Thursday, July 2, 2009

ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 4

శేషేంద్ర ఆధునిక కావ్యభాషను సృష్టించటం ఒక అంశం అయితే అంతకన్నా ప్రబలమైన అంశం ఆధునిక వచన కావ్య రీతిలో మహాకావ్య నిర్మాణం చేయటం. ప్రాచీన మహాకావ్యాలకు కథాంశం మూలసూత్రం. మానుష కథ ఆధారంగా చేసిన నిర్మాణం కావటంవలన విభావాదులకు బలం సమకూడి జీవన వేదనల సమీకరణం ద్వారా ఒక విశిష్టమైన అనుభవ విశేషం దానికి చేరువయ్యింది. ప్రాచీన కాలంనుంచీ భారతీయ సాహిత్యం ఈ సమీకరణం ఆధారంగా రససిద్ధాంతాన్ని నిర్మించుకొన్నది.
ఆధునికకవి వలె ప్రాచీనకవి అంతగా అంతర్ముఖుడు కాడు. తన సంవేదనలను కావ్యపాత్రల ముఖంలో వ్యక్తంచేయగల నిడివీ పొడవూగల వస్తు జగత్తుగలవాడు. కథా ప్రధానంగా కావ్యనిర్మాణం చేయవలెననే ఆలోచన అరవైల తొలిరోజులల్లోనే కుందుర్తి ప్రభృతులు చేయటం (ఈ వ్యాసకర్తకూడా ఆ భావాన్నే అప్పుడు బలపరచటం జరిగింది). దాన్ని తిలక్‌ ప్రభృతులు వ్యతిరేకించటమూ జరిగింది. ప్రాచీనకావ్యం సమష్టి ప్రక్రియ. దానిలోనే కథ ఉంది. వర్ణన ఉంది. ఉపదేశం ఉంది. చమత్కారం ఉంది. నాటకీయ రీతి ఉంది. ఆధునిక కాలంలో నాకం స్వతంత్రించి ముందుకు రావటం కథనంకోసం ప్రత్యేకంగా నవల, కథ ప్రక్రియలు పుట్టుకు రావటం జరిగింది. వర్ణనలు ఖండకావ్యాలలోకి జారిపోయాయి. ఈనాడు కావ్యం మిగిలితే ఖండ కావ్యంగానే ఉండిపోయింది. ఈ సంకుల సన్నివేశంలో కవులు ఈనాటి కావ్యం పద్దెనిమిది పుటలే/ పంక్తులే అనే దశకు చేరుకున్నారు.
విస్తృతమైన సామాజిక సంవేదనను, విశ్వసంవేదన వెల్లడించేందుకు కవిత్వం సాధనం కాలేక పోయింది. వచనంలో మాలపల్లి, వేయిపడగలు ఆధునిక ఇతిహాసాలై ఏకవీర, చివరకు మిగిలేది వంటివి ఆధునిక కావ్యాలైనై. హిందీలో కామాయని ఒక త్రోవచూపింది. సుమిత్రానందన్‌పంత్‌ లోకాయత్‌ ఇంకా విస్తృత భూమికలో మహాకావ్య నిర్మాణానికి ప్రయత్నం చేసింది. నారాయణరెడ్డి కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలు ప్రాచీన కథా కావ్యాల నేటి పద్ధతి కొనసాగింపై నవ్య సంప్రదాయ మార్గంలోకి చేరిపోయినయ్‌. సుమనశ్రీ `నేత్రం నా సంకేతం' పీఠికలో నిఖిలేశ్వర్‌ `పదిదృశ్యాల కవితా సంపుటిని నేను కావ్యంగా ఆమోదించలేక పోతున్నాను' అంటాడు. కావ్యం ఖండకావ్యం కన్నా విశిష్టమైన ఏకాత్మభావం కలిగిన రచనా విశేషమన్న భావం అందరిలోనూ ఉన్నది.
పెన్నా శివరామకృష్ణ రచించిన `జీవనది' పీఠికలో సంపత్కుమారాచార్య ఇలా అంటున్నాడు. `ఏ కావ్య నిర్మాణమైనా కథ ఉన్నా లేకపోయినా సరే కావ్యపరమార్థ దృష్టా్య సాగుతుంది. భారతీయాలంకారికుడయిన దండి `కావ్యం కవే రభిప్రాయః' (కావ్యమంటే కవి ెుుక్క అభిప్రాయం) అన్నాడు. కావ్యం ద్వారా కవి పాఠకుడికి వ్యక్తం చేయదలచుకొన్న అభిప్రాయం అర్థంెుుక్క వివర్త రూపమే కావ్యం'.
శేషేంద్ర `మండే సూర్యుడు' వెనువెంటనే వచ్చిన మహాకావ్యం' `నా దేశం నా ప్రజలు'. ఒక రామాయణంవలె మహాభారతంవలె అతి దీర్ఘమైన కావ్య శరీరం ఆద్యంతం అనుభవించి తన చైతన్యంలో సంలీనం చేసుకునే వ్యవధి తక్కువ కావటంవల్ల ఈనాటి కావ్యాలు సంక్షిప్తరూపంలో ఉండటం లక్షణం అన్నది ఒక విధమైన సమర్థన మాత్రమే అవుతుంది. పాశ్చాత్య దేశాలలోను మనదేశంలోనూ నవలలు వేయిపేజీలను మించిన పరిణామంలో వెలువడటం వాటిని ప్రజలు అంగీకరించటం మనకు తెలియని అంశమేమీకాదు. అయితే ప్రాచీన కావ్యంలోని కథాంశం తొలగిపోయిన ఆధునిక కావ్యం/ఇతిహాసం లఘురూపాన్ని పొందటం విస్మయపరచే అంశమేమీకాదు. ఇందుకు ప్రధానకారణం ఇతివృత్తరాహిత్యం.
అందువల్ల ఆధునిక మహాకావ్యాలకు నాయకుడు నామరూపములు కలిగి ఒకానొక దేశకాలాలకో బద్ధుడైనవాడు కాదు. తననుతాను విశ్వీకరించుకొన్న కవియే ఈ కావ్యాలలో వక్త. తానే నాయకుడు. కావ్యంలోని ప్రతీ అంశంతో తాదాత్మ్యం చెందగలవాడు. `నా దేశం నా ప్రజలు' ఆవిధంగా భారత కర్షక నాయకమైన దేశీయ చైతన్యం రూపుకట్టిన కావ్యం. ఇది ఎనిమిది సర్గల కావ్యం. `నిజానికి ఒకటో సర్గలోని పథకమే రకరకాలుగా పునరావృతమై విస్తృతమౌతుంది మిగతాసర్గల్లో. ఇది కావ్యంలో లయ' అన్నారు ఆర్‌.ఎస్‌.సుదర్శనం (యుగకవి శేషేంద్ర 1976 పే.9)
`నా దేశం నా ప్రజలు' తెలుగు కవిత్వరంగంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. నారాయణరెడ్డి `విశ్వంభర' ఈ మథనంలోనుంచి వెలువడిన మరొక ఇతిహాస కావ్యం. భూమితోనే ప్రారంభమయిన తన జిజ్ఞాస వేయిరేకుల పద్మమై విచ్చుకొన్నది ఈ కావ్యంలో. ఈ కావ్యం అంతా మానవుడు తన సుదీర్ఘ చరిత్రలో చేసిన మహాప్రస్థానం చిత్రించింది. శేషేంద్ర కావ్యంలో మానవుని జీవన సంవేదన మూలం కాగా విశ్వంభరలో మానవుని జిజ్ఞాస మూలమైంది. `నా దేశం నా ప్రజలు'కు ఇలియట్‌ `ది వేస్టులాండ్‌.' ప్రేరణయిస్తే విశ్వంభరకు జయశంకర్‌ప్రసాద్‌ `కామాయని' దారిచూపింది.
పెన్నా శివరామకృష్ణ `జీవనది' మహాకావ్య నిర్మాణంలో మరొక సఫల ప్రయత్నం. ఈ కావ్యం `ద్వాసుపర్ణా' అన్న శ్రుతిని ప్రతీకగా చేసుకొని ప్రారంభమయింది. భారతీయ జీవన పురుషార్థ సాధక దృష్టి ప్రధానంగా ఈ కావ్యం కొనసాగి ఈ దేశ సంస్కృతి కేంద్రంగా చేసుకొని విశ్వజనీనంగా ఎదిగింది. ఈ కావ్యంలో వర్తమానంలోని `కుహనా లౌకికవాదం' ఎంత నష్టం కలుగచేసిందో వివరిస్తున్నాడు కవి
మా సహనమే మమ్మల్ని కాటేసింది
మా సౌభ్రాతృత్వమే దేశాన్ని అవమానాలపాలు చేసింది
మా శత్రువు లెవరెవరిని ఎంతగా ప్రేమిస్తున్నా వన్నదే కాదు
మా శత్రువుల విజయాని కెంత సంబర పడుతున్నావన్నదీ
నీ దేశభక్తికి కొలమానమే
మరొకచోట కవి కవిలక్షణాన్ని వివరిస్తూ `అనుభవాన్ని ప్రేమించని వాడికి/అశ్రువు విలువ తెలీదు/ప్రపంచాన్ని ప్రేమించనివాడు కవి కాలేడు' అంటున్నాడు. ఈ ప్రేమ ఆధారమైన కవి హృదయం ఈ కావ్యాన్ని విశ్వజనీనం చేసింది.
`నాదేశం నా ప్రజలు' నుంచీ వెలువడుతున్న ఆధునిక మహాకావ్యాలను నిర్వచించే ప్రయత్నం చేరా చేశారు. `ఒక ప్రధాన వస్తువుతో, ఒక తాత్తి్వక చింతనతో, సందేశంతో, అనేక భావాలతో, ళీళిళిఖిరీతో, కథ లేకుండా, అర్బేనిటీ అనే లక్షణం కలిగివుండి, తగినంత విస్తారంగా ఉన్న దీర్ఘ కవితను ఆధునిక మహాకావ్యం అంటున్నాను. (కొయ్యగుర్రంపీఠిక) కథా రాహిత్యమును ఒక స్పష్టమైన లక్షణంగా పేర్కొని చేరా ఆధునిక మహాకావ్య స్వరూపాన్ని నిర్ణయించటం జరిగింది. మిగతా లక్షణాలు ఏ మహాకావ్యానికైనా అన్వయించేవే.
వచన కవిత్వరూపం క్రమంగా వికసిస్తూ మహాకావ్యంగా, ఇతిహాసంగా వృద్ధిపొందటం మనం గమనించదగిన ప్రధానాంశం. క్రమంగా రూపం మీద శ్రద్ధకన్నా అభివ్యక్తి వస్తువిన్యాసము ఈ క్రమంలో ప్రాథమ్యం వహించాయి.
1987లో సుప్రసన్న ఒక ఆధునిక మహాకావ్యాన్ని `శతాంకుర' రూపంలో ప్రకటించడం జరిగింది. `కావ్యంలో ఏ కవిత కా కవిత ప్రత్యేకంగా ఆత్మాశ్రయ ధోరణిలో వచన చ్ఛందస్సులో ఖండ కావ్యరూపంగా వ్యక్తీకరించబడింది. కాని ప్రధానాంశం జగజ్జీవన చిత్రణ, కాలస్వరూప విశ్లేషణ, అనంతత్వోపాసన, సృష్టిమూలగవేషణ, త్రివిధ భూమికలలోని దైవాసుర సంఘర్షణ మొదలైన ఐతిహాసిక కావ్య లక్షణాలు, సృజన భూమికల అన్వేషణ, సౌందర్యంతో మమేకత్వం, ప్రేమ దుఃఖంవంటి సుకుమార లలిత భావ వ్యక్తీకరణ మొదలైన కాల్పనిక కావ్య లక్షణాలన్నీ శతాంకురలో గాఢమైన అనుభవ లోకాలను ఆవిష్కరిస్తాయి `(కె.వి.యన్‌. రాఘవన్‌, అభినవ భారతి పే.300) ఏకసూత్రంలో గ్రథితమైన మణిహారం వంటి ఈ కావ్యం తాత్తి్వక కావ్య ధోరణి వికాసానికి బాటవేసింది.
సుప్రసన్న ఇటీవల వెలువరించిన మరొక ముఖ్యమైన మహాకావ్యం సాంపరాయం (2002). ఈ అనంతేతిహాసం (జూచీరిబీ ళితీ శినీలి జూశిలిజీదీరిశిగి) ప్రస్తావనలో రచయిత వ్రాసుకొన్న మాటలివి `సాంపరాయంలో సృష్టా్యరంభంనుంచీ భావి దుఃఖరహిత జగన్నిర్మాణం దాకా గతాగతాలు వర్తమానంలోనికి వచ్చి ముడి వేసుకొన్నాయి. సర్గవిస్తరణలోనికి ప్రసవవేదన భౌతిక ప్రాణిక చైత్త్యస్తరాలలోని సంక్లిష్టత అంతరంగ చైతన్యం దుఃఖ విముక్తికోసం చేసే తపస్సు దీనిలో ఇతివృత్తాలైనవి.
`వస్తు విన్యాసంలో ఏ సరిహద్దులూ లేవు. నాలోనుంచి అమూర్తమైన జీవన పరంపర `పికాసో' చిత్ర సంపుటిగా అభివ్యక్తమై తన ఆంతర్యాన్ని వ్యాఖ్యానించింది. బిందువునుండి మండలం దాకా పరిణామం చెందే క్రమంలో విశ్వవికాసంలోని అన్ని ఘట్టాలనూ, సభ్యతల విస్ఫోటనాన్ని, జీవనంలోని పరిమితులను స్వప్నసంకలనాలలోని సామరస్యాన్ని విశదం చేసింది.
`ఆనంత్యం' రూపుగట్టుకొని వచ్చిమృత్యుకవాటాన్ని వివృతంచేసే ప్రయత్నంలో ఈ కావ్యప్రపంచం ఇతిహాసమై అవ్యక్త శిలాగర్భంలోనుంచి ఆవిష్కృతమైనది. వేదోపనిషత్తులూ, జానపదపురాగాథలూ ఆదిమ ప్రాగ్రూపాలూ తామై కావ్యద్రవ్య సముద్రంలోనికి ప్రవహించాయి. ఈ మెటామార్ఫసిస్‌లో ముడిసరుకుగా ఉన్న సంస్కారాలూ, భావనలూ, బింబాలూ, కల్పనలూ, అన్నీ అనుభవజగత్తులోనికి ఒకానొక అపూర్వ పరిమళాలను మోసుకు వచ్చాయి', (ప్రస్తావన).
పన్నెండాశ్వాసాల ఈ ఇతిహాసం చివరి మూడుసర్గలలో ఉపనిషత్కథలూ, బౌద్ధగాథలూ సంలీనమయినాయి. కథా రాహిత్యమన్న లక్షణానికి ఇది కొంతవరకు అపవాదం వంటి సన్నివేశం. సాహిత్య విమర్శ ధోరణిలో మహాకావ్యం, ఇతిహాసం ఈ రెండు శబ్దాలు పైన పేర్కొన్న కావ్యాల సందర్భంలో అనిశ్చితంగానే వాడబడుతున్నాయి. `నగ్నముని' కొయ్యగుర్రాన్ని మహాకావ్యమన్న చేరా నిశ్చయమూ వివాదరహితం కాలేదు.
5
మొత్తంమీద తెలుగు కవిత్వం ఇంచుమించుగా ఈ మూడు దశాబ్దాలలో విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే ప్రధాన దృశ్యాలు ఇవి.
సెవెన్‌స్టార్‌ సిండికేట్‌వారి అభ్యుదయ సాహిత్య సదస్సు (1970) నాటికి `అరసం' ప్రగతివాద కవిత్వానికి మార్కి్సజం తప్పనిసరి కానక్కరలేదని స్పష్టంగా ప్రకటించింది. సాయుధ విప్లవమే నూతన సమాజ నిర్మాణానికి అవసరమని భావించిన నక్సల్‌బరీ పోరాటం సమర్థించే సాహిత్యకారులు శ్రీశ్రీని కలుపుకొని విరసం ఏర్పరచటం జరిగింది. విరసం క్రమంగా వచనకవిత్వంలోంచి పాటలోకి సాగిపోయి ఒకే ఇతివృత్తం, పరిమితమైన అభివ్యక్తి మార్గం, నియతమైన ఛందస్సులను పరిమితమైన పునఃపునరావర్తనం చేత ఒక మొనాటనీని తప్పించుకోలేక పోయింది. పాడటం లేకుండా రక్తికట్టే పరిస్థితి లేకపోవటం వల్ల అది విప్లవకారుల వారి అనుయాయుల సభలకు పరిమితమై పోయింది. గద్దర్‌, శివసాగర్‌, వంగపండు ప్రసాద్‌ వంటి కవుల రచనలకు ప్రాచుర్యం కలిగింది.
అయితే తమ కవిత్వ సాధనలో అర్బేనిటీపోకుండా మధ్యతరగతి వర్గంలో తాదాత్మ్యం చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు శివారెడ్డి. నగ్నముని, వరవరరావు ప్రభృతులు. శివారెడ్డి ప్రతిభ చేత వస్తువు రత్న గర్భమై ప్రకాశించింది అతని కావ్యాలలో.
దళితవాదం గొంతువిప్పినప్పుడు చాలా బలంగానే విన్పించినా క్రమంగా సమగ్రసమాజం ెుడల సహానుభూతిలేని కారణంగా విశ్వజనీనతను సంతరించుకోవటం కష్టమవుతున్నది. అయినా ఈ మార్గంలో ఉత్తమశ్రేణిలో ెుండ్లూరి సుధాకర్‌, శిఖామణి, సతీష్‌చందర్‌, బన్న ఐలయ్యలు నిలుస్తున్నారు. స్త్రీవాదమూ పరిమిత వస్తువిన్యాసంతో క్రమంగా వెనుకంజవేస్తున్నది. కొండేపూడి నిర్మల, సావిత్రి, జయప్రభ, రజని మొదలైన వారి కవితలు స్త్రీ జీవనంలోని సంవేదనలను స్పష్టంగా ప్రకటించాయి.
ఇదంతా ఏదోవిధమైన నిరసన, సంఘర్షణ, పోరాటాలను ఆశ్రయించిన పార్శ్వం. అయితే రెండవ పార్శ్వంఅధివాస్తవికత, అస్తిత్వవాదం, సంశయ వాదం, అంతర్జగత్తులోని కల్లోలం ఇవన్నీ వ్యక్తంచేసే కవిత్వ భూమి. ఇక్కడ అక్కడక్కడా రహస్యవాదం నీడలు, అనిర్దిష్టమైన అన్వేషణ దృగ్గోచరమవుతాయి. సామాజిక సంవేదన కూడా ఇక్కడ `స్వప్నలిపి'గా మారిపోతుంది. ప్రతీకలు, బింబాలు, నూతన సంయోజనలు ఈ మార్గంలో ఎక్కువ. అజంతా, మోహన్‌ప్రసాద్‌, సుమనశ్రీ ప్రభృతులు ఈ మార్గంలో సాగిపోయినవారు. ఇక్కడ కవిత్వం వస్తు ఛందస్సులను దాటి అభివ్యక్తి నిష్ఠమై పోతున్నది. అందువల్ల అవగాహనలో సౌలభ్యం తక్కువ.
అయితే మరికొంతమంది కవులు భావకవిత్వంవలెనే ఆత్మాశ్రయ లక్షణంతో కాల్పనిక రహస్యవాద మార్గంలో కవిత్వ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ అస్పష్టతలేదు. అరిపిరాల విశ్వం, ఇస్మాయిల్‌, శ్రీకాంతశర్మ, సత్య శ్రీమన్నారాయణ ఇలా కవులు ఒక భావనిష్ఠమైన అనుభూతి రహోలోకాలను నిర్మిస్తున్నారు.
ఆర్‌.ఎస్‌.సుదర్శనం, సంపత్కుమార, అనుమాండ్ల భూమయ్యలు వ్రాసేది పద్యమైనా ఒక ఆత్మానుభవ ప్రకటనకు ప్రాధాన్యం యిస్తున్నారు. చిన వీరభద్రుడు, విన్నకోట రవిశంకర్‌, రాజు, సిద్ధార్థ, సౌభాగ్య, మునిపల్లె రాజు, రామ్‌నారాయణ్‌ఈ కవులంతా తమ నూతన బింబాల సృష్టితో ప్రతీకల ప్రయోగంతో కవిత్వ జగత్తును సుసంపన్నం చేస్తున్నారు. రామగిరి శివకుమారశర్మ `సింగిడి' తెలంగాణా రైతుజీవితంలోని భావనలను అనుభవాలను అత్యంతసుందరంగా అభివ్యక్తం చేసింది. దర్భశయనం రచనల్లో ప్రతీకలు, బింబ సామాగ్రి దేశీయతా, గ్రామీణతా పరిమితుల లోంచి పెల్లుబుకుతున్నది. అభినవత్వం దీనిలో విశిష్టత.
కొందరు ఇటీవలికవులు ఆధునికోత్తరకాలంపేర విచిత్ర ప్రకటనా వూ్యహాలలో విలక్షణమైన శబ్దజాలంతో రచనా ప్రపంచంలో పురోగమిస్తున్నారు. వీరిలో అఫ్సర్‌, సీతారాం, ప్రసేన్‌, వంశీకృష్ణలు ప్రముఖులు. అయితే అనేకమంది కవులు ప్రధాన స్రవంతియైన జాతీయ ప్రజాస్వామ్య చైతన్యంలో దేశీయతాభూమికలో రచనాప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తున్నారు. ఈ కవులు తమ శిల్ప నైపుణ్యంతో వస్తు విన్యాసంలో అపరిమితమైన కవిత్వపు సీమల్లోకి ప్రవేశింపజేస్తున్నారు. వీరిలో బోయి భీమన్న, శేషేంద్ర, నారాయణరెడ్డి, మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, సుప్రసన్న, పెన్నా శివరామకృష్ణ, గోపి, బాపురెడ్డి, మొదట పేర్కొనదగినవారు.
ఇంద్రధనూరమ్యమైన ఈ దృశ్యపరంపరకు వెనుకగా ఈ కాలంలో నవ్య సంప్రదాయం మూడు గొప్ప మహాకావ్యాలను ఆవిష్కరించింది. ఒకటి వానమామలై వరదాచార్యుల పోతన చరిత్రము రెండు ముదిగొండ వీరభద్రమూర్తి' వందేమాతరం', మూడు నాయని సుబ్బారావు `జన్మభూమి'.
ఈతరం కవులు వచన కవిత్వంలో మహాకావ్య నిర్మాణం చేయటం ఒక విలక్షణమైన ఉపలబ్ధి విశేషం. విస్తారమైన మన ఆధునిక సాహిత్యోపలబ్ధులను తమకు, తమకు చెందిన వారికి మాత్రమే పరిమితం చేసుకునే ఒక సంకుచిత బుద్ధితో కొందరు విమర్శకులు నేటి సాహిత్యంలో గిరిగీతలు గీస్తున్నారు. `అసలు సాహిత్యరంగంలోనైతే శాశ్వత విప్లవాన్ని ఎప్పుడూ సంప్రదాయవాదులే తీసుకురాగలరని హెరాల్‌‌డ రోజెన్‌ బర్‌‌గ చెబుతున్నాడు. ఈ మాటల్ని ప్రత్యక్షర సత్యం చేసినవారు ఇలియట్‌, ఆడెన్‌, అరవిందుడు, టాగోరు, విశ్వనాథ, శ్రీశ్రీ లాంటి మహాకవులు. వీళ్లందరిదీ సంప్రదాయం వల్ల పరిపుష్టమైన ఆధునికత. వేదంలోంచీ, మహాభారతంలోంచీ గ్రహించిన `సావిత్రి' వృత్తాంతంపై ఇంగ్లీషూలో రాసిన మహాకావ్యం `సావిత్రి'లో కనిపించేదంతా అరవిందుని ఆధునికత్వమే. అలాగే శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో `ఏ దనుజున్‌ వధించినను ఇంత విషాదమునొందు ఆత్మ మర్యాదుడుస్వామి' అంటూ శ్రీరామచంద్రుడి హృదయంలో ఒక అస్తిత్వవేదన (లినిరిరీశిలిదీశిరిబిజి బిదీవీరీశి) లాంటిది సృష్టించిన విశ్వనాథ సంప్రదాయం లోంచీ ఆధునికతను ఆవిష్కరిస్తున్నాడని గమనించాలి'. (ఆచార్య పణతుల రామచంద్రయ్య పే. 290 సాహిత్యంలో ఆధునికత అభినవ భారతి 1996)
ఈ సమన్విత దృష్టి విశ్వజనీనమైంది ఉంటేనే మనకు మన సాహిత్యచిత్రం సమగ్రంగా దర్శనమిస్తుంది. ఏది ఏమైనా కవిత్వ సాధనకు లక్ష్యం పరిపూర్ణతా సిద్ధి. మన కళాత్మక శిల్పాత్మక సాధనలు ఉపకరణాలు అన్నీ ఈ లక్ష్యం వైపుగానే ప్రయాణించాలి. భాష, ఛందస్సు, అలంకారము, ప్రతీక మరింకేదైనా ఉంటే అదిఅన్నీ మానవ జీవనంలోని అన్ని స్తరాలలోని సంఘర్షణలను చిత్రిస్తూఅనంత జీవనాన్ని గురించిన అతని ఆర్తిని అభివ్యక్తీకరించాలి. 20వ శతాబ్దం నూతనమైన ఆధిభౌతిక తత్త్వ చింతనలోని పార్శా్వలను ఆవిష్కరించింది. మనశ్శాస్త్రం ఆధ్యాత్మిక అనుభవాల సీమలను తాకుతూ వచ్చింది. ఖండదృష్టీ, పార్శ్వదృష్టీ తప్పుడు అనుభావనలకు కారణాలవుతవి.

Monday, February 16, 2009

పాములపర్తి సదాశివ రావు

శ్రీ పాములపర్తి సదాశివరావు వరంగల్ నగరంలో మనకు సమకాలంలో మన ముందు మెదలిన అరుదైన అసాధారణమైన వ్యక్తి. జీవితమంతా తపస్వాధ్యాయాలుగా, తాను ప్రకాశిస్తూ ఎదుటివారిని తన ప్రకాశంతో జాజ్వల్యమానంగా రూపించిన మహాశయుడు. నేను ఎదిగే నాటికి అప్పటికే కాకతీయ పత్రిక సంపాదకుడుగా, కాకతీయ కళాసమితి నిర్వాహకుడుగా ప్రముఖ వ్యక్తి. ఆనాటికి చిన్న చిన్నగా పద్యాలు రాస్తూ కాకతీయలో ప్రచురణ కోసం ఒకసారి ఒక రచన అందించి వచ్చాను. (అయితే అది ప్రచురించబడలేదు.) ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంలో నేనూ, పి.ఎన్‌. స్వామి, ఉదయరాజు రాధాకృష్ణ ముగ్గురమూ ఒక ప్రత్యేక సంచిక వెలువరించ బూనినప్పుడు దానికి సంపాదకత్వ భారాన్ని వహించి నాటికి చాలా అందంగా విశిష్టంగా ప్రచురించారు. దానిలో ఆయన కాకతీయ శిల్పం గురించి ప్రత్యేక వ్యాసం వ్రాశారు. నేను అప్పటికి హైదరాబాదులో బి.ఎ. చదువుకుంటున్నాను. నా చేత ప్రత్యేకంగా దానిలో ప్రచురణ నిమిత్తం `స్థానిక సాహిత్య సమీక్ష' అనే పేర వరంగల్లు జిల్లా సాహిత్య వికాసం గురించి చక్కని వ్యాసం వ్రాయించారు. దానిలో చివరకు నేను మరిచిపోయిన నాలుగైదు పేర్లను చేర్చి వ్యాసాన్ని సమగ్రం చేశారు. అప్పటి నుంచీ ఆయనతో నా పరిచయం కొనసాగింది. `తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు', చరిత్ర, సంస్కృతి, కళ', `జ్ఞాన సిద్ధాంతం', `భారతీయ సాహిత్య పరిణామాలు పరిశీలన' మొదలైన పరిశీలనాత్మకమైన రచనలే కాకుండా `అభ్యుదయ గేయాలు' అనే కవితా సంపుటి కూడా ఆయన రచనలలో ఉన్నాయి. కాకతీయలో సంపాదకీయాలు, ఇతర రచనలు, ఇతరుల పేర్లతో వచ్చిన రచనలు అన్నీ విలువైనవే. విశ్వజ్యోతి మొదలైన పత్రికలు ఆయన ఆధ్వర్యంలో కొనసాగాయి. వాటిల్లోనూ ఎక్కువ పాలు ఆయన చేతి రచనయే. శ్రీ సదాశివరావు పర్వతం వలె గంభీరుడే కానీ కదలకుండా ఒకే బిందువు వద్ద స్థాణువుగా నిలిచి పోలేదు. ఆయన జీవలక్షణం జిజ్ఞాస. ఒక భావనకు ఒక సిద్ధాంతానికి కట్టుబడి తన జీవితాన్నంతా ప్రశ్నించకుండా సాగిపోయిన వ్యక్తి కాదు ఆయన. ఆ పర్వతం కరిగి గంగయై ప్రవహించింది. అనేక సంస్కృతులను నాగరికతలను కాలఖండాలను స్పృశించింది. అనేక ఉపనదులను తనలోనికి సమావేశింప జేసుకున్నది. కమూ్యనిస్టు పార్టీ పక్షాన `సందేశం' పత్రికకు సంపాదకులుగా బౌద్ధం గురించీ, శాంకరాదై్వతం గురించీ రెండు ప్రత్యేక సంచికలు ప్రచురించారు. వీటిల్లో శాంకరాదై్వతం గురించిన పత్రిక ప్రతులను బేదాభిప్రాయాలు కారణంగా తగులబెట్టినారని వారికి మిక్కిలి సన్నిహితుడు నాకు ఆప్తమిత్రుడైన శ్రీ పి.ఎన్‌. స్వామి చెప్పారు. 1957 ప్రాంతం నుండి సదాశివరావులో మార్కి్సస్టు తత్త్వం విశ్లథమవుతూ వచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో ఆయన ప్రచురించిన `అభ్యుదయ గేయాల'లో ఈ విశ్లథ దశ స్పష్టంగా గోచరిస్తుంది. దీనిలోని `భూమాత' అన్న రచన జాతీయ చైతన్యానికి, ఉజ్జ్వలమైన గతానికి హారతులెత్తింది. `శాంతి ఆయుధంలో స్వాతంత్య్ర పథంలో సామ్రాజ్య రాక్షసిని సంహరించిన భూమి' `శూరాధి శూరులౌ రాజులేలిన భూమి' `యోధాను యోధులై పోరుసల్పిన భూమి' `వీరాధి వీరులౌ శ్రీరామ చంద్రులను', `కారుణిక మూర్తులౌ శాక్య గౌతములను', `శృంగార రూపులౌ రాధా మాధవులను', `జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను' గన్న తల్లికి పూజ చేద్దాము' ఇవన్నీ ఈ కవితలోని పంక్తులు. `గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళు్ళలతో, అన్నా `మంచి గతమున కొంచెమేనోయ్‌' అన్నా ఆ కవుల దృష్టికి సదాశివరావు దృష్టికి ఎంత భేదం ఉన్నదో గుర్తించడం అవసరం. చైనా దురాక్రమణ సందర్భములో ఆయన విశ్వజ్యోతి' ప్రత్యేక సంచికలో చైనా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ వ్రాసిన వ్యంగ్యరచన నాకింకా స్పష్టంగా గుర్తే ఉంది. అప్పుడు అభ్యుదయ కవులెవరూ నోరు విప్పలేదు. శాక్యముని అన్న రచనలో `2500 ఏండ్లు గడిచిపోవనిప్పుడు తిరుగవచ్చినావ సర్వానికి మిన్నయైన జనయిత్రిని భారత మాతను చూడగ' భారతమాతను సర్వానికి మిన్నయైన జనయిత్రిగా ప్రస్తుతించారు. అందువల్లనే ఆయన `మానుషత్వము బోధింపు కానీ భావమానుషత్వమును కాదు. సత్యధర్మముల కీర్తింపును కానీ ఊహా సిద్ధాంతములుగ మాత్రం కాదు.' అని ఆచరణ ప్రాథమ్యాన్ని తెలుపుతూ సిద్ధాంత మౌఢ్యాన్ని తిరస్కరించారు. తరువాత తరువాత ఆయన అధ్యయన పరిధులు విస్తరించాయి. విశ్వ వ్యాప్తంగా వచ్చిన సామాజిక, ఆర్థిక, తాత్తి్వక, రాజకీయ సిద్ధాంతాలు, సాహిత్య, సంగీత, చిత్ర, శిల్పాదులు, విజ్ఞాన శాస్త్రాంశాలు, ఒకటేమిటి ఏదైనా ఆయన అధ్యయనంలో భాగమే అయింది. భరతుని సంగీత సిద్ధాంతం, విద్యారణ్యుల వేదశాస్త్ర పరిశోధన గ్రంథాలు, సూఫీవాదం భారతీయ చరిత్ర పునర్విలోకనం, భాగవత సంప్రదాయం ఇలా ఎనై్ననా ఆయన విచారణ పరిమితిలో నూతన కాంతులను సంతరించుకున్నాయి. వరంగల్‌ నగరంలో ఎనభైలలో మొదట పోతన పంచశతి ఉత్సవాలు జాతీయ స్థాయిలో జరగటానికి, చివర్లో విద్యారణ్యులను గురించిన సంగోష్ఠూలు నిర్వహింప బడటానికి ఆయనే మూలకారణం అనడం సత్యోక్తి. ఈ రెండు సందర్భాలలోనూ ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ కారణంగా ఆయనతో కొన్ని నెలలపాటు, ఏండ్లపాటు అధ్యయనంలో, చర్చలలో, కార్యనిర్వహణలో పాల్గొనగల్గటం నా అదృష్టమనే చెప్పాలి. చివరి రోజులల్లో డాక్టర్‌ రాజారాం గారి తోటలో సుమారు రెండు వందల ఉపన్యాసాలు భారతీయ చరిత్రను గురించి ప్రపంచ తాత్తి్వకుల గురించీ ్టవులను గురించీ చేసిన ప్రసంగాలు అమూల్యమైనవి. వాటిని సంపాదించి ఎడిట్‌ చేసి ప్రచురించగలిగితే ఒక నూతన భాండాగారం వివృత కవాటం అవుతుంది. శ్రీ అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి దాకా ఆయన స్పృశించని అంశం ఉండేది కాదు.

Wednesday, February 11, 2009

మహాభారత తాత్పర్యము

ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది. ఎక్కడ లేనిది ఎక్కడా లేదు. అన్న వ్యాసుడి వాక్యం మహాభారతాన్ని స్థూలంగా వర్ణించేది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రతి అంశం దీనిలో నిక్షిప్తం కావడం వల్ల విశ్వం యొక్క తాత్పర్యం గ్రహించడం ఎంత కష్టమో, దీని తాత్పర్యం గ్రహించడం అంతే కష్టం. మహాభారత ఆరంభంలో రెండు చెట్లను వ్యాసుడు వర్ణించాడు. యుధిష్ఠిరుడనే ధర్మ వృక్షము, దుర్యోధనుడనే మన్యు వృక్షము ఈ గాథకి ప్రధాన ఆధారాలు. రెండు చెట్లు విడిగా వర్ణించడం వల్ల ఈ గాథంతా రెండు ప్రవాహాలుగా, సమాంతరంగా.. కొన్ని చోట్ల ఓతప్రోతంగా ప్రవహించినట్లు గ్రహించవచ్చు. మొత్తం గాథలో శంతనుడి కామ భావం, ఆధారంగా సత్యవతి వివాహం జరగడం భీష్ముడు రాజ్యత్యాగం చేయడం ఈ కథకు ఆధార బిందువు. అయితే, భీష్ముడి వంటి దైవాంశ సంభూతుడు, ఆద్యంతము వ్యాపించి ఉండటము, అతడు సమర సందర్భంలో ధర్మ పక్షంలో కాకుండా అధర్మ పక్షంలో నిలిచి పోవడం ఒక విలక్షణమైన విరోధాభాస. పతితమైన బ్రాహ్మణ్యం శస్త్రాన్ని ధరించడం ద్రోణుడి పాత్రలో వ్యక్తమైతే, ఆతడు ప్రతీకార వాంఛతో ద్రుపదుణ్ణి పరాభవించటం, ఏకలవు్యడి నుంచి గురుదక్షిణగా అంగుష్ఠాన్ని యాచించడం, మొత్తం యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా ప్రవర్తించటం ఒక విచిత్రమైన సన్నివేశం. అంతేకాక ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఎప్పుడూ ధర్మ చైతన్యంతో సంబంధం లేకుండా అసూయతో జీవించటం, యుద్ధాంతంలో అపాండవం కరిష్యామి అని చనిపోతున్న దుర్యోధనుడికి వాగ్దానం చేసి నిద్రితులైన ఉప పాండవులను సంహరించటం, గర్భస్థుడైన ఉత్తరాసుతుణ్ణి సంహరించటానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించటం ఒక పిశాచావేశం లాగా గోచరిస్తుంది. అర్జునుడితో పాటు తాను రుద్ర ఆరాధకుడైనా, రుద్రుడి లోని ఆనుకూల్యాంశం ఇతణ్ణి ఎప్పుడూ ఆవేశించలేదు.
ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం, పాండురాజు దిగ్విజయాలు సాధించి అతని చేత నూరు అశ్వమేధాలు చేయించినా, చివరకు అరణ్యవాసంలో శాపగ్రస్తుడై మరణించటం వల్ల ధృతరాష్ట్రుడు, రాజు కావడం సంభవించింది. రాజ్యాధికారం కలిగిన గుడ్డివాడు, అతని ప్రవృత్తి అంతా అంతర్బహిర్చేతనలలో వైరుధ్యంతో పుత్ర మమకారం వల్ల పాండవుల యందు పెంచుకున్న అప్రీతి వల్ల ఒక నాటకంగా జీవితం గడపడం జరిగింది. మహా భారతానికి మొత్తం నాయకుడైన ధర్మరాజు ద్యూత వ్యసనం వల్ల ద్రౌపది దయ వల్ల కలిగిన రాజ్యం కూడా పోగొట్టుకోవడం అరణ్యవాస, అజ్ఞాత వాసములు చేయవలసి వచ్చింది. ధర్మరాజులో ఎంత మెత్తదనం ఉన్నదో అంతటి ప్రతీకారేచ్ఛ కూడా ఉన్నట్టు అది గడుసుదనం వల్ల చప్పబడినట్లు యుద్ధ పర్వాల్లో గోచరమవుతుంది. దుర్యోధనుడు క్రోధము, అసూయ ఈ రెండు లక్షణాలు మూర్తీభవించినవాడు. తనకు జన్మతః సంక్రమించని రాజ్యాధికారాన్ని పొంది దాన్ని ఇతరులతో పంచుకునే ఉద్దేశం లేకుండా దురాశ వల్ల పాండవులను చిన్ననాటి నుంచి ప్రతీకారేచ్ఛతో రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో అతడు చేయని దుష్కార్యం, పాపము మరెక్కడా లేదు. దుశ్శాసనుడు కేవలం సేవాధర్మం కలిగిన వాడే తప్ప అతని స్వతంత్రించి చేసిన కార్యమంటూ ఏమీ లేదు. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కర్ణుడు ప్రవర్తించిన తీరు సజ్జనులకెవరికైనా సిగ్గు తెప్పించేదే. దుర్యోధనుని వస్త్రాపహరణాది దుష్కార్యాలకు ప్రేరేపించి తన దుష్టమైన వాక్కుల చేత భారతానికే కళంకం ఆపాదించినాడు. అతని లోని ధర్మవేతృత, దానుగుణం, పరాక్రమము, మిగిలిన గుణాలన్నీ ఈ ఒక్క దోషంతో తుడుచుకుపెట్టుకు పోతున్నవి.
అసలు విచిత్ర వీర్యుడు చనిపోయిన తరువాత సత్యవతి ప్రార్థననుసరించి భీష్ముడే రాజ్యాన్ని గ్రహిస్తే, చరిత్ర మరొకరకంగా ఉండేది. ఆతడు రాజు కాకున్నా, కాశీరాజు సభలో ఆతని పుత్రికలను బలవంతంగా తీసుకువచ్చినప్పుడు తరువాత అంబను విడిచిపుచ్చడం, ఆమె తిరిగి రాగా స్వీకరించకపోవడం ఆ పట్టుదలను నిలుపుకోవడం కోసం గురువుతో కూడా పోరాడటం, అనేక సందేహాలకు ధర్మ వైరుధ్యాలకు తార్కాణమైన అంశం. యుద్ధం తరువాత అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకు ఉపదేశం చేయడం తాను అంతకు ముందు ఆచరించిన దోషాలను తొలగించుకోవడం కోసం చేసిన ప్రాయశ్చిత్త కర్మగా కనిపిస్తుంది. అతని లోని కృష్ణ భక్తి తత్త్వ జ్ఞానం, ఇవేవీ అంపశయ్య మీదకు చేరేదాకా పనిచేసినట్టు లేవు. భీష్ముడు వసు రుద్రాదిత్యులలో వసువులు భూ చైతన్యానికి చెందిన వారు. అందువల్లనే శరీరాన్ని పోషించిన కౌరవుల యెడ ఆతడు కృతజ్ఞుడై ఉండటం జరిగి ఉండవచ్చు.
మహాభారతంలో ప్రధానంగా మూడు యజ్ఞాలు, కనిపిస్తుంటాయి. సర్పయాగము, రాజసూయం, అశ్వమేథం. సర్పయాగం ప్రతీకార బుద్ధితో ఒక వ్యక్తి చేసిన దోషానికి ఒక జాతిని సంహరించే కార్యం. అంతకు ముందు భార్గవ రాముడు క్షత్రియుల విషయంలో ఇదే పని చేశాడు. ఈ ప్రతీకార బుద్ధి వల్ల సత్వరజస్సులు అణగి తమోగుణం ఆవరిస్తుంది. భారత ఆరంభం ప్రవేశ ద్వారం ఈ తమస్సు చేత నిర్మింపబడ్డది. రాజసూయం రజో గుణ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. ధర్మరాజు చక్రవర్తిగా అభిషేకింపబడటం దీని లక్ష్యం. దీని కోసం అతని తము్మలు నిర్వహించిన విజయయాత్రలు హింస లేనివని జన నష్టం లేనివని చెప్పడానికి అవకాశం లేదు. ధర్మరాజు యుద్ధానంతరం చేసిన రాజసూయం ఒక చక్రవర్తి చేయగలిగిన కార్యం. దీన్ని నిర్వహించినప్పుడు ఆ యాగంలో చేయబడే సర్వ త్యాగ లక్షణం చేత అది సత్వమయంగా నిర్వహింపబడి ఉండవచ్చు.
మహాభారతంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి, సనత్సుజాతీయము, రెండు భగవద్గీత, మూడు విష్ణు సహస్రనామము. సనత్సుజాతీయములో మృత్యువు యొక్క స్వరూపము చెప్పబడింది. మృత్యువంటే ప్రమాదము, ఏమరుపాటు. ఏమరుపాటు లేనివానికి సదా బ్రహ్మచైతన్యంలో నిలిచి ఉండేవానికి మృత్యువు అనేది ఉండదు. మనం అనుకునే మృత్యువు దేహముల యందు మాత్రమే. జాగ్రదవస్థలో నిలిచి ఉండేవాడు నిత్య జన్మ జన్మాంతరాలలో చైతన్య ధార తెగకుండా ఉండటం వల్ల మృత్యు అనుభవాన్ని పొందనే పొందడు. అట్లాగే భగవద్గీత కూడా మృత్యు తత్వాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ``కాలోస్మి లోకక్షయకృత్‌ ప్రవృద్ధః'' నేను మృత్యు స్వరూపాన్ని లోకాన్ని నశింపజేయడం కోసమే ప్రవర్తిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ జీవితమంతా మృత్యుముఖంగా పయనించడమే దీని యథార్థ తత్త్వం. ఈ మృత్యు రహస్యాన్ని చెప్పడం కోసం కథాగతంగా నడుమ సావిత్రి ఉపాఖ్యానాన్ని వ్యాస మహర్షి ప్రపంచించడం జరిగింది. మృత్యువును తరించే లక్షణము ఈ గాథ ఉపనిషత్‌ సంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన యోగ రహస్యాన్ని చెప్పడం కోసం తెల్పబడింది. విష్ణు సహస్రనామము కూడా విశ్వం అనే శబ్దంతో ప్రారంభమై సర్వప్రహరణాయుధ శబ్దంతో పూర్తయి సృష్టి అంతా మృత్యుతీరానికి చేరుతున్న అంశాన్ని తెలియజేస్తుంది. అందువల్లనే మహాభారతానికి మృత్యువు పుత్రుడైన ధర్మరాజు నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం మహాభారతం సర్పయాగం నుంచి స్వర్గారోహణం దాకా మృత్యుహేలయై ప్రవర్తించింది. పాండవులందరూ మృత్యు పుత్రుడు తప్ప చివరకి మృతి చెందారు. అతని స్వర్గారోహణం కూడా నరక దర్శనం చేత మృత్యు తత్తా్వన్ని మరల మరల గుర్తు చేస్తుంది. అతని వెంట నడిచి వచ్చిన ధర్మరూపమైన శునకం కూడా మృత్యువునకు ప్రతీకయే కావచ్చును.
ఈ మొత్తం ఇతిహాసానికి కేంద్ర బిందువైన ద్రౌపది అగ్ని సంభూత. ఈ అగ్ని పంచభూతాలలో కేంద్ర స్థానంలో నిల్చి ఉంటుంది. పంచభూతాలు పంచపాండవులైతే, అగ్ని పార్థుడవుతాడు. ఈ పార్థుడు నరనారాయణులలోని నరుడనే తపస్వి. ఈ మృత్యుక్రీడ కోసం లోకంలో తమోమయ, రజోమయ శక్తులను తొలగించివేయడం కోసం అర్జునుడుగా ఈతడు అవతరించి లయకారకుడైన శివుని వరాన్ని పొంది కురుపాండవ యుద్ధాన్ని మొత్తం నిర్వహించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ మొత్తం ఇతిహాస ప్రవర్తనలో ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోలేదు. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో మాత్రమే ఆయన వస్త్రప్రదానం చేసి ఆమెను రక్షించడం ద్వారా సర్వ జగత్‌ ప్రవృత్తికి మూలమైన స్త్రీత్వాన్ని చెదరకుండా కాపాడటం జరిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన సాక్షీభూతుడే. భగవద్గీత ఎంత ప్రవర్తించినా, దాని సారంగా తేలేది తస్మాత్‌ యుధ్యస్వ అన్న మాటయే. యుద్ధం చేయమని చెప్పడం స్థితికారకుడైన నారాయణ లక్షణం కాకుండా, రుద్రాంశ ఆవరించిన శివుని లక్షణంగా కనిపిస్తుంది. మొత్తం మహాభారతంలో ఈ దృష్టితో చూసినప్పుడు ఇదంతా హరిహరుల క్రీడవలె, మహామాతృ అంశమైన కాళికాదేవి వైభవం వలె గోచరిస్తుంది. ద్రౌపదీదేవి కాళికాదేవి యొక్క రూపాంతరమే.

Sunday, February 8, 2009

గురుకుల వ్యవస్థ భారతీయ విద్యామూలసూత్రం

ప్రాచీన నాగరకతల్లో దాని నిరంతర అభివృద్ధిలో ఆ సమాజంలోని వ్యక్తుల శక్తులు అవగాహనలో లక్ష్యాలు, ఆకాంక్షలు, స్వప్నాలు అన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. విద్య కూడా వీటన్నింటినీ ఆశ్రయించి జనాన్ని ముందుకు నడిపించే దివ్యరథం లాంటిది. విద్యలో నాలుగు రకాలు కానవస్తాయి.
1. జీవిక కోసం అవసరమైన వృత్తులు, నైపుణ్యాలు అభ్యాసము, వీటిని స్థూలంగా గ్రామీణ జీవన మారా్గలుగా నిర్దేశించుకోవచ్చు. వ్యవసాయం కుమ్మరి, కమ్మరి, కంచరి, మంగలి, చాకలి, నేత, కంసాలి మొదలైన విద్యలన్నీ ఈ శ్రేణిలో చేరుతాయి. సాధారణంగా ఈ విద్యకు ఇల్లే విద్యాలయంగా తండ్రియే గురువుగా కొనసాగుతుంది. ఆ గృహంలోని వ్యక్తుల పరంపరలో ఈ విద్యాసూత్రం తరానికీ, తరానికీ నైపుణ్యాన్ని సమకూర్చుకుంటూ అవసరాన్ని బట్టి సాంకేతికతను పెంచుకుంటూ ముందుకు సాగుతుంది.
2. సమాజ వ్యవహారానికి అవసరమైన వ్యాపారము, ఎగుమతులు దిగుమతులు, నిత్యావసర వస్తువుల వినిమయము, తొలుత పేర్కొన్న వృత్తుల వారు ఉత్పత్తి చేసిన వస్తువులను సమాజానికి పంచటం.. ఈ రకమైన వ్యవహారమంతా వణిక్‌ వృత్తిలో సార్థవాహ రీతిలో దగ్గరకూ దూరానికీ అందజేస్తూ తమ జీవితాన్ని కూడా దీని ద్వారా నడుపుకొనే విధము.
3. గ్రామాలకు, పట్టణాలకు, జనపదాలకు, రాష్ట్రానికి అనేక విధాలైన ఆపదలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. క్రూర మృగాల వల్ల, దొంగల వల్ల, బర్బరుల వల్ల, శత్రువుల వల్ల, ప్రాకృతిక బీభత్సాల వల్ల సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఈ సందరా్భలలో సమాజాన్ని రక్షించే జనశ్రేణులు రెండు రకాలుగా అవసరమవుతాయి. ప్రాకృతిక బీభత్సాలలో నష్టపోయిన సందర్భంలో వారిని సేవించే సాధు సజ్జన బృందం, శత్రువులు మొదలైన వారి వల్ల ప్రాణ భీతి ఏర్పడ్డప్పుడు ఆస్తులకు నష్టం కలిగినప్పుడు రాష్ట్రం పరాధీనమయ్యే సందర్భం వచ్చినప్పుడు రక్షించే సైన్య శ్రేణి ఒకటి. ఈ సందర్భంలో సమాజానికి సేవ చేసే ధార్మిక సంస్థలు ఉదార జన సమూహం ఎంత అవసరమో శస్త్ర బలం వల్ల ధనుర్విద్యాదుల వల్ల శత్రువులను ఎదుర్కొని దేశాన్ని రక్షించగల సైనిక సమూహమూ అంతే అవసరము.
4. సమాజ పురోగతిలో అవసరమైన భావనలు పరికల్పనలు, లక్ష్య నిర్దేశాలు భావించే వర్గం ఒకటి. వీరు సమాజాన్ని అట్టడుగు నుంచి శిఖరాల దాకా ఉండిన స్థితిని పరిశీలించి విశే్లషించి నూతన మారా్గన్ని ప్రణాళికను ఆచరణ క్రమాన్ని వ్యాఖ్యానిస్తారు. వీరి పరిశీలనలో మానవుడికి మానవుడికీ నడుమ ఉండే సామరస్యం మాత్రమే కాక, మానవుడికీ, ప్రకృతికీ ఉండవలసిన సామరస్యం, మానవుడికీ, ఈశ్వరుడికీ ఉండవలసిన సామరస్యం, అతని అంతర్బహిర్లోకాల సామరస్యం ప్రధాన వస్తువులు అవుతవి. దీనిని ఆసాంతమూ అవగాహన చేసుకోవటానికి సృష్టి రహస్యం, సృష్టి వికాసము, గ్రహ, నక్షత్ర, గోళముల స్థితిగతులు, ఋతువులు, భౌగోళిక పరిస్థితులు చరాచర జంతుజాలము భూగర్భ రహస్యము, వ్యాధులు, తన్నివారణలు, ఆసందర్భంలో మనిషికి ఓషధులే కాక ఆత్మ విశా్వసాదుల వల్ల కలిగే శక్తి ఇవన్నీ ఇక్కడ ప్రాధాన్యం వహిస్తాయి.
ఈ నాలుగు విధాలైన ప్రావీణ్యం సమాజాన్ని ముందుకు నడుపుతుంది. ఇతర సమాజాలతో అనుబంధాన్ని పెంచుతుంది. ప్రకృతితోడి సామరస్యంతో జీవనాన్ని సుఖమయం చేస్తుంది. అంతర్ముఖమైనప్పుడు శాంతిని బహిర్ముఖమైనప్పుడు సమృద్ధిని జీవన లక్ష్యంగా నిర్దేశిస్తుంది. భారతీయ విద్యానిరా్మణ భావనలో ఈ నాలుగు పారా్శ్వలు తమతమ ప్రాధాన్యాన్ని ఆశ్రయించి ముందుకు సాగుతూ వచ్చాయి. అందువల్లనే ఈనాడు విద్య అన్న భావనకు ఉన్న పరిమితి ఆనాడు లేదు. యావిద్యా సా విముక్తయే అనగా ఏది మానవుణ్ణి అనేక బంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తుందో అదియే విద్య అనబడుతుంది.
పైన పేర్కొన్న క్రమంలో మొదట పేర్కొన్న వృత్తులు గ్రామంలో కుటుంబాన్ని ఆశ్రయించి ప్రవర్ధిల్లినవి. రెండవ పద్ధతి వాణిజ్యం మొదలైనవి కూడా కుటుంబాన్ని, గ్రామాన్ని కలుపుకున్న సమన్వయంలో నుంచి సాగి వచ్చినవి. ఉత్పత్తి చేసే వ్యక్తి నుంచి వ్యక్తి దాన్ని సేకరించి అందరికీ అందజేయటం దాని విలువను గ్రహించి ఉత్పత్తి దారునికి ఎక్కువగా, తనకు తక్కువగా, తన జీవికకు తక్కువగా సాధించవలసి ఉంటుంది. మూడవది రాజ్య వ్యవస్థలను, అధికార వ్యవస్థలను ఆశ్రయించి సాగవలసింది. దీనికి బలాన్ని చేకూర్చే ఉదార వితరణ శీలమైన జనసమూహము సేవాభావం గల వ్యక్తులు అవసరము. అట్లాగే సమాజ రక్షణ కోసం తమ ప్రాణానై్ననా అర్పించగల సైనికులు రక్షకులు మొదలైన వారి వ్యవస్థ అవసరము. నాలుగవది, ఇది ఉపరితలం మీద కాక, అంతర్గతంగా సమాజానికి కావలసిన భావ భూమికలోని పరివర్తనను, పురోగమనాన్ని నిర్దేశిస్తూ సాగిపోయేది. వ్యాకరణమైనా, తర్కమైనా, మీమాంస అయినా, జ్యోతిష్య శాస్త్రమైనా... ఏ శాస్త్రమైనా ప్రత్యక్షంగా సద్యః ఫలదాయకాలు కాకపోయినా, సమష్టిగా మనో భూమిక మీద పరిణామాన్ని తీసుకువచ్చింది. దీనికి కావలసింది దీర్ఘమైన సాధన. నిరంతర సమాలోచన. చర్చ. అంతర్ముఖంగా భావించటం. బుద్ధిని అన్ని పారా్శ్వలలో మేల్కొల్పటం. ఇలాంటి స్థితిలో జీవించటం వల్ల ప్రత్యక్షంగా భౌతిక జీవనానికి లాభం కానరాకపోయినా, పరోక్షంగా ఆ చక్రపు అంచులను ఒరిపిడి పెట్టి తేజోమయ సుదర్శనంగా పరిణమింపజేయవచ్చు.
నాలుగవ భావశ్రేణి ముందు క్రిందికి ప్రసరించిన కిరణాల్లోనుంచి అనేక జ్ఞాన భేదాలు శాఖలు అవతరిస్తాయి. మానవ జీవన అనుభవమంతా ఒకే ద్రవ్యరాశిగా తీసుకొని దాన్ని సార్వజనీనంగా, సార్వకాలికంగా అభివ్యక్తం చేసినప్పుడు సామాన్య శబ్దం కావ్యమవుతుంది. కూనిరాగం సంగీతం అవుతుంది. తంత్రులు గానం చేస్తాయి. చేతులు, కాళు్ల కదిలిస్తే నాట్యమవుతుంది. శిలను తాకితే శిల్పమవుతుంది. సామాన్యమైన శబ్దాదులకు తాత్కాలిక స్ఫూర్తియే ప్రధానం కాగా అనుభవ సముద్రం లోంచి పుట్టుకువచ్చిన ఈ అంశాలు సార్వకాలీనతను సంతరించుకుంటాయి. అట్లాగే దీని అనుభవంలోనికి వచ్చిన వ్యక్తులు అసామాన్యమైన సౌకుమారా్యన్ని, ఆర్ద్రతను సర్వమందు సౌందరా్యన్ని చూడగలిగిన లక్షణము సంపాదించుకుంటారు. అట్లాగే ప్రకృతిలోని కొన్ని ద్రవ్యాలను శారీరక రుగ్మతల నివారణ కోసం ఉపయోగించే గృహ చికిత్సా సంప్రదాయంలోంచి తాత్తి్వక విశే్లషణ తార్కిక సంగతి కలసి వైద్యశాస్త్రం పుడుతుంది. చరకుడు, శుశ్రుతుడు ఈ త్రోవ నుంచి వచ్చిన వారే. ఇలా అనేక శాస్త్రాలకు ప్రేరణలు నాలుగవ శ్రేణి భావ భూమిక నుంచి ప్రసరించి ప్రథమ శ్రేణి వృత్తుల జీవన మారా్గల ఒత్తిడి లోనుంచి నూతన అంశాలు విజ్ఞాన భూములై ప్రకాశిస్తాయి.
౎౎
భగవన్‌ అధీహి మే బ్రహ్మన్‌ అని యాచించిన కుమారునికి తండ్రి తపస్సు చేయమని చెప్పి ఆ తపస్సు ద్వారా కుమారుడు అన్నమును, ప్రాణమును, మనస్సును, విజ్ఞానమును క్రమంగా బ్రహ్మమని భావిస్తూ తనను దిద్దుకుంటూ ఆత్యంతికంగా ఆనందమే బ్రహ్మమని తెలుసుకుంటాడు. తన కుమారుడు బ్రహ్మవిద్యాభిలాష ఉత్కటంగా కలిగినప్పుడు తనను వేధించగా యముని గురువుగా సూచించి అక్కడికి తన పుత్రుని పంపించి, అతనిని బ్రహ్మ విద్యావేత్తగా తీర్చిదిద్దడం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. బృహదారణ్యకంలో జనకుడి సభలో అనేక మంది విద్వాంసులు బ్రహ్మజ్ఞానమును గూర్చి చర్చించడం, పరమార్థమును చేరుకోవటం, సమష్టిగా పరిషత్తుల వల్ల సాగినట్లు కనిపిస్తుంది. ఒక జిజ్ఞాసువు, ప్రశ్నను విప్పుకోవటానికి మరొకని దగ్గరకు చేరగా ఆతడు మరొక గురువు దగ్గరకు తీసుకుపోవటం.. ఇలా పరంపరగా తమకు సమాధానం లభించే వరకు అనే్వషిస్తూ పోవటం ఇంకొక అధ్యయన మార్గం. ఇలా ఉపనిషత్తులలో అనేక గురుకులాలు ఏర్పడి ఉన్నట్లు జ్ఞాన విజ్ఞాన ప్రసారాలు నిరంతరాయంగా సాగినట్లు సాక్ష్యాలు కొల్లలుగా కనిపిస్తాయి.
గురుకులాలు ఉపనిషత్తుల కాలంలో నగరాలకు దూరంగా జనపదాలకు దూరంగా అడవులలో ఉండేవి. అక్కడే ఆశ్రమాలు, అక్కడే గురువులు, అక్కడే విద్యాస్థానాలు శిష్యులు తమకు తగిన గురువును వెతుక్కుంటూ అతనిని ఆశ్రయించటం, అతని వల్ల తాము కోరుకున్న విద్యను సంపాదించటం నాటి ప్రధాన ధోరణి. ఈ గురుకులాలు ప్రధానంగా గురువు కేంద్రంగా, శిష్యపరంపర అతణ్ణి ఆశ్రయించిన జిజ్ఞాసు సమూహంగా సంయోజింపబడి ఉండేది. శిష్యుని అంగీకరించటం, అతనికి ప్రవేశం కల్పించటం గురువు ఇష్టం మీద ఆధారపడి ఉండేది. అట్లాగే గురువును ఎన్నుకోవటం, ఆ గురువును ప్రసన్నుణ్ణి చేసుకుని తనకు కావలసిన విద్యను సంపాదించటంలో శిష్యునికి స్వేచ్ఛ ఉండేది. ఈనాటి విద్యావిధానంలో గురువునకు కానీ, శిష్యునికి కానీ ఈరకమైన స్వేచ్ఛ కనిపించదు. గురుకులాలలో శిష్యులు క్రమశిక్షణ కలిగి గురు కుటుంబానికి శుశ్రూష చేయవలసి ఉండేది. నియతమైన శుల్కం కానీ, మరో విధి కానీ, ఉండేది కాదు. విద్యా స్వీకరణం తరువాత శిష్యుడు తనకు తోచినది, సాధ్యమైనది గురుదక్షిణగా ఇచ్చే అవకాశం మాత్రం ఉండేది. గురుకులాలలో శిష్యులకు కావలసిన అన్నపాన వ్యవస్థ గురువులే చేసేవారు. అలా పదివేల మంది విద్యార్థులకు వ్యవస్థను ఏరా్పటు చేసిన వ్యక్తి కులపతి అని వ్యవహరింపబడేవాడు. ఈ గురుకులాలలో ప్రధానుడైన కులపతి కాకుండా అనేక మంది వివిధ విద్యా విభాగాలను నిర్వహించే విద్వాంసులు ఉండేవారు. మనకు ఇతిహాసాలలో ఆశ్రమంలో ఉండే విద్యా విభాగాల పరిస్థితి కానవస్తుంది. ప్రాన ఋష్యాశ్రమాల ప్రసక్తి అనేక చోట్ల కానవస్తుంది. ఇతిహాసాల కాలంలో వశిష్ట, విశా్వమిత్ర, వామదేవ, భరద్వాజ, అత్రి, కణ్వ, గృష్ణమద ఋషుల ఆశ్రమాలు సనాతన విద్యాసంప్రదాయాన్ని, వ్యవస్థను రక్షించినట్లుగా కనిపిస్తుంది. ఈ ఋషి కులాలలో ఒక్కొక్క చోట ఒక ప్రత్యేక వేద శాఖాధ్యాయనమో, శాస్త్రాధ్యయనమో నియతంగా చేయబడేది. ఒక ఆశ్రమంలో ఉండే విద్యావిభాగాలను మనం పరిశీలించి చూస్తే ఆ వ్యవస్థ ఎంత విపులంగా విశ్వ రహస్య వేతృతను భౌతిక జగత్‌ పరిణామాన్ని, మానవ చైతన్య విస్తారాన్ని, సృజనాత్మక చైతన్యాన్ని వ్యాఖ్యానించేదో తెలియవస్తుంది. ఆనాటా ప్రధాన విద్యాస్థానాలు ఇవి.
1. అగ్నిస్థానం: అగ్ని ఉపాసనకు, యజ్ఞ యాగాదులకు, ఉపాసనలకు ఆధారభూతమైన స్థానం.
2. బ్రహ్మస్థానం: చతుర్వేదాలను సస్వరంగా అధ్యయనం చేసే చోటు.
3. విష్ణుస్థానం: రాజనీతి, అర్థనీతి, వార్త మొదలైన క్షత్రియోచిత విద్యలకు నెలవు.
4. మహేంద్రస్థానము: సైన్య శిక్షణకు సంబంధించిన స్థానము
5. వివస్వత స్థానము: జ్యోతిషము(గ్రహ, నక్షత్ర విద్య)
6. సోమస్థానము: వృక్షములు, ఓషధులు వానికి సంబంధించిన విద్య.
7. గరుడ స్థానము: ప్రయాణాలు, వాహనములు మొదలైన వానిని అధ్యయనం చేసే స్థానము.
8. కార్తికేయ స్థానము: సైన్య వ్యవస్థను ఏరా్పటు చేసే విధము, వివిధ విభాగాల నిర్వహణ, గ్రామ, జనపద, దేశ రక్షణకు సంబంధించిన విద్య.
వీటిని గమనిస్తే కేవలం ఉదాహరణ ప్రాయంగానే చెప్పినట్లుగా తెలియవస్తుంది. వేదాంగాలు, దర్శనాలు, ప్రాతిశాఖ్యలు, నాట్య, సంగీత, శిల్ప విద్యలు మొదలైనవి ఇక్కడ చెప్పబడలేదు.
పురాణాలలో మనకు ప్రసిద్ధంగా కనిపించే నైమిశారణ్యం ఒక విశ్వవిద్యాలయం లాంటిదే. ఇక్కడ పురాణ విద్యాధ్యయనం, ప్రవచనము నిరంతరంగా సాగేది. శౌనకుడు ఈ గురుకులానికి అధిపతి. సుమారు పదివేల మంది విద్యార్థులు ఇక్కడ అధ్యయనం చేసేవారు. మాలినీ నదీ తీరంలో కణ్వమహర్షి ఆశ్రమం ఉండేది. ఈ ఆశ్రమంలో నాలుగు వేదాల అధ్యయనానికి, కల్పసూత్రాలు, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, న్యాయము, శుల్బశాస్త్రము, జంతు శాస్త్రము మొదలైన అనేక శాస్త్రముల అధ్యయనము జరిగినట్లుగా తెలియవస్తున్నది. భరద్వాజ మహర్షి ఆశ్రమం ప్రయాగలో, చిత్రకూటంలో అత్రి మహర్షి ఆశ్రమము, అగస్త్య, శరభంగ మహర్షుల ఆశ్రమాలు రామాయణంలో ప్రసక్తమవుతాయి. అగస్త్య మహర్షి ఒక వైపు శాస్త్రాన్ని, మరోవైపు శస్త్రాన్ని ధరించి శ్రీరామ చంద్రునికి శత్రుసంహార కార్యక్రమంలో సహాయ పడినట్లుగా తెలియవస్తుంది. వ్యాసమహర్షి ఆశ్రమంలో సుమంతుడు వైశంపాయనుడు, పైలుడు, జైమిని అన్న నలుగురు శిష్యులు నాలుగు వేదాలను అధ్యయనం చేయడమే కాక, వారి విజ్ఞానం ద్వారా నూతన శాస్త్రాలకు ప్రవక్తలైనారు. వ్యాసుడి కుమారుడు శుక మహర్షి భాగవత సంప్రదాయాన్ని ముందుకు నడిపించి దేశంలో నూతన ఉద్యమానికి కారకుడైనాడు. వశిష్ట మహర్షి విశా్వమిత్ర మహర్షి ఆశ్రమాలు సరస్వతీ నదీతీరంలో ఉన్నట్లుగా తెలియవస్తున్నది. విశా్వమిత్రుడు మంత్రద్రష్టయే కాక, అనేక శస్త్రాస్త్రములను సంపాదించినట్లుగా, వాటిని శ్రీరామచంద్రునికి ప్రదానం చేసినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు సాందీపని గురుకులంలో విద్యాభ్యాసం చేసి సకల శాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించిన సంగతి భాగవతం వల్ల అవగతమవుతున్నది.
పురాణాల కాలం దాటిన తరువాత గురుకుల వ్యవస్థ విస్తరించి విశ్వవిద్యాలయాలుగా పరిణమించటం మనం గమనించవచ్చు. తక్షశిల, ఉజ్జయిని, నలంద, వారణాసి, వల్లభి, అజంత, మధుర, విక్రమశిల మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి. ఇవి కాక కాంచి, అమరావతి మొదలైన చోట్లలో విస్తృతమైన విద్యావ్యవస్థ దేశ దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించేవి. విద్యాసంవత్సరం ఉపక్రమణమనే ఉత్సవంతో ప్రారంభమై ఉత్సర్గం అనే ఉత్సవంతో పూర్తయ్యేది. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమలు సాధారణంగా అనధ్యయన దినాలు. పెద్దలు ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రకృతి విపత్తుల కాలంలోనూ అనధ్యయనాలు కొనసాగేవి.
పురాణ కాలం తరువాత బౌద్ధ మతం వ్యాపించిన కాలంలోనూ ఈ విద్యావ్యవస్థ వƒలికంగా అలాగే కొనసాగింది. కొన్ని నూతన అధ్యయన శాఖలు విస్తరించినా, వƒలిక స్వరూపం అది మాత్రమే. ఆరోజుల్లో ప్రదానమైన విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిలా విద్యాలయ గాథ అతి ప్రానమైన కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నది. క్రీస్తు పూర్వం ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతమైన విద్యాబోధన సాగేదని చరిత్ర చెప్తున్నది. దేశంలోని నాలుగు మూలల నుంచి చైనా మొదలైన విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి గురువుల పాదాల వద్ద కూర్చొని విద్యాభ్యాసం కొనసాగించేవారు. జాతక కథల్లో తక్షశిలలోని విద్యావ్యవస్థను గూర్చిన అనేక వివరాలు కానవస్తాయి. ఒకానొక సందర్భంలో నూట ముగ్గురు రాజకుమారులు ఈ విద్యాలయంలో విద్యార్థులుగా ఉన్నట్లు తెలియవస్తున్నది. జాతక కథల్లో నూట అయిదు పరా్యయాలు తక్షశిల ప్రసక్తి కనిపిస్తుంది. క్రీస్తు శకం 455 సంవత్సరంలో హూణులు ఈ విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేశారు. ఈ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వేదములు, అష్టాదశ శిల్పశాస్త్రాలు నేర్పబడేవి. అట్లాగే వైద్యశాస్త్రం, న్యాయశాస్త్రం, ధనుర్విద్య, సైన్య విద్య ఇక్కడ ప్రఖ్యాతంగా బోధింపబడేవి. సంగీతము, నాట్యము, నాటకము, మొదలైనవి ఇక్కడి విశేష విద్యాశాఖలుగా ఉండేవి. దక్షిణాదిలోనూ శిలప్పదికారము ప్రకారం విద్యాస్థానాలు అనేకంగా ఉన్నట్లుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి.
తక్షశిల తరువాత ప్రసిద్ధమైన విద్యాస్థానం వారణాసి. వారణాసిలో అనేక శాస్త్రాలు ఆపాదచూడము అధికరింపబడేవి. ఇక్కడ అనేక మంది శాస్త్రవేత్తలు సముద్రముల వలె ప్రఖ్యాతులై దూరదూరాల నుంచి వచ్చే విద్యార్థులను ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యం కల్పించేవారు. ఇక్కడి విద్యావేత్తలు ఆయా క్షేత్రాలలో శిఖర స్థానాలలో ఉండేవారు. కాశీనగర ప్రశస్తి ఇటీవలి కాలం దాకా కూడా కొనసాగుతూ వచ్చింది. మహామహోపాధ్యాయులు, శాస్త్ర రత్నాకరులు, బహుముఖ ప్రజ్ఞాపారంగతులు ఇక్కడ విశే్వశ్వరుని కొలువులో విద్యాధ్యయనమే ఒక అర్చనగా కొనసాగిస్తూ వచ్చినారు. ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో తెలుగుదేశం నుండి అనేక విద్వాంసులు కాశీకి వెళ్లి అధ్యయనం చేయడం మనకు తెలుసు. మా పితామహులు శ్రీమాన్‌ కోయిల్‌ కందాడై రంగాచార్య స్వామి వారు విద్యాధ్యయనం తరువాత కాశీ పండితుల నుండి వచ్చిన ప్రశ్నలకు సమాధానం పంపించి వారి ప్రశంసలు పొందారు.
భారత దేశాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా విద్యాకేంద్రంగా భావించి వేలాది మైళు్ల ప్రయాణం చేసి విద్యాభ్యాసం చేసిన వాడు పాహియాన్‌, హూ్యన్‌త్సాంగ్‌ మొదలైన వాళు్ల. పాహియాన్‌ తన యాత్రా చరిత్రలో ఇక్కడి విద్వాంసులు విద్యను శాస్త్రాన్ని సమగ్రంగా సరహస్యకంగా నేర్చిన వారని గ్రంథ రహస్యాలను తాత్పరా్యన్ని వ్యాఖ్యానించగల వారని పేర్కొనటం మనం గమనించవచ్చు. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ స్నాతకోత్తర విద్యాకేంద్రం అక్కడి విద్వాంసులందరి కలయికగా, ఒక పరిషత్తుగా ఏర్పడి ఉండేది. ఈ విద్వాంసులందరూ ఒక్కొక్క శాస్త్రంలో నిష్ణాతులు. అప్పుడప్పుడు వీరు విద్యాలయంలోని అధ్యయనాంశాలను పరిశీలించి తగిన మార్పులను సూచించేవారు. వీరిని శాస్త్రానికి ప్రతీకలుగా ఆరోజుల్లో భావించేవారు. బౌద్ధ స్థానాల్లో విహారాలలో సంస్కృతాధ్యయనం తగిన ప్రాధాన్యాన్ని కలిగి ఉండేది. బుద్ధుడు తన బోధనలను పాలీ భాషలో వ్యాపింపజేసినా, సంస్కృతాధ్యయనం శిఖర స్థానంలో ఉండేది. ఆ తరువాత ప్రసిద్ధమైన గురుకులాలలో నలంద, వల్లభి, విక్రమశిల, జగద్గళ, ఓదంతపురి, నవద్వీపము పేర్కొనదగినవి.
వీటికంటే ప్రానమైన మిథిల ఇటీవలి కాలం దాకా కూడా ప్రముఖ విద్యాస్థానంగానే వెలుగొందింది. నవ్యన్యాయ శాస్త్రానికి ప్రధాన గ్రంథమైన తత్త్వచింతామణి.. పదిలక్షల పుటల వ్యాఖ్యానం ఇక్కడ విశేషంగా అధ్యయనం చేయబడేది. నలంద విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్రాలు, వైద్యము, భాషా శాస్త్రము యోగము, వేదాంతము, వ్యాకరణము ప్రధాన పాఠా్యంశాలు. నిన్నమొన్న భారత మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్‌ కలాం నలంద విశ్వవిద్యాలయం యొక్క పునరుద్ధరణ గురించి సూచించటం ఆ రాష్ట్ర ప్రభుత్వం దానిని ముందుకు తీసుకుపోవుటకు అంగీకరించటం మనకు తెలిసిందే.
వల్లభి విశ్వవిద్యాలయం కథియావాడ్‌ ప్రాంతానికి చెందింది. విక్రమశిల విశ్వవిద్యాలయం ఎనిమిదవ శతాబ్దంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీటన్నింటిలో జైన బౌద్ధమతాలు, వేద వేదాంగాలు, వైద్యం, సాంకేతిక శాస్త్రాలు, భౌతిక శాస్త్రము, వ్యాకరణం సుష్ఠుగా నేర్పబడేవి. విక్రమ శిల విద్యాలయంలో శాస్త్రవేత్తల విద్వాంసుల చిత్రాలు కూడా చిత్రింపబడినట్లుగా చరిత్రలో సాక్ష్యాలు లభిస్తున్నాయి. నవద్వీపంలో పండితుల నడుమ శాస్త్రారా్థలు జరిగిన తీరు కావ్యకంఠ గణపతిముని చరిత్ర వల్ల మనకు విశదమవుతున్నది. వీటిలో చాలా విశ్వవిద్యాలయాలు పదమూడో శతాబ్దం దాకా వైభవంగా ప్రకాశించినవి. మనం హిందూ బౌద్ధ మతాల నడుమ ఏదో అనివార్యమైన శత్రుత్వం ఉన్నట్లుగా ఈనాడు చరిత్రలో చదువుకుంటున్నాం. కానీ ఈ విశ్వవిద్యాలయాల విద్యాప్రణాళికలను గమనిస్తే, ఈ రెండు ధరా్మలకు నడుమ సామరస్యం, సహజీవనం కొనసాగినట్లుగా తెలియవస్తున్నది. ఇస్లాం దండయాత్రలతో గ్రంథాలయాల దహనం, పండితులను సంహరించటం, విశ్వవిద్యాలయ స్థానాలను భగ్నం చేయటం మొదలైన క్రూర చర్యలతో ఇవి అన్నీ శైథిల్యాన్ని పొందాయి. ఇటీవలి కాలం దాకా భారతీయ గురుకుల వ్యవస్థ అక్షతంగా సామాన్య పండితుల గృహాలలో పితృపుత్ర సంప్రదాయంగా, గురుశిష్య పరంపరగా కొనసాగుతూ ఉన్నది. ఈనాటికీ, శృంగేరీ మొదలైన పీఠాలు శాస్త్రారా్థలు, చర్చలు కొనసాగిస్తూ ప్రాన విద్యావ్యవస్థ మూలాలను అవిచ్ఛిన్నంగా కాపాడుతూ ఉన్నాయి. గురుకుల వ్యవస్థలోని కొన్ని వƒలిక అంశాలను గ్రహించి పద్ధెనిమిదో శతాబ్దంలోని పాశా్చత్య విద్వాంసులు ఇంగ్లండు మొదలైన దేశాలలో తమ విద్యావిధానాన్ని పరివర్తన చేసుకున్నట్లుగా వారు రాసిన నివేదికల వల్ల అవగతమవుతున్నది. అధిక సంఖ్యాకుల సంస్కృతికి, భాషలకు వారి శాస్త్రాధ్యయనానికి దమన శీలంగా కొనసాగిన నిజాం పరిపాలనలో కూడా మారుమూల, చిన్న చిన్న పల్లెటూళ్లలో తమ పూరి పాకలలో చిన్ని చిన్ని గృహాలలో పేదలైన పండితులు ఈ శాస్త్రాలను, సంస్కృతిని, భాషలను రక్షించి తమ సృజనాత్మకతకు దీప్తిని అనుస్యూతిని కల్పించారు. తిరుపతి, శ్రీరంగం, మధుర మొదలైన క్షేత్రాలు ఎక్కడికక్కడ తమ పరిమితిలో విద్యావ్యవస్థను పరిరక్షిస్తూ వచ్చాయి. ఒక్కొక్కచోట ఒక్కొక్క శాస్త్రము, ఒక్కొక్క తాత్తి్వక సంప్రదాయము, ఒక్కొక్క ఉపాసనా మార్గము ప్రాధాన్యం వహించాయి. ఆగమాదులు, తంత్రశాస్త్రము, ఆయా ప్రాంతాలలోని చికిత్సావిధానము, గాంధర్వ విద్యలు, ముష్టి యుద్ధాలు ఎక్కడికక్కడ ప్రామాణికంగా శాస్త్ర రూపాన్ని పొంది ఆయా విద్యావంశాలలో వ్యాప్తిని పొందేవి. అన్నమాచార్య వంశం సాగించిన మూడు తరాల సంకీర్తన యజ్ఞం ఒక విశ్వవిద్యాలయం చేసే పనితో పోల్చవచ్చు. శ్రీరంగంలోని వైష్ణవాచార్యులు నిర్వహించిన ద్రావిడ ప్రబంధ వ్యాఖ్యాన ధోరణి కూడా ఒక విశ్వవిద్యాలయం చేసే కార్యక్రమమే. అట్లాగే దత్తాత్రేయ యోగ పరంపరకు చెందిన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి వంశం ఏడు తరాలు చేసిన సరస్వతీ సేవ పరతత్త్వ సాధన ఒక గొప్ప సంస్థ మాత్రమే చేయగలిగింది.