Sunday, February 8, 2009

గురుకుల వ్యవస్థ భారతీయ విద్యామూలసూత్రం

ప్రాచీన నాగరకతల్లో దాని నిరంతర అభివృద్ధిలో ఆ సమాజంలోని వ్యక్తుల శక్తులు అవగాహనలో లక్ష్యాలు, ఆకాంక్షలు, స్వప్నాలు అన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. విద్య కూడా వీటన్నింటినీ ఆశ్రయించి జనాన్ని ముందుకు నడిపించే దివ్యరథం లాంటిది. విద్యలో నాలుగు రకాలు కానవస్తాయి.
1. జీవిక కోసం అవసరమైన వృత్తులు, నైపుణ్యాలు అభ్యాసము, వీటిని స్థూలంగా గ్రామీణ జీవన మారా్గలుగా నిర్దేశించుకోవచ్చు. వ్యవసాయం కుమ్మరి, కమ్మరి, కంచరి, మంగలి, చాకలి, నేత, కంసాలి మొదలైన విద్యలన్నీ ఈ శ్రేణిలో చేరుతాయి. సాధారణంగా ఈ విద్యకు ఇల్లే విద్యాలయంగా తండ్రియే గురువుగా కొనసాగుతుంది. ఆ గృహంలోని వ్యక్తుల పరంపరలో ఈ విద్యాసూత్రం తరానికీ, తరానికీ నైపుణ్యాన్ని సమకూర్చుకుంటూ అవసరాన్ని బట్టి సాంకేతికతను పెంచుకుంటూ ముందుకు సాగుతుంది.
2. సమాజ వ్యవహారానికి అవసరమైన వ్యాపారము, ఎగుమతులు దిగుమతులు, నిత్యావసర వస్తువుల వినిమయము, తొలుత పేర్కొన్న వృత్తుల వారు ఉత్పత్తి చేసిన వస్తువులను సమాజానికి పంచటం.. ఈ రకమైన వ్యవహారమంతా వణిక్‌ వృత్తిలో సార్థవాహ రీతిలో దగ్గరకూ దూరానికీ అందజేస్తూ తమ జీవితాన్ని కూడా దీని ద్వారా నడుపుకొనే విధము.
3. గ్రామాలకు, పట్టణాలకు, జనపదాలకు, రాష్ట్రానికి అనేక విధాలైన ఆపదలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. క్రూర మృగాల వల్ల, దొంగల వల్ల, బర్బరుల వల్ల, శత్రువుల వల్ల, ప్రాకృతిక బీభత్సాల వల్ల సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఈ సందరా్భలలో సమాజాన్ని రక్షించే జనశ్రేణులు రెండు రకాలుగా అవసరమవుతాయి. ప్రాకృతిక బీభత్సాలలో నష్టపోయిన సందర్భంలో వారిని సేవించే సాధు సజ్జన బృందం, శత్రువులు మొదలైన వారి వల్ల ప్రాణ భీతి ఏర్పడ్డప్పుడు ఆస్తులకు నష్టం కలిగినప్పుడు రాష్ట్రం పరాధీనమయ్యే సందర్భం వచ్చినప్పుడు రక్షించే సైన్య శ్రేణి ఒకటి. ఈ సందర్భంలో సమాజానికి సేవ చేసే ధార్మిక సంస్థలు ఉదార జన సమూహం ఎంత అవసరమో శస్త్ర బలం వల్ల ధనుర్విద్యాదుల వల్ల శత్రువులను ఎదుర్కొని దేశాన్ని రక్షించగల సైనిక సమూహమూ అంతే అవసరము.
4. సమాజ పురోగతిలో అవసరమైన భావనలు పరికల్పనలు, లక్ష్య నిర్దేశాలు భావించే వర్గం ఒకటి. వీరు సమాజాన్ని అట్టడుగు నుంచి శిఖరాల దాకా ఉండిన స్థితిని పరిశీలించి విశే్లషించి నూతన మారా్గన్ని ప్రణాళికను ఆచరణ క్రమాన్ని వ్యాఖ్యానిస్తారు. వీరి పరిశీలనలో మానవుడికి మానవుడికీ నడుమ ఉండే సామరస్యం మాత్రమే కాక, మానవుడికీ, ప్రకృతికీ ఉండవలసిన సామరస్యం, మానవుడికీ, ఈశ్వరుడికీ ఉండవలసిన సామరస్యం, అతని అంతర్బహిర్లోకాల సామరస్యం ప్రధాన వస్తువులు అవుతవి. దీనిని ఆసాంతమూ అవగాహన చేసుకోవటానికి సృష్టి రహస్యం, సృష్టి వికాసము, గ్రహ, నక్షత్ర, గోళముల స్థితిగతులు, ఋతువులు, భౌగోళిక పరిస్థితులు చరాచర జంతుజాలము భూగర్భ రహస్యము, వ్యాధులు, తన్నివారణలు, ఆసందర్భంలో మనిషికి ఓషధులే కాక ఆత్మ విశా్వసాదుల వల్ల కలిగే శక్తి ఇవన్నీ ఇక్కడ ప్రాధాన్యం వహిస్తాయి.
ఈ నాలుగు విధాలైన ప్రావీణ్యం సమాజాన్ని ముందుకు నడుపుతుంది. ఇతర సమాజాలతో అనుబంధాన్ని పెంచుతుంది. ప్రకృతితోడి సామరస్యంతో జీవనాన్ని సుఖమయం చేస్తుంది. అంతర్ముఖమైనప్పుడు శాంతిని బహిర్ముఖమైనప్పుడు సమృద్ధిని జీవన లక్ష్యంగా నిర్దేశిస్తుంది. భారతీయ విద్యానిరా్మణ భావనలో ఈ నాలుగు పారా్శ్వలు తమతమ ప్రాధాన్యాన్ని ఆశ్రయించి ముందుకు సాగుతూ వచ్చాయి. అందువల్లనే ఈనాడు విద్య అన్న భావనకు ఉన్న పరిమితి ఆనాడు లేదు. యావిద్యా సా విముక్తయే అనగా ఏది మానవుణ్ణి అనేక బంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తుందో అదియే విద్య అనబడుతుంది.
పైన పేర్కొన్న క్రమంలో మొదట పేర్కొన్న వృత్తులు గ్రామంలో కుటుంబాన్ని ఆశ్రయించి ప్రవర్ధిల్లినవి. రెండవ పద్ధతి వాణిజ్యం మొదలైనవి కూడా కుటుంబాన్ని, గ్రామాన్ని కలుపుకున్న సమన్వయంలో నుంచి సాగి వచ్చినవి. ఉత్పత్తి చేసే వ్యక్తి నుంచి వ్యక్తి దాన్ని సేకరించి అందరికీ అందజేయటం దాని విలువను గ్రహించి ఉత్పత్తి దారునికి ఎక్కువగా, తనకు తక్కువగా, తన జీవికకు తక్కువగా సాధించవలసి ఉంటుంది. మూడవది రాజ్య వ్యవస్థలను, అధికార వ్యవస్థలను ఆశ్రయించి సాగవలసింది. దీనికి బలాన్ని చేకూర్చే ఉదార వితరణ శీలమైన జనసమూహము సేవాభావం గల వ్యక్తులు అవసరము. అట్లాగే సమాజ రక్షణ కోసం తమ ప్రాణానై్ననా అర్పించగల సైనికులు రక్షకులు మొదలైన వారి వ్యవస్థ అవసరము. నాలుగవది, ఇది ఉపరితలం మీద కాక, అంతర్గతంగా సమాజానికి కావలసిన భావ భూమికలోని పరివర్తనను, పురోగమనాన్ని నిర్దేశిస్తూ సాగిపోయేది. వ్యాకరణమైనా, తర్కమైనా, మీమాంస అయినా, జ్యోతిష్య శాస్త్రమైనా... ఏ శాస్త్రమైనా ప్రత్యక్షంగా సద్యః ఫలదాయకాలు కాకపోయినా, సమష్టిగా మనో భూమిక మీద పరిణామాన్ని తీసుకువచ్చింది. దీనికి కావలసింది దీర్ఘమైన సాధన. నిరంతర సమాలోచన. చర్చ. అంతర్ముఖంగా భావించటం. బుద్ధిని అన్ని పారా్శ్వలలో మేల్కొల్పటం. ఇలాంటి స్థితిలో జీవించటం వల్ల ప్రత్యక్షంగా భౌతిక జీవనానికి లాభం కానరాకపోయినా, పరోక్షంగా ఆ చక్రపు అంచులను ఒరిపిడి పెట్టి తేజోమయ సుదర్శనంగా పరిణమింపజేయవచ్చు.
నాలుగవ భావశ్రేణి ముందు క్రిందికి ప్రసరించిన కిరణాల్లోనుంచి అనేక జ్ఞాన భేదాలు శాఖలు అవతరిస్తాయి. మానవ జీవన అనుభవమంతా ఒకే ద్రవ్యరాశిగా తీసుకొని దాన్ని సార్వజనీనంగా, సార్వకాలికంగా అభివ్యక్తం చేసినప్పుడు సామాన్య శబ్దం కావ్యమవుతుంది. కూనిరాగం సంగీతం అవుతుంది. తంత్రులు గానం చేస్తాయి. చేతులు, కాళు్ల కదిలిస్తే నాట్యమవుతుంది. శిలను తాకితే శిల్పమవుతుంది. సామాన్యమైన శబ్దాదులకు తాత్కాలిక స్ఫూర్తియే ప్రధానం కాగా అనుభవ సముద్రం లోంచి పుట్టుకువచ్చిన ఈ అంశాలు సార్వకాలీనతను సంతరించుకుంటాయి. అట్లాగే దీని అనుభవంలోనికి వచ్చిన వ్యక్తులు అసామాన్యమైన సౌకుమారా్యన్ని, ఆర్ద్రతను సర్వమందు సౌందరా్యన్ని చూడగలిగిన లక్షణము సంపాదించుకుంటారు. అట్లాగే ప్రకృతిలోని కొన్ని ద్రవ్యాలను శారీరక రుగ్మతల నివారణ కోసం ఉపయోగించే గృహ చికిత్సా సంప్రదాయంలోంచి తాత్తి్వక విశే్లషణ తార్కిక సంగతి కలసి వైద్యశాస్త్రం పుడుతుంది. చరకుడు, శుశ్రుతుడు ఈ త్రోవ నుంచి వచ్చిన వారే. ఇలా అనేక శాస్త్రాలకు ప్రేరణలు నాలుగవ శ్రేణి భావ భూమిక నుంచి ప్రసరించి ప్రథమ శ్రేణి వృత్తుల జీవన మారా్గల ఒత్తిడి లోనుంచి నూతన అంశాలు విజ్ఞాన భూములై ప్రకాశిస్తాయి.
౎౎
భగవన్‌ అధీహి మే బ్రహ్మన్‌ అని యాచించిన కుమారునికి తండ్రి తపస్సు చేయమని చెప్పి ఆ తపస్సు ద్వారా కుమారుడు అన్నమును, ప్రాణమును, మనస్సును, విజ్ఞానమును క్రమంగా బ్రహ్మమని భావిస్తూ తనను దిద్దుకుంటూ ఆత్యంతికంగా ఆనందమే బ్రహ్మమని తెలుసుకుంటాడు. తన కుమారుడు బ్రహ్మవిద్యాభిలాష ఉత్కటంగా కలిగినప్పుడు తనను వేధించగా యముని గురువుగా సూచించి అక్కడికి తన పుత్రుని పంపించి, అతనిని బ్రహ్మ విద్యావేత్తగా తీర్చిదిద్దడం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. బృహదారణ్యకంలో జనకుడి సభలో అనేక మంది విద్వాంసులు బ్రహ్మజ్ఞానమును గూర్చి చర్చించడం, పరమార్థమును చేరుకోవటం, సమష్టిగా పరిషత్తుల వల్ల సాగినట్లు కనిపిస్తుంది. ఒక జిజ్ఞాసువు, ప్రశ్నను విప్పుకోవటానికి మరొకని దగ్గరకు చేరగా ఆతడు మరొక గురువు దగ్గరకు తీసుకుపోవటం.. ఇలా పరంపరగా తమకు సమాధానం లభించే వరకు అనే్వషిస్తూ పోవటం ఇంకొక అధ్యయన మార్గం. ఇలా ఉపనిషత్తులలో అనేక గురుకులాలు ఏర్పడి ఉన్నట్లు జ్ఞాన విజ్ఞాన ప్రసారాలు నిరంతరాయంగా సాగినట్లు సాక్ష్యాలు కొల్లలుగా కనిపిస్తాయి.
గురుకులాలు ఉపనిషత్తుల కాలంలో నగరాలకు దూరంగా జనపదాలకు దూరంగా అడవులలో ఉండేవి. అక్కడే ఆశ్రమాలు, అక్కడే గురువులు, అక్కడే విద్యాస్థానాలు శిష్యులు తమకు తగిన గురువును వెతుక్కుంటూ అతనిని ఆశ్రయించటం, అతని వల్ల తాము కోరుకున్న విద్యను సంపాదించటం నాటి ప్రధాన ధోరణి. ఈ గురుకులాలు ప్రధానంగా గురువు కేంద్రంగా, శిష్యపరంపర అతణ్ణి ఆశ్రయించిన జిజ్ఞాసు సమూహంగా సంయోజింపబడి ఉండేది. శిష్యుని అంగీకరించటం, అతనికి ప్రవేశం కల్పించటం గురువు ఇష్టం మీద ఆధారపడి ఉండేది. అట్లాగే గురువును ఎన్నుకోవటం, ఆ గురువును ప్రసన్నుణ్ణి చేసుకుని తనకు కావలసిన విద్యను సంపాదించటంలో శిష్యునికి స్వేచ్ఛ ఉండేది. ఈనాటి విద్యావిధానంలో గురువునకు కానీ, శిష్యునికి కానీ ఈరకమైన స్వేచ్ఛ కనిపించదు. గురుకులాలలో శిష్యులు క్రమశిక్షణ కలిగి గురు కుటుంబానికి శుశ్రూష చేయవలసి ఉండేది. నియతమైన శుల్కం కానీ, మరో విధి కానీ, ఉండేది కాదు. విద్యా స్వీకరణం తరువాత శిష్యుడు తనకు తోచినది, సాధ్యమైనది గురుదక్షిణగా ఇచ్చే అవకాశం మాత్రం ఉండేది. గురుకులాలలో శిష్యులకు కావలసిన అన్నపాన వ్యవస్థ గురువులే చేసేవారు. అలా పదివేల మంది విద్యార్థులకు వ్యవస్థను ఏరా్పటు చేసిన వ్యక్తి కులపతి అని వ్యవహరింపబడేవాడు. ఈ గురుకులాలలో ప్రధానుడైన కులపతి కాకుండా అనేక మంది వివిధ విద్యా విభాగాలను నిర్వహించే విద్వాంసులు ఉండేవారు. మనకు ఇతిహాసాలలో ఆశ్రమంలో ఉండే విద్యా విభాగాల పరిస్థితి కానవస్తుంది. ప్రాన ఋష్యాశ్రమాల ప్రసక్తి అనేక చోట్ల కానవస్తుంది. ఇతిహాసాల కాలంలో వశిష్ట, విశా్వమిత్ర, వామదేవ, భరద్వాజ, అత్రి, కణ్వ, గృష్ణమద ఋషుల ఆశ్రమాలు సనాతన విద్యాసంప్రదాయాన్ని, వ్యవస్థను రక్షించినట్లుగా కనిపిస్తుంది. ఈ ఋషి కులాలలో ఒక్కొక్క చోట ఒక ప్రత్యేక వేద శాఖాధ్యాయనమో, శాస్త్రాధ్యయనమో నియతంగా చేయబడేది. ఒక ఆశ్రమంలో ఉండే విద్యావిభాగాలను మనం పరిశీలించి చూస్తే ఆ వ్యవస్థ ఎంత విపులంగా విశ్వ రహస్య వేతృతను భౌతిక జగత్‌ పరిణామాన్ని, మానవ చైతన్య విస్తారాన్ని, సృజనాత్మక చైతన్యాన్ని వ్యాఖ్యానించేదో తెలియవస్తుంది. ఆనాటా ప్రధాన విద్యాస్థానాలు ఇవి.
1. అగ్నిస్థానం: అగ్ని ఉపాసనకు, యజ్ఞ యాగాదులకు, ఉపాసనలకు ఆధారభూతమైన స్థానం.
2. బ్రహ్మస్థానం: చతుర్వేదాలను సస్వరంగా అధ్యయనం చేసే చోటు.
3. విష్ణుస్థానం: రాజనీతి, అర్థనీతి, వార్త మొదలైన క్షత్రియోచిత విద్యలకు నెలవు.
4. మహేంద్రస్థానము: సైన్య శిక్షణకు సంబంధించిన స్థానము
5. వివస్వత స్థానము: జ్యోతిషము(గ్రహ, నక్షత్ర విద్య)
6. సోమస్థానము: వృక్షములు, ఓషధులు వానికి సంబంధించిన విద్య.
7. గరుడ స్థానము: ప్రయాణాలు, వాహనములు మొదలైన వానిని అధ్యయనం చేసే స్థానము.
8. కార్తికేయ స్థానము: సైన్య వ్యవస్థను ఏరా్పటు చేసే విధము, వివిధ విభాగాల నిర్వహణ, గ్రామ, జనపద, దేశ రక్షణకు సంబంధించిన విద్య.
వీటిని గమనిస్తే కేవలం ఉదాహరణ ప్రాయంగానే చెప్పినట్లుగా తెలియవస్తుంది. వేదాంగాలు, దర్శనాలు, ప్రాతిశాఖ్యలు, నాట్య, సంగీత, శిల్ప విద్యలు మొదలైనవి ఇక్కడ చెప్పబడలేదు.
పురాణాలలో మనకు ప్రసిద్ధంగా కనిపించే నైమిశారణ్యం ఒక విశ్వవిద్యాలయం లాంటిదే. ఇక్కడ పురాణ విద్యాధ్యయనం, ప్రవచనము నిరంతరంగా సాగేది. శౌనకుడు ఈ గురుకులానికి అధిపతి. సుమారు పదివేల మంది విద్యార్థులు ఇక్కడ అధ్యయనం చేసేవారు. మాలినీ నదీ తీరంలో కణ్వమహర్షి ఆశ్రమం ఉండేది. ఈ ఆశ్రమంలో నాలుగు వేదాల అధ్యయనానికి, కల్పసూత్రాలు, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, న్యాయము, శుల్బశాస్త్రము, జంతు శాస్త్రము మొదలైన అనేక శాస్త్రముల అధ్యయనము జరిగినట్లుగా తెలియవస్తున్నది. భరద్వాజ మహర్షి ఆశ్రమం ప్రయాగలో, చిత్రకూటంలో అత్రి మహర్షి ఆశ్రమము, అగస్త్య, శరభంగ మహర్షుల ఆశ్రమాలు రామాయణంలో ప్రసక్తమవుతాయి. అగస్త్య మహర్షి ఒక వైపు శాస్త్రాన్ని, మరోవైపు శస్త్రాన్ని ధరించి శ్రీరామ చంద్రునికి శత్రుసంహార కార్యక్రమంలో సహాయ పడినట్లుగా తెలియవస్తుంది. వ్యాసమహర్షి ఆశ్రమంలో సుమంతుడు వైశంపాయనుడు, పైలుడు, జైమిని అన్న నలుగురు శిష్యులు నాలుగు వేదాలను అధ్యయనం చేయడమే కాక, వారి విజ్ఞానం ద్వారా నూతన శాస్త్రాలకు ప్రవక్తలైనారు. వ్యాసుడి కుమారుడు శుక మహర్షి భాగవత సంప్రదాయాన్ని ముందుకు నడిపించి దేశంలో నూతన ఉద్యమానికి కారకుడైనాడు. వశిష్ట మహర్షి విశా్వమిత్ర మహర్షి ఆశ్రమాలు సరస్వతీ నదీతీరంలో ఉన్నట్లుగా తెలియవస్తున్నది. విశా్వమిత్రుడు మంత్రద్రష్టయే కాక, అనేక శస్త్రాస్త్రములను సంపాదించినట్లుగా, వాటిని శ్రీరామచంద్రునికి ప్రదానం చేసినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు సాందీపని గురుకులంలో విద్యాభ్యాసం చేసి సకల శాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించిన సంగతి భాగవతం వల్ల అవగతమవుతున్నది.
పురాణాల కాలం దాటిన తరువాత గురుకుల వ్యవస్థ విస్తరించి విశ్వవిద్యాలయాలుగా పరిణమించటం మనం గమనించవచ్చు. తక్షశిల, ఉజ్జయిని, నలంద, వారణాసి, వల్లభి, అజంత, మధుర, విక్రమశిల మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి. ఇవి కాక కాంచి, అమరావతి మొదలైన చోట్లలో విస్తృతమైన విద్యావ్యవస్థ దేశ దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించేవి. విద్యాసంవత్సరం ఉపక్రమణమనే ఉత్సవంతో ప్రారంభమై ఉత్సర్గం అనే ఉత్సవంతో పూర్తయ్యేది. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమలు సాధారణంగా అనధ్యయన దినాలు. పెద్దలు ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రకృతి విపత్తుల కాలంలోనూ అనధ్యయనాలు కొనసాగేవి.
పురాణ కాలం తరువాత బౌద్ధ మతం వ్యాపించిన కాలంలోనూ ఈ విద్యావ్యవస్థ వƒలికంగా అలాగే కొనసాగింది. కొన్ని నూతన అధ్యయన శాఖలు విస్తరించినా, వƒలిక స్వరూపం అది మాత్రమే. ఆరోజుల్లో ప్రదానమైన విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిలా విద్యాలయ గాథ అతి ప్రానమైన కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నది. క్రీస్తు పూర్వం ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతమైన విద్యాబోధన సాగేదని చరిత్ర చెప్తున్నది. దేశంలోని నాలుగు మూలల నుంచి చైనా మొదలైన విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి గురువుల పాదాల వద్ద కూర్చొని విద్యాభ్యాసం కొనసాగించేవారు. జాతక కథల్లో తక్షశిలలోని విద్యావ్యవస్థను గూర్చిన అనేక వివరాలు కానవస్తాయి. ఒకానొక సందర్భంలో నూట ముగ్గురు రాజకుమారులు ఈ విద్యాలయంలో విద్యార్థులుగా ఉన్నట్లు తెలియవస్తున్నది. జాతక కథల్లో నూట అయిదు పరా్యయాలు తక్షశిల ప్రసక్తి కనిపిస్తుంది. క్రీస్తు శకం 455 సంవత్సరంలో హూణులు ఈ విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేశారు. ఈ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వేదములు, అష్టాదశ శిల్పశాస్త్రాలు నేర్పబడేవి. అట్లాగే వైద్యశాస్త్రం, న్యాయశాస్త్రం, ధనుర్విద్య, సైన్య విద్య ఇక్కడ ప్రఖ్యాతంగా బోధింపబడేవి. సంగీతము, నాట్యము, నాటకము, మొదలైనవి ఇక్కడి విశేష విద్యాశాఖలుగా ఉండేవి. దక్షిణాదిలోనూ శిలప్పదికారము ప్రకారం విద్యాస్థానాలు అనేకంగా ఉన్నట్లుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి.
తక్షశిల తరువాత ప్రసిద్ధమైన విద్యాస్థానం వారణాసి. వారణాసిలో అనేక శాస్త్రాలు ఆపాదచూడము అధికరింపబడేవి. ఇక్కడ అనేక మంది శాస్త్రవేత్తలు సముద్రముల వలె ప్రఖ్యాతులై దూరదూరాల నుంచి వచ్చే విద్యార్థులను ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యం కల్పించేవారు. ఇక్కడి విద్యావేత్తలు ఆయా క్షేత్రాలలో శిఖర స్థానాలలో ఉండేవారు. కాశీనగర ప్రశస్తి ఇటీవలి కాలం దాకా కూడా కొనసాగుతూ వచ్చింది. మహామహోపాధ్యాయులు, శాస్త్ర రత్నాకరులు, బహుముఖ ప్రజ్ఞాపారంగతులు ఇక్కడ విశే్వశ్వరుని కొలువులో విద్యాధ్యయనమే ఒక అర్చనగా కొనసాగిస్తూ వచ్చినారు. ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో తెలుగుదేశం నుండి అనేక విద్వాంసులు కాశీకి వెళ్లి అధ్యయనం చేయడం మనకు తెలుసు. మా పితామహులు శ్రీమాన్‌ కోయిల్‌ కందాడై రంగాచార్య స్వామి వారు విద్యాధ్యయనం తరువాత కాశీ పండితుల నుండి వచ్చిన ప్రశ్నలకు సమాధానం పంపించి వారి ప్రశంసలు పొందారు.
భారత దేశాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా విద్యాకేంద్రంగా భావించి వేలాది మైళు్ల ప్రయాణం చేసి విద్యాభ్యాసం చేసిన వాడు పాహియాన్‌, హూ్యన్‌త్సాంగ్‌ మొదలైన వాళు్ల. పాహియాన్‌ తన యాత్రా చరిత్రలో ఇక్కడి విద్వాంసులు విద్యను శాస్త్రాన్ని సమగ్రంగా సరహస్యకంగా నేర్చిన వారని గ్రంథ రహస్యాలను తాత్పరా్యన్ని వ్యాఖ్యానించగల వారని పేర్కొనటం మనం గమనించవచ్చు. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ స్నాతకోత్తర విద్యాకేంద్రం అక్కడి విద్వాంసులందరి కలయికగా, ఒక పరిషత్తుగా ఏర్పడి ఉండేది. ఈ విద్వాంసులందరూ ఒక్కొక్క శాస్త్రంలో నిష్ణాతులు. అప్పుడప్పుడు వీరు విద్యాలయంలోని అధ్యయనాంశాలను పరిశీలించి తగిన మార్పులను సూచించేవారు. వీరిని శాస్త్రానికి ప్రతీకలుగా ఆరోజుల్లో భావించేవారు. బౌద్ధ స్థానాల్లో విహారాలలో సంస్కృతాధ్యయనం తగిన ప్రాధాన్యాన్ని కలిగి ఉండేది. బుద్ధుడు తన బోధనలను పాలీ భాషలో వ్యాపింపజేసినా, సంస్కృతాధ్యయనం శిఖర స్థానంలో ఉండేది. ఆ తరువాత ప్రసిద్ధమైన గురుకులాలలో నలంద, వల్లభి, విక్రమశిల, జగద్గళ, ఓదంతపురి, నవద్వీపము పేర్కొనదగినవి.
వీటికంటే ప్రానమైన మిథిల ఇటీవలి కాలం దాకా కూడా ప్రముఖ విద్యాస్థానంగానే వెలుగొందింది. నవ్యన్యాయ శాస్త్రానికి ప్రధాన గ్రంథమైన తత్త్వచింతామణి.. పదిలక్షల పుటల వ్యాఖ్యానం ఇక్కడ విశేషంగా అధ్యయనం చేయబడేది. నలంద విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్రాలు, వైద్యము, భాషా శాస్త్రము యోగము, వేదాంతము, వ్యాకరణము ప్రధాన పాఠా్యంశాలు. నిన్నమొన్న భారత మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్‌ కలాం నలంద విశ్వవిద్యాలయం యొక్క పునరుద్ధరణ గురించి సూచించటం ఆ రాష్ట్ర ప్రభుత్వం దానిని ముందుకు తీసుకుపోవుటకు అంగీకరించటం మనకు తెలిసిందే.
వల్లభి విశ్వవిద్యాలయం కథియావాడ్‌ ప్రాంతానికి చెందింది. విక్రమశిల విశ్వవిద్యాలయం ఎనిమిదవ శతాబ్దంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీటన్నింటిలో జైన బౌద్ధమతాలు, వేద వేదాంగాలు, వైద్యం, సాంకేతిక శాస్త్రాలు, భౌతిక శాస్త్రము, వ్యాకరణం సుష్ఠుగా నేర్పబడేవి. విక్రమ శిల విద్యాలయంలో శాస్త్రవేత్తల విద్వాంసుల చిత్రాలు కూడా చిత్రింపబడినట్లుగా చరిత్రలో సాక్ష్యాలు లభిస్తున్నాయి. నవద్వీపంలో పండితుల నడుమ శాస్త్రారా్థలు జరిగిన తీరు కావ్యకంఠ గణపతిముని చరిత్ర వల్ల మనకు విశదమవుతున్నది. వీటిలో చాలా విశ్వవిద్యాలయాలు పదమూడో శతాబ్దం దాకా వైభవంగా ప్రకాశించినవి. మనం హిందూ బౌద్ధ మతాల నడుమ ఏదో అనివార్యమైన శత్రుత్వం ఉన్నట్లుగా ఈనాడు చరిత్రలో చదువుకుంటున్నాం. కానీ ఈ విశ్వవిద్యాలయాల విద్యాప్రణాళికలను గమనిస్తే, ఈ రెండు ధరా్మలకు నడుమ సామరస్యం, సహజీవనం కొనసాగినట్లుగా తెలియవస్తున్నది. ఇస్లాం దండయాత్రలతో గ్రంథాలయాల దహనం, పండితులను సంహరించటం, విశ్వవిద్యాలయ స్థానాలను భగ్నం చేయటం మొదలైన క్రూర చర్యలతో ఇవి అన్నీ శైథిల్యాన్ని పొందాయి. ఇటీవలి కాలం దాకా భారతీయ గురుకుల వ్యవస్థ అక్షతంగా సామాన్య పండితుల గృహాలలో పితృపుత్ర సంప్రదాయంగా, గురుశిష్య పరంపరగా కొనసాగుతూ ఉన్నది. ఈనాటికీ, శృంగేరీ మొదలైన పీఠాలు శాస్త్రారా్థలు, చర్చలు కొనసాగిస్తూ ప్రాన విద్యావ్యవస్థ మూలాలను అవిచ్ఛిన్నంగా కాపాడుతూ ఉన్నాయి. గురుకుల వ్యవస్థలోని కొన్ని వƒలిక అంశాలను గ్రహించి పద్ధెనిమిదో శతాబ్దంలోని పాశా్చత్య విద్వాంసులు ఇంగ్లండు మొదలైన దేశాలలో తమ విద్యావిధానాన్ని పరివర్తన చేసుకున్నట్లుగా వారు రాసిన నివేదికల వల్ల అవగతమవుతున్నది. అధిక సంఖ్యాకుల సంస్కృతికి, భాషలకు వారి శాస్త్రాధ్యయనానికి దమన శీలంగా కొనసాగిన నిజాం పరిపాలనలో కూడా మారుమూల, చిన్న చిన్న పల్లెటూళ్లలో తమ పూరి పాకలలో చిన్ని చిన్ని గృహాలలో పేదలైన పండితులు ఈ శాస్త్రాలను, సంస్కృతిని, భాషలను రక్షించి తమ సృజనాత్మకతకు దీప్తిని అనుస్యూతిని కల్పించారు. తిరుపతి, శ్రీరంగం, మధుర మొదలైన క్షేత్రాలు ఎక్కడికక్కడ తమ పరిమితిలో విద్యావ్యవస్థను పరిరక్షిస్తూ వచ్చాయి. ఒక్కొక్కచోట ఒక్కొక్క శాస్త్రము, ఒక్కొక్క తాత్తి్వక సంప్రదాయము, ఒక్కొక్క ఉపాసనా మార్గము ప్రాధాన్యం వహించాయి. ఆగమాదులు, తంత్రశాస్త్రము, ఆయా ప్రాంతాలలోని చికిత్సావిధానము, గాంధర్వ విద్యలు, ముష్టి యుద్ధాలు ఎక్కడికక్కడ ప్రామాణికంగా శాస్త్ర రూపాన్ని పొంది ఆయా విద్యావంశాలలో వ్యాప్తిని పొందేవి. అన్నమాచార్య వంశం సాగించిన మూడు తరాల సంకీర్తన యజ్ఞం ఒక విశ్వవిద్యాలయం చేసే పనితో పోల్చవచ్చు. శ్రీరంగంలోని వైష్ణవాచార్యులు నిర్వహించిన ద్రావిడ ప్రబంధ వ్యాఖ్యాన ధోరణి కూడా ఒక విశ్వవిద్యాలయం చేసే కార్యక్రమమే. అట్లాగే దత్తాత్రేయ యోగ పరంపరకు చెందిన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి వంశం ఏడు తరాలు చేసిన సరస్వతీ సేవ పరతత్త్వ సాధన ఒక గొప్ప సంస్థ మాత్రమే చేయగలిగింది.

1 comment:

  1. ఇంగ్లీషు మాటల మీద ఆధారపడకుండా మంచి తెలుగులో రాయటం అలవరచుకోవాలన్న కోరిక కలవారు ఇటువంటి బ్లాగులని చదివితే తెలుగులో రాయగలమనే ధైర్యమూ వస్తుంది, అనుభవానికి అనుభవమూ వస్తుంది. "రాయాలని కోరిక ఉన్నవాళ్ళంతా విస్తృతంగా చదవాలి" అనే సూచన ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎరిగినదే. "తెలుగులో భావప్రకటన చెయ్యలేము" అని నాతో వాదించేవారందరికీ ఒక మనవి. కానీ ఖర్చు లేకుండా మనకి అంతర్జాలంలో దొరుకుతూన్న ఇటువంటి తెలుగు వ్యాసాలని చదవండి. తెలుగు మన మాతృభాష కనుక మనం కూడా కొద్ది పరిశ్రమతో ప్రావీణ్యత సంపాదించగలం.

    ReplyDelete