Friday, July 31, 2009

తెలంగాణలో సాహిత్య చైతన్యం

1955లో బి.ఏ చదువుకోవటానికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాను. అప్పుడు తెలంగాణా రచయితల సంఘం చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నది. ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. `ఉదయ ఘంటలు' కవితా సంకలనం వెలువడింది. మంజీర అనే సాహిత్య పత్రికను ప్రారంభించితే ఒక సంచిక మాత్రం వెలువడింది. మా చిన్నాయనగారు సంపత్కుమారాచార్యులు భువనగిరిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ రచయితల సంఘంలో ముఖ్య కార్యకర్తగా ఉన్నారు. హైదరాబాదులో నేను యూనివర్సిటీ ప్రాంగణంలోని `ఏ' హాస్టలులో చేరాను. అప్పటికి అక్కడ ఉదీయమానుడైన కవి మాదిరాజు రంగారావు వున్నారు. ఆయన తొలిసారి కలుసుకోగానే అంతకుముందే ప్రచురితమైన నేను, సంపత్కుమారతో కలిసి రచించిన కావ్యం `హృద్గీత' నుంచి పద్యాలు చదివించుకుని సాదరంగా ఆహ్వానించారు. నాటినుంచీ మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా, దాదాపు సాహచర్యంగా సాగి పోయింది. అప్పటికే `తెలుగు స్వతంత్ర'లో రంగారావు రచనలూ, నా రచనలూ వెలు వడుతూ వున్నవి. రంగారావు బాగా పద్యం వ్రాయగల, తీర్చిదిద్దగల నేర్పుగలవారే. విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం అంటే అమితమైన ఇష్టం. ఆయన ఇంట్లో బెజవాడలో వుండి కొన్ని రోజులు మేఘసందేశం చదువుకున్నారు. `నా ఇంటన్‌ పదినాళు్ల బిడ్డవలె నున్నాడాంధ్ర సాహిత్య రేఖాయోగ్యుండగు మాదిరాజమణి రంగారాయ బాలుండు' అని విశ్వనాథ ఖమ్మంలో కల్పవృక్ష పఠన సభలలో ఆయనను ప్రశంసించడం నాకు గుర్తే. నారాయణగూడా `దీపక్‌మహల్‌' వెనుక పల్లాదుర్గయ్యగారి ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లోనే రామరాజు, దాశరథి, ఆళ్వార్‌ స్వామి ప్రభృతులు చిన్నచిన్న భాగాలలో అద్దెకు వుంటూండేవాళు్ల. అది సాహిత్య కేంద్రం. సాయంకాలాల్లో మేము యూనివర్సిటీ హాస్టలునుంచి అక్కడికి చేరుకునేవాళ్ళం. ఎం.ఎల్‌.ఏ క్వార్టర్‌‌సలో వుండే నారాయణరెడ్డి చేరుకునేవాడు. కవిత్వమే ప్రధానాంశం. వర్తమాన ధోరణులు, వాటిని గురించిన ప్రశంసలు, విమర్శలు, చర్చలు కొనసాగేవి. సమష్టిగా వీళ్ళందరికీ సాహిత్యమే ప్రధానాంశం గానీ వీళ్ళమీద ఏ రాజకీయ పక్షాల ప్రాబల్యం వుండేది కాదు. కులాల స్పృహ వుండేది కాదు. ఈ గోష్ఠూలలోకి కాళోజీ వచ్చి చేరేవారు. అట్లాగే కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వీళ్ళందరికీ ఆప్తులు. ప్రచురణకు ముందు వడపోతలో శాస్త్రిగారిది ప్రథమ స్థానం. జనగామలో అధ్యాపకులుగా పనిచేస్తున్నా, ఉరుపుటూరి రాఘవాచార్యులు ఈ సమూహానికి ఎంతో వెన్నుబలంగా నిలిచేవారు. ప్రథమ వార్షికోత్సవాలు జనగామలో జరగటానికి బహుశః ఆయనే కారణం. అక్కడ ఆయన పుట్టపర్తివారిని పిలిపించి ఉపన్యాసాలు ఏర్పాటుచేసి వాటిని ప్రచురించారు కూడా. వానమామలై వరదాచార్యులు క్షయ వ్యాధి నుంచి బయటపడి పోతన చరిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. కపిల కాశీపతి సమాచార శాఖ అధిపతిగా వున్నారు. నారాయణరెడ్డి `నాగార్జునసాగరం' వ్రాసిన తరువాత దాన్ని నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన నివాసంలో వినిపించుకున్నారు. జె.బాపురెడ్డి, చేకూరి రామారావులు నిజాం కాలేజీలో చదువుకునే వాళు్ళ. సి.నా.రెతో బాటే గూడూరి సీతారాం వుంటుండేవాడు. `మంజీర' ఆగిపోవడంతో దక్షిణ భారత ప్రచారసభ నిర్వహించే పత్రిక `స్రవంతి' తెలుగు సాహిత్య వికాసానికి బాసటగా నిల్చింది. కొత్త కవుల రచనలకు ఆహ్వానం పలికేది. ఆ పత్రిక సంపాదకులు వేమూరి ఆంజనేయ శర్మ సౌజన్యం మూర్తీభవించిన వ్యక్తి. అప్పట్లో తెలంగాణా రచయితల సంఘం నిర్వహించిన కవిత్వపు పోటీలో తెన్నేటి పూర్ణచంద్రరావు రచన `దయ్యాల మఱ్ఱిచెట్టు' కు మొదటి బహుమానం యాభై రూపాయలు. నా రచన `ఎవరెస్టు గేయానికి' రెండవ బహుమానం ముపై్ప రూపాయలు ఇచ్చారు. ఈ బహుమానం నిర్ణయించిన వారిలో పుట్టపర్తి నారాయణాచార్యులు, నార్ల వెంకటేశ్వరరావులు వున్నారని విన్నాను. నారాయణ రెడ్డి నాగార్జున సాగరం గేయకావ్యం. బౌద్ధమత వాతావరణంలో నుంచి ఉత్పన్నమైన ప్రేమ త్యాగాల జమిలితనం దీనిలో ఇతివృత్తం. చివరకు సాగరం ఏర్పడటం కావ్య తాత్పర్యం. భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నాగార్జున సాగరం ప్రారంభించిన తరువాత అదే వేదికమీద నారాయణ రెడ్డి కావ్య ప్రకటనం జరిగింది. ఇదొక విలక్షణ సన్నివేశం. అంతకు పూర్వం నారాయణ రెడ్డి `జలపాతం' అనే ఖండకావ్యాన్ని దాశరథికి అంకితం చేశారు. ఆ కావ్యంలో ఆ అంకితం పద్యాలు అద్భుతమైనవి. భావ బంధురమైనవి. ఆనాళ్లలో అబ్బూరి వరద రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఛాయాదేవి సంపాదకత్వంలో `కవిత' పత్రిక రెండు సంచికలు చాలా అందంగా వచ్చాయి. దీనిలో తెలంగాణ రచయితల్లో ప్రముఖులెవరికీ స్థానం లభించలేదు. ప్రయోగవాద ప్రగతివాదాల కలయికగా, పాశ్యాత్య కవుల రచనల అనువాదాలతో ఈ సంచికలు వచ్చాయి. సిద్దిపేటలో వేముగంటి నరసింహాచార్యులు స్వయం వ్యక్తుడుగా కావ్య రచన సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా చండూరులో అంబటిపూడి వేంకటరత్నంగారు ఆధునిక కవితకు రూపుదిద్దుతున్న వాళ్లలో వున్నారు. వరంగల్లులో గార్లపాటి రాఘవరెడ్డి, ఉదయరాజు శేషగిరిరావు, గొట్టుముక్కుల రాధాకృష్ణమూర్తి రచనలు కొనసాగిస్తున్నారు. నాటి తెలంగాణంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో వున్న వాతావరణం ఫలితం- ఏ రూపంమీదా, ఏ వస్తువుమీదా, ఏ ప్రత్యేకమైన అభివ్యక్తిపైనా, ఏకైక గమ్యమన్న నిష్ఠ లేకపోవడం. దాశరథి `మస్తిష్కంలో లేబోరేటరీ' అయినా `మహాంధ్రోదయం' అయినా వానమామలై వారి `పోతన చరిత్ర'మైనా, కాళోజీ `నాగొడవ' యైనా నారాయణ రెడ్డి `విశ్వగీతి'యైనా కవి గోష్ఠూలలో సమానంగా ఆదరింపబడేవి. యువ కవుల రచనలకు ప్రతిష్ఠ బాగానే వుండేది. ఈ పరిస్థితివల్ల కవిత్వానికి, అనుభూతికీ ప్రాధాన్యం వచ్చింది. రాజకీయ సిద్దాంతాలకు సాహిత్యం కట్టుబడిపోలేదు. దాశరథి ప్రగతివాద మార్గం నుంచి ప్రయాణం ప్రారంభించినా, కవిత్వ స్ఫూర్తికే కట్టుబడ్డారు. ఆయన పద్యం కొత్త పలుకుబడినీ, జీవాన్ని సంతరించుకున్నది. భావకవులు తెచ్చిన సౌకుమార్యాన్ని కొంత సడలించుకుని ఓజస్సును సమకూర్చుకున్నది. `రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికము్మ దక్కునే' అన్న భీషణ ఘోష పలికించారు. వీర వ్యావహారానికి కానీ, వీర గ్రాంధికానికి గానీ తెలంగాణాలో ప్రాబల్యం లేదు. వచ్చినాడు, చేసినాడు మొదలైన క్రియారూపాలు, దేశికవులలో, తిక్కనలో కనిపించే నామరూపాలు వ్యవహారంలో నిలిచివుండటం వలన యిక్కడ భాషా వైపరీత్యం లేదు. నారాయణరెడ్డి ఒకసారి నా వచనాభాసంగా వ్రాసిన గీత పద్యం చదువుతూవుంటే తన ఒక గీత పద్యం వినిపించారు. దాని చివరిపాదం `మబ్బులవలె వెన్నెలవలె మంచులవలె' అని గుర్తు. ఇంత విశిష్టంగా పద్యాన్ని తీర్పగల నేర్పు ఆయనకు వున్నది. దేవులపల్లి రామానుజరావు, జువ్వాడి గౌతమరావు, పి.వి. నరసింహారావు మొదలైన సాహితీవేత్తలు సమచిత్తంతో సాహిత్యాన్ని నిలబెట్టేవారు. ఆంధ్ర ప్రాంతం నుంచీ సాహితీవేత్తలు రావటం, కావ్య పఠనాలు, ఉపన్యాసాలు విరివిగానే సాగేవి. ఒకసారి బాలాజీ భవన్‌లో నా అభిమాన కవి అనే అంశం గురించి రెండురోజులు ఉపన్యాసాలు జరిగాయి. రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, శ్రీశ్రీ తదితరులను గురించిన ప్రసంగాలు సాగాయి. చివరకు నారాయణరెడ్డి ప్రసంగం తనకంటే వయస్సులో మూడునాల్గేళ్ళకు పైబడని సహచరుడైన కవి దాశరథిని గురించి విశిష్టమైన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. తెలంగాణా రచయితల సంఘం ప్రాచీన కావ్య సంస్కారాన్ని సజీవంగా వుంచడంకోసం కావ్య పఠనోత్సవాలను నిర్వహించింది. భారత భాగవతాలను, మను వసు చరిత్రాదులను శ్రావ్యంగా పఠించి పాఠకుల హృదయాలకు చేరువగా, భావస్ఫోట కంగా, పద్యంలోని సంగీత గర్భితను స్ఫుటంగా చేస్తూ ఈ పఠనం కొనసాగింది. ఈ పద్ధతిని కొనసాగించుతూ ఈనాటికీ నిలబెడుతున్న మహా రసికశ్రేష్ఠూడు జువ్వాడి గౌతమరావు. తెలంగాణా రచయితల సంఘం సాహిత్య చైతన్యాన్ని విశ్వతోముఖంగా పరివ్యాప్తం చేసేందుకు ఎన్నుకున్న ప్రక్రియ కవి సమ్మేళనం. ఉర్దూ పారశీక కవి సమ్మేళనాలలోని పాఠకుల ప్రతిక్రియను ప్రకటించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. ఎన్నుకొన్న కవులనే కాక ఎందరైనా కవులు తమ కావ్యాలను పఠించే సంప్రదాయానికి బలం చేకూర్చారు. 1955 ప్రాంతాలలో బమ్మెరలో కవి సమ్మేళనం రాత్రి తొలిజాములో ప్రారంభమై తెల్లవారేదాకా కొనసాగింది. ఆర్ర్ధత ఆత్మీయతలు అల్లుకున్న తెలంగాణలోని సాహిత్య స్థితి అది.

Thursday, July 30, 2009

రసలోకం-3

పద్యం చచ్చిపోయిందని ప్రచారం చేశారు చాలాకాలం. పద్యం ముసలిదైపోయింది. నేటి అవసరాలకు భావాలకు సరిపోదు. దానికి ఉన్న పరిమితిలో ఆధునిక భాష ఒప్పదు. ఇంకా అనవసరమైన నిర్బంధాలు - అక్షర గణాలు, యతిప్రాసలు ఇంకా తత్సమ పద బాహుళ్యం అందువల్ల సామాన్య ప్రజలకు అర్థం కాదు - అని వాదం
పూర్వం భారత భాగవతాలు గ్రామాలలో రచ్చబండల దగ్గర చదువుతూ ఉండటం వలన జనం వినేవాళు్ల. పద్యం చదవటంలోని ఒడుపు వల్ల అది అందరికీ అర్థం అయ్యేది. యక్షగానాలలో వచనంలో వ్యావహారికం ఉన్నా, పద్యాలూ, పాటలూ లాక్షణిక భాషలోనుండేవి. వీటిని జనం చూచి ఆనందించే వాళు్ల.
20వ శతాబ్దంలో తెలుగులో నూతన సారస్వతం ఆరంభం కావడం, అనేక ప్రక్రియలలో రచనలు కొనసాగటం జరిగింది. పద్యం, గేయం, వచన పద్యమూ ప్రస్తరించాయి. వాటి వాటి అంతస్సత్వాన్ని బట్టి అవి సారస్వతంలో స్థానం పొందాయి. తిరుపతి కవుల తెలుగు పద్యం వాడుక భాషలోని కాకువును, వాక్య నిర్మాణాన్ని తనలో సంలీనం చేసుకున్నది. క్రియాంత ప్రత్యయాలు వదిలేస్తే మిగిలినదంతా వ్యవహార భాషే. పద్యం స్వేచ్ఛగా సంచరించటానికి వీలు లేదని ఆక్షేపించిన నిర్బంధాలు వారి పద్యాలకేం అడ్డం కాలేదు.
కావ్యభాషలో పలుకుబడిలో, పద బంధాలలో శ్రుతి మాధుర్యంలో నూతన స్థితిని ప్రవేశపెట్టిన రాయప్రోలు సుబ్బారావు పద్యం, సహృదయులకు కొత్త ప్రేయసిలాగా చేరువ అయింది. కృష్ణశాస్త్రి పద్యం మాధుర్య ప్రవాహమై వింత సొగసులు పోయింది. ``శిలలు ద్రవించి యేడ్చినవి శీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురము్మలు'' అన్న కొడాలి సుబ్బారావు పద్యం ప్రాచీన వైభవ శైథిల్యాన్ని రూపుగట్టించింది. నేటితో అస్వతంత్రతా నియతమైన ఈ బ్రతుకు తెల్గువారు భరింపలేరు'' అన్న విశ్వనాథ విషాద గీతం జాతి జనుల గుండెలలో ప్రతిస్వనించింది. త్రిపురనేని సూతపురాణం కొత్తగా పురాణ వ్యతిరేక ధోరణిని పద్యంలో ఆవిష్కరించింది.
ఆ నాళ్లలో నండూరి సుబ్బారావు యెంకిపాటలు జానపద భాషలో రాయటం చేత అవి ఎంత రసవంతాలయినా అకలుష ప్రణయ ప్రకటనాలైనా క్రమంగా అవగాహన పరిమితులలో నుంచి వెలికి పోతున్నాయి. ఆ స్థితి గేయ కావ్యాలైన కిన్నెరసాని పాటలకు శివతాండవానికి పట్టలేదు.
1932 తర్వాత తెలుగు పద్యానికి కాల్పనిక కవిత్వంలోని పరిధులు తొలగిపోయాయి. సౌందరనందం రాకతో ఖండకావ్యం మహాకావ్యమయిపోయింది. ఆధునిక సంవేదనలను నాడు కావ్యాలు ప్రస్ఫుటం చేయగలిగాయి. సౌందరనందం కానీ, రామాయణ కల్పవృక్షం కానీ, శివభారతం కానీ, రాణా ప్రతాపసింహ చరిత్ర గానీ, ఆత్మకథ కానీ, ఆంధ్రపురాణం కానీ పద్యం శక్తి ఎంతటిదో ప్రస్ఫుటం చేశాయి. దాశరథి పద్యం సవ్యసాచి సంధించిన బాణం వలె సామాన్య జనులలోకి దూసుకొని వెళ్లింది. `నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను'.. `మూడు కోటుల నొక్కటే ముడి బిగించి పాడినాడ మహాంధ్ర సౌభాగ్యగీతి'... ``తీగెలను త్రెంపి అగ్గిలో దింపినాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ''.. ``మా నిజాంరాజు జన్మ జన్మాల బూజు'' ఈ విధంగా ఉదహరిస్తే దాశరథి పద్యాలన్నీ ఇందుకు తార్కాణాలే.
`పద్యం ఆధునిక భావాలను చెప్పలేదు' అనే మాట సత్యమేనా? `వాస్తవము్మ నార్లవారి మాట'' అన్న మకుటంతో నార్ల రాసిన పద్యాలు ఆధునికాలు కావా? `పెన్నేటి పాట'లో రాయలసీమ కరువు రైతు జీవితం ఎంతో బలంగా వ్యక్తమైంది అంతెందుకు జాషువా పద్యాలు సమకాలీన పరిమితులలో ఒదుగటం లేదా? రామిరెడ్డి పానశాల పద్యాలు ఈనాటి సంవేదనలకు తార్కాణం కాదా? శ్రీశ్రీ సిరిసిరి మువ్వ పద్యాలు, రుక్కుటేశ్వర శతకం పద్యాలు నేటి భాషను ఇముడ్చుకోవటం లేదా?
ఇంద్రగంటి వారి కీర్తితోరణం, ముదిగొండ వీరభద్రమూర్తి గారి `వందేమాతరం' ఎంతో సరళమైన పద్యాలను ఇముడ్చుకొన్నవి. వందేమాతరంలో భాష, వాతావరణం, సన్నివేశ కల్పన స్వాతంత్య్రోద్యమపు స్ఫూర్తిని ఎంతో బలంగా అనుసంధించాయి. బోయి భీమన్న పద్యాలు ఎంతగా నవంనవంగా ఉన్నవో చదివితే తెలుస్తుంది. అనుముల కృష్ణమూర్తి పద్యాలు గుర్రాలపై స్వారీ వంటివి. బేతవోలు పద్యాలు గోదావరి ప్రవాహం వంటివి.
ఇటీవలి కాలంలో తెలుగు పద్యం వచనానికి అత్యంత సన్నిహితంగా వచ్చింది. విశ్వనాథ మధ్యాక్కరలలో ఈ గుణం విశ్వరూపం దాల్చింది. బాడాల రామయ్య కృష్ణకథా విపంచి, సంపత్‌రాఘవాచార్య విశ్వనాథ విజయం ఉత్తమ శ్రేణి రచనలే. చిటిప్రోలు కృష్ణమూర్తి `పురుషోత్తముడు' ఇటీవలి పద్యకావ్యాలలో మేలైంది.
ఉత్పలవారి `ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు' వర్తమాన నగరాన్ని చిత్రించిన రచన. అమేయమైన పద్యశక్తి దీనిలో ప్రకటితమైంది. జోస్యము విద్యాసాగర్‌ `అమ్మ' కోడూరి విష్ణువర్థన్‌ `ధర్మదండం', విలక్షణమైన రచనలు. `కృష్ణరశ్మి' నుంచి `మణిసేతువు' దాకా నా కావాలు, సంపత్కుమార `ఆముక్త', అనుమాండ్ల భూమయ్య మార్మిక పద్య రచనలు ఇటీవలి ఆధ్యాత్మి రచనలు. ఆచార్య ఫణీంద్ర మాస్కో స్మృతులు ఆధునిక నాగరక శాస్త్రీయతా చేతనను ప్రతిఫలించే రచన. కరణం బాలసుబ్రహ్మణ్య పిళై్ల `ఒక రాఘవ రెడ్డి కథ' పెన్నేటి పాటతో పోటీపడదగిన రచన.
`తెలుగు పద్యమనే దానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అది భూస్వామ్య యుగంలో పుట్టిన ప్రక్రియ. దానికి పౌరాణిక వాసన ఉన్నది. రాచరిక వ్యవస్థ భావజాలపు స్వభావం ఉంది. ప్రజాస్వామ్య స్వభావం లేదు.'(వి. చెంచయ్య, 2004) ఇలాంటి గతానుగతికమైన అభిప్రాయాలను ఖండిస్తూ చేరా అంటున్నాడు. `నిజానికి పద్యం తత్కాలపు అవసరాలకు తగినట్టుగా ఎపుడూ మారుతూనే ఉంది.'
ఈ కాలపు అవసరాలకు తగినట్లుగా మారిపోతున్న తెలుగు పద్యం 20వ శతాబ్దంలో నూతన రూపాన్ని సంతరించుకున్నది. నూతన భావ ప్రకటనకు యోగ్యంగా పరిణమించింది. అబ్బూరి రామకృష్ణరావు ఏ ఛందోగతీ లేని వచన పద్యాన్ని కవిత్వ యోగ్యంగా ఆమోదించేవారు కారు.
గడచిన పాతిక సంవత్సరాలుగా అవధానాలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. జనం వేలాదిగా వీటిల్లో పాల్గొంటున్నారు. ఆనందిస్తున్నారు. వీటివల్ల పద్యం అభినవంగా, తరుణంగా నిలిచి ఉంటున్నది.

Wednesday, July 29, 2009

లోకమ్ము వీడి రసమ్ము లేదు

సాహిత్యం అనుభవ సముద్రం. ఈ అనుభవానికి ఏ ఎల్లలూ ఏ కార నియతీ ఉండదు. మానవుడి సర్వ అనుభవాలు, సర్వ జీవన పార్శా్వలు అది ప్రతిఫలిస్తుంది. వివిధ ప్రక్రియలు, సాహిత్య రూపాలు అభివ్యక్తి వైవిధ్యాన్ని బట్టి పాఠకుల వైవిధ్యాన్ని బట్టి కాల ప్రభావాన్ని బట్టి వేరువేరుగా ఏర్పడుతూ ఉన్నవి. ప్రక్రియల భేదం తప్ప, అభివ్యక్తి వైవిధ్యం తప్ప సాహిత్య స్వస్వరూపంలో ఆత్మగా నిలిచి ఉండేది రసమే. ఈ రసం లోకంలోనుంచి కావ్యం లోనికి ప్రసరిస్తుంది.
`లోకము్మ వీడి రసము్మ లేదు' అంటే లోకమే రసమని తాత్పర్యం. లోకంలోనుండి కావ్య ప్రపంచంలోనికి ప్రవహించిన శబ్దం, దేశ కాలాల పరిమితులను ఛేదించుకొని సార్వజనీనంగా, సార్వకాలికంగా రూపొందింది. రసముగా పరిణమిస్తుంది. పాఠకుని అనుభవానికి చేరువగా చేరేందుకు రసము అతని ఎరుకలో ఉన్న స్వస్థాన వేష భాషాది మతములను ప్రకటిస్తూ అభివ్యక్తమవుతుంది.
ఈ వైవిధ్యాలను గుర్తించకుండా ఇటీవలి కాలంలో సాహిత్యాన్ని వైరుధ్యాల పుట్టగా, పరస్పరం సంఘర్షించుకొనే యుద్ధ శ్రేణులుగా వ్యాఖ్యానించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం సుమారుగా అరవై సంవత్సరాల నుంచి సాగుతూ, సాగుతూ ఇప్పుడు దాని పరమ వికృత రూపం ప్రకటిస్తున్నది.
నన్నెచోడుడు `మును మార్గకవిత లోకంబున వెలయక, దేశి కవిత పుట్టించి తెలుంగున నిలిపిరి చాళుక్య రాజు మొదలగు పలువురు' అన్నప్పుడు మార్గదేశి భేదములు మొదటిసారి ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన మొదట సంగీత శాస్త్రానికి చెందింది. ఆ తరువాత సాహిత్యంలోకి వచ్చింది. ఇక్కడ మార్గ కవిత్వం సంస్కృత కవిత్వమై నన్నయాదుల కవిత దేశి కవిత అయింది. తరువాత కొంచెం కాలం గడిచేసరికి మన అంచనాలు మారిపోయి నన్నయాదుల కవిత మార్గమై, పాల్కురికి సోమన మొదలైన వారి కవిత దేశి అయింది. పురాణ ఇతిహాస సంప్రదాయాలు, ఆ రూపాలు మొదటి వర్గం కాగా, దానికి భిన్నమైన ద్విపదాది రచనలు దేశి కవిత అయింది. ఈ విభజన మరి కొంత కాలానికి మరొక రకంగా ప్రస్తావించడం జరుగుతుంది. ఉదాహరణ కావ్యాలు.. దేశి లక్షణాలైన, గానయోగ్యాలైన రగడలు అధికంగా ఉన్నా దేశి కవితలుగా చెప్పబడటం లేదు. శతకాలు ఆత్మాశ్రయాలై, సమాజ వస్తువులు ప్రకటించేవి అయినా, అక్షర ఛందస్సుల్లో ఉండటం వల్ల దేశి కవితలుగా ప్రముఖంగా ప్రస్తావనకు నోచుకోవడం లేదు. మార్గకవిత్వం పండితైకవేద్యమని, దేశి కవిత్వం ప్రజాబాహుళ్యాన్ని ఉద్దేశింపబడిందని ప్రచారం జరుగుతోంది. పండితారాధ్యచరిత్రలో పాండిత్య వివాదాలు, అన్నమయ్య శృంగార మంజరిలో ప్రబంధ లక్షణాలు పామరులకు అందుబాటులోకి వచ్చేవి కావు.
ఈ విభాగం కొంచెం ముందుకు పోయి మౌఖిక, లిఖిత సంప్రదాయాలుగా విభజించడం జరిగింది. లిఖిత సంప్రదాయం అనేసరికి ద్విపదాది కావ్యాలు కూడా దాంట్లో చేరిపోతవి. అప్పుడు జానపద సాహిత్యం, అన్నమయ్య సంకీర్తనలు, సారంగపాణి, క్షేత్రయ్య వంటివారి సాహిత్యం, ఈ విభాగంలోకి వస్తాయి. రాగిరేకుల మీద రాయబడటం వల్ల అన్నమయ్య సాహిత్యాన్ని లిఖిత సాహిత్యం అంటారేమో నాకు తెలియదు. కానీ, అన్నమయ్య సాహిత్యంలో జానపదాంశాలు, ఆ రూపాలు ఎంత విరివిగ ఉన్నవో, ఉపనిషత్తులలోనూ, తత్త్వరహస్యాలు, దై్వతాదై్వత సిద్ధాంతాల విభేదాలు, మార్మిక సంకేతాలు ఎన్నో విరివిగా కనిపిస్తాయి. కొన్ని సంకీర్తనల వివరణలు, సూత్రభాష్యాదుల పాండిత్యం లేకుండా అర్థం కాదు. అట్లాగే త్యాగయ్య రచనల్లో ఉండే తాత్తి్వకాంశాలు, క్షేత్రయ్య రచనల్లో ఉండే రస, నాట్యశాస్త్ర విశేషాలు కేవలం పామరుల కోసం ఉద్దేశింపబడినట్లు కాదు.
పాల్కురికి సోమన కానీ, అన్నమయ్య కానీ, పల్నాటి వీరచరిత్రను రచించిన శ్రీనాథుడు కానీ, రంగనాథ రామాయణ కర్తకానీ, పండితులు కారనడానికి వీల్లేదు. వీరిలో కొందరు అటు పండితాదరణీయాలని చెప్పబడుతున్న కావ్యాలు, ప్రబంధాలు రచించడం ఒకవైపు, మరొక వైపు జానపద లక్షణాలు కల దేశి రచనలు రచించడం మరొకవైపు జరిగింది. ఒక పరిశీలన చేసి చూస్తే, తాత్తి్వకంగా సాహిత్య రచయిత వస్తువును బట్టి తను పెంచుకున్న శ్రోతృ సమూహాన్ని బట్టి ప్రక్రియను నిర్ణయించుకుంటున్నాడు తప్ప సహజంగానే ఈ సాహిత్య సృష్టిలో భేదబుద్ధి లేదు. జానపద సాహిత్యాన్ని సేకరించిన తొలిరోజుల్లో దానికి ప్రాచుర్యం కల్పించడానికి ఆదరణ లభించడానికి కొన్ని `అర్థవాద వాక్యాలు' చెప్పడం అవసరమే కావచ్చు కానీ, అవి ప్రామాణికాలని చెప్పడానికి వీల్లేదు. చింతా దీక్షితులు గారు, నేదునూరి గంగాధరం గారు, బిరుదురాజు రామరాజు గారు మొదలైన వారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి ధోరణి వివరణలలో చెప్పి ఉండవచ్చు. అనాదృత వాఙ్మయం, ప్రజావాఙ్మయం వంటి మాటలు వాడి ఉండవచ్చు. కానీ, ఏదీ నిశ్చితమైన అభిప్రాయం కాదనుకోవాలి. పోతన భాగవతంలో`కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు మఱియున్‌ కొందరకు రెండు గుణమగు అందర మెప్పింతునేను అయ్యెయెడలన్‌' అన్న చోట నాటికీ ప్రచారంలోకి వస్తున్న ఈ భేదభావాన్ని అన్వయించే లక్షణం కన్పిస్తుంది. ఈ ఉభయ సాహిత్య మైత్రి ఆయన రచనను తెలుగువాళ్లకు అత్యంత ఆదరణీయంగా రూపొందింపజేసింది. భాగవత పద్యాలు ఏ సాహిత్య ప్రక్రియల అత్యంత ప్రాచుర్యం పొందిన అంశం అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పాండవోద్యోగ విజయ పద్యాలు అత్యంత జనాదరణ పొందడానికి వాటి అక్షర ఛందోరూపం అడ్డం రాలేదు.
ఎరిగియో ఎరుగకయో అభిమానం చేత రాబోయే పరిణామాలను గూర్చిన అంచనా సరిగా లేకపోవడం వల్ల కల్పించిన ఈ భేదభావాలు సాహిత్యాన్ని నిలువుగా చీల్చడం ఈనాడు పరిదృశ్యమానమవుతున్నది. ఈ భేద కల్పనలో ప్రజాకవులు, అప్రజాకవులనీ సంస్థాన కవులు సంస్థానేతర కవులనీ, ఉన్నత వర్గాల, దళిత వర్గాల కవులనీ, విభజించడం కానవస్తుంది. తేనె, కలకండ, మామిడిపండ్ల రసం మొదలైనవి ఆయా ఉత్పత్తి మూలాలను బట్టి భిన్నంగా కన్పించవచ్చు కానీ, తాత్పర్యతః అవన్నీ మాధుర్యమనే లక్షణం చేత ఒక్కటే అవుతున్నవి. అలాగే రసలక్షణం చేత సాహిత్యాన్ని ఏకరూపంగానే దర్శించవలసి ఉంటుంది.

Tuesday, July 28, 2009

సాహిత్య పరిణామంలో కులము - కులాంతరాలు-మతాలు

`నన్నయ్య కవి పెట్టినాడు గదా తిక్కనాది కవీంద్రుల కాది భిక్ష' అన్న తిరుపతి వెంకట కవుల పద్యం వెనుక, సాహిత్య చరిత్రలో పరిణామంలో నన్నయ్య ప్రాధమ్యాన్నీ, ప్రాధాన్యాన్నీ స్థాపించుటకు కాకుండా నాటికి విజృంభించి ఉన్న వైదికి నియోగి శాఖా భేదాల అంశంకూడా ఉన్నది. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాని, లుద్ధావధాని, గుంటూరు శాస్త్రి మొదలైన పాత్రల ద్వారా వైదికులను వెక్కిరించటం, తక్కువ పరచటం ఉందని భావించే అవకాశం ఉన్నది. వీరేశలింగం నాటికి సాహిత్యరంగం అంతా నియోగి ప్రాధాన్యం ఉండటం, తిక్కనకు అగ్రాసనాధిపత్యం ఇవ్వటం, నాచన సోముని ప్రశంసించే సందర్భంలో నన్నయ, ఎఱ్ఱనకంటే అతనిని అధికునిగా భావించటం ఇవన్నీ ఈ శాఖా భేదాల పరిణామాలే.
అంతకు పూర్వం సి.పి.బ్రౌన్‌ వేమన పద్యాలను ఆకాశానికెత్తటం వెనుక ఉన్న రాజకీయం ఇంతకంటే మించింది. వేమన పద్యాలలో విగ్రహారాధనాదికాలైన `హిందువుల ఆచార వ్యవహారాలను పరిహసించటం, నిరసించటం వెనుక ఆతని అచల యోగ సంప్రదాయము, అవధూత లక్షణాలు ఉన్నాయిగాని, వాటి వెంట ఆత్యంతికమైన వ్యతిరేకత లేదు. ఈ సంప్రదాయ వైవిధ్యంలోని ఆభాస వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక బ్రౌను వేమన రచనను క్రైస్తవ దృష్టిలో చూచి ఆయన సాహిత్యాన్ని సర్వేతరాంధ్ర సాహిత్యానికన్నా అధికంగా భావించటం జరిగింది. ఈ ప్రకటంగా కనిపించే ఆచార వ్యవహార నిరసన మాత్రం ప్రధానంగా భావించి- అతని యోగాన్ని దివ్య జీవన సాధనకు ఉపేక్షించి విమర్శకులు `ఉపరిశోధనలు' చేస్తూ వచ్చారు.తెలుగు సాహిత్యంలో వైదికి నియోగి భేదాలు 1910 తరువాత ఎక్కువగా విజృంభించాయి. తిరుపతి వెంకటకవులు కొప్పరపు కవుల విభేదాలు అనేక కవిత్వ వివాదాలకు కారణాలయ్యాయి, నన్నయ్య భట్టుకు తిక్కనతో సమానమైన- అధికంగా కాకపోయినా స్థానం లభించటానికి తరువాత కనీసం నలభై యేళ్లయినా పట్టింది.సుమారుగా ఈ ప్రాంతంలోనే జస్టిస్‌ పార్టీ ఉద్భవించింది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు పెచ్చరిల్లాయి. గుంటూరు ప్రాంతంలో త్రిపురనేని వారు దీనికి నాయకత్వం వహించారు. నెల్లూరు ప్రాంతాలలో రెడ్లు ఈ ఉద్యమానికి నాయకులయ్యారు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి ఉద్గమ స్థానం మదరాసు కావటంవలన నెల్లూరు అక్కడికి సమీపంలో ఉండటం వలన, అంతకు పూర్వమే గ్రామంమీద పెత్తనం ఉండటంవలన రెడ్లు రాజకీయాలలో మొదట అధికారంలోకి వచ్చారు.
గుంటూరు ప్రాంతంలోని రైతులుగా ఉన్న కమ్మవారు క్రమంగా సాహిత్యరంగంలోకి, పత్రికారంగంలోకి, వ్యాపార రంగాలలోకి వచ్చి బలపడ్డారు.ఈ సంధిలో పుట్టిన `కవిత్వ తత్త్వవిచారం' అలంకార శాస్త్ర మర్యాదలను పునాదులు కూలగొట్టి వస్తు ప్రాథమ్యానికి పట్టం కట్టింది. మహా కావ్యాల చట్రాన్ని తిరస్కరించింది. అభివ్యక్తి వైచిత్రిని కాదన్నది.అప్పటికే ప్రతిష్ఠితమైన కావ్య సంప్రదాయాలను కాదని నూతన సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఔపదేశికతను - అనగా వస్తువునకు పురస్కృతి కలిగింది. తమిళదేశంలో తిరువళు్ళవర్‌కు పట్టంకట్టిన విధంగానే నీతి బోధనకతకు, సామాజిక వ్యాఖ్యకు, కుల భేదాల నిరాకరణకు, అస్పృశ్యతను కాదనటానికి ముఖ్యత వచ్చింది. సరిగ్గా ఇదే కాలంలో ఈ అంశాలలో అధికాంశాలకు ప్రాధాన్యమిచ్చిన గాంధీ నాయకత్వం దేశంలో స్థిరపడింది.కుల భేదాల నిరాకరణం వెనుక కులాల ఆలసత్వమును ప్రకటించుకోవటం ముఖ్యాంశమే అయింది. యోగిగా, జ్ఞానిగా పరిగణింపబడిన వేమన వేమారెడ్డి - `మహాకవి' అయినాడు గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణకర్తగా నిరూపించబడ్డాడు. రాళ్లపల్లివారి వేమన ఉపన్యాసాల సందర్భంలో, రంగనాథ రామాయణం ప్రచురణ సందర్భంలో కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా ఉండటం అవిస్మరణీయమైన అంశం. ఈ కాలంలోనే మొల్ల రామాయణం ప్రశస్తి పెరిగింది. నన్నెచోడుడు, శ్రీకృష్ణదేవరాయల వంటి రాజకవులకు ప్రాధాన్యం కలిగింది.జాతీయోద్యమానికి వ్యతిరేకంగా కొనసాగిన సామ్యవాదోద్యమం భారత జాతీయతను ఏక దేశ భావనను కాదన్నది. క్విట్టిండియా ఉద్యమాన్ని త్రోసిపుచ్చింది. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని బలపరచిన దానిని స్తోత్రం చేసిన కందుకూరినీ, గురజాడనూ, ప్రాచీన సాహిత్యంతో సంబంధం తెలియకుండానే త్రెంచే ప్రయత్నం చేసిన వ్యావహారిక వాది గిడుగు రామమూర్తినీ, ఆధునికాంధ్ర మహాపురుషులుగా గుర్తించి ప్రచారం చేసింది. కాశీనాథుని నాగేశ్వరరావునూ, కొమర్రాజు లక్ష్మణరావునూ ఎప్పుడూ అలా ప్రశంసించలేదు.సామ్యవాదోద్యమంలో జస్టిస్‌ పార్టీవారి వ్యతిరేకాంశాలు ప్రథమంగా చోటు చేసుకున్నవి. స్వాతంత్య్రోద్యమ భావన గర్భితంగా ఉన్న `ప్రతాప రుద్రీయం' వారి ప్రశంసలకు ఎప్పుడూ స్థానం లేదు. వీరి సాహిత్య పార్శ్వం అరసం `ప్రాచీన సాహిత్యమంతా జన సామాన్యానికి ద్రోహం చేసింది' అన్న మూల సూత్రంతో ఉద్యమం ప్రారంభించింది. రామలింగారెడ్డి ప్రారంభం చేసిన వస్తుప్రాధమ్యం. క్రమంగా వస్తువే సాహిత్యమన్న పారమ్య స్థితికి చేరుకున్నది. కాల్పనిక కవిత్వంలోని దేశభక్తి ప్రణయం ఆదిగా పార్శా్వలు దూషితాలయినాయి.
ఈ నడుమ హిందూ భావనకు, విశ్వాసాలకు వ్యతిరేకంగా క్షతికలిగే విధంగా పురాణ, ఇతిహాస ఘట్టాలకు అపవ్యాఖ్య చేయటం ప్రారంభం అయింది. చలం, ముద్దుకృష్ణ, నార్లవంటి వారు ఈ మార్గంలోని వారు.నార్ల కమూ్యనిస్టు వ్యతిరేకిగా కనిపించినా లోతుగా ఎన్నో వ్యతిరేకతలు ఆయన రచనలలో ఉండేవి. ఆయన పత్రికా నిర్వహణలో కొందరు రచయితల ప్రసక్తి నిషిద్ధమై ఉండేది. అంతగా `భావ స్వేచ్ఛ'ను ఆదరించిన వ్యక్తి ఆయన. ఆయన పత్రికలో `చలం - విశ్వనాథ - శ్రీశ్రీల ప్రసక్తి నిషిద్ధం. ఈ అంశం పరిశీలించినప్పుడు ఆయన నిషేధం విధించటంలోని తాత్తి్వక మూలాలు బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం దాకా కొనసాగవలసి ఉంటుంది.ఇన్ని ఇబ్బందులలోనూ ఏ ఇబ్బందికీ పట్టుబడకుండా ఏ స్థిరబిందువుమీదా నిలువకుండా కాలానుగుణంగా కదిలిపోయిన వ్యక్తి కృష్ణశాస్త్రి అనిపిస్తుంది. కాల్పనికోద్యమంలో మూలవిరాటై్ట, అభ్యుదయ కవిత్యోద్యపు `పతాకై' మతం వద్దు, గతం వద్దు మారణహోమం వద్దు అంటూ లౌకికవాదై, `రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం' అంటూ భక్తివాదియై ప్రవర్తించాడు.నార్ల వ్యతిరేక దృక్పథం వల్ల తెలుగు వాళ్లకు రావలసిన జ్ఞానపీఠ ప్రథమ పురస్కారం రాకుండా పోయింది.1956-57లలో హైదరాబాద్‌లో తెలంగాణా రచయిత సంఘం వార్షికోత్సవాలు జరిగాయి. ఆ వేదిక మీద నుంచి విశ్వనాథ అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఆ భావనతో కార్యాచరణకు పూనుకుని ఆ పరిషత్తు ఏర్పరచేందుకు ఒక సన్నాహక సమావేశం హైదరాబాదులో జరిగింది. దీని ఆధిపత్యం తనకు అనుకూలం కానీ వారికి లభించవచ్చునన్న ఊహతో నార్ల, అబ్బూరిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి కొద్ది రోజులలోనే ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీని ఏర్పడేట్లు చేశారు.అయితే కొన్నేళ్ల తరువాత అకాడమీల రద్దుకు ఆయన కారణమయ్యారు.
ప్రాంతీయవాదంవైపు వస్తే తొలి రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాల కవి మండలి సాహితీ సమితిగా సాహిత్యాన్ని ఆవరించింది. తరువాతి కాలంలో ఉత్తరాంధ్ర రచయితలకు ప్రముఖమైన లాబీగా అవతరించింది. తెలంగాణా ప్రాంతంలోగానీ, రాయలసీమలోగానీ ఇలాంటి ప్రబలమైన రచయితల పరస్పర ప్రచారక మండలి ఏర్పడలేదు.మన లౌకికవాద వామపక్ష రచయితలకు మైనారిటీ మతమంటే ఎంతో ముద్దు. గజనీనుంచి కాశీం రజ్వీదాకా వెయ్యేండ్లు విధ్వంసం చేయబడ్డ దేశం. మనుష్యుల మీద ప్రకటించిన క్రౌర్యం, బాగా సంస్కృతుల అణచివేత ఈ కవులకు వస్తువు కాలేకపోయింది. గోద్రా రైలు దహనం వంటి అమానుష చర్య కలిగించిన పరిణామాలు మాత్రమే వస్తువులయి కవులు గుజరాత్‌ గాయం పేర `ఏకాహా'లు నిర్వహించారు. బాబ్రీ సంఘటనను నిరసించే ఈ కవి సమూహం తరువాత విధ్వంసమైన కాశ్మీరులోని ముప్పయి నలభయి దేవాలయాల సంగతి పట్టించుకోలేక పోయారు. మార్కి్సస్టుల ఎజెండాలో ఇటీవల స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదం వస్తువులు కావటం- వారి అనుబంధ సంస్థలు ఈ అంశాలకు ప్రచారం ఇవ్వటం ఆత్యంతికంగా ఈ దేశం `హిందూత్వ'ను నిర్మూలించే లక్ష్యమనేది స్పష్టం అవుతుంది. మనకు ఈ ఆపదనుంచి ఎవరూ రక్షించగలరు?