Wednesday, July 29, 2009

లోకమ్ము వీడి రసమ్ము లేదు

సాహిత్యం అనుభవ సముద్రం. ఈ అనుభవానికి ఏ ఎల్లలూ ఏ కార నియతీ ఉండదు. మానవుడి సర్వ అనుభవాలు, సర్వ జీవన పార్శా్వలు అది ప్రతిఫలిస్తుంది. వివిధ ప్రక్రియలు, సాహిత్య రూపాలు అభివ్యక్తి వైవిధ్యాన్ని బట్టి పాఠకుల వైవిధ్యాన్ని బట్టి కాల ప్రభావాన్ని బట్టి వేరువేరుగా ఏర్పడుతూ ఉన్నవి. ప్రక్రియల భేదం తప్ప, అభివ్యక్తి వైవిధ్యం తప్ప సాహిత్య స్వస్వరూపంలో ఆత్మగా నిలిచి ఉండేది రసమే. ఈ రసం లోకంలోనుంచి కావ్యం లోనికి ప్రసరిస్తుంది.
`లోకము్మ వీడి రసము్మ లేదు' అంటే లోకమే రసమని తాత్పర్యం. లోకంలోనుండి కావ్య ప్రపంచంలోనికి ప్రవహించిన శబ్దం, దేశ కాలాల పరిమితులను ఛేదించుకొని సార్వజనీనంగా, సార్వకాలికంగా రూపొందింది. రసముగా పరిణమిస్తుంది. పాఠకుని అనుభవానికి చేరువగా చేరేందుకు రసము అతని ఎరుకలో ఉన్న స్వస్థాన వేష భాషాది మతములను ప్రకటిస్తూ అభివ్యక్తమవుతుంది.
ఈ వైవిధ్యాలను గుర్తించకుండా ఇటీవలి కాలంలో సాహిత్యాన్ని వైరుధ్యాల పుట్టగా, పరస్పరం సంఘర్షించుకొనే యుద్ధ శ్రేణులుగా వ్యాఖ్యానించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం సుమారుగా అరవై సంవత్సరాల నుంచి సాగుతూ, సాగుతూ ఇప్పుడు దాని పరమ వికృత రూపం ప్రకటిస్తున్నది.
నన్నెచోడుడు `మును మార్గకవిత లోకంబున వెలయక, దేశి కవిత పుట్టించి తెలుంగున నిలిపిరి చాళుక్య రాజు మొదలగు పలువురు' అన్నప్పుడు మార్గదేశి భేదములు మొదటిసారి ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన మొదట సంగీత శాస్త్రానికి చెందింది. ఆ తరువాత సాహిత్యంలోకి వచ్చింది. ఇక్కడ మార్గ కవిత్వం సంస్కృత కవిత్వమై నన్నయాదుల కవిత దేశి కవిత అయింది. తరువాత కొంచెం కాలం గడిచేసరికి మన అంచనాలు మారిపోయి నన్నయాదుల కవిత మార్గమై, పాల్కురికి సోమన మొదలైన వారి కవిత దేశి అయింది. పురాణ ఇతిహాస సంప్రదాయాలు, ఆ రూపాలు మొదటి వర్గం కాగా, దానికి భిన్నమైన ద్విపదాది రచనలు దేశి కవిత అయింది. ఈ విభజన మరి కొంత కాలానికి మరొక రకంగా ప్రస్తావించడం జరుగుతుంది. ఉదాహరణ కావ్యాలు.. దేశి లక్షణాలైన, గానయోగ్యాలైన రగడలు అధికంగా ఉన్నా దేశి కవితలుగా చెప్పబడటం లేదు. శతకాలు ఆత్మాశ్రయాలై, సమాజ వస్తువులు ప్రకటించేవి అయినా, అక్షర ఛందస్సుల్లో ఉండటం వల్ల దేశి కవితలుగా ప్రముఖంగా ప్రస్తావనకు నోచుకోవడం లేదు. మార్గకవిత్వం పండితైకవేద్యమని, దేశి కవిత్వం ప్రజాబాహుళ్యాన్ని ఉద్దేశింపబడిందని ప్రచారం జరుగుతోంది. పండితారాధ్యచరిత్రలో పాండిత్య వివాదాలు, అన్నమయ్య శృంగార మంజరిలో ప్రబంధ లక్షణాలు పామరులకు అందుబాటులోకి వచ్చేవి కావు.
ఈ విభాగం కొంచెం ముందుకు పోయి మౌఖిక, లిఖిత సంప్రదాయాలుగా విభజించడం జరిగింది. లిఖిత సంప్రదాయం అనేసరికి ద్విపదాది కావ్యాలు కూడా దాంట్లో చేరిపోతవి. అప్పుడు జానపద సాహిత్యం, అన్నమయ్య సంకీర్తనలు, సారంగపాణి, క్షేత్రయ్య వంటివారి సాహిత్యం, ఈ విభాగంలోకి వస్తాయి. రాగిరేకుల మీద రాయబడటం వల్ల అన్నమయ్య సాహిత్యాన్ని లిఖిత సాహిత్యం అంటారేమో నాకు తెలియదు. కానీ, అన్నమయ్య సాహిత్యంలో జానపదాంశాలు, ఆ రూపాలు ఎంత విరివిగ ఉన్నవో, ఉపనిషత్తులలోనూ, తత్త్వరహస్యాలు, దై్వతాదై్వత సిద్ధాంతాల విభేదాలు, మార్మిక సంకేతాలు ఎన్నో విరివిగా కనిపిస్తాయి. కొన్ని సంకీర్తనల వివరణలు, సూత్రభాష్యాదుల పాండిత్యం లేకుండా అర్థం కాదు. అట్లాగే త్యాగయ్య రచనల్లో ఉండే తాత్తి్వకాంశాలు, క్షేత్రయ్య రచనల్లో ఉండే రస, నాట్యశాస్త్ర విశేషాలు కేవలం పామరుల కోసం ఉద్దేశింపబడినట్లు కాదు.
పాల్కురికి సోమన కానీ, అన్నమయ్య కానీ, పల్నాటి వీరచరిత్రను రచించిన శ్రీనాథుడు కానీ, రంగనాథ రామాయణ కర్తకానీ, పండితులు కారనడానికి వీల్లేదు. వీరిలో కొందరు అటు పండితాదరణీయాలని చెప్పబడుతున్న కావ్యాలు, ప్రబంధాలు రచించడం ఒకవైపు, మరొక వైపు జానపద లక్షణాలు కల దేశి రచనలు రచించడం మరొకవైపు జరిగింది. ఒక పరిశీలన చేసి చూస్తే, తాత్తి్వకంగా సాహిత్య రచయిత వస్తువును బట్టి తను పెంచుకున్న శ్రోతృ సమూహాన్ని బట్టి ప్రక్రియను నిర్ణయించుకుంటున్నాడు తప్ప సహజంగానే ఈ సాహిత్య సృష్టిలో భేదబుద్ధి లేదు. జానపద సాహిత్యాన్ని సేకరించిన తొలిరోజుల్లో దానికి ప్రాచుర్యం కల్పించడానికి ఆదరణ లభించడానికి కొన్ని `అర్థవాద వాక్యాలు' చెప్పడం అవసరమే కావచ్చు కానీ, అవి ప్రామాణికాలని చెప్పడానికి వీల్లేదు. చింతా దీక్షితులు గారు, నేదునూరి గంగాధరం గారు, బిరుదురాజు రామరాజు గారు మొదలైన వారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి ధోరణి వివరణలలో చెప్పి ఉండవచ్చు. అనాదృత వాఙ్మయం, ప్రజావాఙ్మయం వంటి మాటలు వాడి ఉండవచ్చు. కానీ, ఏదీ నిశ్చితమైన అభిప్రాయం కాదనుకోవాలి. పోతన భాగవతంలో`కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు మఱియున్‌ కొందరకు రెండు గుణమగు అందర మెప్పింతునేను అయ్యెయెడలన్‌' అన్న చోట నాటికీ ప్రచారంలోకి వస్తున్న ఈ భేదభావాన్ని అన్వయించే లక్షణం కన్పిస్తుంది. ఈ ఉభయ సాహిత్య మైత్రి ఆయన రచనను తెలుగువాళ్లకు అత్యంత ఆదరణీయంగా రూపొందింపజేసింది. భాగవత పద్యాలు ఏ సాహిత్య ప్రక్రియల అత్యంత ప్రాచుర్యం పొందిన అంశం అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పాండవోద్యోగ విజయ పద్యాలు అత్యంత జనాదరణ పొందడానికి వాటి అక్షర ఛందోరూపం అడ్డం రాలేదు.
ఎరిగియో ఎరుగకయో అభిమానం చేత రాబోయే పరిణామాలను గూర్చిన అంచనా సరిగా లేకపోవడం వల్ల కల్పించిన ఈ భేదభావాలు సాహిత్యాన్ని నిలువుగా చీల్చడం ఈనాడు పరిదృశ్యమానమవుతున్నది. ఈ భేద కల్పనలో ప్రజాకవులు, అప్రజాకవులనీ సంస్థాన కవులు సంస్థానేతర కవులనీ, ఉన్నత వర్గాల, దళిత వర్గాల కవులనీ, విభజించడం కానవస్తుంది. తేనె, కలకండ, మామిడిపండ్ల రసం మొదలైనవి ఆయా ఉత్పత్తి మూలాలను బట్టి భిన్నంగా కన్పించవచ్చు కానీ, తాత్పర్యతః అవన్నీ మాధుర్యమనే లక్షణం చేత ఒక్కటే అవుతున్నవి. అలాగే రసలక్షణం చేత సాహిత్యాన్ని ఏకరూపంగానే దర్శించవలసి ఉంటుంది.

1 comment:

  1. " లోకమ్ము వీడి రసమ్ము లేదు " చాలా బాగుందండి.
    ఎందుకో ఈ శీర్షిక చదవగానే " నా కోసం చెమ్మగిల్లు నయనమ్ము లేదు " అన్న కవిత గుర్తుకొచ్చింది. బహుశా ఇది చేతనవర్తం కవుల కవితా సంకలనం లోదేమో సరిగా గుర్తులేదు.

    దయచేసి చేతనవర్తం కవుల గురించీ నాటి మీ అనుభవాల గురించీ తెలుప గలరు.
    మరొక మనవి. పేరాల మధ్య గాప్ లేక పోవడం వాళ్ళ చదవడానికి కొంచెం అసౌకర్యంగా వుంది. పేరా అయిపోగానే (కర్సర్ ను అక్కడ వుంచి ) ఎంటర్ కీ నొక్కండి. గాప్ ఏర్పడి చదవడానికి అనుకూలంగా వుంటుంది.
    అన్యదా భావించారని భావిస్తాను. ధన్యవాదాలతో.

    ReplyDelete