Thursday, July 9, 2009

అంతర్ముఖుడు శ్రీ నవీన్‌

మన కవులు-రచయితలు-2
నవీన్‌ నాకు 1960 ప్రాంతాల నించి పరిచయమే. `అంపశయ్య' ద్వారా అంతవరకు తెలుగు సాహిత్యంలో అంతగా ప్రచలితంకాని చైతన్యస్రవంతి సంవిధానాన్ని ప్రయోగించి తొలి నవలను పూర్తి చేశాడాయన. 1955 ప్రాంతాలలో మేము నేను, పేర్వారం జగన్నాథం ప్రభృతులం `సాహితీబంధు బృందం' స్థాపించటం ప్రధానంగా కళాశాల విద్యార్థులుగా, సాహిత్య రంగంలో ప్రక్రియగా ఉండటం కోసం మేము హైదరాబాదు చదువుకోసం వెళ్లగానే మా ఆర్‌‌ట్స కాలేజి అధ్యాపకులు పి.జి, లాలే, ఇరివెంటి కృష్ణమూర్తి, జి.వి. సుబ్రహ్మణ్యం ప్రభృతులు కాళోజీ సోదరులు కేంద్రంగా మిత్రమండలిని స్థాపించటం జరిగింది. 195758లలో. అయితే మిత్రమండలి పక్షానికో, వారానికో సమావేశమై యువ రచయితల రచనలకు పదునుపెట్టింది. ఒక కార్యశాల వలె నడిచింది. ఆ కార్య శాలనించి బయటకు వచ్చిన రచయితలలో నవీన్‌ ఒకరు. వరంగల్లు సాహిత్యంలో తొలి నాళ్లనుంచీ రెండు రకాల స్రవంతులు సమాంతరంగా ప్రవహించటం ఉన్నది. దేశీయత కళామయత, అంతర్బహిర్ముఖాలు, ఆధ్యాత్మికత అధిభౌతికత జంటలు జంటలుగా సాగివస్తుంటవి. పాల్కురికి సోమన, పోతన్న నాటి నుంచీ ఈనాటి వరకు ఈ జంట జంటల పద్ధతి సాగిపోతూనే ఉంది. సర్వతః బహిర్ముఖంగా కనిపించే కాళోజీ ఉర్దు, పారశీక కవితా సౌందర్యానికి పరవశమయ్యే వ్యక్తియే. శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి భక్తి కవితా ధోరణికీ, ఉదయరాజు శేషగిరిరావు `మనోరమ' అనే శృంగార పద్యలహరికీ తన్మయమయ్యే లక్షణం ఉన్నవారే. కాళీజీ ప్రభృతులు నిర్వహించిన మిత్రమండలిలో నుంచి వెలువడడ్డ శ్రీ నవీన్‌ రచయితగా అంతర్ముఖుడైనాడు. అతని నవలలూ కథలూ ఎంతగా లోకాన్ని వర్ణించినట్లు కానవస్తూన్నా ఆత్యంతికగా అంతర్జగత్తులో విలీనమయ్యేవే. నవీన్‌ రచనల విూద ఒక సౌందర్య అనుభవ ముద్ర ఉన్నది. ఈ ముద్ర చలం ద్వారా ఆయనకు సంక్రమించింది. అందువల్ల జీవితాన్ని పై అంచులో వర్ణిస్తూ వర్ణిస్తూనే చివరకు ఆయన అంతర్జగత్తులోకి జారిపోతాడు. పైన బుద్ధిబలం వల్ల, హేతువాదం వల్ల ఏ ఏ పరివేషాల కానవచ్చినా అసలైన నవీన్‌ కేవలం వాటి పొరలు చించినప్పుడే కానవస్తాడు. ``మనస్సును కలచి కలచి మేధస్సును, సంఘటన అనే కవ్వంతో చిలికి చిలికి జీవిత రథ చక్రాల క్రిందపడి నలిగి నలిగి ప్రతిపాత్రను కలం కుంచెతో బొమ్మ గీసి గీసి, ప్రతి అక్షరాన్ని మార్చికూర్చి, ఇటుక మీద ఇటుకకను పేర్చినట్టుగా పేర్చిపేర్చి తన బాధను ప్రపంచబాధగా, ప్రపంచబాధను తన బాధగా చేసుకొని, జీవితం అనే సూది మొన మీద నిరంతర తపస్సు చేసి చేసి అప్పుడు గదా కథ పుడుతుంది అప్పుడు గదా నవల పుడుతుంది. అదో తపస్సుఅదో సాధన అదో ప్రసవవేదన.... అదో అన్వేషణ, అదో తీరని దాహం'' (అంతస్స్రవంతి పేజి. 41) ఒక రచయిత రచనాక్రమాన్ని సోపాన పద్ధతిలో వెల్లడిస్తున్నారు శ్రీ నవీన్‌. `ఇటుకమీద ఇటుక పేర్చినట్టుగా పేర్చిపేర్చి' ఇంతవరకు రచయిత జాగ్రదవస్థలో చేసే కార్యం. అంతస్సులోనికి ప్రవేశించే ప్రయత్నం. తన వు్యత్పత్తీ లోకానుభవమూ, అభ్యస్త సాహిత్య విద్యావైదుష్యమూ వెల్లడించేవి. తరువాత భాగం ఆయన అంతస్సును గురించి తెలియజేస్తుంది. `తన బాధను ప్రపంచబాధగా ప్రపంచబాధను తన బాధగా' చేసికొని ... ఇది అంతర్బహిస్సుల సంధి దశ. ఈ మాటలు మహాప్రస్థానం పీఠికలో చలానివి. ఒకటి కృష్ణశాస్త్రిని గురించి, రెండవది శ్రీశ్రీని గురించి చెప్పినవి. వ్యక్తి క్రమంగా విశ్వచైతన్యంగా పరివర్తించటం విశ్వచైతన్యాన్ని తన వ్యక్తిత్వంలోనికి స్వాయత్తం చేసుకోవటం . . . ఈ రెండూ ఉన్మేషనిమేష దశలు, ప్రతి రచయితా రచనావేళలో ఈ దశల్లో ఎక్కడో ఒకచోట తప్పక నిలిచివుంటాడు. తరువాత మూడవదశ వర్ణించబడింది. ఇది అత్యంతమూ ముఖ్యమైంది. ఒక విధంగా నిర్వికల్పసమాధివంటి దశ. అహంత సరిహద్దులు చెరిగిపోయిన స్థితి. ఆ స్థితి `జీవితం అనే సూదిమొన మీద చేసే నిరంతర తపస్సు'. సర్వ చరాజగత్తులోని జీవచైతన్యమూ సుసూక్ష్మీకరింపబడి కేంద్రితమై రచయితకు ఆధార స్థానమవుతుంది. ఈ ఆధార పద్మం మీద నిలిచి ఉంటాడు రచయిత. సృష్టికర్త. ఈ కేంద్రీకృతమైన సర్వజీవన చైతన్యాన్ని గర్భీకరించుకున్న బిందువు మీద ఉన్న రచయిత మనం ఎరిగిన లోకంలోని వ్యక్తి మాత్రమే కాదు అతడు తనకుమించిన జగత్తునంతనటినీ తనలోనికి చేదుకున్నవాడు. ఒక వ్యక్తావ్యక్త సంధి బిందువు మీద ఉన్న స్థితిని చెప్పుతాడు. అప్పుడది తపస్సుతీవ్రభావనఅవుతుంది. అప్పుడది సాధన అంతర్జగత్తునుంచి ఎప్పుడు చేదుకునే ప్రయత్నం అవుతుంది. అదే తానెరుగని అపూర్వమైన నూతనా విష్కారం కోసం చేసే ప్రయత్నం అవుతుంది. శ్రీ నవీన్‌ ఈ విధంగా రచనాప్రక్రియలోని భిన్నభిన్న దశలను ఇంత విశదంగా చెప్పారు. రచయితగా ఉన్న ఆయన వివేకం స్థాయిని ఇది తెలియజేస్తుంది. అంతర్బహిర్జగత్తుల మధ్య సమన్వయంలోనే గొప్పరచన వెలువడుతుంది. శ్రీ నవీన్‌లో ఈ ఘర్షణ `అంతస్స్రవంతి'లో వ్యక్తమయ్యే సన్నివేశం ఉంది. రచయిత భార్య రజని అంటుంది ``ఎప్పుడూ మల్లెపూల సువాసనలేకాదు. . . అప్పుడప్పుడు కిరోసిన్‌ కంపు కూడా భరించాలి'' అని. భౌతిక ఆధిభౌతిక జీవనాల మధ్య వారధిని నిర్మించుకోవలసిన అవసరాన్ని ఈ సన్నివేశం స్పష్టం చేస్తుంది. రవి తన పాఠకురాలు సుధకు రాసిన ఉత్తరం సన్నివేశంలో ఈ సమన్వయం కుదరకపోవటం వల్ల వచ్చే వైరుధ్యం కానవస్తుంది. ఇక్కడ రవి స్వాప్నికుడు. రజని భూమి. ఈ భూమ్యాకాశాల నడుమ సమన్వయం నవల చివర దాని సమావేశంలో సాధ్యమయ్యింది. రవికి సంప్రదాయ సిద్ధమైన పతివ్రత వంటి విలువలమీద నమ్మకం లేక పోయినా తన సహచరి ఇల్లాలు ఆయనకు సర్వమూ అవుతున్నది. `నువ్వే నారాణిని నా ఎంకివి నా ఊర్వశివి నా పార్వతివి కోమలివి నా అమృతానివి తాను మెచ్చిన స్త్రీల వ్యక్తిత్వాలన్నింటినీ తన ఇల్లాలు రజనిలో చూసుకోగలుగుతాడు రవి. అందువల్లనే ఆమె తన సంగమకాంక్ష తీర్చని వేళలో కూడా దగ్గరకు లాగి జోకొట్టింది. అతనికి ఓ చక్కని కలవచ్చింది. మత్తుగా ఉంది. తెల్లగా మంచుముద్దలు, పచ్చటి మైదానాలు సూర్యకిరణాలలో తళతళలాడే పర్వతాలు. ఎతై్తన యూకలిప్టస్‌ చెట్లు కాదు ఆపిల్‌ చెట్లు, గుత్తులు గుత్తులుగా ఆపిల్‌ పళు్ళ. `వాటి అందమంతా కళ్ళతోటే జుర్రేస్తున్నాడు' (పేజి. 1213) అతని శరీరం కోరిన అనుభవం స్వప్నంలోకి పరివర్తిత మయ్యింది. ఆ పళ్ళను డబ్బాలలో పెట్టి మేకులు కొట్టడం, పాలవాడు తలుపు బాదం ఇవి భౌతిక జగత్తులోనికి దించే వాస్తవాంశాలు. అయితే నవల చివర నాయికా నాయకుల సంగమ దృశ్యం వర్ణించబడింది. అనుభూతి జగత్తులోంచి ఈ వర్ణన భౌతిక పరిమితులను దాటిపోయింది. దాంపత్యజీవన తత్తా్వన్ని వ్యాఖ్యానించింది. ``వాళ్ళిద్దరూ రెండు శరీరాలుగా రెండు ప్రాణాలుగా అంతమైపోయారు. ఏకప్రాణిగా ఆవిర్భవించే ఆ క్షణాలు అతనికి మహత్తరంగా, మహాద్భుతంగా, మధుర మనోజ్ఞంగా కనిపిస్తాయి. అలాంటి క్షణాలు నిత్యమై శాశ్వతమై, అనంతమై'' ``ఈ సృష్టిలో ఇంత ఆనందం ఇంత హాయి తనకు మరొకటిలేదు. రాగం, ద్వేషం, కోపం, తాపం, ఈర్ష్య, ద్వేషం అన్నీ అంతమైపోయిన క్షణాలు'' (పేజి 178) అనిర్వచనీయమైన అనుభవాన్ని చెప్పే గొప్ప ప్రయత్నం ఇది. అందుకే శ్రీ నవీన్‌లో జీవితాన్ని గురించిన ఒక తాత్తి్వక దృక్పథం సమగ్రమైంది ఉన్నది. ఇలాంటి దృక్పథం అనేది లేకపోతే ఏ రచయితా సృష్టినీ మానవ జీవితాన్ని వినూత్నంగా వ్యాఖ్యానించలేదు. ఇన్ని పాత్రల ఇంగితాన్ని స్పష్టంగా విశదీకరించలేడు. అంతస్స్రవంతి చివర జీవితాన్ని గురించి నవీన్‌ ఇలా అంటాడు. ``సృష్టి విచిత్రమైంది. సృష్టి అనంతమైంది. సృష్టి ఆద్యంతాలు లేనిది. సృష్టి ఒక ఆవిచ్ఛిన్న ప్రవాహం. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి విరామం విశ్రాంతి లేవు. అనుక్షణం సృష్టికి ప్రతిసృష్టి జరుగుతూనే ఉంటుంది. అదే జీవిత రహస్యం. అదే జీవితాని కర్థం'' సృష్టి ెుుక్క అనుస్యూతిని, నైరంతర్యాన్ని చెప్పిన ఈ రచయితకు ఈ జగత్తుమీద ఉన్న ``మమకారం'' గొప్పది. ప్రజాతంతువును త్రెంచరాదు అని చెప్పే వైదికసూక్తి దీన్నే చెప్పింది. యూరోప్‌ దేశాన్ని ముంచెత్తిన నైరాశ్యవాదాల పాలబడకుండా, వ్యవస్థ సార్థకమైన ఉనికిని సమర్థించే నవీన్‌ మనకున్న కొద్దిమంది మంచి రచయితలలో ఒకరు.

2 comments:

  1. అద్భుతంగా వివరించారండీ . అభినందనలు .
    నాకు ఇష్టమైన రచయితలలో నవీన్ గారు ఒకరు. నవీన్ గారు తన మనస్సులో సంఘర్షణను అనుభవించి, ఆ సంఘర్షణే పాత్రలను సృష్టించినట్లు కనబడుతుంది.

    ReplyDelete
  2. మాన్యులు కోవెల సుప్రసన్నాచార్య గారికి అభివందనములు.

    మీవంటి పెద్దలు బ్లాగ్లోకంలో ప్రవేశించడం మహదానందం కలిగిస్తోంది.

    "సృజన"లో సీరియల్ గా వెలువడుతున్నప్పుడే నాబోటి (అప్పటి) విద్యార్దులమీద "అంపశయ్య" ఎంతో ప్రభావాన్ని చూపింది. మీ పరిచయం చదివిన తరువాత మరోసారి అంపశయ్యను చదవాలని కుతూహలం కలుగుతోంది. నవలలోని కొత్త కోణాలను ఆవిష్కరించారు.

    ReplyDelete