు సంచికలతో ఆగింది. శ్రీశ్రీ, ఆరుద్ర, వరదలు `మేమే' రాసినప్పుడు ఒక ఉన్మత్త ధోరణి తొంగిచూచింది. ఆశ్రయం కోల్పోయిన కుందుర్తి క్రమంగా వచనకవిత్వ ఉద్యమం పేరున రూపవాదాన్ని ఆశ్రయించ వలసివచ్చింది. అజంతా బింబసంయోజనలు చేసుకుంటూ ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు.
వచన చ్ఛందస్సులో జాతీయ ప్రజాస్వామ్యతత్త్వం ఆధారంగా నిరంతర రచన కొనసాగిస్తూ సాగిపోతున్నాడు మాదిరాజు రంగారావు. సుప్రసన్న పద్యము, గేయము, వచనపద్యమూ సాధన చేస్తూనే కవితారంగంలో సామాజిక ధోరణులతో బాటు ఆధ్యాత్మిక అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీ అరవిందుల తత్త్వచింతన ఆధారంగా ఈ భూమినే దుఃఖరహితంగా పునారచించవలసిన ఆదర్శాన్ని కవిత్వంలో కేంద్రంగా చేసుకొని తన అన్వేషణ ప్రారంభమయింది. ప్రజాస్వామ్యం జాతీయ చైతన్యము, వ్యక్తి సర్వతోముఖ వికాసము, దివ్యజీవన సాక్షాత్కారము ఇవన్నీ చేతనావర్తానికి కారణము లయ్యాయి. ఉద్యమాల హోరుగాలి ఒత్తిడిలో దీని వ్యక్తిత్వాన్ని ప్రధాన ధర్మాన్ని మరచిపోయిన తెలుగు విమర్శ ప్రపంచం ఈ సమగ్ర సమన్విత దృక్పథాన్ని అర్థం చేసుకోవటంలో వెనుక ముందాడింది. దేశీయతత్త్వం మూలాలను వెదకిపట్టుకొన్న ఈ ధోరణి నెమ్మది నెమ్మదిగా `సాహిత్య భూమి'లో వ్రేళూ్లనుకోవటం జరుగుతూ వచ్చింది. సాహిత్య సౌందర్య దర్ళనం భారతీయ జీవన మూల్యాలతో మళ్లీ ముడి వేసుకున్నది. ప్రగతివాదం వస్తుసంవరణంలో చేసిన నియంత్రణ క్రమంగా అదృశ్యమయింది. విద్వాన్‌ విశ్వం 1955 ప్రాంతాలలో రాయలసీమ దారుణమైన కరువుదృశ్యాన్ని జీవనాన్ని `పెన్నేటి పాట'లో పద్యంగా గేయంగా చిత్రించి దాశరథి మార్గాన్ని తేజస్వంతం చేశాడు. (ఈ గ్రంథాన్ని మొదట తెలంగాణా రచయితల సంఘం ప్రచురించింది).
అరవైల నాటికి సాహిత్యరంగంలో ప్రబలంగా ఉన్న ధోరణులు మూడు:
1. నవ్యసంప్రదాయము
2. కుందుర్తి నిర్వహిస్తున్న వచన కవిత్వవాదమనే రూపవాదము
3. దాశరథి కవితాసంప్రదాయము
ఇక్కడ దాశరథి కవితా సంప్రదాయమంటే 1) ప్రగతివాదం విధించిన వస్తు పరిమితులకు లొంగకుండా వుండేది. 2) జాతీయ సంస్కృతిలోని మేలి సంప్రదాయాలను స్వాయత్తం చేసుకునేది 3) విశ్వజనీన దృక్పథం కలది. 4) అభివ్యక్తి విషయంలో రూపవిషయంలో ఏ పరిమితులకూ లొంగనిది 5) మానవుణ్ణి భౌతిక, సాంస్కృతిక ఆధ్యాత్మిక త్రిపుటిగా భావించేది 6) ప్రజాస్వామ్య దృక్పథం మీద అచంచల విశ్వాసంకలది 7) పీడితులు, తాడితులు లేని సర్వశ్రేయస్సమాజంకోసం భావించేది.
ఒక విధంగా తెలంగాణాలో స్వాతంత్య్రానంతరం తెలుగుకవితా ధోరణి ఈ ప్రభావ పరిధిలోనే ప్రవహించింది. నారాయణరెడ్డి, మాదిరాజు రంగారావు, బాపురెడ్డి, సంపత్కుమార, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి, కవిరాజమూర్తి యీ వ్యాసకర్తా మొదలైన వాళ్లందరూ ఇంచుమించుగా ఈ విస్తృత కవితా భూమికకు చెందినవారే. ఇంకా వీరికి ప్రేరణ యిచ్చిన వాళ్లల్లో కాళోజీ, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, పి.వి. నరసింహరావులను ప్రత్యేకంగా పేర్కొనాలి.
పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్కీ్సయ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమూ్యనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత' అన్నగేయం కమూ్యనిష్టూల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి' (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు.
నీవు నేనూ కలసి, నేను నీవూ కలసి భూమిదేవికి పూలువేద్దాము
పుడమితల్లికి పూజచేద్దాము
వీరాధివీరులౌ శ్రీరామచంద్రులన
కారుణిక మూర్తులౌ శాక్యగౌతములను
జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను
కన్నతల్లికి హారతిద్దాము
కన్నీ కడిగి పూజిద్దాము
నీవు పుట్టిన నేల, నేను పుట్టిననేల . . . .
పాలునీరుగ మనము కలసి పోయిననేల
కలసి పోయిన మనము కరగిపోయిననేల
జంట నాగళ్లతో బీళు్ల దున్నిన నేల
నీళు్ల గొట్టిన నేల కాపుగాచిన నేల
రామరాజ్యపు చల్వపందిరెత్తిన నేల
గాంధిపుట్టిన భూమి, తిలకు పుట్టిన భూమి
శాంతి ఆయుధముతో స్వాతంత్య్రపథములో
సామ్రాజ్యరాక్షసిని సంహరించిన భూమి
ఇంటింట జాతీయ జెండ లెగసిన భూమి
కోటొక్క ప్రజలకు తిండి బెట్టేనేల
చల్లచల్లని శాంతి నీడ నిచ్చే నేల
మెల్లమెల్లగ మనలపెంచి సాకేనేల
నిండ నూరేండ్లయి కండ్లుమూసేటపుడు
పట్టుపాన్పులాంటి గుండెపై జోకొట్టి
జోలపాడే నేల, నిద్రబుచ్చేనేల (పే. 42,43)
తమ ఉద్యమం రోజుల్లో `దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషూలోయ్‌' అన్న గేయాన్ని `వందేమాతరం' గేయానికి ప్రతిద్వంద్విగా, వలస వాదులకు అనుకూలంగా కమూ్యనిస్టులు వాడుకున్నారు. ఈ గేయం సంస్కరణోద్యమాన్ని బలపరచేది. స్వాతంత్య్రోద్యమానికి అననుకూలమైంది. స్వాతంత్య్రోద్యమంలో భారతదేశం చరిత్ర సంస్కృతి సాధించిన ఔన్నత్యాలు ప్రేరకాలు. దేశం ఒకవిధంగా జగన్మాతృ రూపమైంది. గురజాడ ఆంగిలేయుల ధర్మరాజ్యాన్ని ప్రశంసించినవాడు. గతమును చూచేప్పుడు వాళ్ల దృష్టితోనే చూచి, `మంచిగతమున కొంచెమేనోయ్‌' అన్నవాడు. పాములపర్తి సదాశివరావు రచన కమూ్యనిస్టులలో రావలసిన భావపరిణామాన్ని దేశీయతా దృక్పథాన్ని ఎత్తిచూపింది. గురజాడ వంటివారి దేశాన్నిగురించిన ఆలోచనలోని రిక్తతను, శూన్యత్వాన్ని బట్టబయలు చేసింది.
ఈ నడుమ దిగంబరకవులు హఠాత్తుగా ఒక నాలుగైదు సంవత్సరాలు చెలరేగటం జరిగింది. అరాచకత్వం, మొరటుతనం, ప్రజాస్వామ్య వ్యవస్థల వైఫల్యం వల్ల కలిగిన నిస్పృహ, ఎక్కడో బలంగా స్రై్టక్‌ చేయాలనే ధోరణి, బూతు పదాల ప్రయోగం ఇవన్నీ వీరి ఆయుధాలు. గిన్‌‌సబర్‌‌గ మొదలైన అమెరికన్‌ కవుల ధోరణులు వీరికి బలాన్ని యిచ్చాయి. అయితే క్రమంగా ఈ ఉద్యమం విరసంలో కలసిపోయింది. పలుచ పలుచగా అటూ ఇటూ చెదరిపోయింది.

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 2

1970 వచ్చేప్పటికి అరసం ప్రగతివాద కవిత్వం మార్కి్సస్టు తత్తా్వనికి కట్టుబడవలసిన అవసరంలేదని నొక్కి చెప్పింది. మరొకవైపు తీవ్ర వామపక్ష భావ సంచలనంలో ఊగిపోతున్న సిి. విజయలక్ష్మి విషాదభారతం, `తిరుగబడు కవులు' దీనితో విభేదించారు.
ఇన్నేళు్లగా సాగుతున్న వస్తుపరచర్చాధోరణి వల్ల కవిత్వాంశానికి ప్రాధాన్యం తగ్గుతున్నదేమో నన్న సంశయం చాలామందికి కలిగింది. కవితారచనకు కవిత్వ స్పృహ వుండటం అత్యవసరం అనేది ఒక తీవ్రభావమై కవిత్వజగత్తు అట్టడుగుభాగాన్ని స్పందింపజేయటం మొదలైంది. 1971లో అఖిలభారత తెలుగు రచయితల ఐదవ మహాసభలో కవి సమ్మేళనం అధ్యక్ష పీఠంనుంచి బోయిభీమన్న ఈ ఆవేదనకు అక్షర రూపం కల్పించాడు. `నీవు నిజంగా కవివే అయితే/నిజంగా కవిత్వం వ్రాయి/నినాదాలు మానెయ్యి (26) భూమినుంచి పుట్టేది కవిత్వం/కార్ఖానాల నుంచి పుట్టేది పాండిత్యం / ప్లాస్టిక్‌ పువు్వల్ని చూచి భ్రమసిపోకు/ఎంత చిన్నదైనా నీ తోపని మానకు (33) సాహిత్యానికి దేశకాలాలు లేవు/సరస్వతి నిత్యయౌవని సనాతని/ఆనాడు కంచి పట్టు చీరలు కట్టింది/ఈనాడు నైలాన్‌ సిల్కువోణీలు వేస్తున్నది (43) సమాజానికి రసభావ సౌందర్యదాతవు/సమైక్యానికి సాక్షాత్‌ పరమేశ్వరుడవు (48) జీవితాన్ని నలుముఖాలుగా అనుభవించు/అనుభవం నుంచి ఆనందమధువును వెలయించు (53).
బోయి భీమన్న ఆలోచనలు అలంకార శాస్త్ర సంప్రదాయాన్ని పునఃస్థాపించాయి. మమ్మటుడ చెప్పిన, `నియతికృత నియమ రహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రాం నవరసరుచిరాం,' అన్న వాక్యాలకు స్థూలమైన వ్యాఖ్యానాలు. తన నాటికి కవిత్వంలోనికి ప్రవేశించిన బింబసంయోజనంలోని సంక్లిష్టతను, ప్రతీకల గందరగోళాన్నీ విమర్శిస్తూ `వాల్మీకిశ్లోకం నీ పద్యంకంటే సరళం / కాళిదాసు డెందం నీ కందం కంటే సరసం' అని నూతనాభివ్యక్తి పేరున ఎంతటి అభివ్యక్తుల కీకారణ్యంలోనికి ప్రవేశిస్తున్నామో వివరిస్తున్నారు.
విరసం ఏర్పడటానికి ముందే కవితారంగంలో ప్రకాశించిన బైరాగి, తిలక్‌లను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. `తిలక్‌ అటు భావకవి ఇటు అభ్యుదయ కవి కాడు. అందుకే ఆ రెండు సంప్రదాయాలలోని కొన్ని లక్షణాలను తనలో సంగమింప చేసుకొని తానొక తీర్థప్రాయుడయ్యాడు' (కె.వి.ఆర్‌. `ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర పే. 221) నూతిలో గొంతుకల్లో బైరాగి ఆధునిక నాగరికతా వైఫల్యాలను, అది ఆత్యంతికంగా కలిగించిన వైక్లబ్యాన్ని చిత్రించాడు.
దాశరథికీ తిలక్‌కూ కొన్ని పోలికలు ఉన్నయ్‌. విస్తృతమైన సమాజమూ, కవితా భూమిక ఇద్దరికీ సమానం. దాశరథి ప్రగతివాదం నుంచి బయటకు వచ్చి కొనసాగినట్లే, తిలక్‌ ప్రగతివాదపు దారినుంచి నిష్ర్కమించి వచ్చాడు. `అమృతం కురిసిన రాత్రి'లో తిలక్‌ ఎంత ఎత్తు ఎదిగినా `పునర్నవం'లో దాశరథి అందుకున్న శిఖరాలకు చేరువ కూడా కాలేకపోయాడు.
`1970లలో అటు విరసం రూపుదిద్దుకుంటున్న తరుణంలోనే సరికొత్త కవిత్వానికి పునాదులు పడ్డట్లు మనం గ్రహించవచ్చు. మే 1969లో సంకలితమైన `చితిచింత', మార్చి1972లో వచ్చిన `చెట్టు నా ఆదర్శం', 1974లో వెలువడిన శేషేంద్ర `మండే సూర్యుడు' అజంతా వెలువరిస్తున్న కవితలు ఈ కొత్త కవిత్వానికి రూపురేఖలు దిద్దినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.' (కవిత్వం ఒక ఆత్మఘోష, సుమనశ్రీ పే. 44). అటు విరసం మార్గం సాగుతూ వుండగానే బలంగా మరొక మార్గం కవిత్వానుభవం ప్రధానంగా సాగిన అంశాన్ని మనం గుర్తించుకోవచ్చు.
ఈ అంతర్ముఖ స్రవంతికి దోహదంగా వరంగల్లుకు సమీపంలో తాటికాయలలో నిశ్శబ్దంగా తన ఊహలకు రూపమిస్తూ వస్తున్నాడు పొట్లపల్లి రామారావు. `చుక్కలు' 60లలో తొలిసారి అచ్చయినా విస్తృత ముద్రణం 1974లో వచ్చింది. రామారావు జీవితాన్ని అన్ని స్తరాలనుంచి పరిశీలించి చేసిన కవితామయమైన రచనా విశేషమిది. వచనకవిత్వం తాత్తి్వకంగా రూపుదిద్దుకోబోతున్న భవిష్యత్తును ఈ రచన సూచించినట్లు సువ్యక్తమయింది.
అంతర్ముఖ బహిర్ముఖాలుగా రెండు ధోరణులూ వేరువేరుగా సాగుతూవున్నా నడుమ ఒక నిశ్శబ్దమైన ధోరణి సాగివస్తున్నది. దాని కేతనం దాశరథి పునర్నవంలో ఎత్తాడు. యుగసంకేతంలో (1969) మాదిరాజు రంగారావు `మతాల విచ్చుకత్తుల మెరుపులలో బ్రతుకును వెలిగించలేను. ఇజాల చిక్కుటుచ్చుల తలపులతో బ్రతుకును బంధించలేను' (52) `నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయం, రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం (15) ముక్తకాలు (1970)లో అని వాఖ్యానిస్తున్నారు. విమర్శకుల దృష్టి అంతగా పడలేదు కాని 1971లోనే అనాదినుంచి నేటివరకు మానవుని జీవితంలోని ఉత్థాన పతనాలను చిత్రించిన మహాకావ్యం `మానవీయం' రచించాడు.
అత్యంతమైన ప్రతిభాశక్తితో కవిత్వంలో శబ్దాలను శిల్పాలుగా తీర్చిన ఒక తనదైన `దర్శనం' గల కవి అరిపిరాల విశ్వం. `రేపటి స్వర్గం', `కాలంగీస్తున్న గీతలు' `హళేబీడు' మొదలైన సంకలనాలలో ఈయన ఎంతో శక్తిశాలిగా కనిపిస్తాడు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే `విశ్వం' సృష్టించే కావ్యభాష శేషేంద్ర సృష్టించిన కావ్యభాషతో బుజాలు ఒరిపిడి పెడుతూ వుంటుంది. `అంతర్గోళాలు' `చిరంతన' రచనలతో ఒక విలక్షణమైన కవితాముద్ర వేసికొన్న కవి దుర్గానంద్‌. గోపాలచక్రవర్తి, శీలా వీర్రాజు. మిరియాల రామకృష్ణ, పరిగి రాధాకృష్ణ, పణతుల రామచంద్రయ్య మొదలైన కవులు ఈ సంధి కాలంలోని వాళ్లే.
1955నుంచి 1970 వరకు కొత్త కవిత్వం ఏదో వెతుక్కున్నట్లు కొనసాగింది. ఒక స్పష్టమైన లక్షణం జాతీయ ప్రజాస్వామ్యంపైన అచంచలమైన విశ్వాసం. వదులుగానైనా కొందరు సామ్యవాదాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు ఏకాంత రహస్య గుహాసీమల్లోని వెలుగులకోసం రహస్యవాదాన్ని ఆశ్రయించినవాళు్ల. `నగరంలో వాన', `అముద్రిత కావ్యం' రచనల దగ్గరకొచ్చేప్పటికి కుందుర్తి కూడా సదసత్సంశయంలో పడి సత్తువైపు ప్రయాణిస్తున్నాడు.
1976లో ఆర్‌.ఎస్‌. సుదర్శనం రచించిన `నిశాంతం' వెలువడింది. `నిశాంతం' మార్మిక కవితా ధోరణికి స్పష్టమైన అభివ్యక్తినిచ్చింది.
ఎన్ని జన్మలు పూవులో నెన్నిరేకు
లెన్ని మధురవాసనలు నా హృదయమందె
యుగయుగము్మల కాలము్మ నొదిగి ెుుదిగి
పుచ్ఛమును మ్రింగబోవు పామువలె నుండు
సృష్టి అనుస్యూతిని జన్మపరంపరల అనంత చక్రాకారాన్ని సూచిస్తున్నదీ పద్యం. త్టోను మ్రింగే పాము అనడంలో జన్మమృత్యువులనే బిందువులు ఒకేచోట సంగమించటం అనే జీవన రహస్యం ఇక్కడ వ్యక్తమవుతున్నది.
`ఈనాటి సమాజంలో ఉన్న పరిస్థితులకు ప్రతిరూపంగా కవిత్వమూ వివిధ భావధోరణులతో కనిపిస్తున్నది. రామాయణ కల్పవృక్షం పూర్తిఐంది. మహాసర్గ అవతరించింది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి ప్రభవించాయి. వందేమాతరం వినిపించింది. విశ్వంభర ఉదయించింది. దిగంబరంచేతనావర్తంవిప్లవం ఇట్లా అనేకం భావావేశం లక్ష్యశుద్దితో తెలుగులో కవిత్వం స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నది. జాతీయభావన, సంస్కరణం, పరివర్తనం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, విప్లవం, సంప్రదాయ పరంపరా పార్వా్శలతో గోచరిస్తుంది. వీరిలో ఒక్కొక్క రచయిత వ్యక్తిత్వంలో ఒక్కొక్కటి ఆధిక్యం వహిస్తూ లేదా కొన్నింటి కలయికచేత విశిష్టరూపాన్ని పొందుతూ పరిశీలనలో గోచరిస్తాయి.' (ఆధునిక కవిత్వం సమాలోచన. మాదిరాజు రంగారావు పే.45) ఈ పరిణతికి ఆధారభూతంగా ఒక సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగివస్తున్నదని పేర్కొంటు న్నాడు విమర్శకుడు. ``ఏ దేశమైనా ఏ సాహిత్యమైనా పరంపరగా వచ్చే సంస్కృతీ భావన ఒకటి వుంది. ఈనాటి జీవనవ్యవస్థలో నిరసనకు గురైన దురాచారాలు చెల్లని నియమాలు అహేతుకమైన ధోరణులు తీసివేస్తే సారభూతమైందీ సంస్కృతీ ప్రస్థానంలో శిఖరంగా నిలిచే సంప్రదాయ పరంపర ఉంది. ఇది ప్రతి భాషా సాహిత్యానికి వర్తిస్తుంది. (ఇదే పే.44) ఈ మాదిరాజు రంగారావు అభిప్రాయంలో ఒక సంతులనం ఉన్నది.

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 3

ఈ పరిస్థితిలో తెలుగు కవిత్వంలో ఉదయించిన నూతన ప్రభాతం ``మండే సూర్యుడు'' ఆవిర్భవించడంతో సంభవించింది. ``విరసం'' ధోరణులు క్రమంగా సాహిత్యరంగానికి దూరమై రాజకీయోద్యమంతో తాదాత్మా్యన్ని పొందటం ఒకవైపు జరిగింది. రాజకీయ స్పృహ ప్రధానాంశమైంది. నియంత్రణ పెరిగి వస్తురూపముల విషయంలో కవి రాజకీయపక్షపు ఆదేశాలకు లొంగిపోతున్నాడు. సాహిత్య రంగంలో నాయకత్వం పరాయివాళు్ల బలవంతంగా ఆక్రమిస్తున్నారు.
ఈ సందర్భంలో శేషేంద్ర ఆవిష్కారం `మండేసూర్యుడి' కాంతిలో కవిత్వ జగత్తును జేగీయమానంగా ప్రకాశించేటట్లు చేసింది.
శేషేంద్ర ఆంధ్ర కవితా జగత్తును ప్రకాశింపజేసిన ప్రధానాంశాలు ఇవి.
1. రాజకీయపక్షాల ప్రాబల్యం నుంచి కవితాజగత్తును విముక్తం చేయటం సాహిత్య జగత్తుకు కవియే నాయకుడని స్పష్టంగా ప్రకటించటం.
2. శుష్కమైన, నినాదప్రాయమైన అకవితా సందోహం భస్మీకరించిఅచ్చమైన కవిత్వ స్పృహను పెంచి కవితా సాధనను ఒక స్పష్టమైన అభినివేశంగా తీర్చిదిద్దటం.
3. కవిత్వాన్ని వ్యాఖ్యానించేప్పుడు తన చేతనను నిర్భయంగా ప్రకటించుకోవటం.
4. ప్రాచ్య పాశ్చాత్య వాఙ్మయాలలోని ఇతిహాసాల ప్రక్రియలను అధ్యయనం చేసి ఆధునిక ప్రక్రియలుగా తన రచనలను ప్రవేశప్టెటం.
5. ప్రతీకలను, బింబసంయోజనను ఫ్రెంచి కవుల నుంచి స్వీకరిస్తూనే వాల్మీకి, కాళిదాస భవభూతులు మొదలైన భారతీయ కవుల ప్రతీకలను, బింబములను ప్రయోగించటాన్ని వివరించి వారి విశ్వజనీనతను ప్రవ్యక్తం చేయటం.
6. ఉదాత్తములైన భారతీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించుతూ, నిర్జీవములైన ప్రాచీనాంశాలను తిరస్కరించటం.
7. నన్నయ్య అనంతరంరాయప్రోలు అనంతరం తెలుగు కావ్యభాషను ఆమూలాగ్రం పరివర్తన చేసి కవిత్వానికి కొత్త రక్తమాంసాలను సమకూర్చటం
8. మార్కి్సజాన్ని జీవన తత్త్వంగా అంగీకరిస్తూనే దాని నుండి విశ్వజనీన చైతన్యం దాకా ప్రస్థానం చేయటం.
9. ప్రగతివాద కవిత్వోద్యమం, విప్లవకవితోద్యమం తీసుకురాలేని వేగాన్ని, ఆవేశాన్ని వచనంలోకి ప్రతిఫలించేట్లు చేయటం.
10. కవిత్వంలో నూతన భాషను సృష్టించుకొన్నప్రతీకలను, బింబాలను విరివిగా ఉపయోగిస్తూ వచ్చినా కావ్యం పాఠకులలో ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఆస్వాదయోగ్యం చేయటం. ఎక్కడా సంక్లిష్టతకానీ, అస్పష్టత కానీ ఉండకుండా ప్రతీకల బింబాల అశ్వ హృదయం తెలిసిన దార్శనికుడైన కవి కావటం.
11. ఈనాటి జీవనానికి అనుగుణంగా ఉపనిషత్తత్తా్వన్ని వ్యాఖ్యానించటమేకాదు. ఆ భాషలోని ముడులను విప్పి తాత్తి్వక రహస్యాలను వెల్లడించటం.
12. తన ప్రతి పరిశీలనను, అనుభవాన్ని, తన జాతిజనుల అనుభవ సంపుటులను కవిత్వంగా మార్చగల స్పర్శవేదిగా తాను రూపొందటం.
ఈ పన్నెండు అంశాలను చూస్తే కవి తెచ్చిన పరిణామం ఎంత బృహత్తరమో అంచనా వేయటానికి కొంత కాలం వేచి చూడవలసి ఉందనిపిస్తుంది. శేషేంద్ర రచనలన్నీ సంకలితాలై ఆధునిక మహాభారతంగా సంకలితమైనాయి. దీనిలో పన్నెండు పర్వాలున్నాయి. దీనికి అనుబంధకావ్యంగా జనవంశం అనే రచనా వచ్చింది. తన కవితా సర్వస్వాన్ని మహాభారతంతో ఏకీభావాన్ని భావించుకోవటంవల్ల శేషేంద్ర దేశీయ జీవన మూలాల్లోకి ప్రవేశించాడు. ప్రగతివాద కవులూ, ప్రయోగవాద కవులూ, విప్లవ వాదులు అందరూ ఈ విషయంలో విఫలమే అయ్యారు. దీని మూలాలు దాశరథిలో ఉన్నా శేషేంద్రలో ఆవిష్కృతమైనంత శక్తిమంతంగా అవి వెలువడలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం శీర్షిక మహాభారత స్ఫురణ కలిగివున్నా తాత్తి్వకంగా భారతంలోని పరమార్థ స్ఫురణ అంటే ఆత్మబలి లేదు.
తన మహాభారతానికి కర్షకుడే నాయకుడు. `ఈ దేశానికి నాగలి ప్రతీక. ఈ దేశపు ఆకృతి నాగలి. ఆకృతి ఒకదాన్ని ఒకటి పోలివుంటుంది.... అతడే ఈ దేశపు జీవన దానప్రభువు' అంటాడు కవి. దేశపు ఆకృతి నాగలి పోలివుండటం అన్న ఒక్క అంశం చాలు శేషేంద్రను జాతీయ మహాకవిగా గుర్తించేందుకు.
శేషేంద్ర కవిత్వ ధర్మాన్ని గురించి శ్రీకాంతశర్మ ఇలా అంటున్నాడు. `శేషేంద్ర శర్మలో లాలిత్యం, అలాగే శబ్దగతమైన కర్కశత్వం ఏకకాలంలో ఒకే కవితలో కలగలిసి, చిత్రమైన బొమ్మలు గీయడానికి ప్రతీకల ద్వారా దోహదం చేస్తాయి. ప్రతి భావాభివ్యక్తి లోనూ ఒక సామూహికత ఉంటుంది. ఏక రూపమైన విశేషభావం, పక్షులుగా, నక్షత్రాలుగా, వల్లికలుగా, వనాలుగా అనేకతను సంతరించుకొంటుంది. బాహ్య ప్రపంచాన్ని తనలోకి లాక్కోవాలనే తపన; లోపల క్రిక్కిరిసిపోయిన శబ్ద ప్రపంచాన్ని విసిరివేయ్యాలనే ఆరాటం; ప్రతిబింబిస్తాయి ఆయన ప్రతీకలు. నీరైపారిపోయినా, సూర్యుడై మండినా తన ప్రతీకలో తనే మునిగిపోయే కవి ఆయన. (ఆలోచన పే. 44. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. 1981).
రామాయణం అశ్వమేధంతో ఆరంభమయింది. భారతం సర్పయాగంతో ప్రారంభమయింది. అందుకే ఇతిహాస రచన ఒక యజ్ఞం. `ఇతిహాస నిర్మాణానికి బాధాపూర్వక బలి కావాలి. నేనే ఆ బలి. నా ప్రతిభ, నా పాండిత్యము, నా అనుభవము ఈ అన్నింటినీ జోడించుకొన్న నా ఆయుస్సు సర్వమూ పిండి మాటల గొంతుల్లో పోసిన ప్రక్రియ ఈ ఇతిహాసం. ప్రపంచ మానవుల్ని, వాళ్ల చరిత్రలని, వాళ్ల జయాప జయాల్ని, వాళ్ల భూత భవిష్యద్వర్తమానాల్ని నా ఇంద్రియ వాద మార్గ ఆర్జిత జ్ఞాన నేత్రంతో అవలోకనచేసి విశ్వదృశ్యం నుంచి ఈ తాత్పర్యాన్ని క్రోడీకరించాను. దూర దూరాల కొండల్లో కూర్చొని ఏకాంత గురుత్వాన్ని ఆశ్రయించి ఈ ఆధునిక మహాభారతాన్ని పొందాను' తన రచనా రహస్యాన్ని తపోవ్యగ్రతను ఇంతస్పష్టంగా ప్రకటించిన కవులు చాలా అరుదు. దూరదూరాల కొండలు, ఏకాంత గురుత్వమూ కవి తన చేతస్సీమలను దాటి ప్రచేతస్సీమలను చేరుకోవటం స్పష్టంగా నిరూపిస్తున్నది. ఈ ప్రచేతస్సీమలను గురించిన ఎరుక శ్రీ అరవిందుల తత్త్వదర్శనంలో కావ్యతత్త్వ చింతనలో స్పష్టంగా కానవస్తున్నది.
సూర్యుడు ఈ శుభ దినాన్ని
మోసంచెయ్యనియ్యను
ఈ దేశపు ప్రాచీరేఖ మీద
సూర్యు డుదయించకపోతే
మండే నా గుండె చీల్చి దానిమీద పెడతా (సూర్యపర్వము 61 పే.)
ఎదురుచూచిన నూతన యుగోన్మేషం జరుగటం లేదు. ఈ సారి కవి తన చైతన్యాన్నే నూతన యుగ భూమికగా అమరుస్తానంటున్నాడు. ఆ గుండెభవిష్యద్దర్శనం జీవకోటి అనంతస్వప్నాల సంకలనం. తప్పక దాన్ని వాస్తవం చేస్తానంటున్నాడు కవి. నాగలిని గురించిన వర్ణన ఇలా ఉంది. `నీవొక కరమ్రుక్కవే కావచ్చు / కానీ అనాది సృష్టిలో తలెుత్తిన/మానవ మహాకృషి ఏకైక చిహ్నానివి . . . . నీ స్పర్శ మట్టిలో నిద్రిస్తున్న/కలల పరిమాణాల్ని మేల్కొల్పి/దిశల్లో విదిలించింది. . . . .శ్రమ జీవుల లోకానికి ఒక/ నూతన సూర్యుణ్ణి వాగ్దానం చేశాను' (ఆ.మహా. పే.92) ఎంత కొత్త పలుకుబడి. నాగలి నూతన యుగ నిర్మాణ హేతుభూతమైన ఒక మహాశక్తికి ప్రతీక అయింది.
`గింజ దిగగానే చినుకు పడగానే వారు ప్రేమించిన గింజల గర్భంలో ప్రవేశిస్తారు. మనుష్యూల జన్మలకు మళ్లీ బీజాలవుతారు.' (ఆ.మహా47) ఈ వాక్యాల్లో సృష్టి పరిణామ రహస్యం ఉన్నది. ఉపనిషత్తులలో చెప్పిన పంచాగ్ని విద్య ఉన్నది. దీన్నే `నా దేశం నా ప్రజలు' ఆరంభంలో `నేను ధాన్యంలోనుంచి పుట్టాను. ధాన్యంకోసమే బ్రతుకుతాను. మరణించి ధాన్యంలోకే వెళ్లిపోతాను' (ఆం. మహా 12పే) అని అంటాడు.
శేషేంద్ర కవితలోని ఏ పంక్తి ఎత్తుకున్నా సజీవంగా ఉరకలేస్తూ ఉంటుంది.
ఆకాశం కనిపించటం మానేసింది
ద్రవ్యరాక్షసి కడుతున్న బహుఅంతస్తుల భవనాలుచూచి (165)
అతనితోపాటు అతని స్వప్నాలుకూడా
కాలుతున్న పరిమళం
అతడు ఒక శతాబ్దం మీద నిలుచున్న వీరుడు. (158)
అడవిలో నాకోసం మరణించిన ఆ వీరునికి
ఎవడు కట్టగలడు ఎత్తయిన సమాధి
నా గుండె వాడి మీద లేచిన గోపురం
నా ఆశ్రువులే వాడిమీద రాలుతున్నపూలు (159)
జీవితం ఒక మహాసముద్రం కావచ్చు
కానీ ఆశ అనే నావలో దాన్ని దాటి వేయవచ్చు (188)
మనుషూలందరూ నడిచే సముద్రాలు
చివరకు కాలపు కెరటాల్లాంటి పునః
పునరావృత్త ప్రాచీన పంక్తుల్లో అర్ధశక్తి
ఆవిష్కారం జరిగింది. నాలో కల్లోలం
స్వస్వరూప దర్శనమిచ్చింది (275)
మరొకచోట అంటాడుకవి `భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కరలేదు మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరతలేదు'! (323) అని. శేషేంద్ర కవిత్వం నిండా ఒక ప్రబలమైన ఆశ. పునర్నిర్మాణ దీక్ష. శేషేంద్ర కవిత్వమంతా ఆధునిక మానవుని సుదీర్ఘ సుందరస్వప్నం.