Thursday, July 30, 2009

రసలోకం-3

పద్యం చచ్చిపోయిందని ప్రచారం చేశారు చాలాకాలం. పద్యం ముసలిదైపోయింది. నేటి అవసరాలకు భావాలకు సరిపోదు. దానికి ఉన్న పరిమితిలో ఆధునిక భాష ఒప్పదు. ఇంకా అనవసరమైన నిర్బంధాలు - అక్షర గణాలు, యతిప్రాసలు ఇంకా తత్సమ పద బాహుళ్యం అందువల్ల సామాన్య ప్రజలకు అర్థం కాదు - అని వాదం
పూర్వం భారత భాగవతాలు గ్రామాలలో రచ్చబండల దగ్గర చదువుతూ ఉండటం వలన జనం వినేవాళు్ల. పద్యం చదవటంలోని ఒడుపు వల్ల అది అందరికీ అర్థం అయ్యేది. యక్షగానాలలో వచనంలో వ్యావహారికం ఉన్నా, పద్యాలూ, పాటలూ లాక్షణిక భాషలోనుండేవి. వీటిని జనం చూచి ఆనందించే వాళు్ల.
20వ శతాబ్దంలో తెలుగులో నూతన సారస్వతం ఆరంభం కావడం, అనేక ప్రక్రియలలో రచనలు కొనసాగటం జరిగింది. పద్యం, గేయం, వచన పద్యమూ ప్రస్తరించాయి. వాటి వాటి అంతస్సత్వాన్ని బట్టి అవి సారస్వతంలో స్థానం పొందాయి. తిరుపతి కవుల తెలుగు పద్యం వాడుక భాషలోని కాకువును, వాక్య నిర్మాణాన్ని తనలో సంలీనం చేసుకున్నది. క్రియాంత ప్రత్యయాలు వదిలేస్తే మిగిలినదంతా వ్యవహార భాషే. పద్యం స్వేచ్ఛగా సంచరించటానికి వీలు లేదని ఆక్షేపించిన నిర్బంధాలు వారి పద్యాలకేం అడ్డం కాలేదు.
కావ్యభాషలో పలుకుబడిలో, పద బంధాలలో శ్రుతి మాధుర్యంలో నూతన స్థితిని ప్రవేశపెట్టిన రాయప్రోలు సుబ్బారావు పద్యం, సహృదయులకు కొత్త ప్రేయసిలాగా చేరువ అయింది. కృష్ణశాస్త్రి పద్యం మాధుర్య ప్రవాహమై వింత సొగసులు పోయింది. ``శిలలు ద్రవించి యేడ్చినవి శీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురము్మలు'' అన్న కొడాలి సుబ్బారావు పద్యం ప్రాచీన వైభవ శైథిల్యాన్ని రూపుగట్టించింది. నేటితో అస్వతంత్రతా నియతమైన ఈ బ్రతుకు తెల్గువారు భరింపలేరు'' అన్న విశ్వనాథ విషాద గీతం జాతి జనుల గుండెలలో ప్రతిస్వనించింది. త్రిపురనేని సూతపురాణం కొత్తగా పురాణ వ్యతిరేక ధోరణిని పద్యంలో ఆవిష్కరించింది.
ఆ నాళ్లలో నండూరి సుబ్బారావు యెంకిపాటలు జానపద భాషలో రాయటం చేత అవి ఎంత రసవంతాలయినా అకలుష ప్రణయ ప్రకటనాలైనా క్రమంగా అవగాహన పరిమితులలో నుంచి వెలికి పోతున్నాయి. ఆ స్థితి గేయ కావ్యాలైన కిన్నెరసాని పాటలకు శివతాండవానికి పట్టలేదు.
1932 తర్వాత తెలుగు పద్యానికి కాల్పనిక కవిత్వంలోని పరిధులు తొలగిపోయాయి. సౌందరనందం రాకతో ఖండకావ్యం మహాకావ్యమయిపోయింది. ఆధునిక సంవేదనలను నాడు కావ్యాలు ప్రస్ఫుటం చేయగలిగాయి. సౌందరనందం కానీ, రామాయణ కల్పవృక్షం కానీ, శివభారతం కానీ, రాణా ప్రతాపసింహ చరిత్ర గానీ, ఆత్మకథ కానీ, ఆంధ్రపురాణం కానీ పద్యం శక్తి ఎంతటిదో ప్రస్ఫుటం చేశాయి. దాశరథి పద్యం సవ్యసాచి సంధించిన బాణం వలె సామాన్య జనులలోకి దూసుకొని వెళ్లింది. `నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను'.. `మూడు కోటుల నొక్కటే ముడి బిగించి పాడినాడ మహాంధ్ర సౌభాగ్యగీతి'... ``తీగెలను త్రెంపి అగ్గిలో దింపినాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ''.. ``మా నిజాంరాజు జన్మ జన్మాల బూజు'' ఈ విధంగా ఉదహరిస్తే దాశరథి పద్యాలన్నీ ఇందుకు తార్కాణాలే.
`పద్యం ఆధునిక భావాలను చెప్పలేదు' అనే మాట సత్యమేనా? `వాస్తవము్మ నార్లవారి మాట'' అన్న మకుటంతో నార్ల రాసిన పద్యాలు ఆధునికాలు కావా? `పెన్నేటి పాట'లో రాయలసీమ కరువు రైతు జీవితం ఎంతో బలంగా వ్యక్తమైంది అంతెందుకు జాషువా పద్యాలు సమకాలీన పరిమితులలో ఒదుగటం లేదా? రామిరెడ్డి పానశాల పద్యాలు ఈనాటి సంవేదనలకు తార్కాణం కాదా? శ్రీశ్రీ సిరిసిరి మువ్వ పద్యాలు, రుక్కుటేశ్వర శతకం పద్యాలు నేటి భాషను ఇముడ్చుకోవటం లేదా?
ఇంద్రగంటి వారి కీర్తితోరణం, ముదిగొండ వీరభద్రమూర్తి గారి `వందేమాతరం' ఎంతో సరళమైన పద్యాలను ఇముడ్చుకొన్నవి. వందేమాతరంలో భాష, వాతావరణం, సన్నివేశ కల్పన స్వాతంత్య్రోద్యమపు స్ఫూర్తిని ఎంతో బలంగా అనుసంధించాయి. బోయి భీమన్న పద్యాలు ఎంతగా నవంనవంగా ఉన్నవో చదివితే తెలుస్తుంది. అనుముల కృష్ణమూర్తి పద్యాలు గుర్రాలపై స్వారీ వంటివి. బేతవోలు పద్యాలు గోదావరి ప్రవాహం వంటివి.
ఇటీవలి కాలంలో తెలుగు పద్యం వచనానికి అత్యంత సన్నిహితంగా వచ్చింది. విశ్వనాథ మధ్యాక్కరలలో ఈ గుణం విశ్వరూపం దాల్చింది. బాడాల రామయ్య కృష్ణకథా విపంచి, సంపత్‌రాఘవాచార్య విశ్వనాథ విజయం ఉత్తమ శ్రేణి రచనలే. చిటిప్రోలు కృష్ణమూర్తి `పురుషోత్తముడు' ఇటీవలి పద్యకావ్యాలలో మేలైంది.
ఉత్పలవారి `ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు' వర్తమాన నగరాన్ని చిత్రించిన రచన. అమేయమైన పద్యశక్తి దీనిలో ప్రకటితమైంది. జోస్యము విద్యాసాగర్‌ `అమ్మ' కోడూరి విష్ణువర్థన్‌ `ధర్మదండం', విలక్షణమైన రచనలు. `కృష్ణరశ్మి' నుంచి `మణిసేతువు' దాకా నా కావాలు, సంపత్కుమార `ఆముక్త', అనుమాండ్ల భూమయ్య మార్మిక పద్య రచనలు ఇటీవలి ఆధ్యాత్మి రచనలు. ఆచార్య ఫణీంద్ర మాస్కో స్మృతులు ఆధునిక నాగరక శాస్త్రీయతా చేతనను ప్రతిఫలించే రచన. కరణం బాలసుబ్రహ్మణ్య పిళై్ల `ఒక రాఘవ రెడ్డి కథ' పెన్నేటి పాటతో పోటీపడదగిన రచన.
`తెలుగు పద్యమనే దానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అది భూస్వామ్య యుగంలో పుట్టిన ప్రక్రియ. దానికి పౌరాణిక వాసన ఉన్నది. రాచరిక వ్యవస్థ భావజాలపు స్వభావం ఉంది. ప్రజాస్వామ్య స్వభావం లేదు.'(వి. చెంచయ్య, 2004) ఇలాంటి గతానుగతికమైన అభిప్రాయాలను ఖండిస్తూ చేరా అంటున్నాడు. `నిజానికి పద్యం తత్కాలపు అవసరాలకు తగినట్టుగా ఎపుడూ మారుతూనే ఉంది.'
ఈ కాలపు అవసరాలకు తగినట్లుగా మారిపోతున్న తెలుగు పద్యం 20వ శతాబ్దంలో నూతన రూపాన్ని సంతరించుకున్నది. నూతన భావ ప్రకటనకు యోగ్యంగా పరిణమించింది. అబ్బూరి రామకృష్ణరావు ఏ ఛందోగతీ లేని వచన పద్యాన్ని కవిత్వ యోగ్యంగా ఆమోదించేవారు కారు.
గడచిన పాతిక సంవత్సరాలుగా అవధానాలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. జనం వేలాదిగా వీటిల్లో పాల్గొంటున్నారు. ఆనందిస్తున్నారు. వీటివల్ల పద్యం అభినవంగా, తరుణంగా నిలిచి ఉంటున్నది.

Wednesday, July 29, 2009

లోకమ్ము వీడి రసమ్ము లేదు

సాహిత్యం అనుభవ సముద్రం. ఈ అనుభవానికి ఏ ఎల్లలూ ఏ కార నియతీ ఉండదు. మానవుడి సర్వ అనుభవాలు, సర్వ జీవన పార్శా్వలు అది ప్రతిఫలిస్తుంది. వివిధ ప్రక్రియలు, సాహిత్య రూపాలు అభివ్యక్తి వైవిధ్యాన్ని బట్టి పాఠకుల వైవిధ్యాన్ని బట్టి కాల ప్రభావాన్ని బట్టి వేరువేరుగా ఏర్పడుతూ ఉన్నవి. ప్రక్రియల భేదం తప్ప, అభివ్యక్తి వైవిధ్యం తప్ప సాహిత్య స్వస్వరూపంలో ఆత్మగా నిలిచి ఉండేది రసమే. ఈ రసం లోకంలోనుంచి కావ్యం లోనికి ప్రసరిస్తుంది.
`లోకము్మ వీడి రసము్మ లేదు' అంటే లోకమే రసమని తాత్పర్యం. లోకంలోనుండి కావ్య ప్రపంచంలోనికి ప్రవహించిన శబ్దం, దేశ కాలాల పరిమితులను ఛేదించుకొని సార్వజనీనంగా, సార్వకాలికంగా రూపొందింది. రసముగా పరిణమిస్తుంది. పాఠకుని అనుభవానికి చేరువగా చేరేందుకు రసము అతని ఎరుకలో ఉన్న స్వస్థాన వేష భాషాది మతములను ప్రకటిస్తూ అభివ్యక్తమవుతుంది.
ఈ వైవిధ్యాలను గుర్తించకుండా ఇటీవలి కాలంలో సాహిత్యాన్ని వైరుధ్యాల పుట్టగా, పరస్పరం సంఘర్షించుకొనే యుద్ధ శ్రేణులుగా వ్యాఖ్యానించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం సుమారుగా అరవై సంవత్సరాల నుంచి సాగుతూ, సాగుతూ ఇప్పుడు దాని పరమ వికృత రూపం ప్రకటిస్తున్నది.
నన్నెచోడుడు `మును మార్గకవిత లోకంబున వెలయక, దేశి కవిత పుట్టించి తెలుంగున నిలిపిరి చాళుక్య రాజు మొదలగు పలువురు' అన్నప్పుడు మార్గదేశి భేదములు మొదటిసారి ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన మొదట సంగీత శాస్త్రానికి చెందింది. ఆ తరువాత సాహిత్యంలోకి వచ్చింది. ఇక్కడ మార్గ కవిత్వం సంస్కృత కవిత్వమై నన్నయాదుల కవిత దేశి కవిత అయింది. తరువాత కొంచెం కాలం గడిచేసరికి మన అంచనాలు మారిపోయి నన్నయాదుల కవిత మార్గమై, పాల్కురికి సోమన మొదలైన వారి కవిత దేశి అయింది. పురాణ ఇతిహాస సంప్రదాయాలు, ఆ రూపాలు మొదటి వర్గం కాగా, దానికి భిన్నమైన ద్విపదాది రచనలు దేశి కవిత అయింది. ఈ విభజన మరి కొంత కాలానికి మరొక రకంగా ప్రస్తావించడం జరుగుతుంది. ఉదాహరణ కావ్యాలు.. దేశి లక్షణాలైన, గానయోగ్యాలైన రగడలు అధికంగా ఉన్నా దేశి కవితలుగా చెప్పబడటం లేదు. శతకాలు ఆత్మాశ్రయాలై, సమాజ వస్తువులు ప్రకటించేవి అయినా, అక్షర ఛందస్సుల్లో ఉండటం వల్ల దేశి కవితలుగా ప్రముఖంగా ప్రస్తావనకు నోచుకోవడం లేదు. మార్గకవిత్వం పండితైకవేద్యమని, దేశి కవిత్వం ప్రజాబాహుళ్యాన్ని ఉద్దేశింపబడిందని ప్రచారం జరుగుతోంది. పండితారాధ్యచరిత్రలో పాండిత్య వివాదాలు, అన్నమయ్య శృంగార మంజరిలో ప్రబంధ లక్షణాలు పామరులకు అందుబాటులోకి వచ్చేవి కావు.
ఈ విభాగం కొంచెం ముందుకు పోయి మౌఖిక, లిఖిత సంప్రదాయాలుగా విభజించడం జరిగింది. లిఖిత సంప్రదాయం అనేసరికి ద్విపదాది కావ్యాలు కూడా దాంట్లో చేరిపోతవి. అప్పుడు జానపద సాహిత్యం, అన్నమయ్య సంకీర్తనలు, సారంగపాణి, క్షేత్రయ్య వంటివారి సాహిత్యం, ఈ విభాగంలోకి వస్తాయి. రాగిరేకుల మీద రాయబడటం వల్ల అన్నమయ్య సాహిత్యాన్ని లిఖిత సాహిత్యం అంటారేమో నాకు తెలియదు. కానీ, అన్నమయ్య సాహిత్యంలో జానపదాంశాలు, ఆ రూపాలు ఎంత విరివిగ ఉన్నవో, ఉపనిషత్తులలోనూ, తత్త్వరహస్యాలు, దై్వతాదై్వత సిద్ధాంతాల విభేదాలు, మార్మిక సంకేతాలు ఎన్నో విరివిగా కనిపిస్తాయి. కొన్ని సంకీర్తనల వివరణలు, సూత్రభాష్యాదుల పాండిత్యం లేకుండా అర్థం కాదు. అట్లాగే త్యాగయ్య రచనల్లో ఉండే తాత్తి్వకాంశాలు, క్షేత్రయ్య రచనల్లో ఉండే రస, నాట్యశాస్త్ర విశేషాలు కేవలం పామరుల కోసం ఉద్దేశింపబడినట్లు కాదు.
పాల్కురికి సోమన కానీ, అన్నమయ్య కానీ, పల్నాటి వీరచరిత్రను రచించిన శ్రీనాథుడు కానీ, రంగనాథ రామాయణ కర్తకానీ, పండితులు కారనడానికి వీల్లేదు. వీరిలో కొందరు అటు పండితాదరణీయాలని చెప్పబడుతున్న కావ్యాలు, ప్రబంధాలు రచించడం ఒకవైపు, మరొక వైపు జానపద లక్షణాలు కల దేశి రచనలు రచించడం మరొకవైపు జరిగింది. ఒక పరిశీలన చేసి చూస్తే, తాత్తి్వకంగా సాహిత్య రచయిత వస్తువును బట్టి తను పెంచుకున్న శ్రోతృ సమూహాన్ని బట్టి ప్రక్రియను నిర్ణయించుకుంటున్నాడు తప్ప సహజంగానే ఈ సాహిత్య సృష్టిలో భేదబుద్ధి లేదు. జానపద సాహిత్యాన్ని సేకరించిన తొలిరోజుల్లో దానికి ప్రాచుర్యం కల్పించడానికి ఆదరణ లభించడానికి కొన్ని `అర్థవాద వాక్యాలు' చెప్పడం అవసరమే కావచ్చు కానీ, అవి ప్రామాణికాలని చెప్పడానికి వీల్లేదు. చింతా దీక్షితులు గారు, నేదునూరి గంగాధరం గారు, బిరుదురాజు రామరాజు గారు మొదలైన వారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి ధోరణి వివరణలలో చెప్పి ఉండవచ్చు. అనాదృత వాఙ్మయం, ప్రజావాఙ్మయం వంటి మాటలు వాడి ఉండవచ్చు. కానీ, ఏదీ నిశ్చితమైన అభిప్రాయం కాదనుకోవాలి. పోతన భాగవతంలో`కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు మఱియున్‌ కొందరకు రెండు గుణమగు అందర మెప్పింతునేను అయ్యెయెడలన్‌' అన్న చోట నాటికీ ప్రచారంలోకి వస్తున్న ఈ భేదభావాన్ని అన్వయించే లక్షణం కన్పిస్తుంది. ఈ ఉభయ సాహిత్య మైత్రి ఆయన రచనను తెలుగువాళ్లకు అత్యంత ఆదరణీయంగా రూపొందింపజేసింది. భాగవత పద్యాలు ఏ సాహిత్య ప్రక్రియల అత్యంత ప్రాచుర్యం పొందిన అంశం అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పాండవోద్యోగ విజయ పద్యాలు అత్యంత జనాదరణ పొందడానికి వాటి అక్షర ఛందోరూపం అడ్డం రాలేదు.
ఎరిగియో ఎరుగకయో అభిమానం చేత రాబోయే పరిణామాలను గూర్చిన అంచనా సరిగా లేకపోవడం వల్ల కల్పించిన ఈ భేదభావాలు సాహిత్యాన్ని నిలువుగా చీల్చడం ఈనాడు పరిదృశ్యమానమవుతున్నది. ఈ భేద కల్పనలో ప్రజాకవులు, అప్రజాకవులనీ సంస్థాన కవులు సంస్థానేతర కవులనీ, ఉన్నత వర్గాల, దళిత వర్గాల కవులనీ, విభజించడం కానవస్తుంది. తేనె, కలకండ, మామిడిపండ్ల రసం మొదలైనవి ఆయా ఉత్పత్తి మూలాలను బట్టి భిన్నంగా కన్పించవచ్చు కానీ, తాత్పర్యతః అవన్నీ మాధుర్యమనే లక్షణం చేత ఒక్కటే అవుతున్నవి. అలాగే రసలక్షణం చేత సాహిత్యాన్ని ఏకరూపంగానే దర్శించవలసి ఉంటుంది.

Tuesday, July 28, 2009

సాహిత్య పరిణామంలో కులము - కులాంతరాలు-మతాలు

`నన్నయ్య కవి పెట్టినాడు గదా తిక్కనాది కవీంద్రుల కాది భిక్ష' అన్న తిరుపతి వెంకట కవుల పద్యం వెనుక, సాహిత్య చరిత్రలో పరిణామంలో నన్నయ్య ప్రాధమ్యాన్నీ, ప్రాధాన్యాన్నీ స్థాపించుటకు కాకుండా నాటికి విజృంభించి ఉన్న వైదికి నియోగి శాఖా భేదాల అంశంకూడా ఉన్నది. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాని, లుద్ధావధాని, గుంటూరు శాస్త్రి మొదలైన పాత్రల ద్వారా వైదికులను వెక్కిరించటం, తక్కువ పరచటం ఉందని భావించే అవకాశం ఉన్నది. వీరేశలింగం నాటికి సాహిత్యరంగం అంతా నియోగి ప్రాధాన్యం ఉండటం, తిక్కనకు అగ్రాసనాధిపత్యం ఇవ్వటం, నాచన సోముని ప్రశంసించే సందర్భంలో నన్నయ, ఎఱ్ఱనకంటే అతనిని అధికునిగా భావించటం ఇవన్నీ ఈ శాఖా భేదాల పరిణామాలే.
అంతకు పూర్వం సి.పి.బ్రౌన్‌ వేమన పద్యాలను ఆకాశానికెత్తటం వెనుక ఉన్న రాజకీయం ఇంతకంటే మించింది. వేమన పద్యాలలో విగ్రహారాధనాదికాలైన `హిందువుల ఆచార వ్యవహారాలను పరిహసించటం, నిరసించటం వెనుక ఆతని అచల యోగ సంప్రదాయము, అవధూత లక్షణాలు ఉన్నాయిగాని, వాటి వెంట ఆత్యంతికమైన వ్యతిరేకత లేదు. ఈ సంప్రదాయ వైవిధ్యంలోని ఆభాస వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక బ్రౌను వేమన రచనను క్రైస్తవ దృష్టిలో చూచి ఆయన సాహిత్యాన్ని సర్వేతరాంధ్ర సాహిత్యానికన్నా అధికంగా భావించటం జరిగింది. ఈ ప్రకటంగా కనిపించే ఆచార వ్యవహార నిరసన మాత్రం ప్రధానంగా భావించి- అతని యోగాన్ని దివ్య జీవన సాధనకు ఉపేక్షించి విమర్శకులు `ఉపరిశోధనలు' చేస్తూ వచ్చారు.తెలుగు సాహిత్యంలో వైదికి నియోగి భేదాలు 1910 తరువాత ఎక్కువగా విజృంభించాయి. తిరుపతి వెంకటకవులు కొప్పరపు కవుల విభేదాలు అనేక కవిత్వ వివాదాలకు కారణాలయ్యాయి, నన్నయ్య భట్టుకు తిక్కనతో సమానమైన- అధికంగా కాకపోయినా స్థానం లభించటానికి తరువాత కనీసం నలభై యేళ్లయినా పట్టింది.సుమారుగా ఈ ప్రాంతంలోనే జస్టిస్‌ పార్టీ ఉద్భవించింది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు పెచ్చరిల్లాయి. గుంటూరు ప్రాంతంలో త్రిపురనేని వారు దీనికి నాయకత్వం వహించారు. నెల్లూరు ప్రాంతాలలో రెడ్లు ఈ ఉద్యమానికి నాయకులయ్యారు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి ఉద్గమ స్థానం మదరాసు కావటంవలన నెల్లూరు అక్కడికి సమీపంలో ఉండటం వలన, అంతకు పూర్వమే గ్రామంమీద పెత్తనం ఉండటంవలన రెడ్లు రాజకీయాలలో మొదట అధికారంలోకి వచ్చారు.
గుంటూరు ప్రాంతంలోని రైతులుగా ఉన్న కమ్మవారు క్రమంగా సాహిత్యరంగంలోకి, పత్రికారంగంలోకి, వ్యాపార రంగాలలోకి వచ్చి బలపడ్డారు.ఈ సంధిలో పుట్టిన `కవిత్వ తత్త్వవిచారం' అలంకార శాస్త్ర మర్యాదలను పునాదులు కూలగొట్టి వస్తు ప్రాథమ్యానికి పట్టం కట్టింది. మహా కావ్యాల చట్రాన్ని తిరస్కరించింది. అభివ్యక్తి వైచిత్రిని కాదన్నది.అప్పటికే ప్రతిష్ఠితమైన కావ్య సంప్రదాయాలను కాదని నూతన సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఔపదేశికతను - అనగా వస్తువునకు పురస్కృతి కలిగింది. తమిళదేశంలో తిరువళు్ళవర్‌కు పట్టంకట్టిన విధంగానే నీతి బోధనకతకు, సామాజిక వ్యాఖ్యకు, కుల భేదాల నిరాకరణకు, అస్పృశ్యతను కాదనటానికి ముఖ్యత వచ్చింది. సరిగ్గా ఇదే కాలంలో ఈ అంశాలలో అధికాంశాలకు ప్రాధాన్యమిచ్చిన గాంధీ నాయకత్వం దేశంలో స్థిరపడింది.కుల భేదాల నిరాకరణం వెనుక కులాల ఆలసత్వమును ప్రకటించుకోవటం ముఖ్యాంశమే అయింది. యోగిగా, జ్ఞానిగా పరిగణింపబడిన వేమన వేమారెడ్డి - `మహాకవి' అయినాడు గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణకర్తగా నిరూపించబడ్డాడు. రాళ్లపల్లివారి వేమన ఉపన్యాసాల సందర్భంలో, రంగనాథ రామాయణం ప్రచురణ సందర్భంలో కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా ఉండటం అవిస్మరణీయమైన అంశం. ఈ కాలంలోనే మొల్ల రామాయణం ప్రశస్తి పెరిగింది. నన్నెచోడుడు, శ్రీకృష్ణదేవరాయల వంటి రాజకవులకు ప్రాధాన్యం కలిగింది.జాతీయోద్యమానికి వ్యతిరేకంగా కొనసాగిన సామ్యవాదోద్యమం భారత జాతీయతను ఏక దేశ భావనను కాదన్నది. క్విట్టిండియా ఉద్యమాన్ని త్రోసిపుచ్చింది. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని బలపరచిన దానిని స్తోత్రం చేసిన కందుకూరినీ, గురజాడనూ, ప్రాచీన సాహిత్యంతో సంబంధం తెలియకుండానే త్రెంచే ప్రయత్నం చేసిన వ్యావహారిక వాది గిడుగు రామమూర్తినీ, ఆధునికాంధ్ర మహాపురుషులుగా గుర్తించి ప్రచారం చేసింది. కాశీనాథుని నాగేశ్వరరావునూ, కొమర్రాజు లక్ష్మణరావునూ ఎప్పుడూ అలా ప్రశంసించలేదు.సామ్యవాదోద్యమంలో జస్టిస్‌ పార్టీవారి వ్యతిరేకాంశాలు ప్రథమంగా చోటు చేసుకున్నవి. స్వాతంత్య్రోద్యమ భావన గర్భితంగా ఉన్న `ప్రతాప రుద్రీయం' వారి ప్రశంసలకు ఎప్పుడూ స్థానం లేదు. వీరి సాహిత్య పార్శ్వం అరసం `ప్రాచీన సాహిత్యమంతా జన సామాన్యానికి ద్రోహం చేసింది' అన్న మూల సూత్రంతో ఉద్యమం ప్రారంభించింది. రామలింగారెడ్డి ప్రారంభం చేసిన వస్తుప్రాధమ్యం. క్రమంగా వస్తువే సాహిత్యమన్న పారమ్య స్థితికి చేరుకున్నది. కాల్పనిక కవిత్వంలోని దేశభక్తి ప్రణయం ఆదిగా పార్శా్వలు దూషితాలయినాయి.
ఈ నడుమ హిందూ భావనకు, విశ్వాసాలకు వ్యతిరేకంగా క్షతికలిగే విధంగా పురాణ, ఇతిహాస ఘట్టాలకు అపవ్యాఖ్య చేయటం ప్రారంభం అయింది. చలం, ముద్దుకృష్ణ, నార్లవంటి వారు ఈ మార్గంలోని వారు.నార్ల కమూ్యనిస్టు వ్యతిరేకిగా కనిపించినా లోతుగా ఎన్నో వ్యతిరేకతలు ఆయన రచనలలో ఉండేవి. ఆయన పత్రికా నిర్వహణలో కొందరు రచయితల ప్రసక్తి నిషిద్ధమై ఉండేది. అంతగా `భావ స్వేచ్ఛ'ను ఆదరించిన వ్యక్తి ఆయన. ఆయన పత్రికలో `చలం - విశ్వనాథ - శ్రీశ్రీల ప్రసక్తి నిషిద్ధం. ఈ అంశం పరిశీలించినప్పుడు ఆయన నిషేధం విధించటంలోని తాత్తి్వక మూలాలు బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం దాకా కొనసాగవలసి ఉంటుంది.ఇన్ని ఇబ్బందులలోనూ ఏ ఇబ్బందికీ పట్టుబడకుండా ఏ స్థిరబిందువుమీదా నిలువకుండా కాలానుగుణంగా కదిలిపోయిన వ్యక్తి కృష్ణశాస్త్రి అనిపిస్తుంది. కాల్పనికోద్యమంలో మూలవిరాటై్ట, అభ్యుదయ కవిత్యోద్యపు `పతాకై' మతం వద్దు, గతం వద్దు మారణహోమం వద్దు అంటూ లౌకికవాదై, `రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం' అంటూ భక్తివాదియై ప్రవర్తించాడు.నార్ల వ్యతిరేక దృక్పథం వల్ల తెలుగు వాళ్లకు రావలసిన జ్ఞానపీఠ ప్రథమ పురస్కారం రాకుండా పోయింది.1956-57లలో హైదరాబాద్‌లో తెలంగాణా రచయిత సంఘం వార్షికోత్సవాలు జరిగాయి. ఆ వేదిక మీద నుంచి విశ్వనాథ అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఆ భావనతో కార్యాచరణకు పూనుకుని ఆ పరిషత్తు ఏర్పరచేందుకు ఒక సన్నాహక సమావేశం హైదరాబాదులో జరిగింది. దీని ఆధిపత్యం తనకు అనుకూలం కానీ వారికి లభించవచ్చునన్న ఊహతో నార్ల, అబ్బూరిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి కొద్ది రోజులలోనే ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీని ఏర్పడేట్లు చేశారు.అయితే కొన్నేళ్ల తరువాత అకాడమీల రద్దుకు ఆయన కారణమయ్యారు.
ప్రాంతీయవాదంవైపు వస్తే తొలి రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాల కవి మండలి సాహితీ సమితిగా సాహిత్యాన్ని ఆవరించింది. తరువాతి కాలంలో ఉత్తరాంధ్ర రచయితలకు ప్రముఖమైన లాబీగా అవతరించింది. తెలంగాణా ప్రాంతంలోగానీ, రాయలసీమలోగానీ ఇలాంటి ప్రబలమైన రచయితల పరస్పర ప్రచారక మండలి ఏర్పడలేదు.మన లౌకికవాద వామపక్ష రచయితలకు మైనారిటీ మతమంటే ఎంతో ముద్దు. గజనీనుంచి కాశీం రజ్వీదాకా వెయ్యేండ్లు విధ్వంసం చేయబడ్డ దేశం. మనుష్యుల మీద ప్రకటించిన క్రౌర్యం, బాగా సంస్కృతుల అణచివేత ఈ కవులకు వస్తువు కాలేకపోయింది. గోద్రా రైలు దహనం వంటి అమానుష చర్య కలిగించిన పరిణామాలు మాత్రమే వస్తువులయి కవులు గుజరాత్‌ గాయం పేర `ఏకాహా'లు నిర్వహించారు. బాబ్రీ సంఘటనను నిరసించే ఈ కవి సమూహం తరువాత విధ్వంసమైన కాశ్మీరులోని ముప్పయి నలభయి దేవాలయాల సంగతి పట్టించుకోలేక పోయారు. మార్కి్సస్టుల ఎజెండాలో ఇటీవల స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదం వస్తువులు కావటం- వారి అనుబంధ సంస్థలు ఈ అంశాలకు ప్రచారం ఇవ్వటం ఆత్యంతికంగా ఈ దేశం `హిందూత్వ'ను నిర్మూలించే లక్ష్యమనేది స్పష్టం అవుతుంది. మనకు ఈ ఆపదనుంచి ఎవరూ రక్షించగలరు?

Saturday, July 25, 2009

రామా చంద్రమౌళి కవిత వసంత పునరాగమనం

`ఎటు?' అని నిర్దిష్టంగా సమాజాన్ని ప్రశ్నిస్తున్న కవి శ్రీ రామా చంద్రమౌళి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత. `ఇక్కడి ఈ ప్రజలు / నిజంగా నిద్రపోతున్నారా / నిద్రలో మరణించారా / నిద్ర నటిస్తున్నారా' ఇది కవికి కలిగిన సంశయం.
నాల్గో సింహం తల్లివలె జాతీయ స్తంభం
వెనుకే దుఃఖిస్తూ మరుగుననే ఉంది.
వ్రేళు్ల భూమిలో రహస్యంగా. . . గుప్తంగానే ఉన్నాయి.
నీళు్ల సముద్రాలలో, జనం కళ్లలో భద్రంగానే ఉన్నాయి.
ప్రజలు ఎన్నో కోటానుకోట్ల అవినీతిని క్షమించి
నిశ్శబ్దంగా నిద్రపోతూనే ఉన్నారు.
ఈ నాల్గో సింహం సమష్టి చైతన్యం మూర్తీభవించిన భారతమాత. వ్యవహార మంతా సాగుతూనే ఉన్నది సాగవలసిన దానికి విరుద్ధంగా. రాజకీయవాదులు సిద్ధాంతాలను మరచి వ్యభిచరిస్తున్నారు అంటున్నారు కవి. ఈ నిద్ర స్వభావం ఏమిటి? ఈ క్షమ వెనుక ఉన్న అసమర్థత ఏమిటి? మేధావుల `స్వప్నాలలో స్ఖలించటం' వెనుక అవార్డులను గౌరవంగా స్వీకరించటం వెనుక, అంగీలు చింపుకుని అరిచే `స్వవంచన వెనుక, ఎంతగా గాఢతమస్సర్పమై కదలి పోతున్నది. ఈ తీవ్రస్వరం వెనుక అనంతమైన వేదన ఉన్నది.
రామా చంద్రమౌళి కవిత్వభాష విలక్షణమైంది. ఆయన ఎన్నుకొన్న శబ్దజాలం, వాక్యవిన్యాసం, బింబాలు ప్రతీకలు సామాన్య తెలుగు కవితా పాఠకునికి చిరపరిచితమైనవి కావు. ఈ రచనలో `వాచ్యాభాసత' ఒక ముఖ్యలక్షణం. వాచ్యాభాసత వాచ్యం కాదు. ఉద్వేగతీవ్రత వల్ల వాచ్యంలా కనిపిస్తుంది. ఈ భాషలో ఆధునిక ఎలక్ట్రానిక్‌ పదజాలం ఉంది. గణిత విజ్ఞాన శాస్త్రాంశాలు ఉన్నాయి. వాక్యం సాగదు. ఎక్కడైనా విరుగుతుంది. ఆగుతుంది. నెమ్మది నెమ్మదిగా సాగుతుంది. మధ్యలో చిన్నప్పుడు తాను విన్న పాఠంలోని వాక్యం `నీరు కదలనిచో నాచుపట్టి నీచు వాసనతో మరణించును.' నీరు మరణించునా అని వెంటనే ప్రశ్న. `ప్లాటు ఫారంపై భారతీయుడు' గీతం శీర్షిక. రైలుకోసం నిరీక్షణం. ఇంకా రైలు రాదు వాన ఆగదు. చీకటి విడిపోదు. ఈ నిరీక్షణలో అనంతమైన మనోవల్మీకంలోంచి పొడుచుకువచ్చే పాముల బుసబుసలు. చైతన్య స్రవంతి పద్ధతిలో సాగే గీతం `అతని తలలో నగ్న వృక్షాలు, నగ్న సముద్రాలు గిర్రున తిరుగుతున్నాయి'. అతన్ని `సాదీ సాదీ' చీకిపోయిన అవ్వముఖం. ఎడతెగని నిరీక్షణ `చూపులు ఎరన్రి లైట్‌లో దిగబడి ఎంత పీకినా రావడంలేదు.' ఎరల్రైట్‌ బురద ఐందా, సుడిగుండమైందా అని మనం విచారించాలి. మన స్మృతిధార అంచునబడిపోతే అన్నమయ్య అంటున్నమాట `నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదుగదా' అని గుర్తుకు వస్తున్నది. భావభూమికలు వైరైనా సృజన భూమికలు ఒక్కటే.
`రూ. వేయి నోట్లపై లేజర్‌ చూపులు' అన్న గీతం పురపాలక సంస్థలూ, ఆసుపత్రులూ ఎలా వ్యర్థమైన వ్యవస్థను నిలబెట్టటమే ప్రయోజనమై, సాఫల్యం వైపు చూడనైనా లేని పరిస్థితిని వ్యక్తీకరిస్తున్నది. `కోయ్‌ వాడి గుండెను' `వేసేయ్‌ లైఫ్‌ టాక్‌‌స' మూడు ముక్కల్లో రామాయణం చెప్పినట్లు ఈనాటి అర్థవ్యవస్థలో అధికారులు, వైద్యులు మొదలైన వారి జీవితం `అడ్డమైన డబ్బు సంపాదించె సంపాదించె సంపాదించె చచ్చె' ఇదీ ఈ మానవమూల్యాలను పోగొట్టుకున్న ధనమునకు దాస్యం చేసే వ్యవస్థ చేరుకున్న భయంకరమైన కాలతీరం.
అదిరిపడి అర్థరాత్రి లేచి కూర్చుంటే
పెళ్ళాం వేసే సాంబ్రాణి పొగ. . . చూపించే వేయి రూపాయల కట్టలు
మార్చరీ వాసన
ఎంతకూ కలలు తెగిపొవు
జీవితం అంతా కారుణ్యం, స్నేహం మమకారం, వాత్సల్యం, ఔదార్యం, కృతజ్ఞత ఇలా అన్ని దైవ గుణాలను కోల్పోయిన స్థితి. కవి వాక్యాలలో వాస్తవాన్ని చెప్పుతూవున్నా ఎంత కసి ఉన్నది? ఈ కసి వెనుక ఎంత క్రోధం ఉన్నది? ఆ క్రోధం వెనుక ఎంత దుఃఖభారం ఉన్నది? `బట్టల్లో లోపల అసలు నీవు లేనట్టు బోలుతనంతో క్షణం క్షణం చచ్చిపోతూ' ఇదీ అతని స్థితి. ఈ మానవుడు సగటు మానవుడు చేరుకోనెంచే లక్ష్యం. ప్రైమరీ యూనిట్‌.
చంద్రమౌళి కవిత్వంలో వాక్‌ తీవ్రధార ఒక పార్శ్వం. మరొకచోట కరిగి కన్నీరై ప్రవహించగల చోట అతనిలోని మృదు కుసుమ పార్శ్వమూ గోచరిస్తుంది.
హృదయాన్ని తపసుతో పూరించి ఆవేశ పరచినప్పుడు
తల ధనధ్రువమై పాదాలు ఋణ ధ్రువాలౌతాయా?
మరొకడు తలతో పాదాలకు ప్రణమిల్లి
హస్తాలతో ఆశీస్సులు పొందితే
విద్యుద్వలయం పూరణమై
శక్తి హృదయానికి చేరుతుందా
మృదు మధుర కోమల హస్త స్పర్శలో శాంత సముద్ర దృక్కులతో ఆ మనిషి మహామానవుడైనా పిడికెడు గుండెతో ఆకాశమందు అగ్నిని ధరించిన పసివాడౌ తున్నాడు. తన్నుతాను తపస్సులోకి ఉపసంహరించుకుంటున్నాడు. పై ఖండిక జీవ చైతన్యంలో ధ్యేయ పరంపర ఎలా పరివర్తనాన్ని సాధించగలదో తెలియజేసింది. తపః ప్రసారాన్ని జీవనంలోనికి నిలువరించుకునే లక్షణాన్ని వ్యాఖ్యానించింది.
జీవితంలో అన్ని పార్శా్శలూ దుఃఖపు అగాధాలై నడిమి బొడ్డు విూద నిల్చున్న వ్యక్తి ఎలా కలల్లో తన భావనాజగత్తులో సుఖానుభవాన్ని ప్రోది చేస్తుందో ఈ ప్రపంచం ఆ కలను ఎంత క్రూరంగా భంగింపజేస్తుందో `పగటిపూట పనిమనిషి కల' అనే గీతంలో వ్యక్తమవుతున్నది.
తుఫానులో రెండు గడ్డిపరకల్లా. . . రెండు జీవితాలు మిగిలాయి. తల్లీబిడ్డలు. ఆ తల్లి ఏంచేస్తుంది. వ్యభిచారం. `. . . ప్లీజ్‌' అన్న గీతం ఆ బాలుని ోభను వ్యక్తం చేయటానికి పుట్టింది. ఆ పసిగుండె ఎంత వేదన పడుతున్నదో ఈ రచన అద్భుతంగా ప్రకటించింది. `నాన్న చనిపోయారు బీదరికముంది చుట్టూ క్రూర నిర్దయ వికృత దయాహీన సమాజ ముంది.' ఇదంతా భూమిక. విలువలు లేని సమాజం. పరదుఃఖ దుఃఖిత లేని సమాజం. `సర్వ మున్నతని దివ్యకళామయ మంచు' భావించలేని సమాజం, ముడుచుకు పోయి ఇరుకైన చీకటి గుహలతో అభద్రతా భావంతో, నిత్య మృత్యు సన్నిహిత భయంతో సగం చచ్చిన సమాజం ఆమెకు ఏ దారి చూపించగలదు? రాజకీయ వ్యవస్థలు, సిద్ధాంతాలు, రాసులు పోసిన సంపదలు, విజ్ఞానము, సాంకేతికత ఇవన్నీ మనిషిలోని దైవీయ పార్శా్వన్ని లోతులలో నుంచి చేది ముందుకు తీసుకురాగలవా అంటే అది అసంభవమనే చెప్పాలి. సర్వాత్మ చైతన్య స్పృహలేని సమాజం తప్పక ఎక్కడో కుప్పకూలుతుంది. అందుకే ఆ బిడ్డ తల్లి తలను నిమిరితే పాము చుట్టపై బడ్డట్లు జలదరించిపోయినాడు.
ఈ సంపుటిలో ఒకటి రెండు వియోగ గీతాలు ఉన్నవి. ఈ గీతాలు మృత్యు వేదనకు సుస్పష్ట ప్రతీకలు. `నీవు వెళ్లి పోయాక' అన్న గీతం ఆమె వెళ్ళిన తరువాత రెక్కలు తెగిన ప్టక్షిగా తాను మారిపోవటంతో ప్రారంభమయింది. గృహము వట్టి ఇల్లయింది. గృహము అంటే కళిళీలి అనీ, ఇల్లు అంటే కళితిరీలి అనే శబ్దాలకు పర్యాయంగా ఇక్కడ, తెలుగులో కవి ప్రయోగించాడు. ఇది భాషలో పలుకుబడిని `సహజమార్గం'లో సంపన్నంగా చేసే పని. ఆమె లేకపోవటం వల్ల బయటి ప్రపంచమూ లేకుండా పోయింది. గృహం అంతటా అణువణువునా ఆమె జ్ఞాపకాలే.
ఎందుకంటే ఆమె సహచరి. ప్రథమ సమాగమంలోనే ఆమె జీవితాన్ని ఉమ్మడి పోరాటంగా నిర్వచించింది. ఎక్కువ తక్కువలు లేవు. లొంగుబాట్లు అధిక గౌరవస్థానాలు లేవు. రెండు చేతులకు బదులు మరో రెండు చేతులు. రెండు కాళ్లకు బదులు మరో రెండు కాళు్ల. ఈ గీతం జీవనంలో గార్హస్థ్య ధర్మ సంపూర్ణతా లక్షణాన్ని ఆధునిక పరిభాషలో చాలా బలంగా, చాలా సమచిత్తంలో, నిమగ్నతతో వ్యాఖ్యానించింది. గృహస్థ జీవనంలో ఒకటి పతాకం పతంగి, రెండవది దాని నింగిదాకా మోసుకుపోయే దారం. చివరకు అంటాడు అత్యంత కరుణాస్పదంగా, ప్రతీక గర్భంగా `ఒక చెప్పు తెగి ఎక్కడో పడిపోతే రెండో చెప్పు పనికి రాదు. దీన్ని తప్పకుండా పారేయాల్సిందే' అని `అసలు వీళ్ళద్దరూ ఇద్దరు కాదని' ఆరంభించి ఐదు పంక్తులలో జీవనంలో దంపతుల సహకార సౌమనస్య జీవన తాత్పర్యం సంప్రదాయ ప్రతీకలు వాడకుండా ఎంత భావుకంగా చిత్రింపబడిందో ఆశ్చర్యం వేస్తుంది.
మరొక వియోగ గీతం `నాన్న జ్ఞాపకాల్లో' అనేది. తండ్రి తనకు ఎలా జీవితాన్ని విప్పి చెప్పాడో, వివరంగా వర్ణిస్తాడు కవి.
అనివార్యమై దుఃఖాలు దండెత్తినపుడు
ఒక్కనివే భరిస్తూ మాకు మండే సూర్యుణ్ణి చూపించావు
ఒక్క ఆకాశం తనను తాను చినుకులుగా, చినుకులుగా
భూమికి దానం చేసుకున్నట్లు
నీవు వేలమంది శిష్యూలకు ఓ చిర్నవు్వవై విస్తరించావు.
మిగతా ఎక్కువ గీతాల్లో కరుణరసభావం క్రూరమైన అధిక్షేపంలో, నిశితమైన వెక్కిరింపులలో నిండివున్న కవివాక్కు ఈ వియోగ గీతాలలో నగ్నంగా, అనుద్విగ్న జలపాతంగా గోచరిస్తుంది. `ఆజంజాహి మిల్లు'ను గూర్చి మరొక వియోగగీతం రాయటం అరుదైన అబ్బురమైన అంశం.
`ఎటు' అన్న ప్రారంభ గీతం జీవితంలో ఉండే నిర్ణయను, కఠినమైన దోపిడీని, మాయాసభ్యతల వలల విసరడాన్ని చిత్రిస్తున్నది. `మెడబట్టి నెట్టబడినచోట కాళ్లకూ కళ్లకూ ఐచ్ఛికాలుండవు. నిర్బంధాలే అనివార్యాలౌతాయి' మన విద్య, మన నాగరికత, సినిమాలు, కళలు, భాషలు ఎలా ప్రపంచ ఆర్థిక సంస్థల నియంత్రణలో, పశ్చిమ దేశాల సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో ఓడిపోయి చైతన్యం కోల్పోయి, నిరాశోపహతమై, హతమై జీవిస్తున్నాయో చిత్రిస్తుందీ కత్తివాదరవంటి గీతం `పావురాన్ని మూసిన హాల్లో బంధించి తరుముతే దానంతటదే నేల కూలుతుంది కుట్ర' అంటారు కవి.
కవి యువజనుల దైన్యస్థితిని కళ్లకు కట్టిస్తున్నాడు. ఆ వేగంతో కొట్టుకుపోతూ ఆ ప్రవాహంలో మనను లాక్కొని పోతున్నాడు. చివరకు
ఇక్కడి జీవావరణం కలుషితమైంది. . . జీవనచిత్రం ఛిద్రమైంది.
జీవన ధర్మాలు, జీవన విధాలు. . . జీవన గమనాలు గతి తప్పాయి.
యిక్క డిపుడు చెట్లపై వాలిన పక్షులను ఆకులే తుపాకులై హత మారుస్తున్నాయి.
రోడ్లే ఉన్నట్లుండి విచ్చుకొని పర్రెలై కబళిస్తున్నాయి.
అని ఈ భయంకర చీకటి రాత్రిని వర్ణిస్తున్నాడు. దీని అనుస్యూతిలో `వేణువు కనిపించడం లేదు. కాని పాట వినిపిస్తోంది.' చదివితే వెలుతురు కిరణాల కోసం యుగయుగాల నిరీక్షణ యికనైనా ముగుస్తుందా అని ప్రశ్నిస్తాడు కవి. అందుకే ఇక్కణ్ణించి `పరుగు గునపా ల్లాంటి చినుకుల వర్షంలో ఒకటే పరుగు.' ముందు ఓ చెట్టు కిందకు చేరనీ' ఈ చెట్టు జీవవృక్షం, సంసార వృక్షం, అనంతకాలాన్ని తనలో సంలీనం చేసుకున్న మహావృక్షం. సర్వజీవులకు ఆశ్రయమిచ్చే వృక్షం.
ఈ వృక్ష ప్రతీక పృథ్విలోకి చొచ్చుకొని ఉన్న ఆనంత్యాన్ని సూచిస్తుంది. అది భూమి మీద నుంచి ఆకాశం నలువైపులా వ్యాపించి దాన్ని ఆవరిస్తుంది. పరిమితినుంచి అపరిమిత స్థానందాకా ఎదిగిపోతుంది. సర్వమునూ తనలో గర్భితంగా చేసుకుంటుంది. అందుకే తర్వాత `వేణువు కనిపించకున్నా ఎక్కడ నుండయితే నేమి ఓ బ్రతికించే పాటను వినవచ్చు.'
`పెనునిద్ర' అన్న గీతం జీవన విధానమే అవినీతిని భాగంగా చేసుకున్న అంశాన్ని దేశ జీవనాన్ని చిత్రిస్తుంది. ఆడిటర్‌ భార్య దీనిలో వక్త. జీవితంలో ఎన్ని పొరలున్నాయి. ఎన్ని వేల ముసుగులున్నాయి. ముప్పయ్యేళు్లగా ఈ వ్యవహారానికంతా సాక్షి. తాను మాంగళ్యధారణతోనే `మరణించింది.' నిద్రలేవవలసినవాళు్ల పెనునిద్దుర నుండి మేల్కోవడం లేదు అంటుంది. ఈ నిద్ర మేలుకొల్పుకు ఆమె వాడుకున్న ప్రతీకగానం `కౌసల్యా సుప్రజా రామ' అని ఈ కౌసల్య నిరీక్షణ రామునికోసం ధర్మ సంస్థాపకుడైన, సత్యపరాక్రముడైన రామునికోసం. ఈ కౌసల్య దేశం. పృథ్వీగర్భం. అందుకే సగటు భారతీయుని సంబోధిస్తూ కవి అంటున్నాడు.
యోజనాల దూరాలను అడుగుల్లోకి సూక్ష్మీకరించడం
దూరాలను సంకలీకరించుకుని సమీకరణాలను సమీక్షించుకుని
దండయాత్రను రచించుకోవడం ఇవన్నీ ఒంటరిగా
నీవు గరళధారి శివుడివికావాలి
నిశ్చల సముద్రంగా గంభీరునివి కావాలి
అప్పుడు పోరాటం `ఓ మాటను పెంచేసుకుని, ఓ పాటను వెంటేసుకొని ఒక సూర్యుడిలా ఒక ఆకాశంలా ఒక భూమిలా ఒంటరిగా ఒక వ్యక్తిగా పోరాటానికి ఉపక్రమిస్తావు.' ఈ ఒంటరిపోరాటం ఆత్మవిశ్వాసంలోనుంచి పొడుచుకు వస్తుంది. గాంధీజీ దేశంలో పోరాటం ఇలాంటి స్థితిలోనే ప్రారంభించారు. ఆ ఒక్క వ్యక్తిలోనే కోట్లాది భారతీయుల చైతన్యం సమీకృతమై అహింసా సేవావాహిని అయింది. అందుకే `గాంధీ జీవన విధానం కంటే గొప్ప పరిత్యాగ సిద్ధాంతం ఉన్నదా' అని కవి ప్రశ్న. రామా చంద్రమౌళి కవితలో వరంగల్లు మాండలిక భాషలోని జీవలక్షణం ఉన్నది. ప్రాంతీయ మాండలిక ప్రయోగాల బిగింపు ఉన్నది. `పెంకాసు', `ఠక్కున, `ఇసిరె' `సద్దుల', `దబదబా', `పతంగీ', `మాంజా', `బొక్క' మొదలైనవి గమనించవచ్చు.
అభివ్యక్తి విషయంలో చంద్రమౌళి కవితకు వాడి ఎక్కువ. `ఏండ్లకు ఏండ్లు గొడ్రాలైన ఆకాశం చినుకు రాల్చదు' `ఆడబొడ్డు చుట్టూ మగచీమలు' `మొస్స పోసుకుంట' `పనియంత్రాలే మంత్రాలపై ఓంు్టగల్లు నగరాన్ని ఓ ఎగిరే జెండగా' `నీ ఉత్తరం చంద్రుణ్ణి తోడ్కొని వచ్చే ఓ ఆకాశం.' ఈ వాక్యాలు కవి భావుకతను పట్టియిస్తాయి.
శ్రీ రామాచంద్రమౌళి ఇంతకు ముందు ప్రచురించిన కవితా సంపుటాలు శిలలు వికసిస్తున్నాయి (1979) స్మృతిధార (1984)ల్లో కవి ఇంత విస్తృతంగా కవితా గంగా ప్రవాహాలను క్రుమ్మరించలేదు. వాటిల్లో పరిమిత బింబాల ప్రతీకల వాక్యవిన్యాసాల పునరావృత్తి ఉన్నది. గొంతులో ఇతర కవుల ముద్రలు ఉన్నాయి. అయితే `ఎటు' వచ్చేసరికి ఈ కవి సర్వతంత్ర స్వతంత్రుడు. భాషలో అనూహ్య మైన వేగం, అభివ్యక్తిలో విలక్షణమైన వినూత్న వైఖరి, వస్తువ్యాసంలో ఆత్మీయత ఈ అంశాలు దీన్ని సర్వతో ముఖంగా వర్చస్వంతం చేశాయి.
ఈనాటి శిథిలమవుతున్న కుటుంబ వ్యవస్థను చిత్రించే `గుండెపుండు' గీతంలో శ్వాసించేశవం అయిన తండ్రి దుర్భర పరిస్థితిని చిత్రించి `నెలక్రితం అమ్మచావును పెళ్లిలా జరిపిన కన్న పిల్లలు' తను జీవించి వుండటాన్ని ఎంత భారంగా భావిస్తున్నారో హృదయ విదారకంగా చిత్రించాడు కవి. తుదకు తన స్థితి పాయలు పాయలుగా ఎడతెగని దుఃఖం, నీడలు నీడలుగా చంపకుండా వెంటాడే భయం' ఈ భయం చంపదు ఛేజ్‌ చేస్తుంది.
`యుద్ధరహస్యం' గీతం ప్రపంచీకరణలోని తాత్పర్యాన్ని వెల్లడిస్తున్నది. విద్యావంతుల `బానిసల వలసలు' ఎలా ఐడెంటిటీని పరిహరిస్తున్నవో `మనిషిని ఓ మార్కెట్‌ చేసి చివరకు నీకు తెలియకుండానే నిన్ను హర్రాజు చేస్తుంది.' ఈ కొత్త దోపిడీని వెల్లడిస్తాడు కవి. భారతీయ జీవనాదర్శ శిఖరాలు ఎలా పడిపోతున్నాయో ఆశ్చర్యకరమైన శబ్ద సంపుటితో వ్యక్తం చేస్తున్నాడు.
`కొండ శిఖరంపై ఓ రమణమహర్షి మరణ మహర్షి రణమహర్షి మర మహర్షి రాలిపోతున్నట్లు, కూలిపోతున్నట్టు' `రమణ మహర్షి' శబ్దం పొందిన వికారాలు మూడూ జాతి పతనాన్ని సూచించే విలక్షణ పదబంధాలు. శబ్దం అక్షర వ్యత్యయంతో నూత్నావతారం ఎత్తిందో ఈ పంక్తులు శక్తివంతంగా రూపించాయి. రామా చంద్రమౌళి శిల్ప పారమ్యం ఇలాంటి ఘట్టాలలో చూడవచ్చు.
వ్యతిరేక పార్శా్వన్ని ఇంత బలంగా చూపిన ఈ కవి సమాజంలోని అనుకూల పార్శా్వన్నీ ప్రకటించటమూ అవసరమే.
భావుకజగత్తులో కొత్త జండాలు ఎగురవేస్తున్న కవి రామా చంద్రమౌళి.