Thursday, July 9, 2009
ఈ తరంవారి భాగ్యం
తెలుగు సాహిత్యంలో సంస్కృతేతిహాస పురాణాలను మళ్ళీ అనువచించే సంప్రదాయం ఒకటి ఆదినించీ ఉన్నది. `మునివృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థ' మేర్పడ నన్నయ్యభట్టు తెలుగులో మహాభారతం పలకడం ప్రారంభించినాడు. తిక్కన ఎఱ్ఱనలు ఆ మార్గమే అనుసరించినారు. అయితే మూలం ఆధారంగా సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, శ్రోతల జ్ఞాన గ్రహణ పరిమితుల దృష్టిలో ఈ అనువచన ధోరణి ప్రారంభమయింది. అందువల్లనే మూలంలోని అనేకాంశాలు సామాజిక ధార్మికాంశాలు ఈ రచనలో కనిపించవు. ముఖ్యంగా భగవద్గీత, సనత్సు జాతీయము మొదలైన అనేక ప్రముఖ గ్రంథ భాగాలు లోపించినవి. అయితే మూలం ఒక ఆధారమై కవుల స్వేచ్ఛాచారణానికి అవకాశ మిచ్చిన ఈ రచనలు నన్నయాదుల కవితా శక్తికి నికషోపలాలు అయినవి. మహాభారత మూల గ్రంథ నిర్మాణవైఖరి, ఇతిహాస కథాంశ ప్రత్యేకతలు, అనేక జ్ఞాన విజ్ఞాన భాగాలు తొలగి పోయినవి. ఈ స్వాతంత్య్ర ధోరణి వాల్మీకి రామాయణం తెలుగులోకి తెచ్చినప్పుడు కూడా ప్రతిఫలించింది. భాస్కర రంగనాథులు రెండు మార్గాలను ఎన్నుకొన్నా, అనువచన పద్ధతి నన్నయాదుల మార్గమే. అవాల్మీకీయ కథాంశాల ప్రకారం కూడా ఎక్కువగానే ఈ రామాయణాలలో చోటు చేసికొన్నది. శ్రీనాథుని కాలంలో నైషధాదుల అనువాదం వచ్చేసరికి ఈ స్వాతంత్య్రం కొంచెం కుంచించుకుపోయింది. అయినా భాషలోని పూర్వ సంప్రదాయం `ఔచిత్యంబు పోషించియు, అనౌచిత్యంబు పరిహరించియు' సాగింది. ఇతిహాసం, పురాణం ఈ రెండూ వస్తు ప్రధాన రచనలు. కావ్యాలు భావ ప్రధానాలు. నాటకాలు పదప్రధానాలు. అందువల్లనే కవుల ప్రయత్నమంతా పురాణేతి హాసాల అనువచనమే. శ్రీనాథుని నైషధం వదలివేస్తే కావ్యాలు నాటకాలు ప్రాచీన సాహిత్యం పట్టించుకున్నవాళు్ళ లేరనే చెప్పాలి. ఏమైనా అనువాదం చేయవలసి వస్తే నాటకాలు కూడా కావ్యాలుగా రూపొందాయి. 19వ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్ల, సాహిత్య దృష్టి ప్రధానం కావడంవల్ల, కవుల ప్రతిభా విశేషాలను అంచనా వేయడం అంతస్థులను నిర్ణయించ ప్రారంభం కావడంవల్ల రచనా ప్రపంచంలో మార్పు వచ్చింది. కవుల కౌశలం ఎంచుకునే ధోరణి పెరిగింది. సాహిత్యానువాదం ఆయా కవుల ప్రతిభా ప్రకటనకే కాని అనువక్త ప్రతిభా ప్రకారం కోసం కాదని ఒక నిశ్చిత భావం ఏర్పడ్డది. అందుకే శరపరంపరగా కావ్యనాటకాదుల అనువాదం ప్రారంభం అయింది. మూల రచయితకు న్యాయం జరుగలేదనే ధోరణిలో ఒకే గ్రంథానికి అనేకానువాదాలు ఏర్పడ్డవి. ఒక్క మేఘదూతానికి, ఒక్క శాకుంతలానికి ముపై్ఫ పైగా అనువాదాలు రావడానికి ఇదే కారణం. ఇదే శతాబ్దంలో పురాణేతిహాసాల అనువాదం కూడా మళ్ళీ జరిగింది. శ్రీపాద వారు మళ్ళీ భారతం నిర్మించడం ఈ దృష్టితోనే. వావిలికొలను సుబ్బారావు గారి రామాయణం ఈ మార్గంలో నడచి సాగిన మరో రచన. ఆయన అనువాదంతోపాటు రామాయణానికి ప్రచారంలో ఉన్న వ్యాఖ్యానాలు ఆధారంగా ఒక బృహద్వా్యఖ్య నిర్మించి మందరమనే పేర అందించారు. వాల్మీకి రచనకు ఏఏ వ్యాఖ్యాన విశేషాలు అన్వయిస్తున్నవో అవన్నీ దీనికీ అనువర్తించగలవని వావిలికొలను వారి అభిప్రాయం. వావిలికొలను వారి దృష్టిలో రామాయణ రచన ఒక విశిష్ట స్థానంలో ఉన్నది అనే కాధ్యాత్మిక సంప్రదాయాల బీజగర్భితత్వం దీనిలో ఉన్నదని. అయితే, మనకు రామాయణం వేదోపబృంహణార్థమని భావించే ధోరణి ఒకటైతే కావ్యకళాదృష్టతో ఆద్యంతమూ విలువగల రచనగా ఆదికావ్యంగా పరిగణించడం ఇంకో దృష్టి. ఈ దృష్టిలో వాల్మీకి రచనను యథాతథంగా `తుచ తప్పకుండా' తెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇంత కాలానికి `రామానుజ రామాయణం' వల్ల జరిగింది. రామానుజ రామాయణం రచించిన మిత్రులు శ్రీ శ్రీ.న.చ. రామానుజా చార్యులుగారు నాకు ఆప్తమిత్రులు. తనలో నిద్రించి ఉన్న కవితా కుండలినిని మనో వాల్మీకంలోనించి తట్టిలేపి యేభై సంవత్సరాలు దాటిన ప్రాయంలో వాల్మీకి రామాయణాన్ని తెలుగులోనికి తీసుకువచ్చారు, దీక్షగా ఆరున్నర సంవత్సరాల యజ్ఞంగా. రామాయణ మూల రచనకు ఆధ్మాత్మిక, ధార్మిక, సామాజిక, భాషా సంబంధి, కళాత్మక ముఖాలు అనేకంగా ఉన్నవి. అయతే ఈ అనువాదంలో భాషా కళాముఖాలకే ప్రాధాన్యం ఉన్నది. వీలైనంతలో ఆయన శ్లోకం ఇముడగల దేశిచ్ఛందస్సులను ఎన్నుకోవడం, వీలైనంతలో దేశి శబ్దజాలాన్ని ఉపయోగించడం ఈ రచనలో ఉన్న విశేషాలు. శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారు వ్యాఖ్యానాలు పరిశీలించి అర్థ విస్పష్టతను సాధించారు. అయితే ఆ ధోరణిలో విస్తరించి వ్యాఖ్యానించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఆ ప్రలోభానికి లొంగక పోవడం తన వ్యక్తిత్వాన్ని మరుగు పరచుకోవటానికి చేసే ప్రయత్నం ఒక అసాధారణ సాఫల్యంగా నేను భావిస్తున్నాను. అనువాదం చేసే సందర్భంలో పద్యం క్రమంగా సారళ్యం పొందింది. `బడు' ను పరిహరించినా, సంస్కృత వాక్య విన్యాస ధోరణిని పరిహరించడం సాధ్యం కాలేదు. కొంచెం ఆ మార్గం అలవాటయితే, సంస్కృత రామాయణం చదువలేని వాళు్ళ, దాన్ని చేరలేనివాళు్ళ దీన్ని చదివి వాల్మీకి ప్రతిబింబాన్ని పోల్చుకోవచ్చును. ఈ అనువాద కార్యానికి తొలి ప్రోత్సాహం శ్రీ ఉషశ్రీది. అయితే ఈ రచనా సందర్భంలో అనువాదాన్ని మూలంతో సరిపోల్చుకుంటూ వినే అవకాశం నాకు చాలావరకు కలిగింది. నా పరిమితిలో కొన్ని చోట్ల చర్చించటం. శ్రీ.న.చ రామానుజా చార్యులుగారు కొన్ని చోట్ల మన్నించడం జరిగింది. కొన్నిచోట్ల తమ దృక్పథాన్ని విశదీకరించడం జరిగింది. ఒక విధంగా నాకు రామాయణాధ్యయనం చేసే అవకాశం, వాల్మీకిని అత్యంత సన్నిహితంగా ఎరిగే స్థితీ కలిగింది. శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారి మాట ఎంత `కచ్చితమో' జీవితంలో ఎంత క్రమశిక్షణో రచనలోనూ అంతే కచ్చితమైన క్రమశిక్షణ గల లక్షణము వ్యక్తమవుతుంది. ఎక్కడా అసమగ్రతతో ఆయన రాజీపడలేదు. ఎంత క్లిష్టమైన ఘట్టంలోనూ `నామూలం లిఖ్యతే' అన్న మార్గం ఆయన వీడలేదు. పారిభాషిక పదబహుళంగా ఉండే యజ్ఞ ఘట్టమూ, విశేషణాల పరంపర కలిగిన ఆదిత్య హృదయము, దేశ భౌగోళిక స్వరూపాన్ని వర్ణించే కిష్కింధలోని మార్గోపదేశమూ, అన్నీ ఈ క్రమశిక్షణలో సాగినవి. విశిష్టాదై్వత సంప్రదాయంలో బహు విశేషభావనలకు తావిచ్చే రామాయణ విశేష శ్లోకాల సంపుటికి `తని శ్లోకి' అని పేరు. ఆ శ్లోకాల రచనలో కూడా కత్తివాదర మీద నడకలాగా ఈ అనువక్త రచన సాగించి దీనికి రామానుజ రామాయణం అన్న పేరుంచడంలోని ఔచిత్యాన్ని ఋజువు చేశారు. అయితే శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారు గురుకుల క్లిష్టూలవునో కాదో కాని ఆంధ్ర మహాభారత సముద్రము దరియంగ నీదిన ప్రయోగదక్షులైన విద్వాంసులు. ఏ సందేహం కలిగినా పూర్వకవి ప్రయోగమును చప్పున ఉదాహరించగలవారు. కవిగా ఆయనకు ఈనాటిలోకం మీద ఉన్న నిరసన ధోరణి అంతా మూర్ఖ శతకంలో మిక్కిలి కటువుగా వ్యక్తమవుతున్నది. రామానుజ రామాయణంలోని అనువాద ధోరణిని పరిశీలించడం, పైన పేర్కొన్న అంశాలు ఆధారంగా జరగాలి. తేషాం కేతురివ జ్యేష్టా రామో రతికరః పితుః బభూవ భూయో భూతానాం స్వయంభూ రివ సమ్మతః (బాల1823)దీని అనువాదం వారిలోన పెద్దవాడు రాముడు పతా కము్మవోలె ప్రీతికరుడు తండ్రి కఖిల భూతతతికి ఆత్మభవుం డట్లు సమ్మదము్మ గూర్చు సంతతము్మఈ అనువాదంలో `పతాకము్మ' అన్నమాట పాదాంతంలో గురువు మీద విరిగి విలక్షణమై తన వ్యక్తిత్వ ప్రత్యేకతను చాటుతున్నది. ఇక్కడ కవి పదాన్ని ఎన్నుకోవడంలో `కేతు' శబ్దం తొలగిపోయి మరింత అసందిగ్ధతను చాటుతున్నది. ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి గుణా ద్రూపగుణాచ్చాపి ప్రీతి ర్భూయో భ్యవర్ధత (బాల7726)దీని అనువాదం ప్రీతిపాత్ర యెు్య సీత రామునకును తండ్రి కూర్చినాలు తానగుటను గుణము వలన రూపగుణమున సైతము పెంపు మీరు చుండె ప్రీతి మిగులఈ పద్యంలో మూలం ఎక్కడా చెక్కుచెదరక పోవడం, సంస్కృతం పలుకుబడి తెలుగులోకి అందంగా దిగిరావడం గమనించవచ్చును. అసిధారావ్రతంగా ఈ అనువాద కార్యం నిర్వహించిన రామానుజా చార్యులుగారిని అభినందించడం తప్ప మనం చేయగలిగిన దేముంది? వాల్మీకి గిరి సంభూతయైన రామాయణ మహానది తెలుగు క్షేత్రంలోకి ఇంత సులభంగా ప్రవహించడం ఈ తరం తెలుగువాళ్ళ భాగ్యం. ఈ యజ్ఞం పూర్తిచేసి అవబృథ స్నానం చేసిన రామానుజాచార్యులుగారిని వారి షష్టిపూర్తి సందర్భంగా హృదయ పూర్వకంగా అభినందించడం, వాల్మీకిని ఇష్టపడే సాహిత్య ప్రవాహ వీథీ సాంయాత్రికు లందరికి ధర్మం.
Subscribe to:
Post Comments (Atom)
chaalaa baaga raasaru ---very good abservetion
ReplyDelete