Thursday, July 2, 2009

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 1

ఈనాటి చాలామంది తెలుగు కవిత్వ విమర్శకులకు, పరిశీలకులకు కవిత్వాన్ని ఒకే ప్రవాహంగా ధోరణిగా చూడటం అలవాటు. మిగతా ధోరణులు, కావ్యరచనా సంప్రదాయాలు ఎంతటి బలమైనవైనా వాటిని ఉపేక్షించి, ్ర పాధాన్యం తగ్గించి, అవి అసలే కవిత్వంకాదన్న ముద్రవేయటం, ఈ ధోరణిలో ఒక ముఖ్యమైన అంశం.
స్వాతంత్య్రం వచ్చేనాటికి అవిచ్ఛిన్నంగా ఎప్పటికప్పుడు నూత్నచైతన్యాన్ని తనలో సంగమింప చేసుకుంటూ జాతీయభావం దేశీయత మానవీయ సంస్కృతి మూలాంశాలుగా నవ్య సంప్రదాయ ధోరణి కానవస్తున్నది. అప్పటికి ప్రబలంగా ఉన్న ప్రగతివాదం రాజకీయోత్థాన పతనాల కారణంగా 1955 నాటికి కుప్పకూలింది. శిష్‌ట్లా మొదలైన కవుల పరంపర ప్రయోగవాద ధోరణి ప్రగతివాదంలోని కొన్ని అంశాలను సంగమింపజేసుకుంటూ యూరోపీయ అస్తిత్త్వవాద ధోరణులను సమాశ్లేషిస్తూ, ఫ్రెంచికవుల సింబలిస్టు ధోరణులను ఆహ్వానిస్తూ ఒక నవ్య కవితా ధోరణికి స్వాగతం చెప్పుతున్నది. అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో ఈ ఉద్యమం నిశ్శబ్దంగానే `కవిత' పత్రిక ద్వారా బయటపడుతున్నది. అజంతా, వరద్ట, రాజశేఖర్‌ మొదలైన కవులు ఈ పద్ధతిని నడిపించేతీరు కనబడుతున్నది. అనుకోకుండా ఇంకా ప్రగతివాద పరివేషం పూర్తిగా వదలని కుందుర్తి వీరిలోనే ఉన్నారు. శ్రీశ్రీ ఆరుద్రలు ఈ ఆశ్రమంలోనికి చేరుకున్నారు. `సాహిత్యోపనిషత్తు'లో తమ పరివర్తనను స్పష్టంగా చాటుకున్నారు.
అప్పుడే ఆధునిక ధోరణిలో మేల్కొన్న తెలంగాణం. ప్రగతివాదంనుంచి నడచివచ్చి తన త్రోవన వెదుక్కొంటున్నది. దాశరథి `మహాంధ్రోదయం'లో తెలుగు సమాజాన్ని దాని మహోజ్జ్వల వైభవాన్ని పద్యరచనా వైదగ్ధా్యన్ని స్వాయత్తంచేసుకొని విజృంభిస్తున్నాడు.
తెలగాణము్మ తమః కవాటముల బందీయైన నిశ్శబ్దరా
త్రులలో మేల్కొని; కోటి తము్మలను మేల్కొల్పన్‌ మహోల్కాసము
జ్జ్వల దగ్నిప్రభలీను గీతముల నభ్రమ్మంటగా పాడి తె
ల్గులలో వెల్గులు నాటినట్టి కవితా లోక ప్రభా నీరధీ
(జలపాతం సి. నారాయణరెడ్డి)
అతని ఉద్విగ్నజాతీయ చైతన్యంలో పారశీక కవితా మాధుర్యమూ కాళిదాసాదుల కావ్యలావణ్యమూ, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల కవిత్వ చైతన్యమూ సంగమించి నూతన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపచేశాయి. ఈ జలపాతంలో తడుస్తూ వచ్చిన కవి నారాయణరెడ్డి దాశరథి మార్గంలోనే జాతీయ చైతన్యం మూలచైతన్యంగా ప్రజాస్వామ్య సంస్కృతి నేపథ్యంగా నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలు రచిస్తున్నాడు.
క్రమంగా `దాశరథి సంప్రదాయం' కవిత్వంలో రూపాన్ని పట్టించుకోలేదు. పద్యమూ, గేయమూ, వచన పద్యమూ మూడూ ఈ ధోరణిలోని కవులు వాడుకున్నారు. అయితే ఈ స్వేచ్ఛ శిల్ప విషయంలో విశృంఖలతకు అవకాశమీయదు.
ఆరుద్ర ప్రధానంగా ప్రయోగవాది. `త్వమేవాహం'లో తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి ఉందని ఆయనే వ్యాఖ్యానించుకోవలసివచ్చింది. చెరిషించు, పెరిషించు మొదలైన ప్రయోగాలు దానిలోనే నిద్రపోయాయి. `త్వమేవాహం' తరువాత ఆరుద్ర ఏ భావబిందువుు దగ్గరా నిలువలేదు. ప్రయోగాలుగానే సాగింది అతని కవితాయాత్ర.
అబ్బూరి ఛాయాదేవి `కవిత' ప్రచురణ రెండు సంచికలతో ఆగింది. శ్రీశ్రీ, ఆరుద్ర, వరదలు `మేమే' రాసినప్పుడు ఒక ఉన్మత్త ధోరణి తొంగిచూచింది. ఆశ్రయం కోల్పోయిన కుందుర్తి క్రమంగా వచనకవిత్వ ఉద్యమం పేరున రూపవాదాన్ని ఆశ్రయించ వలసివచ్చింది. అజంతా బింబసంయోజనలు చేసుకుంటూ ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు.
వచన చ్ఛందస్సులో జాతీయ ప్రజాస్వామ్యతత్త్వం ఆధారంగా నిరంతర రచన కొనసాగిస్తూ సాగిపోతున్నాడు మాదిరాజు రంగారావు. సుప్రసన్న పద్యము, గేయము, వచనపద్యమూ సాధన చేస్తూనే కవితారంగంలో సామాజిక ధోరణులతో బాటు ఆధ్యాత్మిక అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీ అరవిందుల తత్త్వచింతన ఆధారంగా ఈ భూమినే దుఃఖరహితంగా పునారచించవలసిన ఆదర్శాన్ని కవిత్వంలో కేంద్రంగా చేసుకొని తన అన్వేషణ ప్రారంభమయింది. ప్రజాస్వామ్యం జాతీయ చైతన్యము, వ్యక్తి సర్వతోముఖ వికాసము, దివ్యజీవన సాక్షాత్కారము ఇవన్నీ చేతనావర్తానికి కారణము లయ్యాయి. ఉద్యమాల హోరుగాలి ఒత్తిడిలో దీని వ్యక్తిత్వాన్ని ప్రధాన ధర్మాన్ని మరచిపోయిన తెలుగు విమర్శ ప్రపంచం ఈ సమగ్ర సమన్విత దృక్పథాన్ని అర్థం చేసుకోవటంలో వెనుక ముందాడింది. దేశీయతత్త్వం మూలాలను వెదకిపట్టుకొన్న ఈ ధోరణి నెమ్మది నెమ్మదిగా `సాహిత్య భూమి'లో వ్రేళూ్లనుకోవటం జరుగుతూ వచ్చింది. సాహిత్య సౌందర్య దర్ళనం భారతీయ జీవన మూల్యాలతో మళ్లీ ముడి వేసుకున్నది. ప్రగతివాదం వస్తుసంవరణంలో చేసిన నియంత్రణ క్రమంగా అదృశ్యమయింది. విద్వాన్‌ విశ్వం 1955 ప్రాంతాలలో రాయలసీమ దారుణమైన కరువుదృశ్యాన్ని జీవనాన్ని `పెన్నేటి పాట'లో పద్యంగా గేయంగా చిత్రించి దాశరథి మార్గాన్ని తేజస్వంతం చేశాడు. (ఈ గ్రంథాన్ని మొదట తెలంగాణా రచయితల సంఘం ప్రచురించింది).
అరవైల నాటికి సాహిత్యరంగంలో ప్రబలంగా ఉన్న ధోరణులు మూడు:
1. నవ్యసంప్రదాయము
2. కుందుర్తి నిర్వహిస్తున్న వచన కవిత్వవాదమనే రూపవాదము
3. దాశరథి కవితాసంప్రదాయము
ఇక్కడ దాశరథి కవితా సంప్రదాయమంటే 1) ప్రగతివాదం విధించిన వస్తు పరిమితులకు లొంగకుండా వుండేది. 2) జాతీయ సంస్కృతిలోని మేలి సంప్రదాయాలను స్వాయత్తం చేసుకునేది 3) విశ్వజనీన దృక్పథం కలది. 4) అభివ్యక్తి విషయంలో రూపవిషయంలో ఏ పరిమితులకూ లొంగనిది 5) మానవుణ్ణి భౌతిక, సాంస్కృతిక ఆధ్యాత్మిక త్రిపుటిగా భావించేది 6) ప్రజాస్వామ్య దృక్పథం మీద అచంచల విశ్వాసంకలది 7) పీడితులు, తాడితులు లేని సర్వశ్రేయస్సమాజంకోసం భావించేది.
ఒక విధంగా తెలంగాణాలో స్వాతంత్య్రానంతరం తెలుగుకవితా ధోరణి ఈ ప్రభావ పరిధిలోనే ప్రవహించింది. నారాయణరెడ్డి, మాదిరాజు రంగారావు, బాపురెడ్డి, సంపత్కుమార, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి, కవిరాజమూర్తి యీ వ్యాసకర్తా మొదలైన వాళ్లందరూ ఇంచుమించుగా ఈ విస్తృత కవితా భూమికకు చెందినవారే. ఇంకా వీరికి ప్రేరణ యిచ్చిన వాళ్లల్లో కాళోజీ, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, పి.వి. నరసింహరావులను ప్రత్యేకంగా పేర్కొనాలి.
పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్కీ్సయ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమూ్యనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత' అన్నగేయం కమూ్యనిష్టూల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి' (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు.
నీవు నేనూ కలసి, నేను నీవూ కలసి భూమిదేవికి పూలువేద్దాము
పుడమితల్లికి పూజచేద్దాము
వీరాధివీరులౌ శ్రీరామచంద్రులన
కారుణిక మూర్తులౌ శాక్యగౌతములను
జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను
కన్నతల్లికి హారతిద్దాము
కన్నీ కడిగి పూజిద్దాము
నీవు పుట్టిన నేల, నేను పుట్టిననేల . . . .
పాలునీరుగ మనము కలసి పోయిననేల
కలసి పోయిన మనము కరగిపోయిననేల
జంట నాగళ్లతో బీళు్ల దున్నిన నేల
నీళు్ల గొట్టిన నేల కాపుగాచిన నేల
రామరాజ్యపు చల్వపందిరెత్తిన నేల
గాంధిపుట్టిన భూమి, తిలకు పుట్టిన భూమి
శాంతి ఆయుధముతో స్వాతంత్య్రపథములో
సామ్రాజ్యరాక్షసిని సంహరించిన భూమి
ఇంటింట జాతీయ జెండ లెగసిన భూమి
కోటొక్క ప్రజలకు తిండి బెట్టేనేల
చల్లచల్లని శాంతి నీడ నిచ్చే నేల
మెల్లమెల్లగ మనలపెంచి సాకేనేల
నిండ నూరేండ్లయి కండ్లుమూసేటపుడు
పట్టుపాన్పులాంటి గుండెపై జోకొట్టి
జోలపాడే నేల, నిద్రబుచ్చేనేల (పే. 42,43)
తమ ఉద్యమం రోజుల్లో `దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషూలోయ్‌' అన్న గేయాన్ని `వందేమాతరం' గేయానికి ప్రతిద్వంద్విగా, వలస వాదులకు అనుకూలంగా కమూ్యనిస్టులు వాడుకున్నారు. ఈ గేయం సంస్కరణోద్యమాన్ని బలపరచేది. స్వాతంత్య్రోద్యమానికి అననుకూలమైంది. స్వాతంత్య్రోద్యమంలో భారతదేశం చరిత్ర సంస్కృతి సాధించిన ఔన్నత్యాలు ప్రేరకాలు. దేశం ఒకవిధంగా జగన్మాతృ రూపమైంది. గురజాడ ఆంగిలేయుల ధర్మరాజ్యాన్ని ప్రశంసించినవాడు. గతమును చూచేప్పుడు వాళ్ల దృష్టితోనే చూచి, `మంచిగతమున కొంచెమేనోయ్‌' అన్నవాడు. పాములపర్తి సదాశివరావు రచన కమూ్యనిస్టులలో రావలసిన భావపరిణామాన్ని దేశీయతా దృక్పథాన్ని ఎత్తిచూపింది. గురజాడ వంటివారి దేశాన్నిగురించిన ఆలోచనలోని రిక్తతను, శూన్యత్వాన్ని బట్టబయలు చేసింది.
ఈ నడుమ దిగంబరకవులు హఠాత్తుగా ఒక నాలుగైదు సంవత్సరాలు చెలరేగటం జరిగింది. అరాచకత్వం, మొరటుతనం, ప్రజాస్వామ్య వ్యవస్థల వైఫల్యం వల్ల కలిగిన నిస్పృహ, ఎక్కడో బలంగా స్రై్టక్‌ చేయాలనే ధోరణి, బూతు పదాల ప్రయోగం ఇవన్నీ వీరి ఆయుధాలు. గిన్‌‌సబర్‌‌గ మొదలైన అమెరికన్‌ కవుల ధోరణులు వీరికి బలాన్ని యిచ్చాయి. అయితే క్రమంగా ఈ ఉద్యమం విరసంలో కలసిపోయింది. పలుచ పలుచగా అటూ ఇటూ చెదరిపోయింది.

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 2

1970 వచ్చేప్పటికి అరసం ప్రగతివాద కవిత్వం మార్కి్సస్టు తత్తా్వనికి కట్టుబడవలసిన అవసరంలేదని నొక్కి చెప్పింది. మరొకవైపు తీవ్ర వామపక్ష భావ సంచలనంలో ఊగిపోతున్న సిి. విజయలక్ష్మి విషాదభారతం, `తిరుగబడు కవులు' దీనితో విభేదించారు.
ఇన్నేళు్లగా సాగుతున్న వస్తుపరచర్చాధోరణి వల్ల కవిత్వాంశానికి ప్రాధాన్యం తగ్గుతున్నదేమో నన్న సంశయం చాలామందికి కలిగింది. కవితారచనకు కవిత్వ స్పృహ వుండటం అత్యవసరం అనేది ఒక తీవ్రభావమై కవిత్వజగత్తు అట్టడుగుభాగాన్ని స్పందింపజేయటం మొదలైంది. 1971లో అఖిలభారత తెలుగు రచయితల ఐదవ మహాసభలో కవి సమ్మేళనం అధ్యక్ష పీఠంనుంచి బోయిభీమన్న ఈ ఆవేదనకు అక్షర రూపం కల్పించాడు. `నీవు నిజంగా కవివే అయితే/నిజంగా కవిత్వం వ్రాయి/నినాదాలు మానెయ్యి (26) భూమినుంచి పుట్టేది కవిత్వం/కార్ఖానాల నుంచి పుట్టేది పాండిత్యం / ప్లాస్టిక్‌ పువు్వల్ని చూచి భ్రమసిపోకు/ఎంత చిన్నదైనా నీ తోపని మానకు (33) సాహిత్యానికి దేశకాలాలు లేవు/సరస్వతి నిత్యయౌవని సనాతని/ఆనాడు కంచి పట్టు చీరలు కట్టింది/ఈనాడు నైలాన్‌ సిల్కువోణీలు వేస్తున్నది (43) సమాజానికి రసభావ సౌందర్యదాతవు/సమైక్యానికి సాక్షాత్‌ పరమేశ్వరుడవు (48) జీవితాన్ని నలుముఖాలుగా అనుభవించు/అనుభవం నుంచి ఆనందమధువును వెలయించు (53).
బోయి భీమన్న ఆలోచనలు అలంకార శాస్త్ర సంప్రదాయాన్ని పునఃస్థాపించాయి. మమ్మటుడ చెప్పిన, `నియతికృత నియమ రహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రాం నవరసరుచిరాం,' అన్న వాక్యాలకు స్థూలమైన వ్యాఖ్యానాలు. తన నాటికి కవిత్వంలోనికి ప్రవేశించిన బింబసంయోజనంలోని సంక్లిష్టతను, ప్రతీకల గందరగోళాన్నీ విమర్శిస్తూ `వాల్మీకిశ్లోకం నీ పద్యంకంటే సరళం / కాళిదాసు డెందం నీ కందం కంటే సరసం' అని నూతనాభివ్యక్తి పేరున ఎంతటి అభివ్యక్తుల కీకారణ్యంలోనికి ప్రవేశిస్తున్నామో వివరిస్తున్నారు.
విరసం ఏర్పడటానికి ముందే కవితారంగంలో ప్రకాశించిన బైరాగి, తిలక్‌లను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. `తిలక్‌ అటు భావకవి ఇటు అభ్యుదయ కవి కాడు. అందుకే ఆ రెండు సంప్రదాయాలలోని కొన్ని లక్షణాలను తనలో సంగమింప చేసుకొని తానొక తీర్థప్రాయుడయ్యాడు' (కె.వి.ఆర్‌. `ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర పే. 221) నూతిలో గొంతుకల్లో బైరాగి ఆధునిక నాగరికతా వైఫల్యాలను, అది ఆత్యంతికంగా కలిగించిన వైక్లబ్యాన్ని చిత్రించాడు.
దాశరథికీ తిలక్‌కూ కొన్ని పోలికలు ఉన్నయ్‌. విస్తృతమైన సమాజమూ, కవితా భూమిక ఇద్దరికీ సమానం. దాశరథి ప్రగతివాదం నుంచి బయటకు వచ్చి కొనసాగినట్లే, తిలక్‌ ప్రగతివాదపు దారినుంచి నిష్ర్కమించి వచ్చాడు. `అమృతం కురిసిన రాత్రి'లో తిలక్‌ ఎంత ఎత్తు ఎదిగినా `పునర్నవం'లో దాశరథి అందుకున్న శిఖరాలకు చేరువ కూడా కాలేకపోయాడు.
`1970లలో అటు విరసం రూపుదిద్దుకుంటున్న తరుణంలోనే సరికొత్త కవిత్వానికి పునాదులు పడ్డట్లు మనం గ్రహించవచ్చు. మే 1969లో సంకలితమైన `చితిచింత', మార్చి1972లో వచ్చిన `చెట్టు నా ఆదర్శం', 1974లో వెలువడిన శేషేంద్ర `మండే సూర్యుడు' అజంతా వెలువరిస్తున్న కవితలు ఈ కొత్త కవిత్వానికి రూపురేఖలు దిద్దినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.' (కవిత్వం ఒక ఆత్మఘోష, సుమనశ్రీ పే. 44). అటు విరసం మార్గం సాగుతూ వుండగానే బలంగా మరొక మార్గం కవిత్వానుభవం ప్రధానంగా సాగిన అంశాన్ని మనం గుర్తించుకోవచ్చు.
ఈ అంతర్ముఖ స్రవంతికి దోహదంగా వరంగల్లుకు సమీపంలో తాటికాయలలో నిశ్శబ్దంగా తన ఊహలకు రూపమిస్తూ వస్తున్నాడు పొట్లపల్లి రామారావు. `చుక్కలు' 60లలో తొలిసారి అచ్చయినా విస్తృత ముద్రణం 1974లో వచ్చింది. రామారావు జీవితాన్ని అన్ని స్తరాలనుంచి పరిశీలించి చేసిన కవితామయమైన రచనా విశేషమిది. వచనకవిత్వం తాత్తి్వకంగా రూపుదిద్దుకోబోతున్న భవిష్యత్తును ఈ రచన సూచించినట్లు సువ్యక్తమయింది.
అంతర్ముఖ బహిర్ముఖాలుగా రెండు ధోరణులూ వేరువేరుగా సాగుతూవున్నా నడుమ ఒక నిశ్శబ్దమైన ధోరణి సాగివస్తున్నది. దాని కేతనం దాశరథి పునర్నవంలో ఎత్తాడు. యుగసంకేతంలో (1969) మాదిరాజు రంగారావు `మతాల విచ్చుకత్తుల మెరుపులలో బ్రతుకును వెలిగించలేను. ఇజాల చిక్కుటుచ్చుల తలపులతో బ్రతుకును బంధించలేను' (52) `నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయం, రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం (15) ముక్తకాలు (1970)లో అని వాఖ్యానిస్తున్నారు. విమర్శకుల దృష్టి అంతగా పడలేదు కాని 1971లోనే అనాదినుంచి నేటివరకు మానవుని జీవితంలోని ఉత్థాన పతనాలను చిత్రించిన మహాకావ్యం `మానవీయం' రచించాడు.
అత్యంతమైన ప్రతిభాశక్తితో కవిత్వంలో శబ్దాలను శిల్పాలుగా తీర్చిన ఒక తనదైన `దర్శనం' గల కవి అరిపిరాల విశ్వం. `రేపటి స్వర్గం', `కాలంగీస్తున్న గీతలు' `హళేబీడు' మొదలైన సంకలనాలలో ఈయన ఎంతో శక్తిశాలిగా కనిపిస్తాడు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే `విశ్వం' సృష్టించే కావ్యభాష శేషేంద్ర సృష్టించిన కావ్యభాషతో బుజాలు ఒరిపిడి పెడుతూ వుంటుంది. `అంతర్గోళాలు' `చిరంతన' రచనలతో ఒక విలక్షణమైన కవితాముద్ర వేసికొన్న కవి దుర్గానంద్‌. గోపాలచక్రవర్తి, శీలా వీర్రాజు. మిరియాల రామకృష్ణ, పరిగి రాధాకృష్ణ, పణతుల రామచంద్రయ్య మొదలైన కవులు ఈ సంధి కాలంలోని వాళ్లే.
1955నుంచి 1970 వరకు కొత్త కవిత్వం ఏదో వెతుక్కున్నట్లు కొనసాగింది. ఒక స్పష్టమైన లక్షణం జాతీయ ప్రజాస్వామ్యంపైన అచంచలమైన విశ్వాసం. వదులుగానైనా కొందరు సామ్యవాదాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు ఏకాంత రహస్య గుహాసీమల్లోని వెలుగులకోసం రహస్యవాదాన్ని ఆశ్రయించినవాళు్ల. `నగరంలో వాన', `అముద్రిత కావ్యం' రచనల దగ్గరకొచ్చేప్పటికి కుందుర్తి కూడా సదసత్సంశయంలో పడి సత్తువైపు ప్రయాణిస్తున్నాడు.
1976లో ఆర్‌.ఎస్‌. సుదర్శనం రచించిన `నిశాంతం' వెలువడింది. `నిశాంతం' మార్మిక కవితా ధోరణికి స్పష్టమైన అభివ్యక్తినిచ్చింది.
ఎన్ని జన్మలు పూవులో నెన్నిరేకు
లెన్ని మధురవాసనలు నా హృదయమందె
యుగయుగము్మల కాలము్మ నొదిగి ెుుదిగి
పుచ్ఛమును మ్రింగబోవు పామువలె నుండు
సృష్టి అనుస్యూతిని జన్మపరంపరల అనంత చక్రాకారాన్ని సూచిస్తున్నదీ పద్యం. త్టోను మ్రింగే పాము అనడంలో జన్మమృత్యువులనే బిందువులు ఒకేచోట సంగమించటం అనే జీవన రహస్యం ఇక్కడ వ్యక్తమవుతున్నది.
`ఈనాటి సమాజంలో ఉన్న పరిస్థితులకు ప్రతిరూపంగా కవిత్వమూ వివిధ భావధోరణులతో కనిపిస్తున్నది. రామాయణ కల్పవృక్షం పూర్తిఐంది. మహాసర్గ అవతరించింది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి ప్రభవించాయి. వందేమాతరం వినిపించింది. విశ్వంభర ఉదయించింది. దిగంబరంచేతనావర్తంవిప్లవం ఇట్లా అనేకం భావావేశం లక్ష్యశుద్దితో తెలుగులో కవిత్వం స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నది. జాతీయభావన, సంస్కరణం, పరివర్తనం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, విప్లవం, సంప్రదాయ పరంపరా పార్వా్శలతో గోచరిస్తుంది. వీరిలో ఒక్కొక్క రచయిత వ్యక్తిత్వంలో ఒక్కొక్కటి ఆధిక్యం వహిస్తూ లేదా కొన్నింటి కలయికచేత విశిష్టరూపాన్ని పొందుతూ పరిశీలనలో గోచరిస్తాయి.' (ఆధునిక కవిత్వం సమాలోచన. మాదిరాజు రంగారావు పే.45) ఈ పరిణతికి ఆధారభూతంగా ఒక సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగివస్తున్నదని పేర్కొంటు న్నాడు విమర్శకుడు. ``ఏ దేశమైనా ఏ సాహిత్యమైనా పరంపరగా వచ్చే సంస్కృతీ భావన ఒకటి వుంది. ఈనాటి జీవనవ్యవస్థలో నిరసనకు గురైన దురాచారాలు చెల్లని నియమాలు అహేతుకమైన ధోరణులు తీసివేస్తే సారభూతమైందీ సంస్కృతీ ప్రస్థానంలో శిఖరంగా నిలిచే సంప్రదాయ పరంపర ఉంది. ఇది ప్రతి భాషా సాహిత్యానికి వర్తిస్తుంది. (ఇదే పే.44) ఈ మాదిరాజు రంగారావు అభిప్రాయంలో ఒక సంతులనం ఉన్నది.

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 3

ఈ పరిస్థితిలో తెలుగు కవిత్వంలో ఉదయించిన నూతన ప్రభాతం ``మండే సూర్యుడు'' ఆవిర్భవించడంతో సంభవించింది. ``విరసం'' ధోరణులు క్రమంగా సాహిత్యరంగానికి దూరమై రాజకీయోద్యమంతో తాదాత్మా్యన్ని పొందటం ఒకవైపు జరిగింది. రాజకీయ స్పృహ ప్రధానాంశమైంది. నియంత్రణ పెరిగి వస్తురూపముల విషయంలో కవి రాజకీయపక్షపు ఆదేశాలకు లొంగిపోతున్నాడు. సాహిత్య రంగంలో నాయకత్వం పరాయివాళు్ల బలవంతంగా ఆక్రమిస్తున్నారు.
ఈ సందర్భంలో శేషేంద్ర ఆవిష్కారం `మండేసూర్యుడి' కాంతిలో కవిత్వ జగత్తును జేగీయమానంగా ప్రకాశించేటట్లు చేసింది.
శేషేంద్ర ఆంధ్ర కవితా జగత్తును ప్రకాశింపజేసిన ప్రధానాంశాలు ఇవి.
1. రాజకీయపక్షాల ప్రాబల్యం నుంచి కవితాజగత్తును విముక్తం చేయటం సాహిత్య జగత్తుకు కవియే నాయకుడని స్పష్టంగా ప్రకటించటం.
2. శుష్కమైన, నినాదప్రాయమైన అకవితా సందోహం భస్మీకరించిఅచ్చమైన కవిత్వ స్పృహను పెంచి కవితా సాధనను ఒక స్పష్టమైన అభినివేశంగా తీర్చిదిద్దటం.
3. కవిత్వాన్ని వ్యాఖ్యానించేప్పుడు తన చేతనను నిర్భయంగా ప్రకటించుకోవటం.
4. ప్రాచ్య పాశ్చాత్య వాఙ్మయాలలోని ఇతిహాసాల ప్రక్రియలను అధ్యయనం చేసి ఆధునిక ప్రక్రియలుగా తన రచనలను ప్రవేశప్టెటం.
5. ప్రతీకలను, బింబసంయోజనను ఫ్రెంచి కవుల నుంచి స్వీకరిస్తూనే వాల్మీకి, కాళిదాస భవభూతులు మొదలైన భారతీయ కవుల ప్రతీకలను, బింబములను ప్రయోగించటాన్ని వివరించి వారి విశ్వజనీనతను ప్రవ్యక్తం చేయటం.
6. ఉదాత్తములైన భారతీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించుతూ, నిర్జీవములైన ప్రాచీనాంశాలను తిరస్కరించటం.
7. నన్నయ్య అనంతరంరాయప్రోలు అనంతరం తెలుగు కావ్యభాషను ఆమూలాగ్రం పరివర్తన చేసి కవిత్వానికి కొత్త రక్తమాంసాలను సమకూర్చటం
8. మార్కి్సజాన్ని జీవన తత్త్వంగా అంగీకరిస్తూనే దాని నుండి విశ్వజనీన చైతన్యం దాకా ప్రస్థానం చేయటం.
9. ప్రగతివాద కవిత్వోద్యమం, విప్లవకవితోద్యమం తీసుకురాలేని వేగాన్ని, ఆవేశాన్ని వచనంలోకి ప్రతిఫలించేట్లు చేయటం.
10. కవిత్వంలో నూతన భాషను సృష్టించుకొన్నప్రతీకలను, బింబాలను విరివిగా ఉపయోగిస్తూ వచ్చినా కావ్యం పాఠకులలో ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఆస్వాదయోగ్యం చేయటం. ఎక్కడా సంక్లిష్టతకానీ, అస్పష్టత కానీ ఉండకుండా ప్రతీకల బింబాల అశ్వ హృదయం తెలిసిన దార్శనికుడైన కవి కావటం.
11. ఈనాటి జీవనానికి అనుగుణంగా ఉపనిషత్తత్తా్వన్ని వ్యాఖ్యానించటమేకాదు. ఆ భాషలోని ముడులను విప్పి తాత్తి్వక రహస్యాలను వెల్లడించటం.
12. తన ప్రతి పరిశీలనను, అనుభవాన్ని, తన జాతిజనుల అనుభవ సంపుటులను కవిత్వంగా మార్చగల స్పర్శవేదిగా తాను రూపొందటం.
ఈ పన్నెండు అంశాలను చూస్తే కవి తెచ్చిన పరిణామం ఎంత బృహత్తరమో అంచనా వేయటానికి కొంత కాలం వేచి చూడవలసి ఉందనిపిస్తుంది. శేషేంద్ర రచనలన్నీ సంకలితాలై ఆధునిక మహాభారతంగా సంకలితమైనాయి. దీనిలో పన్నెండు పర్వాలున్నాయి. దీనికి అనుబంధకావ్యంగా జనవంశం అనే రచనా వచ్చింది. తన కవితా సర్వస్వాన్ని మహాభారతంతో ఏకీభావాన్ని భావించుకోవటంవల్ల శేషేంద్ర దేశీయ జీవన మూలాల్లోకి ప్రవేశించాడు. ప్రగతివాద కవులూ, ప్రయోగవాద కవులూ, విప్లవ వాదులు అందరూ ఈ విషయంలో విఫలమే అయ్యారు. దీని మూలాలు దాశరథిలో ఉన్నా శేషేంద్రలో ఆవిష్కృతమైనంత శక్తిమంతంగా అవి వెలువడలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం శీర్షిక మహాభారత స్ఫురణ కలిగివున్నా తాత్తి్వకంగా భారతంలోని పరమార్థ స్ఫురణ అంటే ఆత్మబలి లేదు.
తన మహాభారతానికి కర్షకుడే నాయకుడు. `ఈ దేశానికి నాగలి ప్రతీక. ఈ దేశపు ఆకృతి నాగలి. ఆకృతి ఒకదాన్ని ఒకటి పోలివుంటుంది.... అతడే ఈ దేశపు జీవన దానప్రభువు' అంటాడు కవి. దేశపు ఆకృతి నాగలి పోలివుండటం అన్న ఒక్క అంశం చాలు శేషేంద్రను జాతీయ మహాకవిగా గుర్తించేందుకు.
శేషేంద్ర కవిత్వ ధర్మాన్ని గురించి శ్రీకాంతశర్మ ఇలా అంటున్నాడు. `శేషేంద్ర శర్మలో లాలిత్యం, అలాగే శబ్దగతమైన కర్కశత్వం ఏకకాలంలో ఒకే కవితలో కలగలిసి, చిత్రమైన బొమ్మలు గీయడానికి ప్రతీకల ద్వారా దోహదం చేస్తాయి. ప్రతి భావాభివ్యక్తి లోనూ ఒక సామూహికత ఉంటుంది. ఏక రూపమైన విశేషభావం, పక్షులుగా, నక్షత్రాలుగా, వల్లికలుగా, వనాలుగా అనేకతను సంతరించుకొంటుంది. బాహ్య ప్రపంచాన్ని తనలోకి లాక్కోవాలనే తపన; లోపల క్రిక్కిరిసిపోయిన శబ్ద ప్రపంచాన్ని విసిరివేయ్యాలనే ఆరాటం; ప్రతిబింబిస్తాయి ఆయన ప్రతీకలు. నీరైపారిపోయినా, సూర్యుడై మండినా తన ప్రతీకలో తనే మునిగిపోయే కవి ఆయన. (ఆలోచన పే. 44. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. 1981).
రామాయణం అశ్వమేధంతో ఆరంభమయింది. భారతం సర్పయాగంతో ప్రారంభమయింది. అందుకే ఇతిహాస రచన ఒక యజ్ఞం. `ఇతిహాస నిర్మాణానికి బాధాపూర్వక బలి కావాలి. నేనే ఆ బలి. నా ప్రతిభ, నా పాండిత్యము, నా అనుభవము ఈ అన్నింటినీ జోడించుకొన్న నా ఆయుస్సు సర్వమూ పిండి మాటల గొంతుల్లో పోసిన ప్రక్రియ ఈ ఇతిహాసం. ప్రపంచ మానవుల్ని, వాళ్ల చరిత్రలని, వాళ్ల జయాప జయాల్ని, వాళ్ల భూత భవిష్యద్వర్తమానాల్ని నా ఇంద్రియ వాద మార్గ ఆర్జిత జ్ఞాన నేత్రంతో అవలోకనచేసి విశ్వదృశ్యం నుంచి ఈ తాత్పర్యాన్ని క్రోడీకరించాను. దూర దూరాల కొండల్లో కూర్చొని ఏకాంత గురుత్వాన్ని ఆశ్రయించి ఈ ఆధునిక మహాభారతాన్ని పొందాను' తన రచనా రహస్యాన్ని తపోవ్యగ్రతను ఇంతస్పష్టంగా ప్రకటించిన కవులు చాలా అరుదు. దూరదూరాల కొండలు, ఏకాంత గురుత్వమూ కవి తన చేతస్సీమలను దాటి ప్రచేతస్సీమలను చేరుకోవటం స్పష్టంగా నిరూపిస్తున్నది. ఈ ప్రచేతస్సీమలను గురించిన ఎరుక శ్రీ అరవిందుల తత్త్వదర్శనంలో కావ్యతత్త్వ చింతనలో స్పష్టంగా కానవస్తున్నది.
సూర్యుడు ఈ శుభ దినాన్ని
మోసంచెయ్యనియ్యను
ఈ దేశపు ప్రాచీరేఖ మీద
సూర్యు డుదయించకపోతే
మండే నా గుండె చీల్చి దానిమీద పెడతా (సూర్యపర్వము 61 పే.)
ఎదురుచూచిన నూతన యుగోన్మేషం జరుగటం లేదు. ఈ సారి కవి తన చైతన్యాన్నే నూతన యుగ భూమికగా అమరుస్తానంటున్నాడు. ఆ గుండెభవిష్యద్దర్శనం జీవకోటి అనంతస్వప్నాల సంకలనం. తప్పక దాన్ని వాస్తవం చేస్తానంటున్నాడు కవి. నాగలిని గురించిన వర్ణన ఇలా ఉంది. `నీవొక కరమ్రుక్కవే కావచ్చు / కానీ అనాది సృష్టిలో తలెుత్తిన/మానవ మహాకృషి ఏకైక చిహ్నానివి . . . . నీ స్పర్శ మట్టిలో నిద్రిస్తున్న/కలల పరిమాణాల్ని మేల్కొల్పి/దిశల్లో విదిలించింది. . . . .శ్రమ జీవుల లోకానికి ఒక/ నూతన సూర్యుణ్ణి వాగ్దానం చేశాను' (ఆ.మహా. పే.92) ఎంత కొత్త పలుకుబడి. నాగలి నూతన యుగ నిర్మాణ హేతుభూతమైన ఒక మహాశక్తికి ప్రతీక అయింది.
`గింజ దిగగానే చినుకు పడగానే వారు ప్రేమించిన గింజల గర్భంలో ప్రవేశిస్తారు. మనుష్యూల జన్మలకు మళ్లీ బీజాలవుతారు.' (ఆ.మహా47) ఈ వాక్యాల్లో సృష్టి పరిణామ రహస్యం ఉన్నది. ఉపనిషత్తులలో చెప్పిన పంచాగ్ని విద్య ఉన్నది. దీన్నే `నా దేశం నా ప్రజలు' ఆరంభంలో `నేను ధాన్యంలోనుంచి పుట్టాను. ధాన్యంకోసమే బ్రతుకుతాను. మరణించి ధాన్యంలోకే వెళ్లిపోతాను' (ఆం. మహా 12పే) అని అంటాడు.
శేషేంద్ర కవితలోని ఏ పంక్తి ఎత్తుకున్నా సజీవంగా ఉరకలేస్తూ ఉంటుంది.
ఆకాశం కనిపించటం మానేసింది
ద్రవ్యరాక్షసి కడుతున్న బహుఅంతస్తుల భవనాలుచూచి (165)
అతనితోపాటు అతని స్వప్నాలుకూడా
కాలుతున్న పరిమళం
అతడు ఒక శతాబ్దం మీద నిలుచున్న వీరుడు. (158)
అడవిలో నాకోసం మరణించిన ఆ వీరునికి
ఎవడు కట్టగలడు ఎత్తయిన సమాధి
నా గుండె వాడి మీద లేచిన గోపురం
నా ఆశ్రువులే వాడిమీద రాలుతున్నపూలు (159)
జీవితం ఒక మహాసముద్రం కావచ్చు
కానీ ఆశ అనే నావలో దాన్ని దాటి వేయవచ్చు (188)
మనుషూలందరూ నడిచే సముద్రాలు
చివరకు కాలపు కెరటాల్లాంటి పునః
పునరావృత్త ప్రాచీన పంక్తుల్లో అర్ధశక్తి
ఆవిష్కారం జరిగింది. నాలో కల్లోలం
స్వస్వరూప దర్శనమిచ్చింది (275)
మరొకచోట అంటాడుకవి `భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కరలేదు మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరతలేదు'! (323) అని. శేషేంద్ర కవిత్వం నిండా ఒక ప్రబలమైన ఆశ. పునర్నిర్మాణ దీక్ష. శేషేంద్ర కవిత్వమంతా ఆధునిక మానవుని సుదీర్ఘ సుందరస్వప్నం.

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 4

శేషేంద్ర ఆధునిక కావ్యభాషను సృష్టించటం ఒక అంశం అయితే అంతకన్నా ప్రబలమైన అంశం ఆధునిక వచన కావ్య రీతిలో మహాకావ్య నిర్మాణం చేయటం. ప్రాచీన మహాకావ్యాలకు కథాంశం మూలసూత్రం. మానుష కథ ఆధారంగా చేసిన నిర్మాణం కావటంవలన విభావాదులకు బలం సమకూడి జీవన వేదనల సమీకరణం ద్వారా ఒక విశిష్టమైన అనుభవ విశేషం దానికి చేరువయ్యింది. ప్రాచీన కాలంనుంచీ భారతీయ సాహిత్యం ఈ సమీకరణం ఆధారంగా రససిద్ధాంతాన్ని నిర్మించుకొన్నది.
ఆధునికకవి వలె ప్రాచీనకవి అంతగా అంతర్ముఖుడు కాడు. తన సంవేదనలను కావ్యపాత్రల ముఖంలో వ్యక్తంచేయగల నిడివీ పొడవూగల వస్తు జగత్తుగలవాడు. కథా ప్రధానంగా కావ్యనిర్మాణం చేయవలెననే ఆలోచన అరవైల తొలిరోజులల్లోనే కుందుర్తి ప్రభృతులు చేయటం (ఈ వ్యాసకర్తకూడా ఆ భావాన్నే అప్పుడు బలపరచటం జరిగింది). దాన్ని తిలక్‌ ప్రభృతులు వ్యతిరేకించటమూ జరిగింది. ప్రాచీనకావ్యం సమష్టి ప్రక్రియ. దానిలోనే కథ ఉంది. వర్ణన ఉంది. ఉపదేశం ఉంది. చమత్కారం ఉంది. నాటకీయ రీతి ఉంది. ఆధునిక కాలంలో నాకం స్వతంత్రించి ముందుకు రావటం కథనంకోసం ప్రత్యేకంగా నవల, కథ ప్రక్రియలు పుట్టుకు రావటం జరిగింది. వర్ణనలు ఖండకావ్యాలలోకి జారిపోయాయి. ఈనాడు కావ్యం మిగిలితే ఖండ కావ్యంగానే ఉండిపోయింది. ఈ సంకుల సన్నివేశంలో కవులు ఈనాటి కావ్యం పద్దెనిమిది పుటలే/ పంక్తులే అనే దశకు చేరుకున్నారు.
విస్తృతమైన సామాజిక సంవేదనను, విశ్వసంవేదన వెల్లడించేందుకు కవిత్వం సాధనం కాలేక పోయింది. వచనంలో మాలపల్లి, వేయిపడగలు ఆధునిక ఇతిహాసాలై ఏకవీర, చివరకు మిగిలేది వంటివి ఆధునిక కావ్యాలైనై. హిందీలో కామాయని ఒక త్రోవచూపింది. సుమిత్రానందన్‌పంత్‌ లోకాయత్‌ ఇంకా విస్తృత భూమికలో మహాకావ్య నిర్మాణానికి ప్రయత్నం చేసింది. నారాయణరెడ్డి కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలు ప్రాచీన కథా కావ్యాల నేటి పద్ధతి కొనసాగింపై నవ్య సంప్రదాయ మార్గంలోకి చేరిపోయినయ్‌. సుమనశ్రీ `నేత్రం నా సంకేతం' పీఠికలో నిఖిలేశ్వర్‌ `పదిదృశ్యాల కవితా సంపుటిని నేను కావ్యంగా ఆమోదించలేక పోతున్నాను' అంటాడు. కావ్యం ఖండకావ్యం కన్నా విశిష్టమైన ఏకాత్మభావం కలిగిన రచనా విశేషమన్న భావం అందరిలోనూ ఉన్నది.
పెన్నా శివరామకృష్ణ రచించిన `జీవనది' పీఠికలో సంపత్కుమారాచార్య ఇలా అంటున్నాడు. `ఏ కావ్య నిర్మాణమైనా కథ ఉన్నా లేకపోయినా సరే కావ్యపరమార్థ దృష్టా్య సాగుతుంది. భారతీయాలంకారికుడయిన దండి `కావ్యం కవే రభిప్రాయః' (కావ్యమంటే కవి ెుుక్క అభిప్రాయం) అన్నాడు. కావ్యం ద్వారా కవి పాఠకుడికి వ్యక్తం చేయదలచుకొన్న అభిప్రాయం అర్థంెుుక్క వివర్త రూపమే కావ్యం'.
శేషేంద్ర `మండే సూర్యుడు' వెనువెంటనే వచ్చిన మహాకావ్యం' `నా దేశం నా ప్రజలు'. ఒక రామాయణంవలె మహాభారతంవలె అతి దీర్ఘమైన కావ్య శరీరం ఆద్యంతం అనుభవించి తన చైతన్యంలో సంలీనం చేసుకునే వ్యవధి తక్కువ కావటంవల్ల ఈనాటి కావ్యాలు సంక్షిప్తరూపంలో ఉండటం లక్షణం అన్నది ఒక విధమైన సమర్థన మాత్రమే అవుతుంది. పాశ్చాత్య దేశాలలోను మనదేశంలోనూ నవలలు వేయిపేజీలను మించిన పరిణామంలో వెలువడటం వాటిని ప్రజలు అంగీకరించటం మనకు తెలియని అంశమేమీకాదు. అయితే ప్రాచీన కావ్యంలోని కథాంశం తొలగిపోయిన ఆధునిక కావ్యం/ఇతిహాసం లఘురూపాన్ని పొందటం విస్మయపరచే అంశమేమీకాదు. ఇందుకు ప్రధానకారణం ఇతివృత్తరాహిత్యం.
అందువల్ల ఆధునిక మహాకావ్యాలకు నాయకుడు నామరూపములు కలిగి ఒకానొక దేశకాలాలకో బద్ధుడైనవాడు కాదు. తననుతాను విశ్వీకరించుకొన్న కవియే ఈ కావ్యాలలో వక్త. తానే నాయకుడు. కావ్యంలోని ప్రతీ అంశంతో తాదాత్మ్యం చెందగలవాడు. `నా దేశం నా ప్రజలు' ఆవిధంగా భారత కర్షక నాయకమైన దేశీయ చైతన్యం రూపుకట్టిన కావ్యం. ఇది ఎనిమిది సర్గల కావ్యం. `నిజానికి ఒకటో సర్గలోని పథకమే రకరకాలుగా పునరావృతమై విస్తృతమౌతుంది మిగతాసర్గల్లో. ఇది కావ్యంలో లయ' అన్నారు ఆర్‌.ఎస్‌.సుదర్శనం (యుగకవి శేషేంద్ర 1976 పే.9)
`నా దేశం నా ప్రజలు' తెలుగు కవిత్వరంగంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. నారాయణరెడ్డి `విశ్వంభర' ఈ మథనంలోనుంచి వెలువడిన మరొక ఇతిహాస కావ్యం. భూమితోనే ప్రారంభమయిన తన జిజ్ఞాస వేయిరేకుల పద్మమై విచ్చుకొన్నది ఈ కావ్యంలో. ఈ కావ్యం అంతా మానవుడు తన సుదీర్ఘ చరిత్రలో చేసిన మహాప్రస్థానం చిత్రించింది. శేషేంద్ర కావ్యంలో మానవుని జీవన సంవేదన మూలం కాగా విశ్వంభరలో మానవుని జిజ్ఞాస మూలమైంది. `నా దేశం నా ప్రజలు'కు ఇలియట్‌ `ది వేస్టులాండ్‌.' ప్రేరణయిస్తే విశ్వంభరకు జయశంకర్‌ప్రసాద్‌ `కామాయని' దారిచూపింది.
పెన్నా శివరామకృష్ణ `జీవనది' మహాకావ్య నిర్మాణంలో మరొక సఫల ప్రయత్నం. ఈ కావ్యం `ద్వాసుపర్ణా' అన్న శ్రుతిని ప్రతీకగా చేసుకొని ప్రారంభమయింది. భారతీయ జీవన పురుషార్థ సాధక దృష్టి ప్రధానంగా ఈ కావ్యం కొనసాగి ఈ దేశ సంస్కృతి కేంద్రంగా చేసుకొని విశ్వజనీనంగా ఎదిగింది. ఈ కావ్యంలో వర్తమానంలోని `కుహనా లౌకికవాదం' ఎంత నష్టం కలుగచేసిందో వివరిస్తున్నాడు కవి
మా సహనమే మమ్మల్ని కాటేసింది
మా సౌభ్రాతృత్వమే దేశాన్ని అవమానాలపాలు చేసింది
మా శత్రువు లెవరెవరిని ఎంతగా ప్రేమిస్తున్నా వన్నదే కాదు
మా శత్రువుల విజయాని కెంత సంబర పడుతున్నావన్నదీ
నీ దేశభక్తికి కొలమానమే
మరొకచోట కవి కవిలక్షణాన్ని వివరిస్తూ `అనుభవాన్ని ప్రేమించని వాడికి/అశ్రువు విలువ తెలీదు/ప్రపంచాన్ని ప్రేమించనివాడు కవి కాలేడు' అంటున్నాడు. ఈ ప్రేమ ఆధారమైన కవి హృదయం ఈ కావ్యాన్ని విశ్వజనీనం చేసింది.
`నాదేశం నా ప్రజలు' నుంచీ వెలువడుతున్న ఆధునిక మహాకావ్యాలను నిర్వచించే ప్రయత్నం చేరా చేశారు. `ఒక ప్రధాన వస్తువుతో, ఒక తాత్తి్వక చింతనతో, సందేశంతో, అనేక భావాలతో, ళీళిళిఖిరీతో, కథ లేకుండా, అర్బేనిటీ అనే లక్షణం కలిగివుండి, తగినంత విస్తారంగా ఉన్న దీర్ఘ కవితను ఆధునిక మహాకావ్యం అంటున్నాను. (కొయ్యగుర్రంపీఠిక) కథా రాహిత్యమును ఒక స్పష్టమైన లక్షణంగా పేర్కొని చేరా ఆధునిక మహాకావ్య స్వరూపాన్ని నిర్ణయించటం జరిగింది. మిగతా లక్షణాలు ఏ మహాకావ్యానికైనా అన్వయించేవే.
వచన కవిత్వరూపం క్రమంగా వికసిస్తూ మహాకావ్యంగా, ఇతిహాసంగా వృద్ధిపొందటం మనం గమనించదగిన ప్రధానాంశం. క్రమంగా రూపం మీద శ్రద్ధకన్నా అభివ్యక్తి వస్తువిన్యాసము ఈ క్రమంలో ప్రాథమ్యం వహించాయి.
1987లో సుప్రసన్న ఒక ఆధునిక మహాకావ్యాన్ని `శతాంకుర' రూపంలో ప్రకటించడం జరిగింది. `కావ్యంలో ఏ కవిత కా కవిత ప్రత్యేకంగా ఆత్మాశ్రయ ధోరణిలో వచన చ్ఛందస్సులో ఖండ కావ్యరూపంగా వ్యక్తీకరించబడింది. కాని ప్రధానాంశం జగజ్జీవన చిత్రణ, కాలస్వరూప విశ్లేషణ, అనంతత్వోపాసన, సృష్టిమూలగవేషణ, త్రివిధ భూమికలలోని దైవాసుర సంఘర్షణ మొదలైన ఐతిహాసిక కావ్య లక్షణాలు, సృజన భూమికల అన్వేషణ, సౌందర్యంతో మమేకత్వం, ప్రేమ దుఃఖంవంటి సుకుమార లలిత భావ వ్యక్తీకరణ మొదలైన కాల్పనిక కావ్య లక్షణాలన్నీ శతాంకురలో గాఢమైన అనుభవ లోకాలను ఆవిష్కరిస్తాయి `(కె.వి.యన్‌. రాఘవన్‌, అభినవ భారతి పే.300) ఏకసూత్రంలో గ్రథితమైన మణిహారం వంటి ఈ కావ్యం తాత్తి్వక కావ్య ధోరణి వికాసానికి బాటవేసింది.
సుప్రసన్న ఇటీవల వెలువరించిన మరొక ముఖ్యమైన మహాకావ్యం సాంపరాయం (2002). ఈ అనంతేతిహాసం (జూచీరిబీ ళితీ శినీలి జూశిలిజీదీరిశిగి) ప్రస్తావనలో రచయిత వ్రాసుకొన్న మాటలివి `సాంపరాయంలో సృష్టా్యరంభంనుంచీ భావి దుఃఖరహిత జగన్నిర్మాణం దాకా గతాగతాలు వర్తమానంలోనికి వచ్చి ముడి వేసుకొన్నాయి. సర్గవిస్తరణలోనికి ప్రసవవేదన భౌతిక ప్రాణిక చైత్త్యస్తరాలలోని సంక్లిష్టత అంతరంగ చైతన్యం దుఃఖ విముక్తికోసం చేసే తపస్సు దీనిలో ఇతివృత్తాలైనవి.
`వస్తు విన్యాసంలో ఏ సరిహద్దులూ లేవు. నాలోనుంచి అమూర్తమైన జీవన పరంపర `పికాసో' చిత్ర సంపుటిగా అభివ్యక్తమై తన ఆంతర్యాన్ని వ్యాఖ్యానించింది. బిందువునుండి మండలం దాకా పరిణామం చెందే క్రమంలో విశ్వవికాసంలోని అన్ని ఘట్టాలనూ, సభ్యతల విస్ఫోటనాన్ని, జీవనంలోని పరిమితులను స్వప్నసంకలనాలలోని సామరస్యాన్ని విశదం చేసింది.
`ఆనంత్యం' రూపుగట్టుకొని వచ్చిమృత్యుకవాటాన్ని వివృతంచేసే ప్రయత్నంలో ఈ కావ్యప్రపంచం ఇతిహాసమై అవ్యక్త శిలాగర్భంలోనుంచి ఆవిష్కృతమైనది. వేదోపనిషత్తులూ, జానపదపురాగాథలూ ఆదిమ ప్రాగ్రూపాలూ తామై కావ్యద్రవ్య సముద్రంలోనికి ప్రవహించాయి. ఈ మెటామార్ఫసిస్‌లో ముడిసరుకుగా ఉన్న సంస్కారాలూ, భావనలూ, బింబాలూ, కల్పనలూ, అన్నీ అనుభవజగత్తులోనికి ఒకానొక అపూర్వ పరిమళాలను మోసుకు వచ్చాయి', (ప్రస్తావన).
పన్నెండాశ్వాసాల ఈ ఇతిహాసం చివరి మూడుసర్గలలో ఉపనిషత్కథలూ, బౌద్ధగాథలూ సంలీనమయినాయి. కథా రాహిత్యమన్న లక్షణానికి ఇది కొంతవరకు అపవాదం వంటి సన్నివేశం. సాహిత్య విమర్శ ధోరణిలో మహాకావ్యం, ఇతిహాసం ఈ రెండు శబ్దాలు పైన పేర్కొన్న కావ్యాల సందర్భంలో అనిశ్చితంగానే వాడబడుతున్నాయి. `నగ్నముని' కొయ్యగుర్రాన్ని మహాకావ్యమన్న చేరా నిశ్చయమూ వివాదరహితం కాలేదు.
5
మొత్తంమీద తెలుగు కవిత్వం ఇంచుమించుగా ఈ మూడు దశాబ్దాలలో విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే ప్రధాన దృశ్యాలు ఇవి.
సెవెన్‌స్టార్‌ సిండికేట్‌వారి అభ్యుదయ సాహిత్య సదస్సు (1970) నాటికి `అరసం' ప్రగతివాద కవిత్వానికి మార్కి్సజం తప్పనిసరి కానక్కరలేదని స్పష్టంగా ప్రకటించింది. సాయుధ విప్లవమే నూతన సమాజ నిర్మాణానికి అవసరమని భావించిన నక్సల్‌బరీ పోరాటం సమర్థించే సాహిత్యకారులు శ్రీశ్రీని కలుపుకొని విరసం ఏర్పరచటం జరిగింది. విరసం క్రమంగా వచనకవిత్వంలోంచి పాటలోకి సాగిపోయి ఒకే ఇతివృత్తం, పరిమితమైన అభివ్యక్తి మార్గం, నియతమైన ఛందస్సులను పరిమితమైన పునఃపునరావర్తనం చేత ఒక మొనాటనీని తప్పించుకోలేక పోయింది. పాడటం లేకుండా రక్తికట్టే పరిస్థితి లేకపోవటం వల్ల అది విప్లవకారుల వారి అనుయాయుల సభలకు పరిమితమై పోయింది. గద్దర్‌, శివసాగర్‌, వంగపండు ప్రసాద్‌ వంటి కవుల రచనలకు ప్రాచుర్యం కలిగింది.
అయితే తమ కవిత్వ సాధనలో అర్బేనిటీపోకుండా మధ్యతరగతి వర్గంలో తాదాత్మ్యం చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు శివారెడ్డి. నగ్నముని, వరవరరావు ప్రభృతులు. శివారెడ్డి ప్రతిభ చేత వస్తువు రత్న గర్భమై ప్రకాశించింది అతని కావ్యాలలో.
దళితవాదం గొంతువిప్పినప్పుడు చాలా బలంగానే విన్పించినా క్రమంగా సమగ్రసమాజం ెుడల సహానుభూతిలేని కారణంగా విశ్వజనీనతను సంతరించుకోవటం కష్టమవుతున్నది. అయినా ఈ మార్గంలో ఉత్తమశ్రేణిలో ెుండ్లూరి సుధాకర్‌, శిఖామణి, సతీష్‌చందర్‌, బన్న ఐలయ్యలు నిలుస్తున్నారు. స్త్రీవాదమూ పరిమిత వస్తువిన్యాసంతో క్రమంగా వెనుకంజవేస్తున్నది. కొండేపూడి నిర్మల, సావిత్రి, జయప్రభ, రజని మొదలైన వారి కవితలు స్త్రీ జీవనంలోని సంవేదనలను స్పష్టంగా ప్రకటించాయి.
ఇదంతా ఏదోవిధమైన నిరసన, సంఘర్షణ, పోరాటాలను ఆశ్రయించిన పార్శ్వం. అయితే రెండవ పార్శ్వంఅధివాస్తవికత, అస్తిత్వవాదం, సంశయ వాదం, అంతర్జగత్తులోని కల్లోలం ఇవన్నీ వ్యక్తంచేసే కవిత్వ భూమి. ఇక్కడ అక్కడక్కడా రహస్యవాదం నీడలు, అనిర్దిష్టమైన అన్వేషణ దృగ్గోచరమవుతాయి. సామాజిక సంవేదన కూడా ఇక్కడ `స్వప్నలిపి'గా మారిపోతుంది. ప్రతీకలు, బింబాలు, నూతన సంయోజనలు ఈ మార్గంలో ఎక్కువ. అజంతా, మోహన్‌ప్రసాద్‌, సుమనశ్రీ ప్రభృతులు ఈ మార్గంలో సాగిపోయినవారు. ఇక్కడ కవిత్వం వస్తు ఛందస్సులను దాటి అభివ్యక్తి నిష్ఠమై పోతున్నది. అందువల్ల అవగాహనలో సౌలభ్యం తక్కువ.
అయితే మరికొంతమంది కవులు భావకవిత్వంవలెనే ఆత్మాశ్రయ లక్షణంతో కాల్పనిక రహస్యవాద మార్గంలో కవిత్వ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ అస్పష్టతలేదు. అరిపిరాల విశ్వం, ఇస్మాయిల్‌, శ్రీకాంతశర్మ, సత్య శ్రీమన్నారాయణ ఇలా కవులు ఒక భావనిష్ఠమైన అనుభూతి రహోలోకాలను నిర్మిస్తున్నారు.
ఆర్‌.ఎస్‌.సుదర్శనం, సంపత్కుమార, అనుమాండ్ల భూమయ్యలు వ్రాసేది పద్యమైనా ఒక ఆత్మానుభవ ప్రకటనకు ప్రాధాన్యం యిస్తున్నారు. చిన వీరభద్రుడు, విన్నకోట రవిశంకర్‌, రాజు, సిద్ధార్థ, సౌభాగ్య, మునిపల్లె రాజు, రామ్‌నారాయణ్‌ఈ కవులంతా తమ నూతన బింబాల సృష్టితో ప్రతీకల ప్రయోగంతో కవిత్వ జగత్తును సుసంపన్నం చేస్తున్నారు. రామగిరి శివకుమారశర్మ `సింగిడి' తెలంగాణా రైతుజీవితంలోని భావనలను అనుభవాలను అత్యంతసుందరంగా అభివ్యక్తం చేసింది. దర్భశయనం రచనల్లో ప్రతీకలు, బింబ సామాగ్రి దేశీయతా, గ్రామీణతా పరిమితుల లోంచి పెల్లుబుకుతున్నది. అభినవత్వం దీనిలో విశిష్టత.
కొందరు ఇటీవలికవులు ఆధునికోత్తరకాలంపేర విచిత్ర ప్రకటనా వూ్యహాలలో విలక్షణమైన శబ్దజాలంతో రచనా ప్రపంచంలో పురోగమిస్తున్నారు. వీరిలో అఫ్సర్‌, సీతారాం, ప్రసేన్‌, వంశీకృష్ణలు ప్రముఖులు. అయితే అనేకమంది కవులు ప్రధాన స్రవంతియైన జాతీయ ప్రజాస్వామ్య చైతన్యంలో దేశీయతాభూమికలో రచనాప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తున్నారు. ఈ కవులు తమ శిల్ప నైపుణ్యంతో వస్తు విన్యాసంలో అపరిమితమైన కవిత్వపు సీమల్లోకి ప్రవేశింపజేస్తున్నారు. వీరిలో బోయి భీమన్న, శేషేంద్ర, నారాయణరెడ్డి, మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, సుప్రసన్న, పెన్నా శివరామకృష్ణ, గోపి, బాపురెడ్డి, మొదట పేర్కొనదగినవారు.
ఇంద్రధనూరమ్యమైన ఈ దృశ్యపరంపరకు వెనుకగా ఈ కాలంలో నవ్య సంప్రదాయం మూడు గొప్ప మహాకావ్యాలను ఆవిష్కరించింది. ఒకటి వానమామలై వరదాచార్యుల పోతన చరిత్రము రెండు ముదిగొండ వీరభద్రమూర్తి' వందేమాతరం', మూడు నాయని సుబ్బారావు `జన్మభూమి'.
ఈతరం కవులు వచన కవిత్వంలో మహాకావ్య నిర్మాణం చేయటం ఒక విలక్షణమైన ఉపలబ్ధి విశేషం. విస్తారమైన మన ఆధునిక సాహిత్యోపలబ్ధులను తమకు, తమకు చెందిన వారికి మాత్రమే పరిమితం చేసుకునే ఒక సంకుచిత బుద్ధితో కొందరు విమర్శకులు నేటి సాహిత్యంలో గిరిగీతలు గీస్తున్నారు. `అసలు సాహిత్యరంగంలోనైతే శాశ్వత విప్లవాన్ని ఎప్పుడూ సంప్రదాయవాదులే తీసుకురాగలరని హెరాల్‌‌డ రోజెన్‌ బర్‌‌గ చెబుతున్నాడు. ఈ మాటల్ని ప్రత్యక్షర సత్యం చేసినవారు ఇలియట్‌, ఆడెన్‌, అరవిందుడు, టాగోరు, విశ్వనాథ, శ్రీశ్రీ లాంటి మహాకవులు. వీళ్లందరిదీ సంప్రదాయం వల్ల పరిపుష్టమైన ఆధునికత. వేదంలోంచీ, మహాభారతంలోంచీ గ్రహించిన `సావిత్రి' వృత్తాంతంపై ఇంగ్లీషూలో రాసిన మహాకావ్యం `సావిత్రి'లో కనిపించేదంతా అరవిందుని ఆధునికత్వమే. అలాగే శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో `ఏ దనుజున్‌ వధించినను ఇంత విషాదమునొందు ఆత్మ మర్యాదుడుస్వామి' అంటూ శ్రీరామచంద్రుడి హృదయంలో ఒక అస్తిత్వవేదన (లినిరిరీశిలిదీశిరిబిజి బిదీవీరీశి) లాంటిది సృష్టించిన విశ్వనాథ సంప్రదాయం లోంచీ ఆధునికతను ఆవిష్కరిస్తున్నాడని గమనించాలి'. (ఆచార్య పణతుల రామచంద్రయ్య పే. 290 సాహిత్యంలో ఆధునికత అభినవ భారతి 1996)
ఈ సమన్విత దృష్టి విశ్వజనీనమైంది ఉంటేనే మనకు మన సాహిత్యచిత్రం సమగ్రంగా దర్శనమిస్తుంది. ఏది ఏమైనా కవిత్వ సాధనకు లక్ష్యం పరిపూర్ణతా సిద్ధి. మన కళాత్మక శిల్పాత్మక సాధనలు ఉపకరణాలు అన్నీ ఈ లక్ష్యం వైపుగానే ప్రయాణించాలి. భాష, ఛందస్సు, అలంకారము, ప్రతీక మరింకేదైనా ఉంటే అదిఅన్నీ మానవ జీవనంలోని అన్ని స్తరాలలోని సంఘర్షణలను చిత్రిస్తూఅనంత జీవనాన్ని గురించిన అతని ఆర్తిని అభివ్యక్తీకరించాలి. 20వ శతాబ్దం నూతనమైన ఆధిభౌతిక తత్త్వ చింతనలోని పార్శా్వలను ఆవిష్కరించింది. మనశ్శాస్త్రం ఆధ్యాత్మిక అనుభవాల సీమలను తాకుతూ వచ్చింది. ఖండదృష్టీ, పార్శ్వదృష్టీ తప్పుడు అనుభావనలకు కారణాలవుతవి.