Wednesday, January 27, 2010

ఆధునిక మహర్షి ఆచార్య సుప్రసన్న











ఢిల్లీ లో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ కొరియా ఫస్ట్ లేడీ నుంచి టాగోర్ literature అవార్డు అందుకున్న సుప్రసన్న ..

-డా లంకా శివరామ ప్రసాద్‌
సృష్టిలీల బహు చిత్రంగా ఉంటుంది. కాలరథం రహదారి పక్కన శాఖోప శాఖలుగా విస్తరించి, దారిన పోతున్న అనేక మంది బాటసారుల బడలిక తీరుస్తూ తనదంటూ ప్రత్యేకత నిలుపుకున్న ఆ మహావృక్షపు శాఖాగ్రచ్ఛాయల దరిదాపుల్లో అప్పుడే మొలకెత్తిన ఓ చిన్ని మొక్క తలెత్తి ఆ మహావృక్షపు ఎత్తును అంచనా వేయడానికి సంకల్పించింది.
పసిబిడ్డను ఎత్తుకోవాల్సిన ధర్మం పెద్దలది. వాళ్ల హృదయాలకు హత్తుకునే హక్కు పిల్లలది. ఎవరిది ఏ ఎత్తు అయినా ఇద్దరూ ప్రకృతి ఒడిలో పసిపిల్లలే ! ఆ యిద్దరూ ఇంకో చెట్టువేపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ వృక్షం చిత్రాతిచిత్రంగా ఉంది.
ఊర్థ్వమూల మథః శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయమ్‌
ఛన్దాంసి యస్య పర్ణాని య స్తం వేద స వేదవిత్‌

ఆ వృక్షం ెుుక్క స్వరూపాన్ని శోధిస్తూ హృద్గీత, ఆనందలహరి, తేజశ్చక్రము, అధునా, ఋతంభర, పాండిచ్చేరి గీతాలు పన్నెండు, శ్రీ పాంచాలరాయ శతకం, శతాంకుర, స్తుతి ప్రబంధము, కన్నీటికొలను, కృష్ణరశ్మి, శ్రీ నిరుక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, సాంపరాయం, మణిసేతువు, ప్రీతి పుష్కరిణి, శేఫాలిక వంటి అద్భుత జ్ఞాన కావ్య కుసుమాలను, సాహిత్య వివేచన, సహృదయచక్రము విశ్వనాథమార్గము, భావుకసీమ, పోతన చరిత్రము, అధ్యయనం, చందన శాఖి వంటి విమర్శనా మధుర ఫలాల్నందించిన జ్ఞాన వృక్షము తానైతే, ఈ సాహిత్య ప్రకృతిని, ఆ అశ్వత్థ వృక్షాన్ని లీలా మాత్రంగా అవలోకించి అచ్చెరువందుతున్న చిన్ని మొక్కకు ఓ ప్రాతఃదినాన మణిసేతు సందర్శనభాగ్యం, లభించింది. అచ్చోట పూచిన పారిజాత పరిమళాలివి.

వెన్నెల లావరించుటయు వేడుక వానల క్రుమ్మరింతలున్‌
కన్నుల స్వప్న లోకములు కానగ వచ్చుట, లింటివెన్క సం
పన్నిధి గుప్తతల్‌ విడిచి పైపయి కెక్కుట, లెన్నియైన లో
నున్న అమేయ శాంతికి అణూపమ కేనియు పోలి రావెటుల్‌
అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టోత్తర శత దివ్యక్షేత్రాలు, భిన్న ప్రకృతులూ ఉన్న మణి ద్వీపమే భారతదేశము. తన మాతృభూమిని జగన్మాతగా దర్శిస్తూ. . .

అఖిల జగముల కాటపటై్టన నిన్ను
అఖిల జగముల నేది కాదైన నిన్ను
ఎటుల కొల్చుట ెుద నిల్పుటెటుల సర్వ
వియదనంత సమావేశ వృక్షమూర్తి
అఖిలమున కాది మూలమైనట్టి నీవు
అంతమున పరిణతి సహస్రారమగుచు
ఆ మణిద్వీపమున రాజ్ఞివౌచు నిలుతు
గుండెలో సూక్ష్మ షట్పద గుప్తమూర్తి

బీజంలో జడంగా నిద్రిస్తున్న చైతన్యమూర్తి, అంకురమై, మొలకై, చెటై్ట, వృక్షమై విశ్వంగా పరిణామం పొందింది.
నేను జీవాన్ని, వృక్షాన్ని, ఫలాన్ని, రసాన్ని
నేను ఆవర్తాన్ని, బుద్బుదాన్ని, తరంగాన్ని
తథాగతము, తథాదృష్టము, తథాభావితము
నిత్యభావం కనిన స్వప్నము, అర్థరాత్రి గర్భంలో పగలు
ఆ తామసీ గర్భంలోనుంచి ఉషశ్శిశువు జన్మనెత్తింది.
గింజ మట్టిని చీల్చేవేళ ఊపిరినంతా బిగగట్టి
పైకి పొడ్చుకువచ్చి ఒకసారి తన్నుతాను ప్రకటించుకునే క్షణం
చివురు విచ్చుకునే వేళ, మొగ్గ కనబడే వేళ
వినబడని మట్టి మూలుగు ఆ లిప్త విశ్వచైతన్య సంవేదన. . .
ఆవ్యక్త బీజంలోనుంచి
నిర్గమించిన అశ్వత్థ వృక్షం జీవ కిసలయితమై
ఆకాశాన్ని కప్పివేసింది సర్గపు తొలి మొలక తాను
స్కంధంలో ఎన్ని ఎన్ని ప్రాణరహస్య కోటరాలు

కాని ఇప్పుడు వర్తమానం ఆత్మబలి చేస్తున్నది. ఈ నాగరికతా, అణ్వాయుధాలు, మౌఢ్య కాననాల సమిధలతో దగ్ధమైన అనేక మన్వంతరాల వేదనల చితాభస్మాన్ని, వెలుగుల సముద్రంలో కదిలే వెన్నెల పడవలో భావిదాకా మోస్తూ సాగే అనంతేతిహాస ప్రయాణమే సాంపరాయమైనపుడు ఫలితం దుఃఖము తొలగి, మృత్యువు తొలగి, తొలగి అహంత, తోరణం సృష్టి కవుతుంది.
సృష్టి విద్యా ప్రాగల్భ్యమంతా నేర్వక నేర్చిన మర్త్యజగత్తు సద్వస్తుచ్ఛాయయై మృత్యువును గ్రసించి చిదగ్నియై, ఆనందలేశ ప్రతిబింబమై దుఃఖావలిత మవుతున్నది. ఈ బ్రహ్మాండంలో ఎప్పుడో ఒక పూవులోనో, పసిపాప బోసి నవు్వలోనో, వెన్నెల వెండి జరీ అంచు మబ్బు తెరలోనో, అమేయమైన `భ' చక్ర సాక్షాత్కారంలోనో, భీకరమైన ఉప్పెనలోనో, బారులుకట్టి ఆకాశంతో కదిలిపోయే కొంగల సమూహంలోనో ఒక అర్థం కాని, అన్వయం కాని, అవాచ్యమైన అనుభవాల సంకలనం స్ఫురించటం కద్దు.
అప్పుడే ఒక చిన్న పూవు పిలిచింది. `ఓ అనంత సాగర తరంగమై కదిలి వస్తున్న ఏథికుడా, అన్వేషణకు అంతే ఎరుగని బాటసారీ, నీ కోసం ఇక్కడ రూపొందుతున్నాను' అని నేనడిగాను `నీవెవరివని నన్నెరుగుదువా' అని. ఆ పూవన్నది `నేను శేఫాలికను నీవు నాలోని ప్రాణశాఖివని'. ఆ శేఫాలికా ప్రాణశాఖికి మరో ప్రాణసఖి. ఆ ప్రాణసఖి `సుమ శాఖాకృతియై సరిన్నిభమునై, శుభ్రాంశు సందోహమై విమలాంభోజ దళాంచలంబునయి',
బ్రతుకున కొక్క దేవివయి వచ్చిన నీెుడ, నాత్మలోక సం
గత రసపారవశ్యములు కల్గ నిదంతయు నీకె కూర్చితిన్‌
అతిశయ సంగమార్థములు అచ్చపు పాల్కడలిం బలెన్‌ అసుప్ర
తతుల ప్రీతి పుష్కరిణి పాలనసేయవె ఆదిలక్ష్మివై

అది కోరిక. కులపాలికా ప్రణయ సంయోగభావ చిత్రీకరణ వేదిక.
ఈ లీలాలయ మర్త్య జన్మమిది వాంఛింపంగ రాదేమి దృ
గ్జాలంబుల్‌ చిరుకత్తులై ెుడద చీల్చన్‌రాదొ, సంసేవన
స్ఖాలిత్యంబుల మాన్పు మీ బ్రతుకు నీ కళ్యాణ భూమిన్‌ కవా
టాలోలంబగు మువ్వజేసెదను దేవా. . . .
స్తబ్ధుండై దివి వృక్షమై నిలుచు నాదైవంబ, పై మూలమై
అబ్ధుల్‌ కొండలు కాననంబులును భూమ్యాకాశముల్‌ శాఖలైన
ఓ నారసింహ ప్రభూ . . . .
అంతా, అంతటా ఆ అశ్వత్థ వృక్షస్వరూపమే. అక్కడే బోధివృక్షం నీడలను పరచుకొంటున్నది. ఈ ఉనికి అయిదు కొమ్మల వృక్షం. రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానము కలబోసిన ఈ వృక్షము మన కందిస్తున్న ముప్పదిెుుక్క మధుర ఫలాల సంపుటి ఈ సమర్పణ. జాతీయతాభావం, దేశీయత, మానవీయ సంస్కృతి మూలాలుగా విశ్వనా థారవిందుల విశ్వవిజ్ఞానము నారమై, భౌతిక మానసిక ఆధ్యాత్మిక జీవన జ్ఞానం నాదమై, జాగ్రత్‌ స్వప్న సుషూప్తావస్థలు తురీయవేదమై, జగన్మాత సౌందర్యస్వరూపమే అద్భుత వాదమై, ప్రాక్పశ్చిమ నాగరికతల, ప్రాచీన ఆధునిక కవితల మేళవింపు కమనీయమై శాఖోపశాఖలుగా విస్తరించి సాహితీవనాన్ని సుసంపన్నం చేస్తున్నది.
సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదమును, ప్రాగ్రూప వివేచనను (ఆర్కిటైపు), సమకాలీన సార్వకాలీన దృక్పథమును, విశ్వలయను మొట్టమొదట ప్రస్తావించిన భారతీయ పునరుజ్జీవనోద్యమ చైతన్య దర్శనము కలిగిన మానవతావాది, ఆధునిక మహర్షి.
యాంత్రిక ప్రపంచం సృష్టించిన త్రిశంకుస్వర్గాలపై యుద్ధాన్ని ప్రకటిస్తూ జీవన సౌందర్యలహరిని ప్రేమ మార్గం ద్వారా చేరుకునేందుకు సుప్రసన్నాచార్యుల వారిచ్చిన పిలుపు మరల మరల వినిపిస్తుంది. ప్రతి యుగంలో, ప్రతిభావసంతంలో, ప్రతి శతాబ్దంలో కొత్త దుస్తులు తొడుగుతుంది. అది విస్తరిస్తుంది.
శుభం భూయాత్‌ !
డా లంకా శివరామ ప్రసాద్‌

సుప్రసన్న సాహిత్య నిర్మితి

శ్రీ సుప్రసన్న సాధకుడు. ఆధ్యాత్మిక భావసంపుటి ప్రధానంగా ఆయన సాహిత్య నిర్మితి, విమర్శ రూపుదిద్దుకున్నాయి. సాహిత్య ప్రక్రియలన్నింటిలో సిద్ధహస్తుడైన మనీషి, గాఢమననశీలి. పద్యం, వచనం, వచనపద్యం, కథ, గేయం ఇవన్నీ అప్రయత్నంగా సిద్ధించినట్లు తెలుస్తుంది. ఆయన మననశీలి, కావున మితభాషి. సత్యం స్పష్టంగా స్ఫురించనిదే, దాని కనుగుణమైన వ్యక్తీకరణ లభించనిదే ఆయన పల్టుడు `సత్యాయ మితభాషిణాం' గుర్తుకువస్తుంది.
ఆయనతో నాకు నలుబదేళ్ళ సన్నిహిత పరిచయం ఉన్నది. ముపై్పఏళు్ళ కలిసి ఇద్దరం యూనివర్సిటీలో ఉద్యోగం చేశాం. ఈ సుదీర్ఘకాలంలో ప్రశ్నకు తాత్కాలికమైన సమాధానమిచ్చి అప్పటికి తప్పుకోవడమో, లేదా ప్రశ్నను నిరాదరించడమో సుప్రసన్న చేయగా నేను చూడలేదు. అది ఆయన స్వభావానికి విరుద్ధం. ప్రతి ప్రశ్న ఆయన్ను అంతర్ముఖుణ్ణి చేస్తుంది. దాన్ని మనో7రణిలో మధించాలి. అది అర్చిష్మత్తు కావాలి. ప్రకాశించాలి. మనస్సుని ప్రకాశింపచేసి ఆత్మకు ఆనందాన్ని కలిగించి సత్య ప్రత్యయాన్ని స్థాపించాలి. అప్పుడు కాని ఆయన ప్రశ్నకి సమాధానం సూచిస్తారు. `తపసా తద్విజిజ్ఞాసస్వ.'
జ జ జ
సాహిత్యానుషక్తమైన ప్రశ్నలు కవి, కావ్యము, సహృదయుడు, సమాజము, సంస్కృతి, చరిత్ర మొదలైన వాటిని ఆశ్రయించి ఉంటాయి. ప్రశ్నలెంత పురాతనమైనా వాటికి కాలదోషం పట్టదు. సమాధానాలు దేశకాలావచ్ఛిన్నాలై తాత్కాలికాలై పరిమిత ప్రయోజన స్వభావాలై ఉంటాయి. అందుకే ప్రతి దశాబ్దానికీ కవిత్వ రూపం మారుతుందనీ ఆ మార్పు పరిప్రేక్షణంలో సమాధానాలని సవరింపవలసి వస్తుందనీ కొందరు విమర్శకు లంటారు. దశాబ్దకాలంలో అంత స్పష్టంగా స్థూలంగా కన్పించకున్నా, ఒక శతాబ్దపరిధిలో మార్పు స్పష్టంగా నిర్వివాదంగా కన్పిస్తుంది. నూరేళ్ళ కొకసారి సాహిత్యాన్ని కూలంకషంగా వివేచించాల్సిన అవసరముంటుందని మథ్యూ ఆర్నాల్‌‌డ అన్నమాటలో విజ్ఞత ఉన్నది. పై నుదాహరించిన అంశాల్లో ఏదో ఒకదాన్ని తదేక ప్రధానంగా భావించి సాహిత్య విమర్శను రూపొందించడం మూలాన అది పాక్షిక దోషదూషితం కాక తప్పదు. సరస్వతీ తత్త్వం కవి సహృదయాఖ్యమని ఆనందవర్థనుడు భావించినా కవి సృజనాత్మకశక్తి సహృదయ మనోగతభావసందోహం సమాజ వియుక్తమై ఉండటానికి వీలులేదని, కొందరు వాస్తవికమూ, కాల్పనికమూ ఐన రెండు పథాల్ని భిన్నంగా భావించి ఏదో ఒక పారమ్యాన్ని నిశ్చయాత్మకంగా ఉద్ఘాటిస్తున్నారు. దీన్ని వివేచించాలి.
ఆంతరమూ బాహిరమూ ఐన రెండు జగత్తుల అనుభూతి కవికి అనివార్యంగా ఉంటుంది. ఆంతరమైన సంస్కారానికీ బాహిరమైన విషయబాహుళ్యానికీ హృదయ సముద్రంలో మనోమంథానంగా మథనం తప్పనిదౌతుంది. అనూచానమై పరంపరా గతమైన సంస్కృతి ప్రభావం నుండి ఎవడూ విముక్తుడు కాలేడు. ఆ సంస్కృతి ఎంత పురాతనమైతే, అంతలోతై అనపేతమై కొంతమేరకే జాగ్రదనుభూతమై, ఎక్కువ భాగం అంటే మూడువంతులు చేతస్సులో సుప్తమై ఉంటుంది. అది కవికున్న త్రిపాద్విభూతి. జాగ్రదనుభూతి ఉనికి సముద్రాంతఃస్థితమై తల స్పర్శియైన మంచుకొండ శిఖరం కొసగా మనస్తత్వజ్ఞులు చెప్పినారు. ఈ అవచేతనని కాదన వీలుకాదు. జాగ్రదవస్థ కది మూలమౌతుంది, దాని స్వభావాన్ని నిర్ణయిస్తుంది, దానికి అంతర్నిహితమైన దిశానిర్దేశం చేస్తుంది. పురాచరిత్ర సంస్కృతి సాహిత్య ప్రభావమంతా ఈ అవచేతనలో పొరలు పొరలుగానో లేదా అనిర్వాచ్యంగానో పరివ్యాప్తమై ఉంటుంది. ఇది చైతన్యంలో ప్రవహించనిదే రక్తనిష్ఠం కానిదే కవి కావ్యానికి సామీచీన్యాన్ని కల్పించలేడు. ఆంగ్లకవి బాధ్యతను వివరిస్తూ ఎలియట్‌ ఇలా వ్రాశాడు.

He must be aware of the mind of Europe - the mind of his own country - a mind which he learns in time to the much more important than his own private mind - is a mind which changes, and this change is a development which abandons nothing en route.

సంప్రదాయం చేతస్సులో జాగృతం కావడం అలవోకగా సంప్రాప్తమయ్యేది కాదు. వాదోపవాదకౌశలాన్నో, శుష్క పాండిత్యాన్నో సంప్రదాయమని భ్రమపడరాదు. `నాయం. . . ప్రవచనేనలభ్యో న మేధయా న బహునా శ్రుతేన.' అది వ్యక్త్యతీతమై వ్యక్తిత్వాన్ని భాసింసచేస్తుంది అంటేto write not merely with his own generation in his bones, but with a feeling that the whole of the literature of Europe from Homer and within it the whole of the literature of his own country.

సుప్రసన్న మరొక విధంగా సంప్రదాయశక్తిని వివరించినారు.
కవి మనః కోశ నిర్మాణంలో సమకాలీనమే కాక గతకాలం స్మృతి సంకలనమై వెంటనడుస్తుంది. భవిష్యత్తును గూర్చిన కల్పన కూడా స్వప్నంలాగా దర్శనమిస్తూ ఉంటుంది. అచేతనం, అవచేతనం, సమష్టి అవచేతన, అతీతచైతన్యం ఈ నాల్గు అంశాలు జాగ్రద్దశను అమితంగా ప్రభావితం చేస్తాయి. . . . అతని చైతన్యం హేతుక్రమానికి లొంగి ఉండదు. (దర్పణం)
అందుకే కవి వ్యక్తిగా సమాహరించుకొన్నది కావ్య సాక్షాత్కృతిలో, దర్శనంలో విద్యమానం కాకపోవచ్చు. ``ఈ సృజన బీజభూతమైన తనలో నుండి వచ్చినా, పరిమితమైన తనకంటే విస్తృతంగా భిన్నంగా, తనకే దర్శనమిస్తుంది.'' అన్నారు సుప్రసన్న. వర్తమాన జాగ్రదవస్థకు పరిమితమైన కాలానుభవం సాహిత్య నిర్మాణానికి ప్రధానహేతువు కాదని కవిగా సుప్రసన్న కనుభూతమైన విషయం. మన ప్రపంచం దేశకాలపరిమితం కాగా, సాహిత్య ప్రపంచం ఉపర్యుక్తలక్షణ లక్షితమై తదతీతంగా ఉంటుందని నిర్ధారించడానికి కూడా స్వానుభూతియే కారణం.
జ జ జ
శ్రీ అరవిందుల తత్త్వం సుప్రసన్నను బాగా ప్రభావితం చేసింది. అంత శై్చతన్యాన్నీ అవచేతననూ ఆ తత్త్వదృక్కోణం నుంచే పరిశీలించినారు. కళాసృజనల అనుభూతి ప్రపంచంలో వాటి ప్రభావాన్ని సుకుమారంగా సమీక్షించినారు. తద్గత రహస్యాలని మేల్కొలిపే శక్తి కళారూపాలకు ఉందనీ, అస్మితా సమర్పణానుపదంగా అతిమనస్తేజశ్శకలాల అవతరణం కలుగుతుందని ప్రస్తావించినారు. ఇక్కడే మౌలికమైన `విశ్వలయ'ను ప్రతిపాదించినారు. ఇతిహాస మహాకావ్య నిర్వచనం చేసినారు. వ్యక్తి తన అంతస్సుతో, సమాజంతో, ప్రకృతితో, సర్వనియామకమైన దివ్యచైతన్యంతో, సామరస్యం సాధిస్తే ఇతిహాసంలో విశ్వలయ సిద్ధిస్తుంది. తాదృశమైన ఇతిహాసం మానవ చైతన్య విజయయాత్రలో ఒక ప్రధానఘట్టం. ఇతిహాసమహాకావ్య నిర్మాణ మహాయజ్ఞంలో ``కవి తనను తానే ఆహుతి చేసుకుంటున్నాడు.'' ఇది ఎలియట్‌ వివరించిన extinction of personality కంటె ఉదాత్తమైంది, ఉత్కృష్టమైంది.
కళకి దివ్యమూలావశ్యకతను చెప్పినారు. యజనానికి పూర్వం ధ్యాన మావశ్యక మైనట్లు తద్భావనాభావితంగా కళా సృష్టికి పూనుకోవాలి. ఆ కళారూపం తానై పరిణమించాలని వ్యాఖ్యానిస్తూ, కళారూపాలు ప్రతీకలో, స్ఫురణలో, సంకేతాలో ఔతాయని, దర్శనం `ఋతజాత'మై భద్రంకరమై ఉంటుందని వివరించినారు. భారతీయ కళలకు, ధ్యేయమైన, సుషూప్తిదశాకమైన, అంతఃస్ఫురణభూతమైన ఆనందపర్యవ సాయకమైన స్థితిని ప్రతిపాదించినారు. సంప్రదాయపరమమైన అనుస్యూతినీ కాలాను గతమైన విపరిణామాన్నీ ఇట్లా వ్యక్తం చేసినారు:
ఒక మహావృక్షం యుగయుగాలుగా అలాగే ఉన్నట్లు కన్పించినా మూలం తప్ప ప్రతీదీ మారిపోతున్నది. స్కంధము, శాఖలు, పత్త్ర పుష్పాలు అన్నీ. ఇదీ జీవంతమైన సంప్రదాయం, ఈ జీవంతమైన సంప్రదాయం క్రొత్త దర్శనానికి కారణమౌతున్నది. ప్రతియుగం సత్యాన్ని కొత్త సౌందర్యంతో ఆవిష్కరించుకొని మరల మరల `శివ' శిఖరం వైపుగా అధిరోహింపజేస్తున్నది.
దీన్నే మరింత స్పష్టం చేస్తూ
నిత్య పరివర్తన శీలమైన ఈ సంప్రదాయం పాతబడిన ఆకులను బెరడులను పుష్పాదులను పరిత్యజిస్తుంది. మృత్యులక్షణాలను తొలగించుకొని ప్రాణోద్విగ్నవసంత లక్షణాలతో ప్రకాశిస్తుంది.
`శబ్దమురసముఅనుభవము' అనే వ్యాసంలో కవికి కావ్యానికి సహృదయునికీ కల అనుబంధాన్ని ఒక పట్టికలాంటి చిత్రంలో నిరూపించినారు. కవి తన అనుభవాన్ని ధ్యానించి, మనోమయంగా సర్వాంగీణంగా భావించి, అలంకారాది సామగ్రితో అభివ్యక్తీకరించి కావ్యంగా ఆవిష్కరిస్తాడు. కావ్యాన్ని అభివ్యక్తి సామగ్రీ పరిశీలన మారంభంగా అలంకారాదులను వివేచించి మనోమయ విషయభావన చేసి ధ్యానావస్థిత తద్గత మనస్కుడై కవి హృదయా న్నావిష్కరించుకొని సహృదయుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ రహస్యజ్ఞత స్ఫురన్మనీషా లక్షణంగా గోచరిస్తుంది.
సామరస్యంతో సిద్ధించే `విశ్వలయ' భావనయే ఆయనకు సాహిత్య మార్గదర్శనా న్నిచ్చినట్లు చెప్పినారు. నిరంతర సాధన, మననశీలిత హృదయ విస్తృతిని కలిగిస్తుంది. ``భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వసంశయాః'' స్వానుభవంలోని సర్వమార్గ సమన్వయాన్ని ఇలా వివరించినారు:
అది నాకు జీవితాన సిద్ధించింది. అది నాకు మార్గదర్శకమైనదన్నమాట. అంచేత అవిరోధమన్నది ప్రధానలక్షణము. సర్వతత్త్వములతో సర్వమార్గాలతో అవిరోధం నాకు జీవనంలో మార్గదర్శనం చేసింది. అందువల్ల ఏ వస్తువును గురించి రాసినా ఈ సమన్వయమే నా దర్శనమయింది. ఈ వెలుగు ఆధారం చేసుకుని నా సాహిత్యం మొత్తం నిర్మాణమయింది. సాహిత్య విమర్శ నిర్మాణం జరిగింది.

సుప్రసన్న సాహిత్యక్షేత్రమంతా ఆధ్యాత్మిక ధారాపరిప్లుతమే. జీవితలక్ష్యాన్ని అన్వేషించే సాధనంగా సాహిత్యాన్ని భావించారు. తనపై ప్రభావం చూపిన వివిధ సంప్రదాయాలను వాటి పరిమితులనూ, అవి జీవిత దర్శనంలో ఒకదశలో చేసిన మేలునూ తన వ్యాసాల్లో అక్కడక్కడ వివరించినారు. స్వీయ వ్యక్తివికాసాన్ని అరమరికలు లేకుండా చిత్రించినారు. అనుసరణీయ జీవనమార్గాన్ని సుప్రసన్న ఇలా భావించారు:
మానవుడి జీవనం సర్వజీవుల జీవనంతో ఇంకా విశ్వము వ్యవహరించే అనంతకాల ప్రవృత్తిలోని `లయ'తో అనుబద్ధమైనది. ఈ జీవనం, జీవుని జడ ప్రవృత్తి నుంచీ ఆనందమయమైన, దేశకాలాతీతమైన దివ్యత్వం వైపుగా సాగే అనంతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఈ బ్రతుకు ఒక మజిలీ. ఇక్కడ జీవుడు తన కర్మ అంతా తన అనంతప్రయాణ లక్ష్యానికి అనుగుణంగా దిద్దితీర్చికోవలసి ఉన్నది. అయితే మన జన్మభూమి భోగభూమి కాదు. కర్మభూమి. ఈశ్వరమయమైన ఈ జగత్తులో అంతా సమాజానికే సమర్పించి తరువాత మిగిలిన దానిని తాను అనుభవించాలి. ధర్మము యదభిముఖముగా చెప్పబడినదో అది తదభిముఖముగా వ్యాఖ్యానింపబడాలి. లేక అపముఖముగా చూస్తే ఈ సర్వధర్మమూ దోష సంకులముగా కానవస్తుంది.
ఆధునికంగా భారతీయ సాహిత్యాన్ని భిన్న సంస్కృతి ప్రమాణాలతో విశ్లేషించి దానికి న్యూనత నాపాదించే పద్ధతికి ప్రచారం విశేషంగా ఉన్నది. సంప్రదాయంతో ప్రాప్తించిన అత్యుదాత్తమైన విలువల్ని విస్మరించడం లేదా వ్యంగ్యంగా వక్రీకరించడం వలన సాధించేదేమీ లేదు. దశలక్షణ యుక్తమైన ధర్మాన్ని సంకుచితపరిధిలో నిర్వచింపలేదు. దాన్ని `సార్వభౌమం' అనే అన్నారు. దేశకాలాదులతో పరిచ్ఛిన్నం కాని యమనియమాలను పతంజలి `సార్వభౌమం మహావ్రతమ్‌' అని పేర్కొన్నాడు.

ఎలియట్‌ చెప్పిన mind of Europe కంటె భారతీయజీవన తత్త్వ ధర్మానుశాసనం పురాతనమైంది. సాహితీసంస్కృతులు పురాతనమైనవి, విశాలమైనవి. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమగ్రంగా ఆహ్వానించి అంతర్గతం చేసికొని తన స్వరూప స్వభావాలకి కించిత్తు కూడా క్లేశం ఏర్పడకుండా మనగలిగిన శక్తి ఈ సాహితీ సంస్కృతులకు పుష్కళంగా ఉన్నది. భారతీయ సాహిత్యాన్ని పాశ్చాత్యపండితులు విశ్లేషించి ప్రదర్శించిన సముదారత మనకు లేదు. వారి తత్త్వ భూమికతో భిన్నదేశకాలీయమైన సాహిత్య సంస్కృతిని అధ్యయనంచేసి భారతీయాత్మను అవిష్కరించుకొనిన మహావైదుషీ సంపన్నులు పాశ్చాత్య పండితలోకంలో విశేషంగా ఉన్నారు. అంతటి విశ్లేషణ చేయగలిగిన వారు మనలో విరళంగా కన్పిస్తారు. ఆంగ్ల రచయితలను మనం సుమారు రెండువంద లేండ్లుగా అధ్యయనం చేసి వ్రాస్తున్నాం. ఈ భారతీయ విమర్శకులను చదివిన వారెవరైనా పాశ్చాత్యదేశాల్లో ఉన్నారా? అని సీనియర్‌ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌, పద్మభూషణ మాన్యులు సి.డి. నరసింహయ్యగారు ప్రశ్నిస్తే సమాధానమే లేదు. మన సాహిత్యాన్ని అధ్యయనం చేసి మనం వ్రాయం, వాళ్ళ సాహిత్యాన్ని చదివి వ్రాస్తాం. కాని దానికి అస్తిత్వం లేదు. పాశ్చాత్య ప్రమాణాలే శిరోధార్యాలుగా భావిస్తూ, జాతీయ సిద్ధాంతాలని ప్రత్యాఖ్యానం చేస్తూ భారతీయ సాహిత్యాన్ని విశ్లేషించి పొందిన పరమార్థమూలేదు. సుప్రసన్న ఇలా అన్నారు:
మన పరిస్థితులు, మన భాషల జీవలక్షణం మన అవసరాలు, మన సంస్కృతీ సంప్రదాయాలూ మన శాస్త్ర సంపద ఇవన్నీ ఆధారంగా మనం ఆధునిక సాహిత్య దర్శనాన్ని నిర్మించుకోవలసి ఉన్నది. అది ఆధారంగా ఒక వ్యవస్థ ఏర్పడవలసి ఉన్నది.
అట్లాంటి వ్యవస్థ ఏర్పడితే, ఏ వైదేశికమైన సంప్రదాయమైనా మనం స్వీకరిస్తే అది అంతర్భవిస్తుంది.
చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళ ఒక్కొక్కటీ స్వీయ సంప్రదాయాన్ని రూపొందించుకుంటుంది. ఇట్టి సంప్రదాయ సమాహారమే జాతీయతగా సుప్రసన్న నిర్వచించినారు. ఇది కాలంవలె అవిచ్ఛిన్నమైంది. నిరంతర ప్రవహణ శీలమైంది. సాహిత్యాధ్యయనంలో ఇది అంతస్స్రోతస్సు కావాలి.

వైదికకాలం నుండి అధునాతనయుగం దాకా శబ్దసందోహం నిరంతరంగా ప్రవహిస్తూ భారతీయ భాషలన్నింటినీ సంపన్నం చేసింది. వైదిక ప్రతీకలు, కల్పనలు, కథలు, ప్రాగ్రూపాలు మన అవచేతనలో నిక్షిప్తమైనాయి. ప్రతిశబ్దం వెనుక అమేయమైన అర్థ పరిణాహం ఉంటుంది. విస్తృతమూ, గాఢమూ, గూఢమూ ఐన మూలచక్రం ఉంటుంది. అర్థబాహుళ్యం, ప్రతీకల సర్వతోదర్శనం భారతీయ కవితలో నిస్సందేహంగా కన్పిస్తాయి. బాహిరమైన కథా కథనం వెనుక నిస్తంద్రంగా అనురణిస్తూ ఆంతరమైన కథానుగమనం ఉంటుంది. దీనికై కవి ప్రయత్నించాల్సిన అవసరంలేదు. అది సహజంగా శబ్ద గర్భితమై ఉంటుంది, ప్రాగ్రూపనిహితమై ఉంటుంది. దీనినే సుప్రసన్న రహస్య కథన సంప్రదాయంగా విశదం చేసినారు. గురజాడ పూర్ణమ్మ కథను ఆ పరిధిలో వ్యాఖ్యానించినారు. అట్లే గరుడోర్ధ్వగమన ఘట్టాన్ని కూడా. ఇదొక విలక్షణమైన విమర్శ విధానం. పాశ్చాత్య విమర్శలోనూ ఫిలిప్‌ వీల్‌రైట్‌ వంటి వారు కీట్‌‌స కవిత్వాన్ని ఈ పార్శ్వం నుంచి విశ్లేషించినారు. భారతీయ సాహిత్యాల్లో దీనికి నిస్సీమవైశాల్యమున్నది. అమోఘమైన అవకాశమున్నది.

జీవితమంతా సాధనగా భావించి, సాహిత్యాన్ని జీవన సాఫల్యోకరణంగా మలుచుకోవడానికి సుప్రసన్న అనుక్షణమూ యత్నిస్తున్నారు. కవితా రచన, విమర్శ ఒక విధంగా ఉపాసనయే. సాహిత్యాధ్యయనంలో అనుపాదేయ లక్షణాన్ని ప్రస్తావిస్తూ ఇలా వ్రాశారు:
ప్రాచీన సాహిత్యాధ్యయనం విషయంలో గడచిన అరవైఏళు్ళగా వ్యతిరేకప్రచారం అత్యధికంగా జరిగింది. సాహిత్యానుభవం విషయంలో ఈ విభేదం, విషమత అడ్డుగీతలను గీచింది. సాహిత్యానుభవం వాస్తవ జీవితానుభవం కన్నా విలక్షణమైంది. ఒకటి స్వభావ జగత్తు వాస్తవమైంది. రెండవది విభావజగత్తు కావ్యలోకంలోనిది. స్వభావ జగత్తు రెండవదానికి ఆధారమైనదే అయినా విభావ జగత్తుగా పరిణమించి గొంగళిపురుగు సీతాకోకచిలుక అయిన రీతిగా పరిణమిస్తుంది. ఒకదాని కొకటి ప్రతిఫలన రూపాలు కావు. అట్లాగే సమానానుభవం కలిగించేవీ కావు.
విమర్శలో ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్నకిది తర్క సహమూ సులభ సుందరమైన సమన్వయం. బ్రజేంద్రనాథ్‌సీల్‌ గొంగళిపురుగు సీతాకోకచిలుక ఉపమానాన్ని ఇదే సందర్భంగా చెప్పినారు. సుప్రసన్నది ఆ సాదృశ్యమే .
సుప్రసన్న ప్రతి వ్యాసం మననం చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తుంది. ఆయనకు ఎవరినో వాదించి ఒప్పించాలన్న కోరికలేదు. ప్రశంసలపై ప్రచారంపై మమకారం లేదు. తన అభిప్రాయాల్ని వ్యర్థపదాలు లేకుండా, ఆవేశరహితంగా అనాసక్తంగా యథాదృష్టంగా ప్రీతీ భీతీ లేకుండా చెప్పడం సుప్రసన్న స్వభావం. ఇదంతా ఆయనPoetry workshop నుంచి వచ్చిన భావసామగ్రి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించకున్నా, చదివి గాఢంగా మననం చేయడం తప్పని సరి.
ఆచార్య శ్రీ లక్ష్మణమూర్తి

Monday, January 25, 2010

‘అంతరంగం’కు ‘ టాగూరు సాహిత్య పురస్కారం’

written by - డా.లక్ష్మణ చక్రవర్తి

(సుప్రసన్నాచార్య ‘అంతరంగం’కు నేడు ఢిల్లీలో సాహిత్య అకాడమి ‘టాగూరు సాహిత్య పురస్కారం’ ప్రదానం చేసిన సందర్భంగా)

అనుభూతి, అనుభవం ఇవి రెండు ఒకే వ్యక్తిలో ఉంటే అంతరంగం సుప్రసన్నమౌతుంది. అనుభూతిని అనుభవానికి తెచ్చుకుని అంతరంగాన్ని ఆవిష్కరించగలగడం అందరూ చేయగలిగిన పని కూడా కాదు.నలభై ఏళ్లుగా సృజన/విమర్శ రంగాలలో తమదైన ముద్రను ప్రదర్శిస్తూ తమ అంతరంగాన్ని ఈ రెండు రంగాలలోను ఆవిష్కరిస్తున్నవారిలో ప్రత్యేకంగా చెప్పదగినవారు ఆచార్య కోవెల సుప్రసన్న. సృజనమూలాలు విమర్శ చైతన్యం రెండూ వేర్వేరు తీరాలు.హృదయం ద్రవించి ఏ తీరాన్ని చేరుతుందో దానినిబట్టి సృజన/విమర్శ ఏర్పడతాయని భావించే వర్గానికి ప్రతినిధిగా నిలిచేవారు వీరు. గత ౪౦ ఏళ్లుగా సృజనాత్మక, శాస్త్ర వాఙ్మయ గ్రంథాలకు రాసిన పీఠికలన్నీ కలిపి ‘అంతరంగం’గా సృజనలోకం (వరంగంల్‌) వారు ప్రచురించారు. ఇందులో ౬౮ పీఠికలున్నాయి. పెద్దల స్తుతిరూపంలో ప్రాచీనాంధ్ర కవుల పీఠికలుంటే పెద్దలే రచించినవి ప్రస్తుత పీఠికలు. రెండవ పద్ధతికి సంబంధించిన పీఠికలు ఇవి. చాలావరకు పీఠికలు గ్రంథాన్ని, గ్రంథకర్తను ప్రోత్సహించి ముగించినట్లుగా, గ్రంథ విశేషాలతో కూడినట్లుగా ఉంటాయి. ఈ పద్ధతికి భిన్నంగా ఉండడమే ఈ పీఠికల విశిష్టత. సుప్రసన్న ఈ పీఠికల ద్వారా కొత్తమార్గం వేశారని చెప్పవచ్చు. రచన, రచయిత కంటే రచనలోని అంశానికి సంబంధించిన విస్తృత విషయాలను అందించడం ఆ కొత్తమార్గం.౧౯౬౬లో సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘వసుచరిత్ర’కు సంపాదకునిగా రాసిన పీఠిక నుండీ, సాహిత్యలోకంలోకి ఇటీవల వచ్చిన ‘భారతీయ జ్వలిత చేతన-బంకించంద్ర చటర్జీ’ వరకు పయనించిన వారి పీఠికలు ఇందులో ఉన్నాయి. కాలక్రమంగా కాకుండా విషయ ప్రధానంగా పీఠికలు కూర్చడం బాగుంది. విషయం అర్థం చేసుకునేందుకు వీలు కలిగింది. ఒక అంశానికి సంబంధించిన పీఠికలను ఒక దగ్గరగా చదువుకుంటే ఆ విషయానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది.సాహిత్య చరిత్ర, విమర్శకులకు సంబంధించిన పీఠికలు ముందుగా చేర్చడం, స్వీయ రచనలు, భగవత్‌ సంబంధ రచనలు దేశభక్తి, విశ్వనాథ, శాస్త్ర వాఙ్మయ విషయాలకు సంబంధించినవి వరుసగా చేర్చడం వలన విషయ విస్తృతి తెలుస్తుంది. భట్టుమూర్తి వసుచరిత్రకు రాసిన పీఠిక మధ్యయుగ ప్రబంధాల అధ్యయనానికి ఒక నూతన మార్గాన్ని వేసింది.కథను మూడంచెలుగా భట్టుమూర్తి నిర్వహించినట్లు వారు ప్రతిపాదించడంతో తర్వాతి కాలంలో ప్రబంధాలలో ఉన్న సంకేత శిల్పాన్ని చాలా మంది అధ్యయనం చేయడానికి దోహదం చేసింది. ఉపరిచరంలో వసువృత్తాంతం, ఇంద్రవృత్రాసురుల కథ, జలకథ ఈ మూడు పొరలలో కథ నడిచిందని ప్రతిపాదించారు. మహాకావ్య నిర్మాణానికి ఉపబలకంగా ఉండే అన్ని అంశాలు ‘శిల్పం’లో ఉంటా యి. ఈ శిల్పం ద్వారా కావ్య నిర్మాణాన్ని కవి చేసిన తీరును ఈ పీఠిక తెలియజేస్తుంది.చేతనావర్తం ఆధునిక సాహిత్యలోకంలో తెచ్చిన మార్పు దేశీయమైంది. వైయక్తిక, సామాజిక అనుభూతులను వ్యక్తీకరించడంలో చేతనావర్త కవులు కొత్త దారులు వేశారు. ఈ పీఠికలో డార్విన్‌, ఫ్రాయిడ్‌, మార్క్స్‌, ఐన్‌స్టీన్‌ చేసిన శాస్త్రీయ భావాలపైన ఆధునికత నిలిచిందన్నారు. ౧౯౬౦ వరకున్న సాహిత్య వాతావరణాన్ని కూలంకషంగా చర్చించి, ఐహిక, భావ, ఆధ్యాత్మ రచన చేసేవారు చేతనావర్త కవులని భావించారు. సహృదయుడి నేపథ్యంతో విమర్శ నిర్మించవలసి ఉందన్న ప్రతిపాదన చేశారు. ఆధునిక సాహిత్య పరిణామాన్ని సూచించే పీఠిక ఇది.స్వీయరచనల పీఠికల్లో పాంచరాత్రాగమశాస్త్ర అవగాహన తెలుస్తుంది. హనుమంతుడు, నృసింహుడు మొదలైన విషయాలపై రచించిన సిద్ధాంత వ్యాసాలు, సృజనాత్మక రచనలకు రాసిన పీఠికల్లో ఆయా భగవత్తత్వాలు తెలుస్తాయి. కృష్ణతత్త్వానికి సంబంధించిన పీఠికలు అంతరంగంలో ఎక్కువ. ఉత్పలవారి భ్రమరగీతాలకు రాసిన పీఠిక కృష్ణతత్త్వక్రమ పరిణామాన్ని చెబుతుంది.ముదిగొండ వీరభద్రమూర్తి వందేమాతరం, బంకించంద్ర గ్రంథానికి రాసిన పీఠికలు భారతీయ జీవనమూల్యాలు పరిష్కృతం కావడానికి కారణమైన వారిని చెబుతూనే ప్రస్తుత కర్తవ్యాన్ని వివరిస్తాయి. కేతవరపు రామకోటి శాస్త్రి నాచన సోముడుకు రాసిన పీఠిక/సోమనపై వచ్చిన విమర్శ గ్రంథాలను ప్రస్తావించి తుమ్మపూడి వారిది సమగ్రమైందని సమన్వయ పూర్వకమైందని నిష్పాక్షికంగా చెప్పారు.అంతరంగంలోని పీఠికలు పుస్తకం అట్టమీద ఉన్నట్టు ‘పీఠికలు కేవలం ప్రశంసలు కావు. కావ్యగర్భంలోనికి ప్రవేశించి దాని పరమార్థాన్ని వ్యాఖ్యానించేవి. పీఠికలో రచన/ రచయిత కంటే దానిచుట్టూ ఉన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన పాఠకుడి జ్ఞానం మరింత విస్తృతమవుతుంది.ఇందులోని సాహిత్య చరిత్ర విమర్శ వికాసాలకు సంబంధించిన పీఠికలు ఆయా రంగాల్లోని కొత్త మార్గాలను చెబుతున్నాయి. అయితే సుప్రసన్నగారి విస్తృత విషయ పరిజ్ఞానం పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏ పీఠికకు ఆ పీఠికగా అధ్యయనం చేస్తే ప్రతి పీఠికా విజ్ఞాన సర్వస్వమవుతుంది. ఒక్కో పీఠిక ఒక్కో విమర్శాంత రంగాన్ని ఆవిష్కరిస్తుంది.ఈ విధంగా వారి పీఠికలన్నీ ఒక్క దగ్గరికి చేర్చడం వల్ల సాహిత్య విమర్శలో కొత్త మార్గాలు తెలుసుకోవడానికి, లోటును దూరం చేసుకోడానికి ఉపయోగపడతాయి. అటువంటి పీఠికలకు టాగూర్‌ సాహిత్య అవార్డు రావడం సాహిత్య విమర్శకులకు ఆనందాన్ని కలిగించే విషయం.