Friday, July 3, 2009

నిజమైన గురజాడ చైతన్యం

మన కవులు-౧
ఒక రచయిత చైతన్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. వ్యక్తి సంస్కారము వాతావరణము 2. సమకాలీన చైతన్యము 3. ఆ వ్యక్తి సమష్టి చైతన్యాన్ని అందుకోవడం, తన వ్యక్తిత్వంలో అన్వయించుకోవడం ఈ అంశాలలో మొదటి రెండు సాధారణంగా స్ఫురించేవేకాని, మూడో అంశం సమష్టి అవచేతనలో వ్యక్తమయ్యే స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం జరిగితేనే అది నిజమైన రూపంలో సాక్షాత్కరిస్తుంది. సమష్టి అవచేతనలోని సంస్కారం రచయిత వైయక్తిక జాగ్రత్ప్రయత్నం లేకుండానే రచనలో నిరూపితమవుతుంది. గురజాడ ప్రధానంగా 19వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించినాడు. అవి భారత దేశంలో పునరుజ్జీవనోద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న రోజులు. దానికి రెండు ముఖాలు. ఒకటి 1857 ఉద్యమం ెుుక్క కొనసాగింపులో దేశ స్వాతంత్య్రానికి సమగ్ర జాతీయ శక్తుల సాక్షాత్కారానికి జరిగిన మహాప్రయత్నం. రెండోది ఆంగ్లపాలనా సంస్కారాలవల్ల ఆత్మన్యూనతా భావంతో ప్రారంభమై ఆంగ్ల విద్యాప్రాబల్యాన్ని కోరడం, బ్రహ్మసమాజ ఉద్యమం, సంఘసంస్కారోద్యమము మొదలైన రూపాలలో వ్యక్తమైంది. మొదటి మార్గంలో శ్రీ రామకృష్ణూల, దయానందుల, వివేకానందుల ఆధ్యాత్మికోద్యమాలు సంగమించి భారతీయాత్మను పునఃదర్శించే ప్రయత్నం జరిగింది. బంకించంద్రుని రచనలు ఈ ప్రేరణలోనుంచి ఉద్గమించినవే. మొత్తం జాతిని స్వాతంత్య్ర సమరానికి సమాయత్తం చేసిన ``వందేమాతరం'' ఈ రోజుల్లో ఆవిర్భవించింది. రెండో మార్గంలో ఉద్యమం జాతి పతనస్థితి నుండి ఉద్గతిని పొందేందుకు పాశ్చాత్య విజ్ఞానము, సంస్కారమూ అవసరమని భావించడం జరిగింది. దేశీయ మత స్వరూపాన్ని కూడా క్రైస్తవ మతము మాదిరిలో రూపొందించే ప్రయత్నం జరిగింది. బ్రహ్మసమాజ స్వరూపం ఈ రూపమైందే. మైఖేల్‌ మధుసూదన్‌ దత్‌ వంటి కవులు ఈ చైతన్యంతో పరిస్పందించినవారే. ఈ రెండు మార్గాలు ఇలా ఉండగా గురజాడ మనస్సు రూపొందే రోజులలో ఆయన ఒక జమీందారీలో జీవించాడు. విజయనగరం సంస్థానంలో ఆయన ఉద్యోగి. ఆ జమీందారీ ప్రభావం ఆయన మీద ఉండటం సహజం. ఆనందగజపతి రాజుగారి ప్రోత్సాహంతో ఆయన బ్రహ్మ సమాజంలోనూ, థియోసాఫికల్‌ సొసైటీలోనూ సభ్యుడుగా చేరినట్లు చరిత్ర చెప్పుతున్నది. తన చైతన్యమూ, తన పరిసరాలు ఆయనకు జమీందారు మీద ప్రత్యయాన్ని కలిగించినవి. ఆయన కన్యాశుల్కం రాయడం ఆనంద గజపతి ప్రోత్సాహం తోనే. అట్లాగే ఆయనకు ఆ కుటుంబం మీద ఉన్న భక్తివిశ్వాసాలు నీలగిరి పాటల్లోనే స్పష్టంగా వ్యక్తమవుతవి. ఆ వాతావరణం, ఆంగ్లేయ ప్రభుత్వానికీ, తన జమీందారుకీ ఉన్న సంబంధం ఆ ప్రభుత్వం మీద అమితమైన విశ్వాసం ప్రకటించేటట్లు చేసింది. ``కన్నుగానని వస్తుతత్వము కాంచనేర్పరు లింగిరీజులు, కల్లనొల్లరు వారి విద్యల కరచి సత్యము గరపితిన్‌'' ``ఆంగిలేయుల ధర్మరాజ్యము జ్ఞానమును స్వాతంత్య్రమిచ్చుచు సంతతము వర్ధిల్లు గావుత'' ఆనాటి ఆంగ్ల విద్యావంతులు సంస్కారోద్యమపరులు అందరూ ఇలాగే ఆలోచించేవారు. వీరేశలింగంగారు కూడా రాజకీయంగా ఇలాంటి అభిప్రాయం గలవారే. 1915 దాకా గురజాడ, 1919 దాకా వీరేశలింగం జీవించిఉన్నా ఉవ్వెత్తున లేచిన జాతీయోద్యమాన్ని వాళు్ల ఏ విధంగానూ బలపరచలేదు. అందువల్లనే గురజాడ అప్పారావు దేశభక్తి గీతం కూడా దేశ స్వాతంత్య్రాన్ని కోరే గీతం కాదు. ఆంగ్లేయులు దేశంలోకి తెచ్చిన ``నాగరీకరణ'' యుగానికి స్వాగతం చెప్పడమే దీనిలోని ప్రధానాంశం. ``అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోయ్‌ దేశి సరుకుల నమ్మవలెనోయ్‌ డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్‌'' ఈ గీతం ఆంగ్లేయులు వ్యాపారం ద్వారా దేశాలను ఎట్టా కబళిస్తూ వచ్చారో అలాగే వస్తువుల ఉత్పత్తి ద్వారా, ఎగుమతిద్వారా దేశాన్ని సంపన్నం చేయవలెనని ఆయన భావించడం జరిగింది. అయినా ఆంగ్లేయ రాజ్యం దేశీయ ఉత్పత్తులను ఎగుమతులను ప్రధానంగా దెబ్బతీసిన చారిత్రక సత్యం గురజాడ దృష్టికి రాలేదు. ఇక్కడ దేశి సరుకులు పెంచవలె ననడంలో గాంధీజీ నడిపిన స్వదేశీ ఉద్యమచ్ఛాయ ఏ మాత్రమూ లేదు. ఇటు ఉగ్రవాదోద్యమాల ెుడగానీ, అటు కాంగ్రెసు వారి ఉద్యమంమీదగానీ ఆయనకు సానుభూతి లేదు. ఒక కాంగ్రెసు సభకు వెళ్లి వచ్చి దాన్ని వెక్కిరిస్తూ గేయం రాసిన సంగతి కూడ మన గుర్తుంచుకోవాలి. దేశభక్తి గీతం ప్రధానంగా వ్యక్తిగతమైన సంస్కారాన్ని మాత్రమే కాంక్షిస్తుంది. అది ఆంగ్ల సామ్రాజ్యానికి ఏ హానీ చేయదు కనుక. దేశం అంటే కేవలం ఒక భౌగోళిక పరిమితి మాత్రమే కాదనీ, ఒక జన సమూహం మాత్రమే కాదనీ కొన్ని వేల సంవత్సరాలుగా పెంపొందించుతూ వచ్చిన సంస్కృతి చైతన్యానికి ప్రాతినిధ్యం వహించే స్థల వ్యక్తి కాలాల సంగమమనేభావం గురజాడకు అంగీకార్యం కాదు. ఒకవిధంగా ``దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషూలోయ్‌'' అన్నమాట ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పుతుంది. సర్వచైతన్య భావపరమేశ్వరిగా దేశాన్ని దర్శించిన వందేమాతరం గీతాన్ని వెక్కిరించడం కూడా ఈ గీత రచనలో గూఢమైన ఉద్దేశ్యం. అందువల్లనే దేశభక్తి గీతం సంకుచితమైన సమకాలీన మానవులను మాత్రమే దేశమని నిర్దేశిస్తుంది. ``దేశాభిమానం నాకు కలదని. . .'' ఇత్యాదిగా చెప్పిన అంశం జాతీయోద్యమం ెుడల ఆయనకు సానుభూతిలేని లక్షణం స్పష్టం చేస్తుంది. ఈ గీతంలో ఎక్కడా విదేశీపాలన ఎడల నిరాసం లేదు. ఇతర స్థలాలలో ఆంగ్లేయ ప్రభుత్వం చిరకాలం నిలువవలెనని కోరడం, ఈ గీతంలో విదేశీ పరిపాలన ప్రసక్తిలేక పోవడమూ ఈ రెంటిని సరిగ్గా అంచనా వేస్తే ఈ గీతం ఒక విధంగా ప్రభుత్వ విధేయంగా ఉంటూ వారి పాలనను ప్రోత్సహించుతూ వారి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే దేశభక్తిగా కవి ప్రతిపాదించినట్లు గోచరిస్తుంది. అయినా సంస్కారం విషయంలో కూడా గురజాడది పరిమితమైన దృక్పథం మాత్రమే. వీరేశలింగం ప్రధానంగా సంఘ సంస్కారి. ఆయన తన ఈ దృక్పథంతో ఎప్పుడూ రాజీపడలేదు. గురజాడ కన్యాశుల్కంలో అన్ని పాత్రలలోనూ మానవులలోని వెలుగు చీకట్లు ప్రదర్శించాడే తప్ప సంఘ సంస్కారాంశాన్ని ప్రతిపాద్యాంశంగా చూపలేదు. ఇంకా పరిశీలిస్తే గిరీశం పాత్ర ద్వారా సంఘ సంస్కారోద్యమం ఎట్లా విఫలమైందీ నిరూపించడం ఆయన ఈ విషయంలో నిశ్చయ భావానికి వచ్చాడని చెప్పే అవకావం ఇవ్వడం లేదు. కన్యాశుల్కంలో బాల్యవివాహాన్నీ, కన్యాశుల్కాన్ని నిరసించడం కనిపిస్తుంది. విధవా వివాహ విషయంలో ధైర్యంగా పరిష్కారం చూపించలేదనే చెప్పాలి. నాటకం చివర గిరీశం టక్కరితనం నిరూపించడం, బుచ్చమ్మ వివాహం విషయంలో అను కూలమైన సూచన ఏమీ చేయకపోవడం ఇక్కడ మనం గమనించాలి. అయితే గురజాడ ప్రధానంగా ఆశించిన సంస్కారం వర్ణభేదములన్నీ మాసి పోవలెననీ, లోకమంతా ఒక యిల్లు కావలెననే అంశం. వర్ణభేదనిరాసం మధ్య యుగాలనుంచీ భక్తి ఉద్యమాలలో ప్రసరిస్తూ ఉన్న భావస్రోతస్సే. అయితే ఆధునిక జీవన పరిస్థితులు ఆ భావాన్ని ఆచరణలో సాధ్యం చేసినవి. ఈ అంశంలో ఆంగిలేయులు, ఆంగ్లేయ విద్యావంతులూ సమభావం కలిగిఉన్నారు. అయితే స్వయంసంపూర్ణమైన గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, నూతనమైన భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటమూ, తత్ఫలితంగా నాగరీకరణమూ, నూతన వృత్తులూ వర్ణభేద వికాసాన్ని అత్యంతావసరం చేశాయి. అప్పటికే వర్ణ వ్యవస్థ తన ప్రాథమిక భావాన్ని కోల్పోయి స్వరూప మాత్రంగా నిలచివున్నది. ఈ వర్ణవ్యవస్థలోని ప్రాథమికమైన భావంతో ఆయనకు పేచీలేదు. `విద్య నేర్చినవాడె విప్రుడు, వీర్య ముండినవాడు క్షత్రియుడు' అని వర్ణవ్యవస్థ ెుుక్క భావరూపాన్ని వ్యాఖ్యానించుతారు. ఈ భావచ్యుతి పొందిన వ్యవస్థ తొలగిపోవలెననే అంశం పునరుజ్జీవనోద్యమంలోని రెండు ముఖాలూ ప్రబలంగా కోరినవే. అప్పటికీ శ్రీరామకృష్ణ, దయానంద, వివేకానందులు వర్ణభేదనిరాసమునూ, అస్పృశ్యతా రాహిత్యాన్ని ప్రపంచించదమే కాకుండా తమ తమ పరిధులలో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వసుధైక కుటుంబమన్న భావం కూడా వివేకానందులు ఆమెరికాలో చేసిన ఉపన్యాసాలలో స్పష్టంగా ప్రతిపాదించిన అంశమే ఈ సన్నివేశంవల్ల గురజాడలో ముత్యాలసరాలు రాసేనాటికి ఈ రెండు భావాలూ గాఢంగా వ్యక్తం కావడానికి అవకాశం కలిగించినట్లు భావించవచ్చు. `ముత్యాలసరా'లన్న ఖండికలోని `జీవితేశ్వరి' ద్వారా గురజాడనాటి సంస్కారోద్యమానికి ప్రతిపక్షాన్ని కూడ మృదువుగా సమకూర్చినట్లు తోస్తుంది. ``కలసి మెసలిన యంత మాత్రనె కలగబోదీ యైకమత్యము'' ఇది ఆమె మాట. కేవలం పంక్తి భోజనాలు చేయడం ద్వారా ఈ మార్పు రాదు. సామాజిక పరిస్థితులలో సంస్కారంలో మార్పులు రావాలి. ఈనాటికీ మన ప్రవృత్తిని ప్రశ్నిస్తున్న ప్రశ్న యిది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కలసి మెలగుతూ వున్నా దేవాలయ ప్రవేశం కలిగించినా ముప్పయ్యా రేండ్ల తరువాత కూడా ఈ కులపు వ్రేళు్ల ఇంకా బలపడుతూ వుండటం మనం చూస్తూనే వున్నాము. ఈ ప్రయత్నాలలో ప్రధానమైంది మానసిక సంస్కారం. అది కలిగించే ప్రయత్నం భక్తి ఉద్యమాలు చేశాయి. వర్గాలలో ఉన్న న్యూనతాధిక్య భావాలమీద దెబ్బతీశాయి. సమైక్యానికి పునాది వేశాయి. సంస్కారోద్యమాలు రాజకీయాల నీడలు పడినాక వాటికి ప్రచారమూల్యం పెరిగింది. భావ పరివర్తన వెనుకబడింది. ఈ నాగరిక వల్ల వచ్చిన మరో మార్పు సమష్టి కుటుంబ విచ్ఛేదం. ఈ అంశం కూడా ఈ గీతంలోనే ``జీవితేశ్వరి'' ప్రశ్నించింది. అయితే గురజాడ రచనల్లో కాల్పనికోద్యమ ప్రభావం కూడా బలంగా కనిపిస్తుంది. ఆయన రచనల్లో ప్రేమ ప్రాధాన్యం స్పష్టంగా పేర్కొనబడింది. ``దేశమనిెుడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్‌'' అన్నచోట ``ప్రేమ కలుగక బ్రతుకు చీకటి మరులు ప్రేమని మది తలంచకు'' అంటాడు. ``కాసులు'' అన్న గీతంలో వివాహవ్యవస్థలో ప్రేమ ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని సృష్టీకరిస్తాడు. ``మగడు వేల్పన పాతమాటది ప్రాణ మిత్రుడ నీకు'' అని స్త్రీ పురుషవ్యవస్థలో ఆ యిరువురి సమ ప్రాధాన్యాన్ని వివరిస్తాడు. సతుల సౌరను కమలవనమునకు పతుల ప్రేమయే వే వెలుగు'' అంటాడు. ఈ వాక్యంలోని రూపకం స్త్రీ పురుషూల సంబంధాలలోని సామరస్యాన్ని ప్రాధాన్య క్రమాన్నీ సూచిస్తుంది. ఈ గీతంలో ``అమలిన శృంగార'' భావబీజాలు నిక్షిప్తాలై ఉన్నాయి. గురజాడ ముందు పేర్కొన్నట్లుగా బ్రహ్మ సమాజంలోను, దివ్యజ్ఞాన సమాజం లోనూ సభ్యుడుగా ఉన్నవాడే. ఆయన మతవిషయాలలో ఆధునికోద్యమాల ప్రభావం ఉన్నవాడు. కాని నాస్తికుడు కాడు. ``మనిషి'' అన్న గేయంలో విగ్రహారాధనకు అంటే బాహ్యాచార ఆడంబరాలకు ప్రాధాన్యం యిచ్చి మాధవసేవకు ప్రాధాన్యం యివ్వని మౌఢ్యాన్ని తిరస్కరిస్తాడు. మధ్య యుగాలలోని భక్తి ఉద్యమాలలోని ఈ భావం ఆధునిక యుగంలో శ్రీ రామకృష్ణాదుల ముఖాన ప్రస్ఫుటమైంది. ఈశ్వరుడు సర్వసంస్థుడు. ఆయన ఉనికిని రాయి రప్పలకూ, కొండ కోనలకూ పరిమితం చేయటం తప్పు. భక్తులకు ఈశ్వరుడు కన్ను దెరచిన కానబడుతాడు. ఈ కన్ను దివ్యచక్షుస్సు. ఎరిగి కోరిన ముక్తిని యిస్తాడు. ఇక్కడి ఎరుక జ్ఞానము, కోరిన భక్తితో చేసే సమర్పణము. అనంత కరుణామయుడైన ఆ ప్రభువు కరిగి భక్తవశుడై ముక్తినిస్తాడు. ఈశ్వరభక్తి సంబంధించిన సంప్రదాయ రూపకాలు నీలగిరి పాటల్లో స్పష్టంగా గోచరిస్తవి. ఉమాపతి యర్చన అన్న గీతంలో ఉదకమండలం ఉమాపతి అర్చన ెుట్లా కోటి గుణితమైన పుణ్యఫల మిస్తుందో సూచిస్తాడు. తెలమబ్బులలో ఉదక మండలమే హిమాలయముగా గోచరిస్తుంది. అక్కడి ప్రకృతి అంతా ఈశ్వరార్చనకు సామగ్రి అయింది. ఆశ్రీతవరదుడైన అంబికారమణుడు రాణిని రక్షించవలెనని ఈ గీతం తాత్పర్యం. `చిత్తరువుని చూడ' అన్న గీతంలో విష్ణూప్రసక్తి కూడా వస్తుంది. గురజాడ రచనల్లో ``కన్యక'' ``పూర్ణమ్మ'' రెండూ గొప్ప గీతాలు. వీటిలోనూ, కన్యా శుల్కంలోనూ అసలు వివాహం ప్రధానమైన అంశం. ఆ విషయం కవిని ోభ పెట్టినట్లుగా గోచరిస్తుంది. ఈ రెండు గీతాలలో దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం ప్రాగ్రూపం (ఆర్కిటైప్‌) పని చేసినట్లుగా గోచరిస్తుంది. కన్యకలో రాజు దక్షుని స్థానంలో ధర్మస్వరూపాన్ని మరచి అహంకరించి మైమరచిన స్థితిలో గోచరిస్తాడు. అందుకే దక్షయజ్ఞంలో దక్షుని వలె రాజు నశిస్తాడు. పట్నమేలే రాజు పోెును, మట్టి కలసెను కోట పేటలు పదం పద్యం పట్టి నిలిపెను కీర్తు లపకీర్తుల్‌'' అని పూర్తి చేస్తాడు. అతని కోట కూలి నక్కల కాటపట్టయింది. అందుకే కన్యక రాజు ఎదురు పడ్డప్పుడు ``ఇంటిదైవం వీరభద్రుని దేవళానికి పోయి యిప్పుడె పళ్ళెరం సాగించి వత్తును'' అంటుంది. వీరభద్రుని పళ్ళెరం అనేది శైవుల యిళ్ళలో శుభాశుభ కార్యాలలో జరిపే ఒక కర్మకాండ. ఈ కర్మలో వీరభద్రుడు విజృంభించి దక్షునియజ్ఞాన్ని విధ్వంసం చేసిన వృత్తాంతం గీత నృత్యాలలో ఖడ్గఖేలనంతో స్మరింపబడుతుంది. ఈ లక్షణం వల్ల కన్యకకు సతీదేవితో సామ్యం లభించింది. పూర్ణమ్మ కూడ ఇలాంటి ఇతివృత్తమే ఈ కథలో పూర్ణమ్మ బాల్యం నుంచీ దుర్గ భక్తురాలు. కన్యక కథలోనూ దీనిలోనూ దుర్గాదేవి ప్రసక్తి కనిపిస్తుంది. గురజాడకూ ``దుర్గా''దేవికీ ఉన్న సంబంధం ఇంకా లోతుగా పరిశీలించదగింది. ఈ గీతంలో కవికి దుర్గోపాసన విషయంలో ఆసక్తి ఉన్న విషయం స్పష్టంగా గోచరిస్తుంది. గుడి పరిసరాల వర్ణన ఆమె దుర్గమత్వాన్ని (కొండల, కోనల, కొలనుల ప్రసక్తి వలన) సూచిస్తున్నది. ఆమె బంగరు దుర్గ. శ్రీ సూక్తంలో చెప్పబడిన ``హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం'' అన్న వర్ణన ెుుక్క సారమంతా ఈ బంగరు దుర్గ అన్నమాట వ్యక్తం చేస్తుంది. దుర్గ ెుట్లా హిరణ్మయో పూర్ణమ్మ కూడా పుత్తడిబొమ్మ. ఈ వర్ణన భక్తునికి భగవంతుడికి కలిగే అభేదాన్ని వ్యక్తం చేస్తున్నది. దీన్నే కంఠోక్తిగా పూర్ణమ్మ మరణించి నప్పుడు ``కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేనిపసల్‌, హంసల చేరెను నడకలబెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మా'' అని వర్ణించాడు. పంచభూతాలలో తత్తదంశలు విలీనం కాగా చివరకు ఆమె ఆత్మ ఆమె ఆరాధ్యయైన దుర్గలో ఐక్యాన్ని పొందింది. ఉపాసనా మార్గం విషయంలో కూడా దీనిలో కొన్ని అంశాలు కనిపిస్తుంది. ఏ ఏ వేళల పూచే పూవులు ఆయా ఋతువుల పండే ఫలాలు అన్నీ దుర్గకు ఆమె అర్పించేది. ప్రకృతి, కాలము రెంటి సంయోజనంవల్ల కలిగే చైతన్యస్పందం అంతా ఈశ్వరార్పితం కావలసిందేనని తాత్పర్యం. చివరకు దుర్గకు తన్నుతాను సమర్పణ చేసుకొన్న విధానికి ప్రతీకగా ఆమె మెడలో హారములమరెను'' అంటాడు కవి. ఈ కావ్యంలో అభివ్యక్తమయ్యే పూర్ణమ్మ దివ్యప్రకృతికి సూచనగా ఆమె మృతిని వాచ్యం చేయలేదు. ఒక విధంగా ఆమె పేరులో ఉన్న పూర్ణశబ్దం కూడా ఆద్యాదేవికి ప్రాగ్రూపంగా గూఢార్థ స్ఫోరకమేమో విచారించవలసి ఉన్నది. ఈ విధంగా విచారణ చేసినప్పుడు గురజాడ చైతన్యంలో ఈ క్రింది అంశాలు ప్రధానంగా కానవస్తవి.
1. గురజాడ ప్రధానంగా సంస్కారోద్యమంలో ప్రభావితుడైనవాడు అయినా ఆ ఉద్యమాలలోని పరిమితులను గ్రహించినవాడు. ఈ రంగంలో మానసిక సంస్కారానికి ప్రాధాన్యం యిచ్చేవాడు.
2. రాజకీయంగా ఆంగ్లేయ రాజ్యాన్ని అభిమానించేవాడు, ఆంగ్లేయుల సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని (కల్చరర్‌ ఇంపీరియలిజం) ఆహ్వానించే వాడు. ఆ సామ్రాజ్యం వల్ల దేశీయ గ్రామవ్యవస్థ ఛిన్నభిన్నమై వృత్తులు కోల్పోయిన ప్రజలు ఎట్లా ోభించిందీ గ్రహించినవాడు కాదు. జాతీయోద్యమానికి అనుకూలుడు కాదు.
3. ఆస్తికుడు. మత విషయాలలో నూతనోద్యమాలలోని సమన్వయ దృక్పథాన్ని అనుసరించినవాడు.
4. దేవీ ఉపాసనామార్గంతో తాదాత్మ్యం కలిగినవాడు.

No comments:

Post a Comment