భారతీయ జీవన దృక్పథం అంటే ప్రాచ్యదేశాల దృక్పథం పాశ్చాత్య దేశాల దృక్పథం కంటే విలక్షణమైంది. పరోక్షమైన అనుభవం ఈ జగద్వ్యవహారంలో ప్రతి ఫలించటం ఒక దృష్టి ఐతే, ఇంద్రియానుభవ రూపమైన ప్రత్యక్ష ప్రపంచం మరొక దృష్టికోణం అని చెప్పాలి. `ఈశావాస్యమిదం' అన్నప్పుడు ఈశ్వరభావ పరివ్యాప్తంగా ఈ జగత్తును దర్శించి అంతర్నిహితమైన ఈ తత్త్వం బయట ఆవరించియున్న ఈ తత్త్వం ఈ రెండు ముఖాలుగా దర్శించవలసి యున్నది. తిక్కన సోమయాజి `త్రిభువన శుక దృఢ పంజర విభవ మహితునకు త్రివిష్టప నిర్మోక భుజగపతికి' అని వర్ణించి, `మూడు లోకాలు అనే చిలుకకు ఆయన పంజరం' అట్లాగే `మూడు లోకాలనే కుబుసంగా ధరించిన పామూ' ఆయనే అన్న భావాన్ని అందించాడు. `అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః' అన్న శ్రుతికి వ్యాఖ్యానం ఇది. ప్రాచ్యదేశాలలో భారతదేశంలో జీవనలక్ష్యం పరమార్థం. ఈ జీవుడు ఎరిగి ెురిగి సమర్థతతో పరిపూర్ణతతో ఈశ్వరుడుగా పరివర్తన చెందటం. పురాణాలలో సాధారణంగా ఒక కథ కనబడుతుంది. భూదేవి జీవుల పాపభారాన్ని మోయలేక ఈశ్వరుని సన్నిధికి చేరి తన భారాన్ని తగ్గించుమని, దానికోసం అవతరించమని ప్రార్థిస్తుంది. సాధారణంగా ఈ పాపభారం అధర్మమని చెప్పబడుతుంది. అధర్మానికీ ధర్మానికీ మధ్య భేదం సృష్టి ఈశ్వరాభిముఖ ప్రయాణానికీ అనుకూలంకావడమో, ప్రతికూలం కావడమో అని చెప్పవచ్చు. వీటిని దేవదైత్యశక్తులుగా భావించవచ్చు. భూమి తనలోని పరిణామ చైతన్యానికి, ఉద్గమశీలానికి నిరోధం కలిగించే శక్తులనుండి విముక్తిని కాంక్షించడం దానికోసం తీవ్రవేదనను పొందడం ఇక్కడ భూమాత ప్రయాణంగా చెప్పబడింది. ఈశ్వరావతరణం దిగివచ్చే ఈశ్వరానుగృహానికి సంకేతం. ఈ విధంగా పురాణకథ అభికాంక్షకూ, (జురీచీరిజీబిశిరిళిదీ) అనుగ్రహానికీ సంగమాన్ని కల్పించే తపస్సునకు సంకేతరూపం. పాశ్చాత్య లోకాలలో పరాపరలోకాల నడిమి విభాగం నిత్యమైంది. ఈశ్వరాభిముఖ పరిణామం ఈ మత సంప్రదాయాలలో లేనేలేదు. అందువల్లనే తూర్పుదేశాలలో కళ దివ్యమూలకమైనది. దివ్యత్వ స్పర్శలేకుండా ఏ కళా ఆవిర్భవించలేదు. అందుకే కళలు ఆత్మను సంస్కరించునని `ఆత్మానం సంస్కురుతే' అని చెప్పబడినది. ఒక కళా నిర్మాణం చేయడానికి ఆ కవిగానీ, కళాకారుడుగానీ, సంగీతవేత్తకానీ ఆ కళా రూపము తానై పరిణమించవలసి ఉంటుంది. డాంటే `ఒక చోట ఒక చిత్రమును గీయదలచినపుడు ఆ చిత్రకారుడు తానే ఆ చిత్రము కావాలి' అన్నాడు. యోగసాధకులలో, ఉపాసనలలో ఈ విషయమే మరొక విధంగా చెప్పబడింది. `శివోభూత్వా శివమర్చయేత్' `నీవు శివుడివై శివుణ్ణి పూజించాలి' అంటే భావ తాదాత్మ్యము నూతన సృష్టికి, తన్మయీభవనానికి, అస్మితను కోల్పోవడానికి ప్రధాన కారణమవుతుంది. `ధ్యాత్యా యజేత్' ధ్యానించి పూజించవలె. ధ్యానము ద్వారా ఊర్థ్వమనోలోకాల సంస్పర్శతో పరలోక చైతన్యం తన వెలుగులను నెమ్మదిగా ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆ వెలుగులను అందుకున్న వేళ అపూర్వ రూపస్ఫురణ, నాద శ్రవణ, పరీమళ ఆస్వాదన, రుచిగ్రహణ, స్పర్శానుభవములు కలుగడం అనుభవంలో ఉన్న సంగతే ఈ ధ్యానం అవ్యక్తమైన దివ్య ప్రకృతిలోని అనేక అంశాలకు అనేక రూపనామ కల్పనలను చేస్తుంది. అందువల్ల యజనమునకు పూర్వము ధ్యానము విధిగా చెప్పబడినది. లౌకికంగా కళా సృజన విషయంలో చెప్పబడ్డ అంశమే బ్రహ్మాండ సృష్టిలోనూ చెప్పబడింది. సృష్టా్యరంభానికి ముందు `సతపో7తప్యత బహుస్యాం ప్రజాయేయ ఇతి' అని బ్రహ్మ తపోభావనలో చేరినట్లు చెప్పబడింది. ఇదియే లోకంలో ధ్యానం. ధ్యానం గురించి వాయిస్ ఆఫ్ సైలెన్సు అన్న పుస్తకంలో హెచ్.బి. బ్లావెట్‌స్కీ ఇలా చెప్పారు. `ధ్యానద్వారం తెల్లని ప్రతిఫలించే చంద్రకాంతశిల వంటి ఆభరణ శిలాపాత్ర. దానిలో నిశ్చలంగా సువర్ణజ్వాల వెలుగొందుతుంది. ప్రజ్ఞా రూపమైన ఆ రూప జ్వాల ఆత్మలో నుండి వెలుగులను విరజిము్మతుంది.' ఈ ఆత్మ కాంతులకు పట్టుకునే ప్రయత్నమే భారతీయ కళాసృష్టి. పాశ్చాత్యదేశాలలోని కళల్లో వాస్తవవాదము బింబప్రతిబింబభావానికి సంబం ధించింది. లోకందేన్ని చూస్తుందో అనుభవిస్తుందో దాన్ని యథాతథంగా పునర్నిర్మించడం కళకు పరమ ప్రయోజనం. అందువల్లనే వాస్తవవాదం అక్కడ ప్రాధాన్యం వహించింది. భారతదేశంలో సాదృశ్యం అంటే సమత్వమే కానీ బింబవత్‌భావము కాదు. `తద్భిన్నత్వే సతి తద్గతభూయో ధర్మవత్‌త్వమ్' అంటే లక్ష్యమునకు లక్ష్యమైన వస్తువునకు భిన్నముగా ఉన్నదానియందలి ధర్మములు మరల మరల ప్రకాశించు పద్ధతి సాదృశ్యము. అందుకే సుందరిముఖమునకు చంద్రునితో కమలముతో సామ్యము చెప్పుటభూయోధర్మవత్త్వము చేతనే సంభవిస్తుంది. అందుకే మనకళలు వాస్తవరూపాన్ని కోల్పోయి ప్రతీకలుగా స్ఫురణలుగా సంకేతాలు మారిపోతున్నాయి. మన దర్శనము భూతమాత్రం కాకుండా ప్రజ్ఞ మాత్రమే అవుతుంది. అంటే వస్తువును చర్మ చక్షువుల ద్వారా కాకుండా ప్రజ్ఞా చక్షువు ద్వారా దర్శించవలసి ఉంది. ఋగ్వేదము `భద్రాఋతజాతసత్యా' ఋతమునుండి పుట్టుట చేత సత్యములు క్షేమకారకములై ఉన్నవి. (4518.) ఈ ఋతము సర్వసృష్టికి కారణమైన ఆధారభూతమైన మూలసూత్రము. దానినుండి ఈ జగత్తు నిష్పన్నమవుతున్నది. అలంకార శాస్త్రం కూడా `సచేతసామ్ అనుభవః ప్రమాణమ్ తత్రకేవలమ్' సౌందర్య అనుభవమునకు అత్యంత ప్రమాణమైన అంశము సహృదయుల అనుభవమే. శివతాండవమే జరిగిందంటే శివుడెక్కడో కైలాసంలోనో తారకారణ్యంలోనో చిదంబరంలోనో తీరికగా నాట్యం చేశాడని కాదు, తాత్పర్యం. ఈ తాండవం అవ్యక్తమైన పరమాత్మ, నీవారశూకవత్తన్వి, చైతన్యరూపమైన ఆకాశంలో దహరాకాశంలో నాట్యం చేసినాడని భావించాలి. జీవుల అంతశై్చతన్యంలో జగచై్చతన్యం ఆవిష్కరించబడే సంధికాలంలో ఆ చైతన్యం ెుుక్క ఆవిష్కారబిందులిప్తలోని అమేయమైన కల్లోలాన్ని వ్యక్తం చేయడమే ఈ ప్రతీకాత్మకమైన శివతాండవ వర్ణనకు తాత్పర్యం. ఇదే అంశం కృష్ణలీలలకూ వర్తిస్తుంది. అవిద్యా తమస్సులో మునిగి ఉన్న జీవులకు ఈశ్వరుని వేణుగానం వినగా కలిగిన జ్ఞానబోధోత్సవం ఈ కృష్ణలీలల్లో స్పష్టంగా దర్శనమిస్తున్నది. విక్రమార్కుని కథలలో ఒక రాజు తన భార్య చిత్రాన్ని చిత్రించమని చిత్రకారుని కోరినపుడు అతడు పద్మినీ జాతి స్త్రీ చిత్రాన్ని చిత్రించినాడట. ఇక్కడ వ్యక్తిరూపం కంటే ఆ స్త్రీ స్వభావ లక్షణాలను వ్యక్తం చేయడమే ప్రధాన అంశం అవుతున్నది. భాసుని ప్రతిమా నాటకంలో భరతుడు అయోధ్యకు తిరిగి వస్తూ ప్రతిమా గృహంలో తన పూర్వుల విగ్రహాలను చూచి ఆ ప్రతిమలకు దేవతా భావంతో నమస్కరింపబోతాడు. దేవకులికుని చేత నివారింపబడి ఆ ప్రతిమ లెవ్వరివని ప్రశ్నిస్తాడు. `అహోక్రియామాధుర్యం పాషాణానాం అహోభగవతి రాకృతీనాం' అని శిల్ప వైదగ్ధా్యన్ని ప్రశంసిస్తాడు. అక్కడ దశరథరాజు విగ్రహం రూపసామ్యాన్ని కాకుండా రఘువంశరాజుల లక్షణాన్ని ప్రకటించడం చేత భరతునికి కూడా గుర్తుపట్టడం సాధ్యంకాదు. భారతీయ శిల్ప చిత్రరీతులలో ఉండే ఈ రూపధ్యాన లక్షణాన్ని ప్రతీకాత్మకంగా తప్ప వేరుగా వర్ణించడం సాధ్యం కాదు. మూల విగ్రహం నుండి విమానం దాకా ఆలయ నిర్మాణం అటు బ్రహ్మాండానికీ ఇటు పిండాండానికీ ప్రతీకాత్మకంగా రూపొందిన అంశం జాగ్రత్తగా గమనించవలసి ఉన్నది. అనుభవమును విశ్లేషిస్తే దాని విభిన్నస్తరాలలో విభిన్న దశలలో స్థితిని గమనించ వచ్చును. లోకము ఐంద్రియక జాగ్రత్ వాస్తవవాదం సుఖదుఃఖ మిశ్రమము మనోలోకము భావుక స్వప్న ప్రతీకవాదం ప్రీతపర్యవసన్నం దివ్యలోకము ధ్యేయ సుషూప్తి అంతఃస్ఫురణ ఆనందం పై పట్టికను చూచినపుడు భారతీయ కళలకు భావలోక దశలో దివ్యలోకదశలో ఉన్న సోపానక్రమం కానవస్తుంది. పాశ్యాత్య దేశాలలో కళలకు ఆధారభూతమైన వాస్తవ వాదము నేల విూదనే ఉనికిని చాటుకుంటున్నది. కళా సృజన స్వప్న సుషూప్తిదశలకు ఉండే ప్రాథమ్యము జాగ్రద్దశకు లేదు. స్వప్నలోకం అవ్యక్తం నుంచి భావబింబాలను సంకేతాలను ప్రతీకలను ఆవిష్కరించు కుంటున్నది. చిత్తాసన్న జీవానుభవసంగమము ఇక్కడి ప్రధాన లక్షణం. ఇక్కడి అనుభవము సుఖ దుఃఖ మిశ్రీతము కాకుండా సర్వమూ ప్రీతిలో పర్యవసిస్తుంది. దీన్నే శాస్త్రం రసం అని చెప్పింది. దీనికి ఆధారం భావుకత్వం, అంటే తన అస్మితను తాను కోల్పోయి విశ్వ చైతన్యంలో సంలీనత చెందటం. ఆ స్థితిలో సర్వానుభవాలు వ్యక్తి పరిమితులను దాటి వొక అలౌకికమైన సార్వజనీనమైన అనుభవమునకు కారణమవుతుంది. దీనికి హేతువైన భావకత్వాన్ని `తనదైన అనుభూతి తనదిగాన' అన్నాడు కవి. అజంతా చిత్రాలు చూసినపుడు బుద్ధదేవుని రూపాన్ని మానుష ప్రయాణం కంటె అధికంగా ఇతరులను అల్పంగానూ చిత్రకారుడు రూపిస్తాడు. ఇక్కడ మహాత్ముడైన బుద్ధదేవుని అనుభావ విశేషం ప్రధానమై అతని రూపాన్ని ఉన్నతోన్నతంగా చేసింది. అందుకే ఇతరుల మూర్తులు చిన్నవి కావడం. ఇది తారతమ్య వివక్షకోసమే. కావ్యంలోకి శబ్దం ప్రవేశించినపుడు అది సంకేతిక అర్థపరిమితుల నుండి విముక్తమై, వేయి రెక్కలతో కావ్యాకాశంలో పరిభ్రమిస్తుంది. కానీ దివ్యశబ్దం భావ పరిమితులను దాటి మంత్రమై అతీతచైతన్యాన్ని ఇహలోక చైతన్యంతో అనుసంధిస్తుంది. అభిదాలక్షణం లోకానికి మూలమైతే ఉద్విగ్నలక్షణం కావ్య శబ్దానికి మూలమవుతుంది. అట్లాగే దివ్యశబ్దానికి అర్థాతీత లక్షణం ప్రధానమౌతుంది. లోకశబ్దం కావ్యంలోకి చేరి రసభావపుష్టిని పొంది నూతన అవతారమెత్తుతుంది. వెండి గొలుసులు లంకెవేసి ప్ర చండమగు నీ నీలి తెరలను తూర్పు వాకిలి తలుపు రెక్కల తొలగ లాగెదరెవ్వరో రాయప్రోలు సుబ్బారావు అన్నప్పుడు ఈ వెండిగొలుసులు, తూర్పువాకిలి తలుపుల రెక్కలు, తొలగ లాగటం ఈ మూడు శబ్దబంధాలు లౌకిక అర్థపరిమితులను ఛేదించుకొని నూతన ఉషస్ సమయాన్ని నిర్దేశిస్తున్నవి. ఏ అనుభవానికైనా వ్యక్తీకరించే శబ్దం దానిని సూచించటనికే ఉపయోగ పడుతుంది తప్ప సమగ్రంగా చెప్పలేదు. దివ్యస్థాయిలోనైనా భావుకస్థాయిలోనైనా, ఈ అనిర్వచనీయత ప్రధాన లక్షణమే అయినా, లోకస్థాయిలోనూ అది అనివార్యమైన లక్షణమే అవుతుంది. అందుకే సాహిత్యం శబ్దార్థ సంయోజన ఉచితంగా నిర్మించటం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ ఔచిత్యము లేనప్పుడు ఆ శబ్దార్థ సంయోజన ప్రభావరహిత మవుతుంది. కుంతకుడు అటువంటి లక్షణాన్ని వ్యాధిభూతము లేదా మృతకల్పము అంటున్నాడు. ప్రభావ రహితమైన ఆడంబరము అనుభవాన్ని సూచించే అంశంలో అతివ్యాప్తి దోషాన్ని పొందుతుంది. అందుకే శాస్త్రవేత్తలు అలంకార గ్రహణ విషయంలో కాలేచ గ్రహణత్యాగౌ కాలము అనగా సందర్భమును బట్టి ఈ అలంకారాలను స్వీకరించడము వదిలి వేయడము జరుగుతుందని సూచించారు. చిత్రకళలో రంగుల మిశ్రణము రేఖల ఆవిష్కారము లోతునూ ఎత్తునూ తెలిపే శిల్పమూ ఇవన్నీ అనుభవ ద్వారానికి కవాటాలే తప్ప సాక్షాదనుభవాలు కావు. సంగీతకారుడు ఒక రాగాన్ని ఆలపించేప్పుడు స్వరాలను ప్రస్తరించినపుడు శబ్దాదుల సహాయం లేకుండా నాదమాధ్యమం ద్వారా రసానుభవాన్ని శ్రోతకు సన్నిహితం చేస్తున్నాడు. అన్ని కళలలోనూ రస ప్రపంచ వైఖరి ఇదే. ఇక్కడే కావ్యానికి కళలకు లోకానికి మధ్య విభజనరేఖ ఏర్పడుతున్నది. లోకంలో అనుభవము ప్రత్యక్షమై సుఖ దుఃఖ దాయకం కాగా కావ్యంలో కళా జగత్తులో ఈ అనుభవము పరోక్షమై సుఖదుఃఖాల పరిమితులను దాటి ప్రీతి మాత్రానుభవకారక మౌతుంది. లోకంలో ఏ అనుభవమైనా అంతో ఇంతో మన పరిజ్ఞానాన్ని పెంచుతుంది. సాధారణీకరణ లక్షణం పెరిగిన కొద్దీ శాస్త్రత్వాన్ని పొందుతుంది. ఇక్కడ సాధారణీకరణం వల్ల (ఇది ఆలంకారికుల సందర్భంలోని పద ప్రయోగం కాదు) అది ఔపదేశిక స్థాయిని పొందుతుంది. భట్ట నాయకుడు కవిత్వం వలన ఎవడు జ్ఞానాన్ని గానీ, ఆదేశాన్ని గానీ పొందడని స్పష్టం చేశాడు. `కావ్యే రసయితా సర్వే న బోద్ధాన `నియోగభాక్'. ``ప్రీతి కూడా ఒక విధమైన యోగమన్నాను. ప్రీతి అంటే రసమే అన్నారుగదా. లాక్షణికులు ప్రీతి అంటే `దయా మయాంతః కరణ విశేషం' మని ప్రాచీనులు నిర్వచించారు. ఈ వ్యవస్థను ఇలా భావించాలె. వీరు బహిరింద్రియములను స్వచ్ఛందంగా వదిలివేస్తారు. అంతరింద్రియములను అంతరాంతరమునందు సురక్షితంగా నిలిపి పెట్టుకుంటారు... మానవునకు నిసర్గమైనది ప్రీతి. ప్రీతికి రాగము తల్లి వేరు వంటిది. రాగము సుఖాశయి అన్నది యోగ శాస్త్రము సుఖము భోగాశయము కావటం కూడా సహజమే. భోగము లలిత కళాశ్రయము కావటము లోకములో కనబడుతున్నది''.రాయప్రోలు (కృష్ణశాస్త్రి కవితా స్వర్ణోత్సవం ప్రత్యేక సంచిక) 1975 పే. 12 కవితా సామగ్రి గురించి కవులు అనేక కాలంగా మూల ద్రవ్యాలను విని యోగిస్తున్నప్పటికీ వాటి ఉపయోగంలో ఎప్పుడూ కొత్తదనానికి అవకాశం ఉంటున్నది. అవే శబ్దాలు, అనే అలంకారాలు, రసపరిగ్రహణం చేత ఎపుడూ కొత్తగానే కనిపిస్తవి అంటారు శాస్త్రవేత్తలు. ఈ అభినవత సృష్టిమూల లక్షణము. ఎప్పటికప్పటికి వసంతం కొత్తదే. ఉదయం కొత్తదే. ప్రేయసి దరహాసం కొత్తదే. వక్రోక్తి జీవితంలో (వృత్తి) ఉదాహరించిన శ్లోకం ఇది. ఆసంసారం కవిపుంగవైః ప్రతి దివస గృహీత సారోపి అద్యాప్యభిన్నముద్ర ఇవ జయతి వాచాం పరిస్పందః (పేజీ 292. చౌఖంబా 1983) సృష్టా్యది నుంచీ అసంఖ్యాకులయిన కవులు శబ్దాన్ని తమ కవిత్వంగా చేసేందుకు ఆ రత్నము ెుుక్క అనంత పార్శ్వములను ప్రకాశింప జేస్తున్నారు. అయినా ఇవాళ్టికీ అది చెక్కు చెదరకుండా ఉన్నది. అలాంటి శబ్దానికి జయం కలగాలి. ఎన్నడైనా కవిత్వం శబ్దమే. దానిలో గర్భితమైందే అర్థము. అనంతార్థము. ఆదిలాక్షణికులందరూ ఈ రెంటి కలయికను, సామరస్యాన్ని నిర్దేశిస్తూ వచ్చినా చివరకు జగన్నాథ పండితుడు నిగ్గుతేల్చి శబ్దాన్నే కావ్యంగా నిరూపించటం జరిగింది. ఈ శబ్దము నాభిలో నుంచి వెలువడే మణిపద్మము. మణియై అంశు మాలికతో వేయంచాల చక్రమై విజృంభించుతుంది. పద్మమై సహస్రదళమై సృష్టికి ఆరంభ బిందువవుతున్నది. విశ్వమంతా వ్యాపించినప్పుడు సహస్రఫణామణి మండితమై తానే వ్యక్తమైన సర్వమూ అవుతున్నది. ఆకాశాభిముఖమై విశ్వోత్తీర్ణమై అవ్యక్తాన్ని వ్యక్తం చేసే సృజన బిందువు అవుతున్నది. లోకశబ్దం సంకేతార్ధ వ్యక్తీకృతికి పరిమితమైంది. కావ్యశబ్దం పరోక్షానుభవ ప్రకాశము. చెప్పినది చెప్పనట్లు, చెప్పనిది చెప్పినట్లు ఉండటం పరోక్షాభివ్యక్తి, ధ్వని సిద్ధాంతం అంతా దీనిపైన ఆధారపడి వున్నది. అందువల్ల కావ్యంలోని శబ్దం సంకేతి తార్థానికి పరిమితమైంది కానేకాదు. కని ప్రయోగనైపుణ్యం చేత లోకజీవన రహస్య ద్వారాలను వివృతం చేసే తాళంచెవి. ఈనాటికీ శబ్దం నిత్య నవీనంగా లావణ్యంగా సదా ప్రకాశిస్తూనే వుంటున్నది. అద్యావ్యభిన్న ముద్ర ఇవ. అంటే అక్షతమని. కాళిదాసు మాటల్లో చెబితే అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహైః అనావిద్ధం రత్నం అని. అప్పుడే తన కోసం పూచిన పూవులాగా కవికి సిద్ధిస్తుంది. ఈ ప్రపంచం అనాది కాని కవి వాక్కు నిత్య నూతనం. అదే బ్రతుకు, అదే సంసారం, అవే ఆకలిదప్పులు, కామక్రోధాలు, పగలు, కార్పణ్యాలు, అసూయలూ, ప్రవృత్తి లక్షణాలు అయినా జగత్తుగా అది నిత్యమూ పరిక్రమిస్తూ, పరిణమిస్తూ పరివర్తిత మవుతున్నది. నిన్న ఉన్నదేదీ ఇప్పుడు ఉండటం లేదు. క్షణికం అంతా. అయినా ఒక అనుస్యూతి సూత్రం దీన్ని పట్టుకొని ఉన్నది. ఈ సందర్భంలో ఏది మారేదీ, ఏది మారనిదీ గ్రహించవలసి ఉన్నది. ఇందుకు ఉదాహరణగా శ్రీమద్రామాయణ కల్పవృక్షంలోని ఈ సన్నివేశాన్ని చూడవచ్చు. విశ్వామిత్ర మహర్షి తపోనిష్ఠలో ఉన్నాడు. తపస్సును భంగింప జేయడానికి రంభ స్వర్గంనుండి, వసంతము భూమిలో నుండి ఒకేసారి తమను ఆవిష్కరించుకున్నాయి. తపోభంగం చేయడం కోసం అక్కడ ఒక యుద్ధరంగం సిద్ధమైంది. వసంతముగానీ అప్సరగానీ యుద్ధముఖంగా తీర్చిదిద్దబడటం ఇక్కడి విశేషమైన అంశం. చుఱచుఱ నెఱ్ఱనై చూచెడు చివురాకు చివురాకు వెనుక బొంచిన లతాంత బాణుండు విసరగా బట్టిన పిడిబాకు పిడిబాకు రివు్వన విసర దూసి చన్న సవ్వడి వోని సన్నని పికివాకు పికివాకుతో మేళవించి సన్న గొంతు రాగము తోడ గులుకు నచ్చరసోకు పిరువీకుగా నొక్క పెట్టద్రోచి తోచుటాలస్యముగ గింకిణీ చిణచిణ నినద కనదబ్జ పదసమానీతమధుర గీతికా రసవార్థి పొంగిన తరంగ మచ్చరయు గన్నులను హృదయమున బొడువ (బాలధమ231) రంభాముఖంగా ఇక్కడ ఇంద్రుడు మహర్షిపై చేస్తున్న దాడిని ఈ పద్యం విశిష్టంగా వ్యక్తీకరిస్తుంది. `చుఱచుఱ నెఱ్ఱనై చూచెడు చివురాకు ఆరంభం. చివురాకు, పిడిబాకు, పికివాకు, అచ్చరసోకు అనుప్రాస ఘటితములై చతురంగ బలాల వూ్యహ కల్పనను స్ఫురింప జేస్తున్నవి. సీస పద్యంలోని చివరిపాదం చివర నుంచి అందుకొని పరుగెత్తించిన గీత పద్యం అంతర్బహిరింద్రియాల విూద జరిగిన ఏకకాలికమైన దండయాత్రను అభివ్యక్తం చేస్తున్నది. భావ ప్రకాశం కళా నిర్మాణంలోని ఔచిత్యమూలాన్ని స్పృశిస్తూ (ఙ119) జాతానురాగయైన కులాంగన అనురాగ చేష్టలను వర్ణిస్తూ `వచనే అవచనమ్' అన్నది. మాట్లాడినపుడు మాట్లడదు, అని అంటుంది. కావ్యము లోకవ్యవహారాన్ని ప్రత్యక్షంగా వ్యక్తీకరించకుండా కులాంగనవలె వ్యంగ్య మార్గాన్ని ఆశ్రయిస్తుందని దీని తాత్పర్యం.
లలితాసహస్రనామం అమ్మవారిని గురించి వర్ణిస్తూ `సామరస్యపరాయణా' అంటుంది. సామరస్యం అంటే జీవనంలో ఉండే సమలయస్థితి సౌష్ఠవం (ఐగిళీళీలిశిజీగి). సమరసస్థితి సుఖదుఃఖాలకు దూరంగా ఒక శాంతస్థితిని కల్పిస్తుంది. కరుణ శృంగారములు రెండే కావ్యమందు నిజరస విపాక భోగమందింపగలవు అన్నట్లు లోకంలో సుఖ దుఃఖాలన్ని ఈ సామరస్యం తొలగడం వలననే సంభవిస్తవి. శృంగారము ప్రీతి హేతువైనపుడు కరుణము మృత్యుదశను ఆవిష్కరించే దుఃఖహేతువవుతుంది. లోకం ఈ జన్మ మృత్యువుల నడుమ ఊయలూగుతూ ఉంటుంది. జీవులు దుఃఖాన్ని పరిహరించటానికి శాంతినీ ప్రీతినీ పెంచుకోవడానికి అనేక వ్యవస్థలను ఏర్పరచుకున్నారు. సంసారమనే విషవృక్షానికి రెండే అమృత ఫలాలు. ఒకటి కావ్య రసాస్వాదన; రెండు సజ్జన సాంగత్యం, ఈ ప్రాచీన సూక్తి జీవితాన్ని ప్రియంగా చేసుకోవడానికి ఉన్న మార్గాలను స్పష్టం చేస్తుంది. కళాజగత్తులో శబ్దం సంకేతంగా మారినప్పుడు అది ెుగిరే గగనాలు ప్రవేశించే లోతులు విశ్వ జనీన స్థితిని కలిగించి, తన తనాన్ని అస్మితను కోల్పోయేటట్టు చేసి, జగదతీతమైన స్వస్థితిని పొందేట్లు చేస్తుంది. ఆనంద నిష్యందిషూ రూపకేషూ వు్యత్పత్తి మాత్రమ్ ఫలమ్ అల్పబుద్ధేః యో-పీతిహాసాదివదాహ సాధుః తసై్మనమః స్వాదు పరాఙ్మూఖాయ (దశరూపకం) ఆనందమును కలిగించే రూపకాలలో ఇతిహాసాదుల వలె వు్యత్పత్తిని మాత్రమే ఫలంగా భావించే రసపరాఙ్మూఖుడైన అల్పబుద్ధికి ఒక నమస్కారం. కళా ప్రపంచంలో పరివర్తన అసహిష్ణూత ప్రధాన లక్షణము. కళారూపం తనను తాను సాంగంగా ఆవిష్కరించుకున్న తర్వాత తనలో తాను ఎటువంటి మార్పును సహించదు. పరివర్తన అసహిష్ణూత అని దీనిని శాస్త్రం పేర్కొంటున్నది. ఆత్యంతికమైన కళారూపం ఏర్పడ్డ తరువాత శ్రావ్యత వల్ల ఔచిత్యం వల్ల ఛందఃస్పందం వల్ల ఔజ్జ్వల్యం వల్ల ఏ మార్పు దానియందు కలిగించే వీలు ఉండదు. దీనిని మరొక విధంగా చెప్పాలంటే అంతర్గతమైన నిర్మితమైన లయ భంగింపబడడానికి అంగీకరించదని తాత్పర్యము. ఈ లయ శబ్ద సంయోజన నుండి మహా కావ్య నిర్మాణందాకా అనుసంధితమై విశ్వలయతో తాదాత్మా్యన్ని భజిస్తుంది. ఈ విశ్వలయ (్పుళిరీళీరిబీ ష్టన్రీగిశినీళీ) పరమ సూక్ష్మమైన కళాభివ్యక్తి నుండి స్థూలమైన మహానిర్మాణాల దాకా పరివ్యాప్తమై ఉంటుంది. ప్రాచ్యదేశాల నిర్మాణాలలో అభివ్యక్తమయ్యే (సిమెట్రీ ఐగిళీళీలిశిజీగి) సౌష్ఠవము ఈ అంశాన్ని ప్రతిపాదిస్తుంది. ఆధునిక యూరోపీయ కళా నిర్మాణాలలో కనిపించే అస్తవ్యస్త (ఎరివీచిబివీ) లక్షణం దీనికి పూర్తిగా భిన్నమైంది. దీనియందు అపూర్వత ఉంటుంది. కానీ అంతర్గత (దీదీలిజీ ష్టన్రీగిశినీళీ) లయ లోపిస్తుంది. కళారూపాలలోని అపూర్వత ఆశ్చర్యాన్ని కలిగించడం సహజమే కానీ ప్రీతి భావాన్ని కలిగించడం అసాధ్యమైన అంశం. వెరగు, అద్భుతం, మొదలైన అంశాలు అసాధ్యసాధనాన్ని వ్యక్తం చేస్తవికానీ అంతస్సులోని శాంతిని వ్యక్తం చేయలేవు. సజ్జన సాంగత్యము కుటుంబ వ్యవస్థ నుండి సమాజంతో పూర్తిగా తాదాత్మ్యం చెందేదాకా ఉండే భిన్నభిన్నములైన స్తరాలను వ్యక్తం చేస్తుంది. పరస్పర ప్రీతి కలిగిన దంపతులు కుటుంబము విస్తృతమైన పరివారము గ్రామము దేశము నగరము ఇలా ఈ సాంగత్యబిందువు క్రమంగా విస్తరించుకుంటూ పోతుంది. దీనిలో ఏ స్థాయిలోనైనా సామరస్యం తొలగిపోయినప్పుడు సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ సంఘర్షణ అశాంతికి పార్యంతికమైన దుఃఖానికి కారణమౌతుంది. కావ్య రసాస్వాదన మనిషి అనుభవాన్ని లోకస్థితి నుంచి అతీతంగా సాధారణీకరణ స్థాయికి ఎదిగేటట్లు చేస్తుంది. సజ్జన సాంగత్యంలో అనేకుల సమావేశం ప్రీతిని కలిగింపగా ఇక్కడ ఏకాంతంలో తానే అనేకత్వాన్ని భజించి ప్రీతిని సంపాదించు కుంటున్నాడు. `ఏపున మంటి నుండి ఉదయించిన జానకి మింటి నుండి ఆవాపముగన్న రాఘవుడు' ఈ ఇద్దరి మధ్య ఉండే దాంపత్య బంధం సృష్టి సామరస్యాన్ని ప్రతీకాత్మకంగా వ్యక్తం చేస్తున్నది. ద్యానాపృథివిసంగమము వేదాల నాటి నుంచీ సంకేతితమై మనదాకా సాగివస్తున్నది. `ధరసింహాసనమై నభంబు గొడుగై' అన్న పద్యంలోనూ ఈ ఊర్థ్వ అధోలోకాల సామరస్యము వ్యక్తమౌతున్నది. ఆకాశంలో ఒక మహా సముద్రాన్ని నిర్మించి దేవతలు ఆ జలాన్ని భూమి విూదికి కుమ్మరించారని ఋగ్వేదం పేర్కొంటున్నది. దివ్యచైతన్యం భూమికి అభిముఖంగా కదలిరావడం ఇక్కడ ప్రతీకాత్మకంగా ఉద్దిష్టమైన అంశం. స ఉత్తరస్యాత్ అధికం సముద్ర మాపోదివ్యాఅసృజత్ వర్షా్య అభి అస్మిన్ సముద్రే అధ్యుత్తరస్మిన్ ఆపోదేవేభిర్నివృతా అతిష్ఠత్ ఋగ్వేదము 109856 మన జీవితంలోకి దిగివచ్చిన మతం కానీ దేవతావ్యవస్థ కానీ ఆచార వ్యవహారాలు కానీ కుటుంబ సంబంధాలు కానీ ఈ దివ్య భూమికతోడి స్పర్శను కలిగి ఉంటవి. కానీ ఈ నేలను విడిచి ఎక్కడికో పారిపోవడానికి ఉద్దేశించినవికావు. జీవితాన్ని అనుభవించడం భారతీయ దర్శనంలో ప్రధానాంశం. `జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతమ్' ఇత్యాది వాక్యాలు జీవితాన్ని ఎంత సౌభాగ్యవంతం చేసుకోవచ్చునో నిరూపిస్తాయి. `సహనౌ భునక్తు' `శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే' ఇత్యాది వాక్యాలు సకల జీవుల మధ్య ఉండవలసిన సామరస్యాన్ని వెల్లడి చేస్తున్నవి. పంచభూతములకు చరాచరములకు భూమ్యాకాశములకు ోభ కలిగించని శాంతి భావన సృష్టికీ మానవునికీ నడుమ ఉండవలసిన సామరస్యమును వ్యక్తం చేస్తున్నవి. సమాజంలో మానవ సంబంధాలు గ్రామీణ వ్యవస్థ సజీవంగా ఉన్నంత కాలం సామరస్యం కేంద్రంగా పరస్పర సహకారము, పరస్పర అనుబంధము, పరస్పర పరిపూరకత అనే భావనలు ఆధారంగా నిలచి ఉండేవి. ఐహికలోక శాంతికి ప్రధాన భావనలు ఈ సామరస్యము మీద ఆధారపడ్డవి. మనిషి తనలోని అంతర్ వ్యక్తితో తనకు తన చుట్టూ ఉన్న సమాజంతో తనకూ తన చుట్టూ ఉన్న ప్రకృతిలో, తనకూ విశ్వనియామకమైన ఋతముతో నెలకొల్పవలసిన సమన్వయాన్ని జీవనానికి ఆధార సూత్రాలుగా ఏర్పరచినట్లు మనకు స్పష్టమౌతుంది. పారిశ్రామిక నాగరికత సాంకేతిక విప్లవము మానవ జీవితానికి ఈ సమన్వయ భావం నుండి చాలా దూరం దాకా తీసుకువెళ్ళాయి. విధ్వస్తమయిన సామరస్యము కారణంగా తనలో తాను మానవుడు అస్తిత్వ విచికిత్సతో అంతులేని అంధకార గుహలలో పరిభ్రమిస్తున్నాడు. ప్రకృతిని విడిచి ఈ సామరస్య సూత్రాన్ని విడిచి మానవుని సుఖ సాధనయే పరమార్థంగా ఏర్పరచుకొన్న సిద్ధాంతాలు మానవ సమాజ పునర్నిర్మాణ సూత్రాలు ఘోరంగా విఫలం చెందాయి. సమాజంలోని అంతరైక్య సూత్రాలు భంగింపజేసే కుల మత భాషాప్రాంతాది భేదాలు దుఃఖాన్ని సంోభాన్ని రోజు రోజుకూ అధికం చేస్తూనే ఉన్నవి. నిత్య జీవితంలో మనం ఆచరించే పండుగలు అలవాట్లు పద్ధతులు సూక్ష్మంగా వివేచించినపుడు మనకు జీవనాన్ని ఇప్పటివరకు అనుశాసించిన సామరస్య సూత్రాలు సౌందర్య శాస్త్ర అనుభవాలు లౌకికాలౌకిక భూమికల అనుసంధానాలు స్పష్టంగానే వ్యక్తమవుతాయి. పూజాదులలో మనం వాడే యంత్రాలు రేఖాగణితం సూత్రాలు ఆధారంగా రూపొందినవి. వీటిలో ముఖ్యంగా కనిపించే అంశాలు బిందు, త్రికోణ, చతురస్ర వలయాలు ఈ నాల్గింటి కలయికల చేత ఓత ప్రోత లక్షణము చేత ఈ దేవతా యంత్రాలన్నీ రూపు దిద్దుకున్నాయి. ఈ లక్షణమే పండుగలలో మనం ఇళ్ళలో వాకిళ్ళలో వేసే ముగ్గుల వల్ల అభివ్యక్తం అవుతున్నవి. ఇక్కడ కూడా బిందు త్రికోణ రేఖావలయాలే ప్రధానాంశాలు. ఈ ముగ్గులన్నింటిలోనూ సమలయ సౌష్టవము ప్రధానాంశంగా ఉండటం మనం గమనించవలసిన అంశం. మన ప్రాంతంలో భాద్రపద అశ్వయుజ మాసాలలో స్త్రీలు అన్ని స్థాయిలలోనూ జరుపుకునే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఉన్నాయి. బొడ్డు అంటే నాభి, కేంద్రము, బిందువు. ఈ బిందువు శ్రీచక్ర మధ్యంలో ఉండే బిందువే. ఈ బిందు రూపిణియైన మహామాతను మేరు ప్రస్తారంలో నిర్మించుకుని అర్చించటం దీనిలోని ప్రధానాంశం. శ్రీవిద్యా సంప్రదాయంలోని శ్రీచక్రార్చనమెంత ముఖ్యమైనదో బొడ్డెమ్మ పండుగ కూడా అంతే ముఖ్యమైనది. బతుకమ్మ పండుగ కూడా నవరాత్రులతో సమాంతరంగా గౌరీదేవి ముఖ్య అర్చనీయగా ఆచరింపబడటం సృష్టి వికాసానికి జీవన ఉద్వేలతకు సంకేతాలయిన పూలు ప్రధాన ద్రవ్యంగా వాడటం మన బ్రతుకు సారాంశాన్ని చైతన్యాన్ని అభివ్యక్తం చేస్తున్నది. ఈ పండుగను చేయడానికి సామాజికంగా ఏ విధి నిషేధాలు లేవు. అందువల్ల లిటిల్ ట్రెడిషన్, గ్రేట్ ట్రెడిషన్ అల్ప సంప్రదాయము మహా సంప్రదాయములు అనే పేర సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయడం వృధా ప్రయాస. అన్ని స్తరాలలో ఒకే సందేశం, ఒకే భావన, ఒకే తత్త్వం, భిన్న భిన్న రూపాలలో ఆచరణలోనికి దిగిరావడం దీనిలోని రహస్యం. మనం ఆచరించే పండుగలలో ఎక్కడా మత ప్రసక్తికి ప్రాధాన్యం లేదు. పారి వారిక, సామాజిక సమన్వయమే ఇక్కడ ఆధారభూతమైన అంశం. పండుగల ఆచరణలో అన్నమయ ప్రాణమయ మనోమయ భూమికలకు సామరస్యాన్ని సాధించడం ప్రధానమైన లక్షణం. గృహాలంకారాలలో వాస్తు నిర్మాణాలలో ఏకరూపత సామరస్యం పూర్వం ప్రధానాంశాలయితే ఇప్పుడు అపూర్వత లయభంగము వైవిధ్యము వైరుధ్యము ప్రధానాంశా లవుతున్నవి ద్వార బంధాలకు ఉండే ఏనుగు ముఖాలు చిలుక కొయ్యలు ఈనాడు ప్రదర్శనశాలలో చూడవలసే ఉంది. మతము, ఉపాసన మొదలైన అంశాలు ఎంతో వైవిధ్య పూర్ణంగా మనకు కనిపించినా ఒక సామరస్యభావన నెలకొల్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు జరుగుతూనే వచ్చింది. స్త్రీ పురసరూపమైన దేవతా సామరస్యము అర్థనారీశ్వర మూర్తిలో అభివ్యక్తం అయింది. అలాగే హరిహరాభేదభావన సమన్వయం కోసమే ఆవిష్కరింపబడింది. అసలు తత్వానికి ఏ రూపమూ ఏ నామమూ లేదని అది అనిర్వచనీయమైన బ్రహ్మతత్త్వ మేనని `విష్ణూరూపాయ నమశ్శివాయయని పల్కెడు భక్తజనము వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వము గొల్చెద' అంటున్నాడు తిక్కన సోమయాజి. ప్రతికాలంలోనూ ప్రతి కొత్త సంప్రదాయం వచ్చినపుడల్లా ఈ సమన్వయ భావం ముందుకు వస్తూనే ఉన్నది అందుకే శ్రీ శంకర భగవత్‌పాదులు షణ్మత స్థాపకులు అయినారు. వైదిక వైదికేతర సంప్రదాయాలు పురాణాల నాటికి సమన్వయం పొందాయి. శ్రీ విద్యాసంప్రదాయంలో దశమహా విద్యలు అని దేవీ ఉపాసనలు పది విధాలుగా చెప్పబడ్డవి. కాలాంతరంలో వైష్ణవ మార్గానికి చెందిన దశావతారాలతో వీటికి ఐక్యభావన కలిగించడం జరిగింది. కృష్ణస్తు కాళికా ప్రోక్తా రామమూర్తిశ్చ తారిణీ వరాహో భువనాప్రోకా నృసింహో భైర వీశ్వరీ ధూమావతీ వామనస్యాత్ ఛిన్నా భృగు కులోద్భవః కమలా మత్స్యరూపఃస్యాత్ కూర్మస్తు బగళాముఖీ మాతంగీ బౌద్ధ ఇత్యేషా షోడశీ కల్కి రూపిణీ(దశ మహా విద్యలు కొమరవోలు వేంకట సుబ్బారావు (2000) పే 190) దేవీ దేవతల నడుమ వలెనే ఈ సామరస్యము మానవ జీవితాలలో సాధించడానికి సమష్టి కుటుంబ వ్యవస్థ దాంపత్యము కేంద్రంగా ఏర్పడింది. సృష్టికి ఆధార భూతమైన ప్రకృతి పురుషూల వలెనే కుటుంబానికి స్త్రీ పురుషూలు కేంద్ర స్థానంలో ఉండే పరిపాలించవలసి ఉన్నది. మొత్తం ఈ చక్రానికి కేంద్రబిందువు తల్లి. బహిర్వలయం తండ్రి. ఈ రెంటి నడుమ సంబంధము పరస్పరాధార భూతము. లోకానుభవంలోకి వచ్చే అర్థకామానుభవంలో ధర్మానుసంధానము దానికి ఒక సుస్థితిని కల్పిస్తుంది. కుటుంబంలోని స్త్రీ పురుషూల నడుమ బంధువుల నడుమ అతిచార స్థితికలుగకుండా కామభావాన్ని క్రమీకరించడం నిమిత్తం. పరిహాసాలు వెక్కిరింపులు ఏర్పడ్డాయి. అకలష్మంగా అట్లాగే వదినె మరదుల మధ్య మాతృవత్ భావన అలాగే రూపొందింది. మన దేశంలో అనాధిగా వస్తున్న సంప్రదాయాల్లో అతిథి అభ్యాగతుల సమర్చన ఒకటి. ఈ అతిథిని సాక్షాత్తు ఈశ్వరునిగా భావించి పూజించుమని ఈశోపనిషత్ చెప్పిన `తేన త్యక్తేన భుంజీథాః అన్న వాక్య తాత్పర్యము గోచరిస్తుంది. సమాజంలో కృతజ్ఞతా భావము విశ్వరూపంలో విస్తరించడానికి ఋణభావన ఏర్పరచబడింది. దేవ ఋణం ప్రకృతితో తాదాత్మా్యన్ని పితౄణము కుటుంబంతో తాదాత్మాన్ని ఋషిఋణము జాతి వారసత్త్వంతో విజ్ఞానంతో తాదాత్మా్యన్ని సూచిస్తూ ఉన్నవి. నిత్య జీవితంలో సౌందర్య శాస్త్రానికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నా లేకపోయినా బ్రతుకులోని లయను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రతిక్షణమూ ప్రతికార్యమూ దోహద పడుతుంది. క్రమ రాహిత్యాన్ని అసౌష్ఠవాన్ని అనే చిత్యాన్ని పరిహరించగలిగితే జీవితమంతా సౌందర్య స్థానం అవుతుంది. మన పరిసరాలలో ఉన్న ప్రతివస్తువూ ప్రతిపూవూ ప్రతి మబ్బు, ప్రతి వాయువీచిక మనను అనుకరిస్తూనే ఉంటాయి. సమన్వయానికి దూర మైనప్పుడు చిత్తశాంతి కోల్పోయినపుడు జీవితాన్ని స్వార్థం కేంద్రంగా నిర్మించుకోవలసి నపుడు లయ తప్పిన జీవితం పరిహార్యం, ఆక్షేపణీయం, జుగుప్సావహం అవుతుంది. జీవితంలో నిగ్రహంతో శాంతచిత్త స్థితితో సాగించవలసిన లయను కళా రూపాలలో అంతర్ముఖీనమైన, అనుద్విగ్నమైన చిత్రవృత్తితో సాధించవలసి వస్తుంది. ఆయా కళావిష్కరణలన్నీ రచయిత శిల్పమైతే వ్యర్థ పదార్థాన్ని తొలగించటం చేత పొందుతున్నారు. లయ విరహితమైన భౌతిక జగత్తులోకి లయను ఆవిష్కరించటం కళా ధర్మమవుతున్నది. కూనిరాగం ఒక పాటగా, ఒక పదంగా, ఒక కీర్తనగా, ఒక స్వరరాగ మేళగా రూపొందటం లయ పొందుతూవున్న పరమ ఉన్నత స్థితిని వ్యక్తీకరిస్తుంది. శ్రీ అరవిందులు లయను గురించి ఇలా అన్నారు `లయ యేర్పడటం కవిత్వ ప్రేరణలో భాషా శక్తి వంటి అంతర్గత భాగమే. లయ సాధారణంగా తానై వస్తూనే భాషకూ, భావాల తోడి అనుసంధాన్ని యేర్పరస్తుంది. ఈ అంశాలన్నీ ఎక్కడో వెనకాల సంసిద్ధమయ్యే ఉన్నాయి. వాటిని స్వీకరించి ప్రసారం చేయటమే మిగిలింది. సామాన్యంగా మన భౌతిక మనస్సే, కలతయే నిరోధం కలిగించేది.' లయను సాధించేందుకు తొలిప్రయత్నం అస్తవ్యస్త పరిస్థితిని తొలగించటం. రెండు యధోచితంగా నూతన వ్యవస్థను యేర్పరచటం. యధోచిత నూతన వ్యవస్థా నిర్మాణ సందర్భంలో విశ్వలయతో అనుబంధం పొందినప్పుడు అది తప్పకుండా సాధ్య మవుతుంది. అస్తవ్యస్త పరిస్థితిని చూచినపుడు వ్యథ పొందిన తాను, సామాన్య లయ రహిత స్థితి నుంచి బయటపడకుండా మరొక పరిస్థితిని కలిపించే ప్రయత్నం చేయటం, తాను నిర్మూలించిన వ్యవస్థ నిర్మాణానికి హేతువులైన స్వార్థము, భయము, అరక్షణ భావము మొదలైన అంశాల జోలికి పోకుండా అలాంటివే మరొక రూపం పొందిన ఆ భావాలే ఆధారంగా నిర్మించటం వల్ల మరొక పూర్వ వ్యవస్థా వికృత సంతానం ఆవిర్భవిస్తుంది. 20వ శతాబ్దంలో కుప్పకూలిపోయిన సామ్యవాద వ్యవస్థలకు ఈ తత్తా్వన్ని అవగాహన చేసుకోక పోవటమే ప్రధాన కారణం. వ్యక్తులకు, వ్యక్తుల సమూహాలకు (సమాజాలకు) అత్యధికంగా ఒక ముద్రవేసి ఒక లక్షణాన్ని ఆపాదించి మన సిద్ధాంతం నిర్మించరాదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఎదిగిపోయే ఒక విశిష్ట విలక్షణ భావ సంపుటి. దైవాసుర సంఘర్షణ అన్నది సైద్ధాంతికంగా భావముల మధ్య ఘర్షణయే కాని, వ్యక్తుల, సమూహాల జాతుల నడుమ సంఘర్షణ కాదు. ధృతరాష్ట్ర దశరథ శబ్దాలు ప్రతీకలు. రావణ వర్గంలో విభీషణుడు నియంతృత్వానికి భీతి చెందని వాడున్నాడు. కౌరవ వర్గంలో ధర్మానికి దుర్వా్యఖ్యలు వినక ధైర్యంగా ఎదుర్కొనే వికర్ణులూ ఉన్నారు. ప్రాతిభాసికమైన వైరుధ్యం ఆత్యంతికం కాదు. అందువల్లనే భాసుని వంటి మహా నాటక కర్త పాంచరాత్రంలో కౌరవ పాండవులకు సమరసభావం కుదిరి యుద్ధం నివార్యమైనట్లుగా చిత్రించాడు. దుర్యోధననిలో ఉన్న ధర్మజీవుణ్ణి వెలికి తీసుకొని వచ్చి రెండు సమూహాల నడమ ఉండే సామరస్యమును ప్రత్యక్షంగా వ్యాఖ్యానించాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యులకు గురుదక్షిణ నీయబోతాడు. ఆతడు గురు దక్షిణగా అర్థరాజ్యం పాండవుల కిమ్మంటాడు. అనేక సన్నివేశాల తరువాత పాండవులకు రాజ్యం సంక్రమిస్తుంది. ఈ సన్నివేశంలో వైరస్యం ఉన్నవాళు్ల కౌరవ పాండవులు. ఇద్దరికీ సామరస్యం కుదిరించే కార్యబిందువు ద్రోణుడు. రెండు పక్షాలకు సమానుడైన గురువు అతడే. కౌరవ పాండవ పక్షాలు అనే రెండు బిందువులు తమ తమ సామరస్యం కోసం చేరుకున్న ద్రోణుడనే బిందువు దగ్గర సంగమించారు. ఇదొక త్రిభుజం. వైరస్యమున్న రెండు దూర బిందువులు శిఖరం దగ్గర వైరస్యాన్ని కోలుపోవటం ఇక్కడ ప్రధానాంశం. జీవితాన్ని గురించి ఒక తాత్తి్వక సూక్తిగా `సత్యం శివం సుందరం' అన్న త్రిపుటి వ్యాప్తిలో ఉన్నది. ఆధునిక భారతీయ తాత్తి్వక భావ మర్యాదలో నుంచి ఈ పదబంధం పుట్టింది. ఉపనిషత్తులలో పేర్కొన్న పదబంధం కాదు. బ్రహ్మతత్త్వమును గురించి సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ అనీ శాంతం శివం అదై్వతం అని వాటిల్లో వర్ణింపబడింది. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అన్న పాశ్చాత్య సాహిత్య భావ ప్రతిఫలనం నుంచి ఈ పదబంధం పుట్టి ఉంటుంది. ఈ పదబంధంలో శివశబ్దమే కేంద్రం. సత్యమూ, సుందరము శివము లక్ష్యముగా కొనసాగాలి. చివరకు చేరవలసిన బిందువు అదే శివఏవ కేవలం, మనిషి పురోగమించిన కొద్దీ అనేకములైన విరుద్ధాంశాలు సమన్వితాలవుతూ పోతవి. అప్పటికి మనకు సృష్టిమూలంలో ఉన్న ఏకత, సమగ్రత ఆవిష్కారమవుతవి. గాంధీజీ ఒకచోట ఇలా అన్నారు. `చిమ్మచీకటి నడుమ వెలుగు ఉంటుంది. మృత్యువు నడుమ జీవనం ఉంటుంది. ద్వేషం మధ్యలో ప్రేమ ఉంటుంది.' పైకి అత్యంత విరుద్ధాలుగా కానవచ్చే అంశాల నడుమ ఒక సహజీవనం ఎలా ఉంటుందో సర్వమునందూ ఈశ్వరాంశ ఎలా నిగూఢమై ఉన్నదో ఈ వాక్యాలు స్ఫుటం చేస్తవి (గాంధీ శతాబ్ది సంచిక విశ్వభారతి 1969). ఇక్కడ సత్య శివముల నడుమ అనుసంధాన బిందువు సుందరము. జీవలోకము అత్యంత ప్రయత్నముతో సాధనతో తపస్సుతో సాధించుకొన్న ఉన్నత స్థితి ఈ సౌందర్య లోకము. ఈనాడు మానవ జీవనంలో వచ్చిన పరిణామాలు విద్యుచ్ఛక్తి, దూరయానాలు, కంప్యూటర్ ఇవన్నీ మనిషిని అతిగా విస్తరించిన లోకసంబంధాలతో అంతర్ముఖుణ్ణి కాకుండా నిరోధిస్తున్నవి. మనుష్యూడు ఇవాళ కేవలం `బహిర్ముఖుడు' మాత్రమే. జీవనదులు కలుషితాలవుతున్నవి. వనసంపద నిర్మూలిత మవుతున్నది. పక్షులు దూర దూరాలకు వలస పోతున్నవి. అనేక జీవకోటి క్రమక్రమంగా నశించి పోతున్నది. ప్రకృతిలో సమతులనం భంగింపబడుతున్నది. మానవ జీవితాన్ని చూస్తే సమష్టి కుటుంబాలు క్రమంగా తొలగిపోతున్నవి. మానవ సంబంధాలలో ఆర్ర్దత, ఆత్మీయత లోపించాయి. భాగవతంలో కృష్ణలీలలు చదివితే ఒకటి రెండు తరాల తరువాత శ్రీకృష్ణూడు కాన్వెంట్‌లో చేరక ఇంకా ఇంట్లో ఎందుకు ఉన్నాడనే ప్రశ్న పుట్టవచ్చు. ఉమాపతిధరుడనే కవి సదుక్తి కర్ణామృతంలో శ్రీకృష్ణూని అద్భుత లీలలను వర్ణించాడు. పశువులను మేపడానికి వెళ్లిన శ్రీకృష్ణూడు ఇంటికి రాలేదు. నందుడు ఆందోళనలో ఉన్నాడు గోపబాలకులు భయంతో తాము అతన్నెక్కడ చూచిందీ చెబుతున్నారు. ఒకడంటాడు యమునా పులినతలంలోనని, రెండోవాడు అది కాదుకాదని పర్వతం క్రిందుభాగంలో చూచానంటాడు. మరొకడు అదీకాదని మర్రిచెట్టు నీడలో చూచానంటాడు. నాల్గవవాడు కాదుకాదు నేను అతణ్ణి రాధ తండ్రి ఇంటి ముంగిట్లో చూచానంటాడు. ఇలా చెబుతూ వుండగానే ఆతడేమో నందగోపుని ఇంట్లో నుంచే బయటకు వచ్చాడు. ఈ శ్లోకంలో ఒకరినోటను మరొకరు కాదుకాదని నిషేధించటం ఎంత అందంగా పొదుగబడిందో చూడవలసిందే. కాళిందీ పులినేమయా, నన మయాశైలోపకంఠే, నన న్యగ్రోధస్యతలేమయా, నన మయా రాధా పితుః ప్రాంగణే దృష్టః కృష్ణ ఇతీరితస్య సభయం గోపైర్యశోదాపతే విస్మేరస్య పురోహస న్నిజగృహా న్నిర్యన్ హరిః పాతు వః (స.క. శ్లో 255) శ్రీ కృష్ణ ప్రసక్తి వచ్చింది కాబట్టి మన పండగలు చాలావరకు కాలగర్భంలో కలసిపోయిన సంగతి గుర్తువస్తున్నది. కృష్ణాష్టమి తెల్లవారి ఉట్ల పండగ. అదొక వినోదం. అదొక సాహసం. శ్రీకృష్ణానుభావంతో, తాదాత్మ్యం సిద్ధికోసం మనం ఆ వాతావరణంలోకి వెళ్లే ప్రయత్నం. అన్నమయ్య కీర్తనలలో ఉట్ల పండుగను వర్ణించే పాట ఎంతో అపురూపమైంది. ఉట్లు ఎన్నో రకాలు. వాటిల్లో పెట్టే సామాగ్రి వివిధతా పూర్ణమైందే. బాలులతో వీధులలో పారాడు వారు కోలలెత్తుక వుట్టీ గొట్టీ జుండి నారికడపువక్కలు, నానిన సనగలు చారపప్పు తేనెలు చక్కెరలును పేరిన నేతులు నాన బియ్యాలు నుట్ల నవే చేరి యశోద బిడ్డకు జెప్పేరు సుండీ చక్కిలాలు నడుకులు సనిగెపప్పులును చెక్కిన మెత్తటి తోట చెఱకులును పెక్కువగా నుట్లలో బిందెల నించిన వవె చక్క నెశోద బిడ్డకు జాటేరు సుండి నువు్వలు చిటిబెల్లాలు నున్నని చిమ్మలులు నువు్వటిడ యును చిన్ని నురుగులును ెువ్వారు వెంకటపతి కెరిగింప నారగించి కివ్వకివ్వ నవ్వ నణకించీ జుండీ (కొత్త సంపుం 1256) (`రసమయి'లో శ్రీ వేటూరి ఆనందమూర్తి వ్యాసం `ఉట్లపండగ' నుంచి)(ఆగస్టు 2003) మనం ఆ పండుగలకే కాదు ఆ భావతాదాత్యా్మనికీ దూరమైనాము. ఆ చిరుతిండ్ల పేర్లే మనకు ఈనాడు తెలియక పోవచ్చు. త్రవు్వకుంటూ పోతే ఇలా ఎనై్ననా గతకాలంలోని సదంశాలను లెక్కించుకోవచ్చు. అయితే లెక్కించితే వ్యతిరేకాంశాలూ ఉంటాయి. మొత్తం మీద సమాజాన్ని అత్యంతాల్పమైన ప్రభుత్వ వ్యవస్థ, ఆత్మీయత మీద ఆధారపడ్డ కుటుంబ వ్యవస్థ, సమష్టి క్షేమాన్ని కేంద్రంగా భావించిన కుటుంబ వ్యవస్థా కాపాడుతూ వచ్చాయి. వికేంద్రీకృతమైన పరిమిత విస్తృతి కలిగిన సమాజంలో ఉన్నంత పరస్పర ధార్మిక నియమన రీతి ప్రపంచమంత విస్తరించి ఏకకేంద్ర వ్యవస్థితమైన వర్తమాన ప్రపంచంలో ధర్మం నిర్వచించేది ఆ ఏక కేంద్రమే. యుద్ధాలు నడిపినా, వాటినుంచి తొలగినా వారి యిష్టమే. ఎక్కడికక్కడ నియంత్రణలూ, ప్రతినియంత్రణలూ ఉండవలసిందే. వర్తమానం దిక్కు చూపలేనప్పుడు మనుష్యూడు స్వయం నియంత్రణ కోసం గతంలోకి త్రవు్వకుంటూ పోతాడు. రామాయణం మళ్లీ మళ్లీ రూపు ్టట్టుతుంది. `సర్వ ధర్మ మూల బీజంబుగా' శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఆధునిక కాలంలో పునరుద్గతం కావటానికి ఇదే హేతువయింది. కన్నడంలో కె.వి. వుట్టప్ప 1949లో `శ్రీరామాయణ దర్శన' రచించితే అదే భాషలో వీరప్ప మొయిలి `శ్రీరామాయణ మహాన్వేషణ' రచిస్తున్నారు. అస్థిపంజరాలు ఒకటే అయినా ఆత్మలు వేరు. దర్శనాలు వేరు. అన్వేషణలు వేరు. అయితే ఈ రామకథాపరంపర అనాది నుంచీ సాగివస్తున్నదే. కాలము, తత్త్వగవేషణ, భావుకత్వం, నూతన శిల్పాను సంధానం ఇవన్నీ వినూత్నంగా అనుస్యూతికి దోహదం చేస్తున్నది. ఒక మహావృక్షం యుగాలుగా అలాగే ఉన్నట్లు కనిపించినా మూలం తప్ప ప్రతిదీ మారిపోతున్నది. స్కంధము, శాఖలు, పత్రపుష్పాలు అన్నీ. ఇదీ జీవంతమైన సంప్రదాయం, ఈ జీవంతమైన సంప్రదాయం క్రొత్త దర్శనానికి కారణం అవుతున్నది. ప్రతి యుగం సత్యాన్ని కొత్త సౌందర్యంతో ఆవిష్కరించుకొని మరల మరల `శివ' శిఖరం వైపుగా అధిరోహింప జేస్తున్నది. ఇది అనుస్యూతి. ఇది సంప్రదాయం. నూతన సౌందర్య దర్శనం. ఇదే మృత్యువుకు తొలగించేది. మహాభారతం చెప్పింది. మృత్యువు అంటే అత్యంత విస్మృతి అని. `ప్రమాదంవై మృత్యురహం బ్రవీమి తథా అప్రమాదం అమృతత్వం బ్రవీమి.' ఏ దశలో మృత్యువు ఆ దశలోనిదే (ఉద్యోగ424 సనత్సు జాతీయం) ఈ అనుస్యూతిని విస్మరించటం మృత్యువును పొందటం. అంటే సంప్రదాయాన్ని విస్మరించటం. అది నిత్య పరివర్తన శీలమైంది. అందుకే అలంకార శాస్త్రం చెప్పింది `క్షణే క్షణే యన్నవతా ముపైతి తదేవరూపం రమణీయతాయాః' అని. నిత్యపరివర్తన శీలమైన ఈ సంప్రదాయం పాతబడిన ఆకులను బెరడులను పుష్పాదులను పరిత్యజిస్తుంది. మృత్యు లక్షణాలను తొలగించుకొని ప్రాణోద్విగ్న వసంత లక్షణాలతో ప్రకాశిస్తుంది. మహాయోగి శ్రీఅరవిందులు ఈ నిత్యలక్షణాన్ని ఇలా చెప్పారు. అవిద్య సరిహద్దులు వెనక్కు తగ్గుతవి. అధికాధిక జీవులు వెలుగులోకి ప్రవేశిస్తారు ప్రకృతి అంతస్సులో గర్భితమైన దివ్యత్వాన్ని ప్రకటిస్తుంది దివ్యచేతన మానుష లీలలను వెల్లడిస్తుంది. భౌమజీవనం దివ్యజీవనం అవుతుంది. (సావిత్రి 111)
Wednesday, February 4, 2009
Subscribe to:
Post Comments (Atom)
బ్లాగు లోకానికి మీకు మా హృదయపూర్వక స్వాగతం.
ReplyDelete