Wednesday, January 27, 2010

ఆధునిక మహర్షి ఆచార్య సుప్రసన్నఢిల్లీ లో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ కొరియా ఫస్ట్ లేడీ నుంచి టాగోర్ literature అవార్డు అందుకున్న సుప్రసన్న ..

-డా లంకా శివరామ ప్రసాద్‌
సృష్టిలీల బహు చిత్రంగా ఉంటుంది. కాలరథం రహదారి పక్కన శాఖోప శాఖలుగా విస్తరించి, దారిన పోతున్న అనేక మంది బాటసారుల బడలిక తీరుస్తూ తనదంటూ ప్రత్యేకత నిలుపుకున్న ఆ మహావృక్షపు శాఖాగ్రచ్ఛాయల దరిదాపుల్లో అప్పుడే మొలకెత్తిన ఓ చిన్ని మొక్క తలెత్తి ఆ మహావృక్షపు ఎత్తును అంచనా వేయడానికి సంకల్పించింది.
పసిబిడ్డను ఎత్తుకోవాల్సిన ధర్మం పెద్దలది. వాళ్ల హృదయాలకు హత్తుకునే హక్కు పిల్లలది. ఎవరిది ఏ ఎత్తు అయినా ఇద్దరూ ప్రకృతి ఒడిలో పసిపిల్లలే ! ఆ యిద్దరూ ఇంకో చెట్టువేపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ వృక్షం చిత్రాతిచిత్రంగా ఉంది.
ఊర్థ్వమూల మథః శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయమ్‌
ఛన్దాంసి యస్య పర్ణాని య స్తం వేద స వేదవిత్‌

ఆ వృక్షం ెుుక్క స్వరూపాన్ని శోధిస్తూ హృద్గీత, ఆనందలహరి, తేజశ్చక్రము, అధునా, ఋతంభర, పాండిచ్చేరి గీతాలు పన్నెండు, శ్రీ పాంచాలరాయ శతకం, శతాంకుర, స్తుతి ప్రబంధము, కన్నీటికొలను, కృష్ణరశ్మి, శ్రీ నిరుక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, సాంపరాయం, మణిసేతువు, ప్రీతి పుష్కరిణి, శేఫాలిక వంటి అద్భుత జ్ఞాన కావ్య కుసుమాలను, సాహిత్య వివేచన, సహృదయచక్రము విశ్వనాథమార్గము, భావుకసీమ, పోతన చరిత్రము, అధ్యయనం, చందన శాఖి వంటి విమర్శనా మధుర ఫలాల్నందించిన జ్ఞాన వృక్షము తానైతే, ఈ సాహిత్య ప్రకృతిని, ఆ అశ్వత్థ వృక్షాన్ని లీలా మాత్రంగా అవలోకించి అచ్చెరువందుతున్న చిన్ని మొక్కకు ఓ ప్రాతఃదినాన మణిసేతు సందర్శనభాగ్యం, లభించింది. అచ్చోట పూచిన పారిజాత పరిమళాలివి.

వెన్నెల లావరించుటయు వేడుక వానల క్రుమ్మరింతలున్‌
కన్నుల స్వప్న లోకములు కానగ వచ్చుట, లింటివెన్క సం
పన్నిధి గుప్తతల్‌ విడిచి పైపయి కెక్కుట, లెన్నియైన లో
నున్న అమేయ శాంతికి అణూపమ కేనియు పోలి రావెటుల్‌
అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టోత్తర శత దివ్యక్షేత్రాలు, భిన్న ప్రకృతులూ ఉన్న మణి ద్వీపమే భారతదేశము. తన మాతృభూమిని జగన్మాతగా దర్శిస్తూ. . .

అఖిల జగముల కాటపటై్టన నిన్ను
అఖిల జగముల నేది కాదైన నిన్ను
ఎటుల కొల్చుట ెుద నిల్పుటెటుల సర్వ
వియదనంత సమావేశ వృక్షమూర్తి
అఖిలమున కాది మూలమైనట్టి నీవు
అంతమున పరిణతి సహస్రారమగుచు
ఆ మణిద్వీపమున రాజ్ఞివౌచు నిలుతు
గుండెలో సూక్ష్మ షట్పద గుప్తమూర్తి

బీజంలో జడంగా నిద్రిస్తున్న చైతన్యమూర్తి, అంకురమై, మొలకై, చెటై్ట, వృక్షమై విశ్వంగా పరిణామం పొందింది.
నేను జీవాన్ని, వృక్షాన్ని, ఫలాన్ని, రసాన్ని
నేను ఆవర్తాన్ని, బుద్బుదాన్ని, తరంగాన్ని
తథాగతము, తథాదృష్టము, తథాభావితము
నిత్యభావం కనిన స్వప్నము, అర్థరాత్రి గర్భంలో పగలు
ఆ తామసీ గర్భంలోనుంచి ఉషశ్శిశువు జన్మనెత్తింది.
గింజ మట్టిని చీల్చేవేళ ఊపిరినంతా బిగగట్టి
పైకి పొడ్చుకువచ్చి ఒకసారి తన్నుతాను ప్రకటించుకునే క్షణం
చివురు విచ్చుకునే వేళ, మొగ్గ కనబడే వేళ
వినబడని మట్టి మూలుగు ఆ లిప్త విశ్వచైతన్య సంవేదన. . .
ఆవ్యక్త బీజంలోనుంచి
నిర్గమించిన అశ్వత్థ వృక్షం జీవ కిసలయితమై
ఆకాశాన్ని కప్పివేసింది సర్గపు తొలి మొలక తాను
స్కంధంలో ఎన్ని ఎన్ని ప్రాణరహస్య కోటరాలు

కాని ఇప్పుడు వర్తమానం ఆత్మబలి చేస్తున్నది. ఈ నాగరికతా, అణ్వాయుధాలు, మౌఢ్య కాననాల సమిధలతో దగ్ధమైన అనేక మన్వంతరాల వేదనల చితాభస్మాన్ని, వెలుగుల సముద్రంలో కదిలే వెన్నెల పడవలో భావిదాకా మోస్తూ సాగే అనంతేతిహాస ప్రయాణమే సాంపరాయమైనపుడు ఫలితం దుఃఖము తొలగి, మృత్యువు తొలగి, తొలగి అహంత, తోరణం సృష్టి కవుతుంది.
సృష్టి విద్యా ప్రాగల్భ్యమంతా నేర్వక నేర్చిన మర్త్యజగత్తు సద్వస్తుచ్ఛాయయై మృత్యువును గ్రసించి చిదగ్నియై, ఆనందలేశ ప్రతిబింబమై దుఃఖావలిత మవుతున్నది. ఈ బ్రహ్మాండంలో ఎప్పుడో ఒక పూవులోనో, పసిపాప బోసి నవు్వలోనో, వెన్నెల వెండి జరీ అంచు మబ్బు తెరలోనో, అమేయమైన `భ' చక్ర సాక్షాత్కారంలోనో, భీకరమైన ఉప్పెనలోనో, బారులుకట్టి ఆకాశంతో కదిలిపోయే కొంగల సమూహంలోనో ఒక అర్థం కాని, అన్వయం కాని, అవాచ్యమైన అనుభవాల సంకలనం స్ఫురించటం కద్దు.
అప్పుడే ఒక చిన్న పూవు పిలిచింది. `ఓ అనంత సాగర తరంగమై కదిలి వస్తున్న ఏథికుడా, అన్వేషణకు అంతే ఎరుగని బాటసారీ, నీ కోసం ఇక్కడ రూపొందుతున్నాను' అని నేనడిగాను `నీవెవరివని నన్నెరుగుదువా' అని. ఆ పూవన్నది `నేను శేఫాలికను నీవు నాలోని ప్రాణశాఖివని'. ఆ శేఫాలికా ప్రాణశాఖికి మరో ప్రాణసఖి. ఆ ప్రాణసఖి `సుమ శాఖాకృతియై సరిన్నిభమునై, శుభ్రాంశు సందోహమై విమలాంభోజ దళాంచలంబునయి',
బ్రతుకున కొక్క దేవివయి వచ్చిన నీెుడ, నాత్మలోక సం
గత రసపారవశ్యములు కల్గ నిదంతయు నీకె కూర్చితిన్‌
అతిశయ సంగమార్థములు అచ్చపు పాల్కడలిం బలెన్‌ అసుప్ర
తతుల ప్రీతి పుష్కరిణి పాలనసేయవె ఆదిలక్ష్మివై

అది కోరిక. కులపాలికా ప్రణయ సంయోగభావ చిత్రీకరణ వేదిక.
ఈ లీలాలయ మర్త్య జన్మమిది వాంఛింపంగ రాదేమి దృ
గ్జాలంబుల్‌ చిరుకత్తులై ెుడద చీల్చన్‌రాదొ, సంసేవన
స్ఖాలిత్యంబుల మాన్పు మీ బ్రతుకు నీ కళ్యాణ భూమిన్‌ కవా
టాలోలంబగు మువ్వజేసెదను దేవా. . . .
స్తబ్ధుండై దివి వృక్షమై నిలుచు నాదైవంబ, పై మూలమై
అబ్ధుల్‌ కొండలు కాననంబులును భూమ్యాకాశముల్‌ శాఖలైన
ఓ నారసింహ ప్రభూ . . . .
అంతా, అంతటా ఆ అశ్వత్థ వృక్షస్వరూపమే. అక్కడే బోధివృక్షం నీడలను పరచుకొంటున్నది. ఈ ఉనికి అయిదు కొమ్మల వృక్షం. రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానము కలబోసిన ఈ వృక్షము మన కందిస్తున్న ముప్పదిెుుక్క మధుర ఫలాల సంపుటి ఈ సమర్పణ. జాతీయతాభావం, దేశీయత, మానవీయ సంస్కృతి మూలాలుగా విశ్వనా థారవిందుల విశ్వవిజ్ఞానము నారమై, భౌతిక మానసిక ఆధ్యాత్మిక జీవన జ్ఞానం నాదమై, జాగ్రత్‌ స్వప్న సుషూప్తావస్థలు తురీయవేదమై, జగన్మాత సౌందర్యస్వరూపమే అద్భుత వాదమై, ప్రాక్పశ్చిమ నాగరికతల, ప్రాచీన ఆధునిక కవితల మేళవింపు కమనీయమై శాఖోపశాఖలుగా విస్తరించి సాహితీవనాన్ని సుసంపన్నం చేస్తున్నది.
సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదమును, ప్రాగ్రూప వివేచనను (ఆర్కిటైపు), సమకాలీన సార్వకాలీన దృక్పథమును, విశ్వలయను మొట్టమొదట ప్రస్తావించిన భారతీయ పునరుజ్జీవనోద్యమ చైతన్య దర్శనము కలిగిన మానవతావాది, ఆధునిక మహర్షి.
యాంత్రిక ప్రపంచం సృష్టించిన త్రిశంకుస్వర్గాలపై యుద్ధాన్ని ప్రకటిస్తూ జీవన సౌందర్యలహరిని ప్రేమ మార్గం ద్వారా చేరుకునేందుకు సుప్రసన్నాచార్యుల వారిచ్చిన పిలుపు మరల మరల వినిపిస్తుంది. ప్రతి యుగంలో, ప్రతిభావసంతంలో, ప్రతి శతాబ్దంలో కొత్త దుస్తులు తొడుగుతుంది. అది విస్తరిస్తుంది.
శుభం భూయాత్‌ !
డా లంకా శివరామ ప్రసాద్‌

No comments:

Post a Comment