Thursday, July 30, 2009

రసలోకం-3

పద్యం చచ్చిపోయిందని ప్రచారం చేశారు చాలాకాలం. పద్యం ముసలిదైపోయింది. నేటి అవసరాలకు భావాలకు సరిపోదు. దానికి ఉన్న పరిమితిలో ఆధునిక భాష ఒప్పదు. ఇంకా అనవసరమైన నిర్బంధాలు - అక్షర గణాలు, యతిప్రాసలు ఇంకా తత్సమ పద బాహుళ్యం అందువల్ల సామాన్య ప్రజలకు అర్థం కాదు - అని వాదం
పూర్వం భారత భాగవతాలు గ్రామాలలో రచ్చబండల దగ్గర చదువుతూ ఉండటం వలన జనం వినేవాళు్ల. పద్యం చదవటంలోని ఒడుపు వల్ల అది అందరికీ అర్థం అయ్యేది. యక్షగానాలలో వచనంలో వ్యావహారికం ఉన్నా, పద్యాలూ, పాటలూ లాక్షణిక భాషలోనుండేవి. వీటిని జనం చూచి ఆనందించే వాళు్ల.
20వ శతాబ్దంలో తెలుగులో నూతన సారస్వతం ఆరంభం కావడం, అనేక ప్రక్రియలలో రచనలు కొనసాగటం జరిగింది. పద్యం, గేయం, వచన పద్యమూ ప్రస్తరించాయి. వాటి వాటి అంతస్సత్వాన్ని బట్టి అవి సారస్వతంలో స్థానం పొందాయి. తిరుపతి కవుల తెలుగు పద్యం వాడుక భాషలోని కాకువును, వాక్య నిర్మాణాన్ని తనలో సంలీనం చేసుకున్నది. క్రియాంత ప్రత్యయాలు వదిలేస్తే మిగిలినదంతా వ్యవహార భాషే. పద్యం స్వేచ్ఛగా సంచరించటానికి వీలు లేదని ఆక్షేపించిన నిర్బంధాలు వారి పద్యాలకేం అడ్డం కాలేదు.
కావ్యభాషలో పలుకుబడిలో, పద బంధాలలో శ్రుతి మాధుర్యంలో నూతన స్థితిని ప్రవేశపెట్టిన రాయప్రోలు సుబ్బారావు పద్యం, సహృదయులకు కొత్త ప్రేయసిలాగా చేరువ అయింది. కృష్ణశాస్త్రి పద్యం మాధుర్య ప్రవాహమై వింత సొగసులు పోయింది. ``శిలలు ద్రవించి యేడ్చినవి శీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురము్మలు'' అన్న కొడాలి సుబ్బారావు పద్యం ప్రాచీన వైభవ శైథిల్యాన్ని రూపుగట్టించింది. నేటితో అస్వతంత్రతా నియతమైన ఈ బ్రతుకు తెల్గువారు భరింపలేరు'' అన్న విశ్వనాథ విషాద గీతం జాతి జనుల గుండెలలో ప్రతిస్వనించింది. త్రిపురనేని సూతపురాణం కొత్తగా పురాణ వ్యతిరేక ధోరణిని పద్యంలో ఆవిష్కరించింది.
ఆ నాళ్లలో నండూరి సుబ్బారావు యెంకిపాటలు జానపద భాషలో రాయటం చేత అవి ఎంత రసవంతాలయినా అకలుష ప్రణయ ప్రకటనాలైనా క్రమంగా అవగాహన పరిమితులలో నుంచి వెలికి పోతున్నాయి. ఆ స్థితి గేయ కావ్యాలైన కిన్నెరసాని పాటలకు శివతాండవానికి పట్టలేదు.
1932 తర్వాత తెలుగు పద్యానికి కాల్పనిక కవిత్వంలోని పరిధులు తొలగిపోయాయి. సౌందరనందం రాకతో ఖండకావ్యం మహాకావ్యమయిపోయింది. ఆధునిక సంవేదనలను నాడు కావ్యాలు ప్రస్ఫుటం చేయగలిగాయి. సౌందరనందం కానీ, రామాయణ కల్పవృక్షం కానీ, శివభారతం కానీ, రాణా ప్రతాపసింహ చరిత్ర గానీ, ఆత్మకథ కానీ, ఆంధ్రపురాణం కానీ పద్యం శక్తి ఎంతటిదో ప్రస్ఫుటం చేశాయి. దాశరథి పద్యం సవ్యసాచి సంధించిన బాణం వలె సామాన్య జనులలోకి దూసుకొని వెళ్లింది. `నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను'.. `మూడు కోటుల నొక్కటే ముడి బిగించి పాడినాడ మహాంధ్ర సౌభాగ్యగీతి'... ``తీగెలను త్రెంపి అగ్గిలో దింపినాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ''.. ``మా నిజాంరాజు జన్మ జన్మాల బూజు'' ఈ విధంగా ఉదహరిస్తే దాశరథి పద్యాలన్నీ ఇందుకు తార్కాణాలే.
`పద్యం ఆధునిక భావాలను చెప్పలేదు' అనే మాట సత్యమేనా? `వాస్తవము్మ నార్లవారి మాట'' అన్న మకుటంతో నార్ల రాసిన పద్యాలు ఆధునికాలు కావా? `పెన్నేటి పాట'లో రాయలసీమ కరువు రైతు జీవితం ఎంతో బలంగా వ్యక్తమైంది అంతెందుకు జాషువా పద్యాలు సమకాలీన పరిమితులలో ఒదుగటం లేదా? రామిరెడ్డి పానశాల పద్యాలు ఈనాటి సంవేదనలకు తార్కాణం కాదా? శ్రీశ్రీ సిరిసిరి మువ్వ పద్యాలు, రుక్కుటేశ్వర శతకం పద్యాలు నేటి భాషను ఇముడ్చుకోవటం లేదా?
ఇంద్రగంటి వారి కీర్తితోరణం, ముదిగొండ వీరభద్రమూర్తి గారి `వందేమాతరం' ఎంతో సరళమైన పద్యాలను ఇముడ్చుకొన్నవి. వందేమాతరంలో భాష, వాతావరణం, సన్నివేశ కల్పన స్వాతంత్య్రోద్యమపు స్ఫూర్తిని ఎంతో బలంగా అనుసంధించాయి. బోయి భీమన్న పద్యాలు ఎంతగా నవంనవంగా ఉన్నవో చదివితే తెలుస్తుంది. అనుముల కృష్ణమూర్తి పద్యాలు గుర్రాలపై స్వారీ వంటివి. బేతవోలు పద్యాలు గోదావరి ప్రవాహం వంటివి.
ఇటీవలి కాలంలో తెలుగు పద్యం వచనానికి అత్యంత సన్నిహితంగా వచ్చింది. విశ్వనాథ మధ్యాక్కరలలో ఈ గుణం విశ్వరూపం దాల్చింది. బాడాల రామయ్య కృష్ణకథా విపంచి, సంపత్‌రాఘవాచార్య విశ్వనాథ విజయం ఉత్తమ శ్రేణి రచనలే. చిటిప్రోలు కృష్ణమూర్తి `పురుషోత్తముడు' ఇటీవలి పద్యకావ్యాలలో మేలైంది.
ఉత్పలవారి `ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు' వర్తమాన నగరాన్ని చిత్రించిన రచన. అమేయమైన పద్యశక్తి దీనిలో ప్రకటితమైంది. జోస్యము విద్యాసాగర్‌ `అమ్మ' కోడూరి విష్ణువర్థన్‌ `ధర్మదండం', విలక్షణమైన రచనలు. `కృష్ణరశ్మి' నుంచి `మణిసేతువు' దాకా నా కావాలు, సంపత్కుమార `ఆముక్త', అనుమాండ్ల భూమయ్య మార్మిక పద్య రచనలు ఇటీవలి ఆధ్యాత్మి రచనలు. ఆచార్య ఫణీంద్ర మాస్కో స్మృతులు ఆధునిక నాగరక శాస్త్రీయతా చేతనను ప్రతిఫలించే రచన. కరణం బాలసుబ్రహ్మణ్య పిళై్ల `ఒక రాఘవ రెడ్డి కథ' పెన్నేటి పాటతో పోటీపడదగిన రచన.
`తెలుగు పద్యమనే దానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అది భూస్వామ్య యుగంలో పుట్టిన ప్రక్రియ. దానికి పౌరాణిక వాసన ఉన్నది. రాచరిక వ్యవస్థ భావజాలపు స్వభావం ఉంది. ప్రజాస్వామ్య స్వభావం లేదు.'(వి. చెంచయ్య, 2004) ఇలాంటి గతానుగతికమైన అభిప్రాయాలను ఖండిస్తూ చేరా అంటున్నాడు. `నిజానికి పద్యం తత్కాలపు అవసరాలకు తగినట్టుగా ఎపుడూ మారుతూనే ఉంది.'
ఈ కాలపు అవసరాలకు తగినట్లుగా మారిపోతున్న తెలుగు పద్యం 20వ శతాబ్దంలో నూతన రూపాన్ని సంతరించుకున్నది. నూతన భావ ప్రకటనకు యోగ్యంగా పరిణమించింది. అబ్బూరి రామకృష్ణరావు ఏ ఛందోగతీ లేని వచన పద్యాన్ని కవిత్వ యోగ్యంగా ఆమోదించేవారు కారు.
గడచిన పాతిక సంవత్సరాలుగా అవధానాలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. జనం వేలాదిగా వీటిల్లో పాల్గొంటున్నారు. ఆనందిస్తున్నారు. వీటివల్ల పద్యం అభినవంగా, తరుణంగా నిలిచి ఉంటున్నది.

3 comments:

  1. ఒక పేరాకి మరొక పేరాకి మధ్య ఒక లైన్ ఖాళీ ఇస్తే చదవడానికి సులభంగా వుంటుంది.

    ReplyDelete
  2. " ఆచార్య ఫణీంద్ర మాస్కో స్మృతులు ఆధునిక నాగరక శాస్త్రీయతా చేతనను ప్రతిఫలించే రచన "
    తమ ఆశీస్సులు నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చింది.

    ReplyDelete
  3. యువ కవులకు మార్గ దర్శకంగా చక్కని వ్యాసాన్నిప్రచురించారు.
    ధన్యవాదాలు !

    ReplyDelete