దాశరథి కవితారంగంలోకి ప్రవేశించినప్పటికి `తెలగాణము్మ తమఃకవాటముల బందీ'యైనకాలం. ఆ స్తబ్దతలో నిశ్శబ్దరాత్రిలో జ్వాలాకేతనంతో ప్రవేశించి, ఆసాధారణ ప్రతిభతో, పాండిత్యంతో నిరంతర సాధనతో `ప్రాణలొడ్డి ఘోర గహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములన్ సృజించిన రైతుదే తెలంగాణము, ముసలినక్కకు రాచరికము్మ దక్కునే' అని గర్జించిన కవియోధుడు దాశరథి. అప్పటికి ఉధృతంగా సాగుతూవున్న ప్రగతివాదోద్యమంలోనికి ప్రవేశించి ఆ ఉద్యమంలోనికి జాతీయవాద దీప్తిని నిలబెట్టి నూతన ప్రాణాన్ని సమకూర్చాడు. ఇంట్లో నేర్చుకున్న సంస్కృత సాహిత్యం. పాఠశాల వాతావరణంలో అలవడ్డ ఉర్దూ పారసీక కవితా సౌందర్యం ఆయన తెలుగు పలుకునకు గొప్ప దీప్తిని తెచ్చిపెట్టింది. ఈ స్థితివల్ల అతని కవిత ప్రగతివాదోద్యమ పరిధి కంటె విస్తృతంగా రూపొందింది.
గెలిచినది గడ్డిపోచ, ముక్కలయిపోయి
మన్నుకరచెను గొడ్డలి, కన్నులోని
వేడి ఆశ్రువు గెలిచెను, వాడి కత్తి
ఓడిపోెును ముస్సి పారాడిపోెు. . .
అని హైదరాబాదు సంస్థాన విముక్తిని తాదాత్మ్యంతో వర్ణించాడు దాశరథి. ప్రగతివాద కవుల్లోలేని ఆత్మీయతకాల్పనికవాద కవుల వారసత్వంగా దాశరథి కవితలోనికి సాగివచ్చింది. జాతీయ చైతన్యం సమగ్రంగా శతపత్రసుందరంగా దాశరథిలో వికసించింది. అగ్నిధార ప్రారంభంలోనే
జెండా ఒక్కటి మూడు వన్నెలది, దేశంబొక్కటే భారతా
ఖండాసేతు హిమాచ లోర్వర, కవీట్కాండము్మలోనన్ రవీం
ద్రుండొక్కండె కవీంద్రు, డూర్జిత జగద్యుద్ధాలతో శాంతికో
దండోద్యద్విజయుండు గాంధి ెుుకడే, తల్లీ మహాభారతీ
ఈ పద్యంలోని వస్తువు ప్రగతివాద కవుల పరిమితులను దాటివచ్చింది. `గతమొక గంగయై హృదయగహ్వరమునన్ చొరబారింది'. వర్తమానం ఆయన కార్య రంగం. భవిష్యత్తు స్వప్న భూమి. మూడుకాలాలనూ తనలో సమన్వయించుకున్న కవి. అందువల్ల `మంచి గతమున కొంచెమేనోయ్' వంటి పాక్షిక ధోరణులతో ఆయన ఎప్పుడూ కుంచించ్టుపోలేదు. అందుకే దాశరథి `కాలం నా కంఠమాల' అన్నాడు. దాశరథి దృష్టిలో గతం వర్తమానం లోనికి ప్రేరక శక్తిగా ప్రవహిస్తుంది. `నా కవితా లతాంతము తృణము్మలలో నయినన్ సువాసనల్ ప్రాకెడి రీతి పూచినది, పాతదనము్మను త్రావి తేన్చి నాజూకగు కొత్తవాసనలు చూపిన దీ రసికాంధ్ర సాహితీ లోకమునందు' అని వివరించాడు దాశరథి.
దాశరథి కవిత్వంలో ఉద్వేగం ఎక్కువ.
ఏది కాకతి, ఎవరు రుద్రమ,
ఎవడు రాయలు, ఎవడు సింగన,
అన్ని నేనే అంతనేనే, వెలుగు నేనే తెలుగు నేనే
అరిశిరస్సుల నుత్తరించిన అలుగు నేనే, తెలుగు నేనే
అఖిల జగముల చుట్టివచ్చిన పులుగు నేనే, వెలుగు నేనే,
దాశరథి దృష్టిలో కవిత మాట్లాడని మల్లెమొగ్గ. నిశ్శబ్దం ఎరుగని నిమ్నగ. ఈ రెండూ వైరుధ్యం గల లక్షణాలు. వాచ్య ప్రధానం కాక వ్యంగ్యమును ప్రకటించే కవిత మాట్లాడని మల్లె మొగ్గ. నిశ్శబ్దం ఎరుగని నిమ్నగ అంటే దేశకాలాలకు అతీతంగా అందరి హృదయాలలోనూ నిరంతరంగా నిస్వనించే లక్షణం కలిగింది. ఈ రెండు లక్షణాలు కలిగివుండడం వల్ల కవిత ఆజరామరమౌతుంది. దాశరథి కవితకు పోరాటమే వస్తువు. ఈ పోరాటం అంతస్సులోనూ, బాహ్యంగానూ సాగుతున్నది. హిట్లర్, ముసోలినీ, నిజాంరాజులను ఎదరించి గెలిచిన మహావీరులు ఆయనకు సమానంగా ఆరాధ్యస్థానాల్లో ఉన్నవారే. అందుకే `నేను దుష్టూలతో రాజీపడలేదు వారితో సామరస్యం నా చేతకాదు. సమరసం కన్నా సమరమే నాకు ఇష్టం' అంటాడు.
దాశరథి కవితాచైతన్య స్పందన తెలంగాణా పోరాటంతోనే ప్రారంభం అయింది. `విషము గుప్పించినాడు, నొప్పించినాడు మా నిజాంరాజు జన్మజన్మాల బూజు' అని ధీరతతో పల్కి యుద్ధంలో పాల్గొన్న కవి అతడు. ఈ ధీరప్రకృతి ఆయన కవిత్వం నిండా వ్యాపించి ఉన్నది. జీవితంలోనూ సాహిత్యంలోనూ దేనితోనూ రాజీపడని వ్యక్తిత్వం దాశరథిది. చైనాతో, పాకిస్తాన్‌తో భారతదేశం జరిపిన యుద్ధాలలోనూ దాశరథి తన గొంతును శక్తిమంతంగానే వినిపించాడు. తెలంగాణ తోడి ఆత్మీయతయే అతనిని గొప్పకవిగా తీర్చిదిద్దింది. `నా తెలంగాణా కోటి రత్నాల వీణ' అన్న మాట తెలంగాణా ప్రజల వ్యక్తిత్వ చైతన్యానికి ప్రతీక వంటి వ్యక్తీకరణ నినాదమయింది. తెలంగాణంలోని ప్రతి అంశమూ ఆ కవితా యాత్రలో ఆయన గళంలోనుంచి కవితయై పాటయై వెలువడింది. నిజామాబాదు దగ్గర ఉన్న `మంజీర' ఆయనకు కావ్యవస్తువైంది. `ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర' అన్న పంక్తులలో ఆనందమూ, దుఃఖమూ జంటగా కనిపిస్తాయి. జీవితంలోని వైవిధ్యం ప్రకృతిలో నిష్పన్నమై స్ఫురిస్తున్నది.
దాశరథి కాళిదాసు వలె, రవీంద్రుని వలె ప్రకృతితో తాదాత్మ్యము చెంద గలవాడు. పూలలో జ్వాలలు, మస్తిష్కంలో లేబరేటరీ వంటి రచనల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆయన ఆధునిక కావ్యభాషలో ఎన్నో భావ చిత్రాలను, శబ్ద చిత్రాలనూ నిర్మించాడు. వెలుతురు బాకు, మించుకాగడా, చీకటి కలలు, నగ్నతరువు, అగ్నిచేలము, మోదుగు ముతై్తదువ, దీపాంగన, నయన శయనాగారం ఇలా ఎనై్ననా పేర్కొనవచ్చు. ప్రగతివాద కాల్పనిక వాదాల సంగమంగా ప్రారంభమైన దాశరథి కవితా యాత్ర క్రమంగా పునః కావ్యరచన వైపు, పునః ప్రయోగశీలతవైపు సాగింది. ఇంచుమించుగా ఒకే కాలంలో వచ్చిన మహాంధ్రోదయం, పునర్నవం కావ్య సంపుటాలు ఈ భావనకు దోహదం చేస్తాయి.
తరువాత మహాబోధి కథాకావ్య రచనకు మార్గదర్శకం కాగా పునర్నవంలో అంతుర్ముఖు డైనా, కవి ప్రయోగవాదం నుంచి మార్మికత వైపు మరలినట్లుగా గోచరిస్తుంది. దాశరథి వల్ల తెలుగు కవిత్వంలోనికి నూతన సౌందర్య ప్రపంచం ప్రవేశించింది. అరబీ పారసీ కవితా రీతుల విస్ఫార రీతి అది. ఆయన కవిత్వం చేప్పేప్పటికి సాగివస్తూవున్న ప్రగతివాదం కేవలం నినాదాలలోకి అకవిత్వంలోకీ జారిపడుతూ వున్నది. ఆయనవల్ల కావ్యవస్తు విషయంలో పార్టీల నియంత్రణకు గురౌతూవున్న యువకవిలోకం ఒక్కసారి విముక్త మైనట్లు భావించుకున్నది.
అంతర్జాతీయ దృక్పథం పేర జాతీయోద్యమాలనూ, సంస్కృతినీ జీవన మూల్యాలనూ తిరస్కరించి, స్వయంకృత పరాయీకరణ నుంచి తప్పించి కవితా చైతన్యాన్ని ఈ దేశపు మట్టిలో నిలబెట్టడం జరిగింది. అంటే దాశరథి మతవాదీ, మితవాదీ సంకుచిత జాతీయవాదీ కాదు. `ముసలిమొగం పడిన వృక్షం మీద యౌవనం చిగురించడం కవిత్వం' `రోజూ కనబడే నక్షత్రాలలోనూ రోజూ కనపడని కొత్తదనం చూసి రోజూ పొందని ఆనందానుభూతిని పొందటం అంటేనే కవిత్వం' అని నిర్వచిస్తాడు కవిత్వాన్ని. అందుకే అతని దృష్టిలో శక్తిమంతమైన శబ్దానికి జననమే కానీ మరణంలేదు.
తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనంలో దాశరథి పాత్ర గణనీయమైంది. ఈ ప్రాంతపు సాహిత్య సంస్కృతులలో ఆధునికత సంపూర్ణంగా ఆయన వల్లనే ప్రవేశించింది. దాశరథి తీసుకువచ్చిన ప్రగతివాద, కాల్పనికవాద జాతీయోద్యమాల సమన్వయం వలన పద్యరచనకు ఆధునిక పరివేషం కల్పించడం వలన, సామ్యవాదం నుంచి మానవతావాదం దాకా ప్రయాణించడం వలన తరువాత నవ్య సంప్రదాయ సిద్ధాంతం బలం పుంజుకోవడం జరిగింది.
దాశరథి పద్యం కాల్పనికోత్తరకాలానికి చెందిన శిల్పమర్యాద కలది. సాధారణ జనజీవన వ్యవహారంలోని శబ్దాలే కవి స్పర్శతో సుందర కవితా తోరణాలైనాయి. పూర్వం చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి చేసిన ధోరణికి ఇది కొత్త తరపు పొడిగింపు. ఆయన పద్యం ఆధునిక భావనకు ఆధారంగా నిలిచిపోయింది. `గాలిబ్' మొదలైన కవుల రచనల అనువాదం చేత తెలుగు కవితా ప్రపంచం వస్తు విస్తృతిస్థానంలో రస ప్రచుర వాగ్వ్యక్తికి ఆలంబనమైంది. దాశరథి కవిత్వం తెలుగువాళ్లకు ప్రాణాగ్ని జ్వాల. ఆత్మలక్షణ దర్పణం.
baga rasaru..manchi vishayam....
ReplyDelete