Sunday, February 8, 2009

శ్రీ గురు తత్త్వము

ఈశ్వరుడికి, జీవుడికి నడుమ అనుబంధంగా ఉండే వ్యక్తి గురువు. ఈ వ్యక్తి వాగ్రపంలో ఉండవచ్చు. ప్రయోగ రూపంలో ఉండవచ్చు. ఆదర్శ రూపంలో ఉండవచ్చు. కొందరు గురువులు లోకసామాన్యంగా కనిపిస్తూ, ఆంతర జీవనాన్ని ఉదాత్తమైన దివ్య తేజస్సులను అవతరింపజేస్తారు. కొందరు గురువులు సామాన్య జీవులను తల్లి పసిపిల్లలను చూసినట్లు ప్రతి అంశంలోనూ ప్రతి స్ఫూర్తి లోనూ శ్రద్ధ తీసుకొని, మార్జాల కిశోరం మాదిరిగా లక్ష్యం దాకా ప్రయాణింపజేస్తారు. జీవులు సామాన్యంగా దివ్యజ్ఞాన విషయంలో గుడ్డివారైనప్పుడు గురువు కలిగించే జ్ఞానం, వారి కన్నులను తెరిపించి నూతన లోకాలను దర్శింప జేస్తుంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా, చక్షురున్మీలితంయేన తసై్మ శ్రీగురవే నమః అన్న గురుగీతా వాక్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా అనేక సంప్రదాయాల్లో శిష్యుని గూర్చి గురువు చేతిలో నుండి జన్మించినట్లుగా చెప్పుకుంటారు. సాధారణమైన జన్మ తల్లిదండ్రుల వల్ల కలిగితే, గురువిచ్చేది జ్ఞాన రూపమైన మరొక జన్మ. సనాతన సంప్రదాయంలో ఉపనయనం మరొక జన్మకు సంకేతంగా భావించటం ఉన్నది. అందువల్లనే ఉపనీతుడు ద్విజుడవుతున్నాడు. జ్ఞానం పొందిన జీవుడు జీవితాన్ని పరిపాలించుకోవటానికి జగత్తునంతా విష్ణుమయంగా భావించి ప్రవర్తించవలసి ఉంది. అందువల్ల ఈ విష్ణుమయత్వాన్ని చిత్తంలో నిలిపిన వ్యక్తి విష్ణువవుతున్నాడు. మరొక విధంగా ఐహికమైన జీవనం నుంచి విడివడి తాను మరొక జీవనం ప్రారంభించి గడచిన జీవనాన్ని ఆ బంధాలను తెంచుకొని తాను శివుడవుతున్నాడు. ఈ విధంగా సద్గురు తత్త్వము త్రిమూర్తుల కార్యక్రమాలను ఏక వ్యక్తి ముఖంలో నిర్వహిస్తున్నది. అందువల్ల గురువును బ్రహ్మయని, విష్ణువని, శివుడని సంప్రదాయం చెప్పుతున్నది.
భారతీయ సంస్కృతిలో గురుతత్త్వము తొలుత ఈశ్వరుడిలోనే వ్యక్తమవుతున్నది. నారాయణ సమారంభాం, సదాశివ సమారంభాం..... అని గురుపరంపరను చెప్పుకునే పద్ధతి ఆది గురువు పరమాత్ముడనే విషయాన్ని రుజువు చేస్తుంది. నృసింహ కరావలంబ సో్త్రత్రంలో స్వామి గురువని శ్రీ శంకరులు సంబోధించినారు. సీతారామాంజనేయ సంవాదం వంటి గ్రంథాలు శ్రీరాముని యందు గురుత్వాన్ని స్థాపిస్తున్నవి. శ్రీకృష్ణుడు జగద్గురుడనే విషయం మహాభారతం స్థాపిస్తున్నది.
ఈశ్వరుడితో ప్రారంభమైన ఈ తేజస్సు మహాత్ముల యందు ప్రతిఫలించి సంక్రమించి నెలకొని మానుష దేహం లోకి దిగివస్తున్నది. వశిష్ఠాదులు, సిద్ధార్థ శంకరాదులు, ఈ తేజస్సును మోసుకొని వచ్చి జనులకు ఈశ్వరుడితో అవిచ్ఛిన్నమైన అనుబంధాన్ని నిలబెట్టినారు.
ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస మొదలుగా సనాతన గురుపరంపర అనేక రూపాలుగా లోకంలోకి దిగివచ్చింది. ఈ మహాత్ములందరు జనుల యొక్క భౌతిక, ప్రాణిక, మానసిక చైతన్యాన్ని ఉన్మనీ భూమికల దాకా తీసుకుని వెళ్లిన వారు. తపస్సు చేత లౌకికమైన చరిత్రను మలుపులు తిప్పిన వారు. జగత్తునంతా తమ ప్రబోధ ప్రభావం చేత చైతన్యమయం చేసిన వారు.
మన సమకాలంలో ఈ గురు తేజస్సు భీముని పట్నంలోని ఆనందవనంలో నెలకొని ఉన్న సదాశివమూర్తి అయిన సద్గురు శ్రీ శివానందమూర్తి వ్యక్తిలో ప్రకాశిస్తున్నది. శ్రీ శివానందమూర్తి సంప్రదాయమైన ఋషి సంప్రదాయాన్ని తత్తా్వన్ని, సమన్వయాన్ని మన వేషంలో, మన భాషలో, మన జీవనంలో మన వెంట నడుస్తూ దానిని మనలోకి సంక్రమింపజేస్తున్నారు. సద్గురు శ్రీ శివానందమూర్తి గారి కార్యాచరణ, ప్రణాళిక స్థూలంగా భౌతికంగానే కనిపిస్తుంది. 1974 ప్రాంతాల్లో వరంగల్‌ ప్రాంతీయ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో పది పన్నెండుగురు సన్నిహితులైన అనుచరులకు ఉపనిషత్తుల భగవద్గీతాదుల యోగ గ్రంథాల విపుల వ్యాఖ్య చేయటం ఆ గ్రంథాల సారాన్ని సాధకుల ఆచరణకు అనుకూలంగా, ఆ గ్రంథాల రహస్యాన్ని వివృతం చేస్తూ కొనసాగిన కార్యకాలం ఒకటి. ఆ కాలంలోనే ఆర్తులు, విషణ్ణులు, శిథిలులు, భీతులు, ఘోర రోగాలలో ప్రవర్తించేవారు చేరువైనప్పుడు మంత్ర ఔషధముల ద్వారా వారి ఆర్తిని తొలగించి జీవితానికి వెలుగుబాటను వర్షింపజేస్తూ వచ్చారు. ఈ సందర్భంలో వారి అనుచరులు కొందరు జిజ్ఞాసువులు, కొందరు ఆర్తులుగా రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. క్రమంగా ఆర్తులు గురు సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ, అనుభవిస్తూ జిజ్ఞాస మార్గంలోకి ప్రవర్తిస్తూ వచ్చారు.
ఈ సన్నివేశంలో భీముని పట్నం దగ్గర పరమ గురువుల ఆదేశాన్ని అనుసరించి ఆనందవనమనే ఆశ్రమాన్ని నిర్మించటం జరిగింది. ఈ ఆశ్రమంలో చేసుకున్న తపస్సు, జప ధ్యానాదులు వేయింతల ఫలితాలిస్తాయని సాధకుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆశ్రమ నిర్వహణలో సద్గురువులు పరిశ్రాజక మూర్తిగా కాక ఒక తండ్రిగా, తల్లిగా, హితుడుగా, ఆత్మీయుడుగా, గురువుగా అనేక భూమికలలో దర్శనమిస్తున్నారు. వారి కార్యక్రమం క్రమంగా విస్తరించింది. భారత దేశం అడుగడుగునా అనుచరులతో సంచరించి ప్రతి స్థలాన్ని తీర్థ భూతం చేసారు. వందలాది రుద్రయాగాలు నిర్వహించారు. అనేక తీర్థయాత్రలను దర్శింపజేసి శిష్యుల పుణ్యాన్ని వేయింతలు పెంచి వారికి భౌతిక జీవన సుఖాన్ని, భద్రతను కల్పించారు.
సద్గురువులు తర్వాతి దశలో అనేక రచయితల గ్రంథాల ముద్రణకు సహాయం చేశారు. వాఙ్మయ ప్రచారానికి దోహదం చేశారు. వందలాది రచయితలకు సనాతన ధర్మం వైపు మరలునట్లుగా ప్రేరణ ఇచ్చారు. సాహిత్యాన్ని ఎలా ఉద్దీప్తం చేశారో, సంగీత, నృత్యాది కళలకు , ఆంధ్ర మూ్యజిక్‌ అకాడమీ వంటి సంస్థలను స్థాపించి విద్వాంసులను సన్మానించి శాస్త్రీయ సంగీతాన్ని కొత్త తరంలో అభిరుచి, రసికతను పెంపొందించి ఆ కళ యొక్క స్వచ్ఛతకు అనుస్యూతిని కల్పించారు. ఆధ్యాత్మిక సాధకులకు పౌరాణికులకు రచయితలకు కవులకు కళాకారులకు వందలాది మందికి ఉదాత్త రీతిలో సన్మానాలు నిర్వహించి భారతీయ సరస్వతీమూర్తికి పట్టాభిషేకం నిర్వహించారు.
సద్గురు శ్రీ శివానందమూర్తి భౌతిక స్థాయిలో శిష్యుల ఆపదలను తొలగిస్తూ రోగాలను తొలగిస్తూ శరీరాలకు రక్షణ కల్పిస్తున్నారు. మానసికంగా కళలను, సాహిత్యాన్ని సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా పునరుజ్జీవింపజేస్తూ ఒక మణిసేతువును నిర్మించారు. ఆధ్యాత్మిక స్థాయిలో తత్వ రహస్యాలను ఉపదేశించి సాదు మార్గంలో నడిపిస్తున్నారు. ఏక కాలంలో అనేక స్తరాలలో వ్యవహరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఈశ్వరుని సౌలభ్యానికి మారు రూపంగా దర్శనమిస్తున్నారు. అనేక దేవాలయాల పునరుద్ధరణకు సహాయం చేస్తూనే భీమునిపట్నంలోని ఆనందవనంలో యోగగణపతిని ప్రతిష్ఠించి సాధకుల తపోభూమిగా పరివర్తింపజేశారు. ఇక్కడే అద్భుతమైన, శిల్పమహితమైన ఆద్యాది శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించి సర్వధారి విజయదశమి పర్వదినాన దేశ సౌభాగ్యం కోసం ప్రతిష్ఠింపజేస్తున్నారు.
గురు తత్తా్వన్ని గురించి సంగ్రహంగా క్రింది నాలుగు పద్యాలు తెలియజేస్తున్నాయి.
* గురువు ఈశ్వర లీలా రథ శిఖర వైజయంతి
గురువు ఆత్మారోహ గిరిశిఖరం మీది జ్యోతి
గురువు జిజ్ఞాసువుల దాహం తీర్చే ప్రపాశాల
గురువు సుషుమ్నాద్వారం, గురువు శివుని మారు రూపు

* సంసిద్ధమైన బ్రతుకులో తానై వచ్చే వినూత్తాతిథి
అతీత జీవానుభూతుల రహస్యాల భాండాగారం
సనాతన పరంపరా తేజస్సును మన దాకా మోసుకువచ్చి
ఈ హృదయంలో ప్రతిష్ఠించి తాను మరుగయ్యే దివ్య తీర్థం


* అతి మనస్సులోనుంచి జలపాతమై దూకే కవిత
సమష్టి మనస్సులో నుంచి ప్రాకివచ్చే ప్రాగ్రూపం
ధ్యాన వేళ అభీప్సను ఊర్థ్వంగా మోసుకుపోయే జ్వలదగ్ని
పంచభూతాల సమష్టిని మనకోసం దయతో గ్రహించిన ఈశ్వరుడు

*ఆశ్రయం లభించితే చాలు అభ్యాసి తొలి ఘట్టం దాటినట్లే
గురు తేజస్సు హృదయంలో చేరి వృత్తులను నియమిస్తుంది.
ప్రలోభపెట్టే దృశాయలను, సిద్ధులను కట్టడి చేస్తుంది
గురుభావం భుజం మీద నిలుపుకొని చివరిదాకా తీసుకుని వెళు్లతుంది
(సాంపరాయం, పే.8283)

1 comment:

  1. మీలాంటి మహానుభావులు,విద్యావంతులు బ్లాగుల ద్వారా మీ జ్ఞానాన్ని అందరితో పంచుకొంటున్నందుకు మా బ్లాగ్లోకం తరపున మీకు నా మనఃపూర్వక ధన్యవాదములు మరియు పాదాభివందనములు.

    ReplyDelete